Tammareddy Bharadwaja: విక్టరీ' ఆలోచనలే వేరు

ABN , First Publish Date - 2023-06-18T04:19:39+05:30 IST

నా కాలమ్‌ చదువుతున్న చాలామంది మిత్రులు ఓ సలహా ఇచ్చారు. అదేంటంటే... ‘అలనాటి నటుల గురించి కూడా ఈ తరానికి తెలియజేస్తే బాగుంటుంది’ అని! తప్పకుండా. అవకాశం ఉన్నప్పుడల్లా వారి గురించి మాట్లాడుకొందాం. అందులో భాగంగా ఈవారం ‘విక్టరీ’ మధుసూదన్‌రావు గారి గురించి చెప్పాలి.

 Tammareddy Bharadwaja: విక్టరీ' ఆలోచనలే వేరు

భరద్వాజీయం

నా కాలమ్‌ చదువుతున్న చాలామంది మిత్రులు ఓ సలహా ఇచ్చారు. అదేంటంటే... ‘అలనాటి నటుల గురించి కూడా ఈ తరానికి తెలియజేస్తే బాగుంటుంది’ అని! తప్పకుండా. అవకాశం ఉన్నప్పుడల్లా వారి గురించి మాట్లాడుకొందాం. అందులో భాగంగా ఈవారం ‘విక్టరీ’ మధుసూదన్‌రావు గారి గురించి చెప్పాలి. ఎందుకంటే మొన్ననే ఆయన శతజయంతి జరిగింది. ఆయన రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు తదితరులతో 71 సినిమాలు చేశారు. హిందీలో కూడా సినిమాలు తీశారు. ఆయన సినిమాలన్నీ హిట్‌ అయ్యేవి. అందుకే వీరమాచినేని మధుసూదన్‌రావును ‘విక్టరీ’ మధుసూదన్‌రావు అనేవారు. ఆయన చేసినవన్నీ విభిన్నమైన చిత్రాలే. దాదాపు ముప్ఫై చిత్రాల్లో హీరోహీరోయిన్లుగా చేసిన రామారావు, సావిత్రిలను అన్నా చెల్లెళ్లుగా పెట్టి ‘రక్తసంబంధం’ తీశారు. అది సెన్సేషనల్‌ హిట్‌ అయింది. మొదలు పెట్టినప్పుడు అందరూ అనుకున్నారు... వీళ్లిద్దరూ అన్నా చెల్లెళ్లుగా నటిస్తే సినిమా ఫట్‌ అని. అన్నా చెల్లెళ్ల సంబంధం మీద అంతటి గొప్ప సినిమా ఆ రోజుకూ ఈ రోజుకూ లేదనేది చాలామంది అభిప్రాయం. ఆ తరువాత మాస్‌ హీరో ఎన్టీఆర్‌ గారిని ‘గుడిగంటలు’లో కాళ్లు లేకుండా వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి ఆయన సినిమా తీశారు.

అసలు మధుసూదన్‌రావు గారి ఆలోచనా విధానమే భిన్నంగా ఉండేది. ఆయనది కమ్యూనిస్టు భావజాలం. అలాగని కమ్యూనిస్టు సినిమాలు తీయలేదు. కానీ ఎక్కడ అవకాశం వచ్చినా ఆ భావజాలాన్ని వదిలిపెట్టలేదు. ‘పదండి ముందుకు, మనుషులు మారాలి, మంచి రోజులు వచ్చాయి’... లాంటి చిత్రాలు అద్భుతంగా తీశారు. ‘మనుషులు మారాలి’ అయితే అద్భుతంగా ఉంటుంది. అది రేమేక్‌ అనుకోండి. ఆయన రీమేక్‌ కింగ్‌. మధుసూదన్‌రావు గారు చేసినన్ని రేమేక్‌లు ఎవరూ చేసి ఉండరు. అన్నీ సూపర్‌ డూపర్‌ హట్లే. నాకు తెలిసినంత వరకు ఆయన 71 చిత్రాల్లో యాభైకి పైగా సిల్వర్‌ జూబ్లీలే. అలాగే పాటలు కూడా! ‘గాంధీ పుట్టిన దేశమా ఇది... నెహ్రూ కోరిన సంఘమా ఇది’ లాంటి అద్భుతమైన పాటలతో ప్రశ్నించేవారు. వాస్తవానికి ఆ సినిమాలో పెట్టాల్సిన పాట కాదు. కాకపోతే ఆ పాత్ర కోసం ఆ పాటను పెట్టి, ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని అక్కడ చెప్పగలిగారు. అలాగే ‘భక్త తుకారం’లోకి వచ్చేసరికి ‘ఉన్నావా అసలున్నావా...’ అని దేవుడిని ప్రశ్నించారు. తన ఆలోచనా విధానాన్ని ఏదో ఒక రూపంలో సినిమాల్లో జొప్పిస్తూ వచ్చారు.

