‘Telugu' Channel Techie P. Anusha: అదే మా సింపుల్ డ్రీమ్!
ABN , First Publish Date - 2023-03-28T22:55:26+05:30 IST
మహిళలు యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారంటే చీరలు, నగలు, ఫంక్షన్లు, ప్రయాణాల వీడియోలు చేస్తుంటారు. అయితే ‘సింపుల్‌ఘర్ తెలుగు’ ఛానెల్ టెక్కీ పి.అనూష మాత్రం ఒకింత ప్రత్యేకం.
మహిళలు యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారంటే చీరలు, నగలు, ఫంక్షన్లు, ప్రయాణాల వీడియోలు చేస్తుంటారు. అయితే ‘సింపుల్‌ఘర్ తెలుగు’ ఛానెల్ టెక్కీ పి.అనూష మాత్రం ఒకింత ప్రత్యేకం. మన ఇంట్లో వాడే దోమతెరల నుంచి... మిక్సీల వరకూ ఎన్నో వస్తువులను పరీక్షించి నిజాయితీగా తన ఛానల్‌లో రికమెండ్ చేస్తారు. వీటితో పాటు గ్యాడ్జెట్స్ గురించి మనకు అవసరమైన టిప్స్ చెబుతుంటారు. తన ఛానల్‌తో పాటు జీవిత విశేషాల్నీ అనూష ‘నవ్య’తో పంచుకున్నారిలా...
పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు దగ్గర ఉండే కటకోటేశ్వరం మా ఊరు. నాన్న బీఎస్‌ఎన్‌ల్ ఉద్యోగిగా పనిచేశారు. అమ్మ గృహిణి. ఎనిమిదో తరగతినుంచే బొమ్మలు గీయటం అలవాటు. మా ఛానల్‌లో 130 వీడియోలున్నాయి. వీటిలో అధికంగా షార్ట్స్ ఉన్నాయి. యూట్యూబ్ సిల్వర్ బటన్ వచ్చిన తర్వాత స్వల్ప వ్యవధిలోనే మరో లక్షమంది సబ్‌స్క్రయిబర్స్ వచ్చారు. రెండు లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు ఉన్నారిప్పుడు. మాకు ‘సింపుల్‌ఘర్’ హిందీ ఛానల్ ఉంది. అందులో మా టీమ్‌లోని అక్షయ్ వస్తువుల గురించి వివరిస్తారు. మా టీమ్‌లో రవి, మణికంఠ అనే ఇద్దరు ఎడిటర్లు ఉన్నారు.
‘‘యూట్యూబ్‌నుంచి ఇటీవలే సిల్వర్‌బటన్ అందుకున్నా. లక్షమంది సబ్‌స్క్రయిబర్స్ వచ్చినందుకుగానూ ఈ చిన్ని అభినందన దక్కింది. ఇదెంతో ఉత్సాహాన్ని.. ఆనందాన్ని ఇచ్చింది. ఈ అభినందన తర్వాత తక్కువ వ్యవధిలోనే మరో లక్షమంది సబ్‌స్క్రయిబర్స్ వచ్చారు. ప్రస్తుతం వీరి సంఖ్య రెండు లక్షలకు పైబడే. నేను బిటెక్ చేశా. ఇంట్లో వస్తువుల గురించి, గ్యాడ్జెట్ల గురించి వీడియోలు చేస్తుంటే.. ‘ఇదంతా ఎందుకు? హ్యాపీగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకోక!’ అన్నారు కొందరు. అలాంటి కామెంట్స్ పట్టించుకోకుండా.. వినియోగదారులకు కచ్చితమైన సమాచారం అందివ్వాలనే ఆలోచనతో అడుగులేశా.
అలా వచ్చిన ఆలోచనతో...
