Sushmita: మా ఇంట్లో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టయిల్

ABN , First Publish Date - 2023-01-15T02:15:38+05:30 IST

సుస్మిత... ఈ మధ్య పరిశ్రమలో బాగా వినిస్తున్న పేరు. చిరంజీవి కుమార్తెగానే కాకుండా కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ కెరటం.

Sushmita: మా ఇంట్లో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టయిల్

సుస్మిత... ఈ మధ్య పరిశ్రమలో బాగా వినిస్తున్న పేరు. చిరంజీవి కుమార్తెగానే కాకుండా కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ కెరటం. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో చిరంజీవి గెటప్‌ను మరో రేంజ్‌కుతీసుకువెళ్లారు. ఆ విశేషాలను ఆమె ‘నవ్య’తో పంచుకున్నారు...

భోగి రోజు ఉదయమే మా ఇంట్లో సంక్రాంతి సందడి మొదలవుతుంది. ఉదయం నాన్నగారింట్లో ఐదు గంటలకే అందరం కలుస్తాం. షూటింగ్స్‌ లేకపోతే, అందరం బెంగళూరులో మా ఫార్మ్‌హౌ్‌సకు వెళ్తాం. అక్కడే భోజనం చేస్తాం. సాయంత్రం అంత్యాక్షరి లాంటి గేమ్స్‌ ఉంటాయి. సమయం తెలియకుండానే ఆ రోజు గడిచిపోతుంది.

రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’, ‘ఆచార్య’ చిత్రాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా చేశాను. ప్రోమోస్‌, ఇంటర్వ్యూలకు వెళ్లేటప్పుడు దుస్తులకు సంబంధించి సలహాలు అడుగుతాడు. నేను సెలెక్ట్‌ చేసి పంపిస్తాను.

‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేయడంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు?

కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌ లో ఒకేసారి అనేక విషయాలను సమన్వయం చేసుకోవడమే అసలైన సవాల్‌. ప్రతి సీన్‌కూ కొత్తగా డిజైన్‌ చేయాలి. దర్శకుడు బాబీ ఒక సీన్‌ గురించి వివరించినప్పుడు డిజైనర్‌ గా నాకంటూ ఓ ఐడియా ఉంటుంది. దాని ప్రకారం మనం రూపొందించిన దుస్తులు నాన్నకి సౌకర్యంగా ఉండాలి. అలాగే సెట్‌, సన్నివేశం తాలూకు మూడ్‌ను ఆ దుస్తులు ప్రతిబింబించాలి.

అయితే ఏ రంగంలోనైనా చాలెంజ్‌ లేకపోతే బోర్‌ కొడుతుంది. సవాళ్లు మనల్ని రాటుదేలుస్తాయి. కష్టమైన సందర్భాలను ఒక ఎగ్జైట్‌మెంట్‌ కింద తీసుకుంటాను. కొత్తదనం చూపించడానికి ప్రయత్నిస్తాను. ఆసక్తితోనే కాస్ట్యూమ్‌ డిజైనర్‌ పనిని ఎంచుకున్నాను. బాగా ఆస్వాదిస్తున్నాను.

ఈ రంగంపైన మీకు ఆసక్తి ఎలా కలిగింది?

ఫ్యాషన్‌ రంగం మీద కన్నా నాకు సినిమాలపైనే ఎక్కువ ఆసక్తి. సినీ అభిమానిగానే కాకుండా, పరిశ్రమలో కూడా భాగమవ్వాలనేది నా కోరిక. పైగా చిన్నప్పటి నుంచి ఈ రంగాన్ని దగ్గరగా చూస్తూ పెరిగాను కాబట్టి అది సహజం. ఇక్కడ కెరీర్‌ను నిర్మించుకోవాలనే ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేశాను. కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా చేస్తున్నాను.

Sushmita-chiru.jpg

మాస్‌ గెటప్‌లో మెప్పిస్తూనే, చిరంజీవిని వయసుకు తగినట్లు హుందాగానూ చూపించాలి. రెండింటినీ ఎలా బ్యాలెన్స్‌ చేశారు?

ప్రేక్షకులకు ఈ సినిమా ద్వారా, ఈ పాత్ర ద్వారా మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, వాళ్లను ఎలా ఎంటర్‌టైన్‌ చేయబోతున్నాం అన్నదే టెక్నీషియన్ల అందరి సింగిల్‌ ఎజెండా. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్‌ను కూడా దానికి జోడించాలి. నటులు సౌకర్యవంతంగా భావించకపోతే పూర్థి స్థాయి ప్రదర్శన ఇవ్వలేరు. సెట్‌కు వెళ్లిన తర్వాత మళ్లీ మార్పులు చేర్పులు చేస్తాం. కొన్నింటి విషయంలో ముందుగానే ఆప్షన్స్‌ పెట్టుకుంటాం. ‘వాల్తేరు వీరయ్య’లో నాకు బాగా నచ్చిన అంశం స్ర్కిప్ట్‌. అది వింటున్నప్పుడే నా మైండ్‌లో ఓ స్పష్టత వచ్చింది.