ఆ తరువాత మధుసూదన్‌రావు గారి వద్ద అసిస్టెంట్లుగా చేసిన రాఘవేంద్రరావు గారు, కోదండరామిరెడ్డి గారు తెలుగు సినిమా చరిత్రలో సరొకొత్త ఒరవడిని సృష్టించారు. రాఘవేంద్రరావు గారు మసాలా సినిమాలకు కేరాఫ్‌ అయ్యారు. అప్పట్లో రాజ్‌కపూర్‌ను షోమ్యాన్‌ అనేవారు. రాఘవేంద్రరావు గారు కూడా మనకు షోమ్యాన్‌లా సినిమాలు తీశారు. అలాగే కోదండరామిరెడ్డి గారు. వాళ్లిద్దరూ వరుసగా సూపర్‌హిట్స్‌ ఇచ్చారు. చిరంజీవి గారితో కోదండరామిరెడ్డి గారు 30 సినిమాలు చేశారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌తో రాఘవేంద్రరావు గారు చేసుకొంటూ వెళ్లారు. మధుసూదన్‌రావు గారి మరో అసిస్టెంట్‌ పీసీ రెడ్డి. ఆయన ఒకే సంవత్సరం ఎన్టీఆర్‌తో ‘బడిపంతులు’, శోభన్‌బాబుతో ‘మానవుడు దానవుడు’, కృష్ణతో ‘ఇల్లు ఇల్లాలు’ తీశారు. ముగ్గురు హీరోలతో తీసిన మూడూ సిల్వర్‌ జూబ్లీలే. నాకు తెలిసి ఇప్పటికీ ఆ రికార్డు బ్రేక్‌ చేసిన దర్శకులు లేరు. అంటే ఒకే ఏడాది ముగ్గురు హీరోలతో మూడు సిల్వర్‌ జూబ్లీలు. అలాగే ఆయన దగ్గర చివర్లో చేసిన శివనాగేశ్వరరావు కూడా కామెడీ సినిమాలను ఒక పద్ధతిగా తీశాడు. మధుసూదన్‌రావు గారు సినిమాలు మానేసే సమయానికి ‘మధు ఫిలిమ్‌ ఇనిస్టిట్యూట్‌’ పెట్టి అందులో ఎంతోమంది కుర్రాళ్లను నటులుగా తీర్చిదిద్దారు. శ్రీకాంత్‌, శివాజీరాజా, పూరీ జగన్నాథ్‌, బండ్ల గణేశ్‌... ఇలా చాలామంది అక్కడి నుంచి వచ్చినవారే.

ఇలా అన్ని రకాలుగా పరిశ్రమ కోసం పాటుపడుతూ, తను నమ్మిన సిద్ధాంతాలను పాటిస్తూ, మంచిని ఇంకా పెంచుకొంటూ పోవడానికి ప్రయత్నం చేశారు మధుసూదన్‌రావు గారు. సినిమాల ద్వారా ప్రజలకు వినోదాన్ని పంచుతూనే తను నమ్మిన సిద్ధాంతాన్ని కూడా జొప్పించగలిగారు.

ఆయన నాన్న గారి ‘రవీంద్రా ఆర్ట్‌ పిక్చర్స్‌’లో ఎన్టీఆర్‌తో ‘లక్షాధికారి’, ఏఎన్నార్‌తో ‘జమిందార్‌’ చేశారు. తరువాత నా దగ్గరికొచ్చేసరికి కృష్ణ గారితో ‘జగన్నాథ రథచక్రాలు’ తీశారు. అలాగే ‘జగపతి ఆర్ట్‌ పిక్చర్స్‌’కు చాలా చిత్రాలు చేశారు. ఆ బ్యానర్‌లో అక్కినేనితో వరుస హిట్స్‌ ఇచ్చారు. అలాంటి మహనీయులను మనం అప్పుడప్పుడూ గుర్తు చేసుకోవాలి.

-తమ్మారెడ్డి భరద్వాజ(సినీ రచయిత, దర్శకుడు)

Updated Date - 2023-06-18T04:19:39+05:30 IST