నా పెళ్లి 2019 సంవత్సరంలో జరిగింది. మా ఆయన పేరు అభిలాష్. తను కూడా బి.టెక్ చదివారు. కాస్త విభిన్నంగా డిజిటల్ మార్కెటింగ్ కెరీర్‌గా ఎంచుకున్నారు. కరోనా సమయంలో చాలామంది ఆన్‌లైన్‌లో ప్రతిదీ ఆర్డర్ ఇచ్చేవాళ్లు. ఫలానా వస్తువు.. ఏ కంపెనీది కొంటే బావుంటుంది? అంటూ మా సర్కిల్‌వాళ్లు మమ్మల్ని అడిగేవాళ్లు. మేము చెప్పేవాళ్లం. మేం హైదరాబాద్‌లో కొత్తగా ఫ్యామిలీ పెట్టాక.. వాక్యూమ్ క్లీనర్, థర్మామీటర్, కిచెన్‌లో వాడే మిక్సీ గ్రైండర్లు, ఫ్యాన్లు.. లాంటి వస్తువులను కరోనా సమయంలో ఆన్‌లైన్‌లోనే కొన్నాం. రేటింగ్ చూసి ఆన్‌లైన్‌లో కొన్నా ఫలితం లేదు. డబ్బుకు తగిన క్వాలిటీ లేకపోవటం లాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. మా మాదిరే ఫలానా యాడ్ బావుందనో.. వస్తువు ఫొటో అందంగా ఉందనో.. రేటింగ్ ఆధారంగా కొంటుంటారు. తక్కువ సమయంలోనే పాడైతే ఏమీ చేయలేక పారేస్తారు. మంచి వస్తువులను టెస్ట్ చేసి నిజాయితీగా చెబితే వినియోగదారుల డబ్బులను సేవ్ చేయచ్చు అనిపించింది. ఇలాంటి సమాచారం పదిమందికి అందిస్తే ఎలా ఉంటుంది? అని మాట్లాడుకున్నప్పుడే ఈ యూట్యూబ్ ఆలోచన పుట్టింది.
ఆత్మవిశ్వాసం కలిగిందప్పుడే...
మరో ముగ్గురు మిత్రుల సహకారంతో ‘సింపుల్‌ఘర్ తెలుగు’ పేరుతో యూట్యూబ్ ఛానల్ తీసుకురావాలని అనుకున్నాం. లక్షల ఛానళ్ల ముందు నిలబడగలమా? అనే విషయంపై మూన్నెళ్ల పాటు మా వారు వర్క్ చేశారు. నాకు కమ్యూనికేషన్ ఉంది. దీంతో పాటు కొత్త విషయం తెల్సుకోవాలనే ఉత్సుకత నాలో ఎక్కువ. వీడియోలు చేసి మిత్రులకు, ఫ్యామిలీకి పంపేదాన్ని. ‘ముందుకు వెళ్లచ్చు’ అన్నారంతా. నేనే రాసుకుని కెమెరా ముందు చెప్పటం మాత్రం కష్టంగా ఉండేది. అదో ప్రహసనంగా అనిపించేది. అయితే సాధన చేయటం వల్ల ఎలా చెప్పాలో అర్థమైంది. యోగామ్యాట్స్ గురించి మొదటి వీడియో చేశా. ఆ వీడియోకోసం తీసుకున్న టేక్స్ గురించి చెప్పలేను. అలా తొలి వీడియో చేయటానికి వారం రోజులు పట్టిందంటే నా పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నాలుగు దోమ తెరలను పరీక్షించి.. వాటి ప్లస్‌లు, మైన్‌సలతో సహా చెప్పాను. ఆ వీడియోకి స్పందన వచ్చింది. చెప్పే విధానం చాలా బావుందని కామెంట్స్ వచ్చాయి. అప్పుడే కాన్ఫిడెన్స్ వచ్చింది నాలో.

షార్ట్స్‌తోనే అసలైన క్రేజ్...