‘వాల్తేరు వీరయ్య’ పాత్రలో చాలా వేరియేషన్స్‌ ఉన్నాయి కదా?

అవును. వాటన్నిటికీ సరిపోయేలా మేం ప్రధానంగా లుంగీ లుక్‌పైనే దృష్టి పెట్టాం. పడవల్లో ఉండేవాళ్లకి లుంగీలో సౌకర్యంగా ఉంటుంది. నెట్‌ బనియన్‌ వేసుకుంటారు లోపల. ఈ పాత్ర ఒక చిన్న స్మగ్లర్‌ కూడా. మామూలుగా వాళ్లు కళ్లజోడు, బూట్లు లాంటి వస్తువులు అన్నీ డూప్లికేట్స్‌ వాడతారు. అలాగే ఈ సినిమాలో నాన్నది సీరియస్‌ పాత్ర కాదు. చాలా సరదాగా ఉండే మనిషి. ఆ పేటలో అందరికీ గ్యాంగ్‌ లీడర్‌. తనకు బాగా నప్పే పాత్ర అది. కానీ ‘గాడ్‌ఫాదర్‌’లో ఆయన పాత్ర డిఫరెంట్‌గా ఉంది. నాయకత్వ లక్షణాలు, నిశ్శబ్దంగా పనిచేసుకుపోయే తత్వం ఉంటుంది ఆ పాత్రలో. అక్కడ చాలా డీపర్‌ కలర్‌ వాడాం. ‘వాల్తేరు వీరయ్య’ పాత్ర దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. దానికి తగ్గట్లు రంగులు మార్చుకుంటూ వచ్చాం. అదేవిధంగా థీమ్‌ సాంగ్స్‌ రెండు ఉన్నాయి. అందులో పాత్ర సహజ శైలికి పూర్తి భిన్నంగా వెళ్లాం. షూట్‌ చేసిన ప్రదేశాలకు మ్యాచ్‌ అయ్యే రంగులు వాడాం. నేపథ్యంలో మంచు కనిపిస్తుంటే మనం భిన్నంగా ప్రయత్నిస్తే బాగోదు. అందుకే ఇప్పుడు ఆ పాట ఒక అందమైన తీయని కలలా కనపడుతోంది. శ్రుతిహాసన్‌ చీరలకు కూడా మ్యాచ్‌ అయ్యేలా అన్నీ సాఫ్ట్‌ కలర్స్‌, సాఫ్ట్‌ ప్యాలెట్‌ వాడాం.

అంత చలిలో పనిచేయడం కష్టం అనిపించలేదా?

చాలా కష్టం అండీ. మేమైతే పైనుంచి కిందవరకూ చలి బారి నుంచి రక్షించుకునేందుకు దుస్తులతో కప్పేసుకున్నాం. నాన్న, శ్రుతిహాసన్‌, బ్యాగ్రౌండ్‌ డ్యాన్సర్లు మాత్రం చాలా ఇబ్బందిపడ్డారు. పెద్ద పెద్ద జాకెట్లతో కవర్‌ చేసుకోవాలి. షాట్‌ రెడీ అనగానే పైన ఉన్న లేయర్‌ తీసేయాలి. ఒక్కో షాట్‌కు చాలా టైమ్‌ పట్టింది. అందరికన్నా ఎక్కువ శ్రుతిహాసన్‌ చలి ప్రభావానికి ఎక్కువ గురయ్యారు. ఆమె ఉల్లిపొర లాంటి చీర ధరించారు. అందంగా కనిపించారు కానీ చలికి తట్టుకోలేకపోయారు.

కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌పై బడ్జెట్‌ ప్రభావం ఎంత?

వృథా ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఉంటాం. అనుకున్న బడ్జెట్‌లోనే పూర్తి చేస్తాం. పాటలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం. ఈ విషయంలో నేను లక్కీ. మంచి నిర్మాణ సంస్థల్లో పని చేశా. అక్కడ ‘దీనికి ఇంత ఖర్చు పెట్టడం ఎందుకు’ అని అడగరు.

మీ నాన్న వేసుకున్న దుస్తుల్లో బాగా నచ్చింది?

