Mayabazar : సెట్లో ఏడ్చేసిన నటుడు
ABN , First Publish Date - 2023-12-03T01:46:52+05:30 IST
విజయా సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందించిన ఆణిముత్యాల్లో ‘మాయాబజార్’ ఒకటి. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ వెండితెర కృష్ణుడిగా పేరు తెచ్చుకున్నారు.
విజయా సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందించిన ఆణిముత్యాల్లో ‘మాయాబజార్’ ఒకటి. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ వెండితెర కృష్ణుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్, ఏయన్నార్, ఎస్వీఆర్, సావిత్రి, రేలంగి వంటి మేటి తారాగణం నటించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో నిర్మించారు నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి. కె.వి.రెడ్డి దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టిన చిత్రం ఇది. ఎన్టీఆర్, రంగారావు, సావిత్రి రెండు భాషల్లోనూ నటించారు. అక్కినేని పోషించిన అభిమన్యుడి పాత్రను తమిళంలో జెమినీ గణేశన్ చేశారు. అలాగే తెలుగు వెర్షన్‌లో శకుని పాత్రను సి.ఎ్‌స.ఆర్.ఆంజనేయులు, తమిళ వెర్షన్‌లో నంబియార్ పోషించారు. సినిమా పతాక సన్నివేశంలో శకుని సత్యపీఠం ఎక్కి మనసులోని మాటను దాచుకోకుండా చెప్పే సీన్ మీకు గుర్తుంది కదూ. మూడొందల అడుగుల నిడివి ఉన్న ఆ షాట్‌ని సింగిల్ టేక్‌లో ఓకే చేయించుకున్నారు సి.ఎ్‌స.ఆర్. తర్వాత తమిళ వెర్షన్ కోసం నంబియార్‌పై ఆ సీన్ తీశారు. ఆయనకు డైలాగ్ వంట పట్టకపోవడంతో మూడు నాలుగు టేకులు తీయాల్సి వచ్చింది. సాధారణంగా ఏ ఆర్టిస్ట్ అయినా ఒకటి, రెండు టేకులకు మించి తీసుకుంటే కె.వి.రెడ్డి ఇబ్బంది పడేవారు. అందుకే నంబియార్‌తో ‘ఏమండీ.. మీరేదో పెద్ద నటులు, సమర్ధులు అని ఈ వేషానికి బుక్ చేశాం’ అని అన్నారు. ఆ ఒక్క మాట నంబియార్‌ను కుదిపేసింది. సింగిల్ టేక్‌లో సి.ఎ్‌స.ఆర్. ఆ డైలాగ్ చెప్పిన విధానం, అలా తను చెప్పలేకపోవడం గుర్తుకు వచ్చి సెట్‌లో అందరి ముందూ ఒక్కసారిగా ఏడ్చేశారు నంబియార్. కంగారు పడిన కె.వి.రెడ్డి నంబియార్ దగ్గరకి వెళ్లి ఓదారిస్తే కానీ ఆయన మాములు మనిషి కాలేదు.