ఆరేడు నిముషాల నిడివి ఉండే వీడియోను వారానికి ఒకటి మాత్రమే అప్‌లోడ్ చేసేవాళ్లం. మిక్సీగ్రైండర్లు, వంటింటి కత్తులు, ప్లగ్గులు, వెయిట్ మిషన్, బల్బులు, ఫ్యాన్లు, రూమ్ హీటర్లు.. లాంటి వస్తువులను కనీసం మూడు లేదా నాలుగు కొనుక్కుని వాటికి ఐదారు పరీక్షలు చేయటానికి కాస్త సమయం పట్టేది. ఫలానా వస్తువు బావుంటుందని జెన్యూన్ రికమెండ్ చేసేదాన్ని. కామెంట్స్‌లో జనాలు అడిగిన వస్తువులనూ కొని విశ్లేషించేదాన్ని. అయితే ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలకు ఉన్నంత ఆదరణ మాలాంటి యుటిలిటీ బేస్ వీడియోలకు ఆదరణ ఉండదేమో! అనిపించేది. నిరుత్సాహానికి గురయ్యేదాన్ని. ఈ పని అవసరమా? అనిపించేది. అయితే నెటిజన్ల ఫీడ్‌బ్యాక్ చూశాక.. మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో వీడియోలు చేసేదాన్ని. మేం అప్‌లోడ్ చేసిన షార్ట్స్‌కి అనూహ్యంగా క్రేజ్ వచ్చింది. ముప్ఫయి సెకన్ల పొట్టి వీడియోల్లో గట్టి సమాచారం ఉండటంతో గత డిసెంబరునుంచి వీటికి లక్షల్లో లైక్స్ రావటంతో పాటు వైరల్ అయ్యాయి. కెన్నెల్, ఇస్ర్తీపెట్టె, టీడీఎ్‌సమీటర్, ఇయర్‌ఫోన్లు, ఐఫోన్‌టిప్స్ గురించి చెబితే అద్భుతమైన స్పందన వచ్చింది.
అందుకే వీడియోలు చేయటం ఆపలేదు...
2021 అక్టోబర్ సమయంలో మా ఛానెల్ ప్రారంభించాం. ఏడాది దాటినా పదివేల మంది సబ్‌స్క్రయిబర్లు మాత్రమే ఉండేవాళ్లు. ‘మీ వీడియో చూసి ఫలానా వస్తువు కొన్నాం. రికమెండ్ చేసినందుకు ధన్యవాదాలు’ అనే కామెంట్స్ వచ్చినప్పుడు హ్యాపీగా ఫీలయ్యేదాన్ని. పనిలో శాటి్‌సఫ్యాక్షన్ ఉండటంతో వీడియోలు చేయటం ఆపలేదు. ఎట్టకేలకు గత డిసెంబర్ నుంచి మా ఛానల్ దారిలో పడింది. వీడియోలు వైరల్ అవుతున్నాయి. జనాలు చూస్తున్నారు. ఇకపోతే.. మా బాధేంటంటే.. చాలా సంస్థలు ఉపయోగకరమైన ఎన్నో ఇన్నోవేషన్ వస్తువులను తయారు చేస్తున్నాయి. అవి డిస్‌ప్లేకు కనిపించటం లేదు. జనాలకు తెలియటం లేదు. ఏవో యాడ్స్, రివ్యూల రేటింగ్స్‌ను చూసి కొనేస్తున్నారు. అలా చేయకూడదు. మనం పెట్టిన ప్రతి పైసాకు విలువ ఉండాలి. దీంతోపాటు వస్తువు క్వాలిటీగా ఉండాలి. మా ఛానెల్‌కు వచ్చి చూస్తే.. మీకు సమయం, డబ్బు వృథా కావు. ఇది గ్యారెంటీ. మా ఛానల్ చూసి వస్తువులు ఎంపిక చేసుకునే స్థాయికి ఎదగాలన్నదే మా డ్రీమ్.’’
-రాళ్లపల్లి రాజావలి