నటుడిగా ఆయన అన్ని రకాల విషయాలనూ తనలో సహజంగా ఇముడ్చుకుంటారు. ‘గాడ్‌ఫాదర్‌’లో కొత్తగా డ్రెస్‌లు వేశారు. ‘అబ్బా... ఇన్నాళ్లూ ఎందుకు వేయలేదా... ఇంత బావున్నారు’ అనుకున్నాను. అలాగే ‘వాల్తేరు వీరయ్య’లో లుంగీ, స్పోర్ట్స్‌ షూస్‌, కళ్లద్దాలతో కనిపించారు. ఇందులోనూ బాగానే ఉన్నారనిపించింది. నాన్న ఎలాంటి దుస్తుల్లో అయినా బానే ఉంటారు. షూస్‌, జీన్స్‌, లెదర్‌ జాకెట్‌ వేసుకున్నప్పుడు చాలా బావున్నారనిపించింది.

1.jpg

ఫ్యాషన్‌ ను ఎలా నిర్వచిస్తారు?

ఫ్యాషన్‌ అనేది ట్రెండ్స్‌ను ఫాలో అవ్వదు. మన వ్యక్తిత్వాన్ని మనం అత్యుత్తమంగా ఎలా ప్రదర్శించుకోగలం అనేది ఫ్యాషన్‌. మనల్ని మనం బయటకు ఎలా చూపించుకుంటున్నాం, మనల్ని మనం ఏం అనుకుంటున్నాం, మనల్ని ఎంత బెస్ట్‌గా చూపించుకోగలం అనేదే ప్రధానం. కొన్నిసార్లు ప్లెయిన్‌ శారీ కావచ్చు, జీన్స్‌ వైట్‌షర్ట్‌ అవ్వొచ్చు... అది ట్రెండీ అవ్వకపోయినా, మీ పర్సనల్‌ స్టైల్‌ను సూచిస్తుంది. అదే ఫ్యాషన్‌బుల్‌గా ఉండడానికి ఉత్తమమైన మార్గం. అలాగే కంఫర్ట్‌బుల్‌గానూ ఉండాలి.

రామ్‌చరణ్‌ ‘ఆస్కార్‌’ వేడుకకు వెళ్లేటప్పుడు

ఎలాంటి డ్రెస్‌ వేసుకుంటే బాగుంటుంది?

తన పర్సనల్‌ స్టైల్‌ స్టేట్‌మెంట్‌ ఎక్సలెంట్‌. తనకు సరిపోయే దుస్తులను ఎంచుకోవడంలో మంచి నైపుణ్యం ఉంది. మన సంస్కృతిని ప్రతిబింబిస్తూనే, పాశ్చాత్య శైలికి దగ్గరగా ఉంటుంది. ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డ్స్‌ ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు తన వస్త్రధారణలో ఒక వెస్ట్రన్‌ ఫీల్‌ కూడా కనిపించింది. అప్పుడు ఫోన్‌ చేసి చరణ్‌ను, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ను అభినందించాను.

ఒక ప్రేక్షకురాలిగా ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో

మీకు బాగా నచ్చిన అంశం?

బాబీ ప్రతి సన్నివేశంలోనూ ఎమోషన్‌, యాక్షన్‌, కామెడీ కలగలిపిన తీరు నాకు బాగా నచ్చింది. అంతర్లీనంగా ఎమోషన్‌ను కంటిన్యూ చేయడం బాగుంది.

మీ కుటుంబంలో మంచి డ్రెస్‌ సెన్స్‌ ఎవరికుంది?

బెస్ట్‌ అని చెప్పలేను గానీ ప్రతి ఒక్కరికీ వస్త్రధారణలో వాళ్లకంటూ సొంత శైలి ఉంది. వరుణ్‌, వైష్ణవ్‌తేజ్‌, అల్లు అర్జున్‌, చరణ్‌, నాన్న... ఇలా ప్రతి ఒక్కరూ తమ సొంత శైలిని సెట్‌ చేసుకున్నారు. ఇక బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌ అయితే యూత్‌లో ట్రెండ్‌ సెట్టర్‌. తనది యూనిక్‌ స్టైల్‌. కాలేజీ రోజుల్లో ఆయన యూత్‌ ఐకాన్‌. బాబాయ్‌ చెప్పులు వేసుకొని నడిచినా అందులో ఓ స్టైల్‌ ఉంటుంది.

మీ అమ్మగారు ఏవైనా సలహాలు ఇస్తారా?

చిన్నప్పటి నుంచి మా అమ్మను చీరల్లో చూడడం ముచ్చటగా ఉంటుంది. ఇప్పటికీ నా చీరలన్నీ మా అమ్మ సెలెక్ట్‌ చేసినవే . చీరల ఎంపికలో ఆమెకు మంచి అభిరుచి ఉంది. ‘ఫలానా దుస్తులు మీకు బాగుంటాయ’ని నాన్నకు కూడా సలహాలిస్తుంది. నాన్న కోసం దుస్తులు ఎంపిక చేసినప్పుడు కొన్నిసార్లు మన ఎంపిక సరైనదా, కాదా అనే విషయం తెలుసుకోవడానికి అమ్మను అడుగుతాం.

-సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - 2023-01-15T09:10:59+05:30 IST