కనకమై మెరిసిన కాంస్యం

ABN , First Publish Date - 2023-10-04T04:05:14+05:30 IST

అంతా కలలా ఉంది. ఇదంతా నిజమేనా? నేనేదైనా వర్చువల్‌ ప్రపంచంలో ఉన్నానా? అని కూడా అనిపిస్తోంది.

కనకమై మెరిసిన కాంస్యం

యంగ్‌ టాలెంట్‌

ఆమెకు అదే తొలి అంతర్జాతీయ వేదిక...

అదీ మహామహులు తలపడే మెగా ఆటల పండుగ...

కానీ... చెదరని ఆత్మవిశ్వాసం... పట్టువదలని ప్రయత్నం...

ఆమెను విజేతగా నిలబెట్టాయి.

అగసర నందిని... హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల హెప్టాథ్లాన్‌లో కాంస్య పతకం గెలిచి... దేశ గౌరవాన్నే కాదు... తెలుగు కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేసిన క్రీడాకారిణి. స్వదేశానికి తిరిగివచ్చిన నందినిని ‘నవ్య’ పలకరించినప్పుడు... ఉద్వేగభరితమైన తన విజయ యాత్ర గురించి ఇలా చెప్పుకొచ్చింది...

ఫేవరెట్‌ ఫుడ్‌: చికెన్‌ ధమ్‌ బిర్యానీ. రోజు పెట్టినా తింటా.

అభిమాన యాక్టర్‌: మెగాస్టార్‌ చిరంజీవి. అంజి సినిమా బాగా ఇష్టం.

ఇష్టమైన పుస్తకం: అబ్దుల్‌ కలాం ఆటోబయోగ్రఫీ

‘వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌’.

ఆరాధ్య ఆటగాళ్లు: పుల్లెల గోపీచంద్‌, మహేంద్రసింగ్‌ ధోనీ

ఇష్టమైన ప్రదేశం: గోవా

అంతా కలలా ఉంది. ఇదంతా నిజమేనా? నేనేదైనా వర్చువల్‌ ప్రపంచంలో ఉన్నానా? అని కూడా అనిపిస్తోంది. ఆసియా క్రీడల్లో కాంస్య పతకం ఖాయం కాగానే పట్టలేని సంతోషంతో గంతులేశా. మా పెదనాన్న గుర్తొచ్చి, ఈ విజయాన్ని ఆయనతో పంచుకోవడానికి తను మాతో ఇప్పుడు లేరని బాధపడ్డా. వెంటనే కోచ్‌ నాగపురి రమేష్‌ సార్‌కి వీడియో కాల్‌ చేసి మెడల్‌ సాధించానని చెప్పా. ఆయన ఉద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. తరువాత నా గురువు రామ్‌లక్ష్మణ్‌ సార్‌కి, అమ్మానాన్నకు ఫోన్‌ చేశా. వారంతా అప్పటికే టీవీలో లైవ్‌ చూసి, నాకు మూడో స్థానం లభించగానే పటాకులు పేల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. నేను ఫోన్‌ చేశాక అందరూ ఒక్కసారిగా సంతోషం పట్టలేక ఏడ్చేశారు. ‘మొత్తానికి అనుకున్నది సాధించావు. నీతో పాటు మా జీవితాలు కూడా మార్చేశావు. నీ గెలుపు చూసి దేశం మొత్తం మురిసిపోతోంది. నిన్ను కన్నందుకు మా రుణం తీర్చుకున్నావు’ అని అమ్మా నాన్న అన్నారు. మెడల్‌ గెలిచాక ఇప్పటివరకు పట్టుమని రెండు గంటలు పడుకుంది లేదు. ఆ పతకాన్ని చూస్తుంటే అసలు నిద్రే రావడం లేదు. తొలి అంతర్జాతీయ ఈవెంట్‌లో, అదీ ఆసియా క్రీడల్లో పతకం సాధించడం నన్ను ఎంతో ఉద్వేగానికి గురి చేసింది.

అమ్మ ఒప్పుకోలేదు...

తొలుత నాలో ప్రతిభను గుర్తించింది ముత్తయ్య సార్‌. హైదరాబాద్‌ కేంద్రియ విద్యాలయంలో చదువుతున్నప్పుడు ఆయన అక్కడ పీఈటీ. క్రీడల్లో నేను చురుగ్గా ఉన్నానని గమనించి, స్థానికంగా జరిగే క్రీడా పోటీలన్నింటికీ పంపించేవారు. అలా గచ్చిబౌలి స్టేడియంలో 2018లో జరిగిన స్టేట్‌ రీజినల్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో నాగపురి రమేష్‌ సార్‌ సహాయకుడు నాగరాజు అన్న... నేను తలపడిన ఈవెంట్స్‌ అన్నీ దగ్గరుండి చూశాడు. నేను పోటీ పడిన అన్ని విభాగాల్లో పతకాలు సాధించడంతో ‘నీకు మంచి భవిష్యత్‌ ఉంటుంది. రమేష్‌ సార్‌ దగ్గర శిక్షణ తీసుకో’ అని చెప్పాడు. మూడ్రోజులు రమేష్‌ సార్‌ వద్ద సాధన చేశాక నాపై సార్‌కు నమ్మకం కలిగింది. అక్కడే శిక్షణ తీసుకొంటానని ముందుగా మా నాన్నకు చెప్పా. నాన్న నా మాట ఎప్పుడూ కాదనరు. ఒక విధంగా చెప్పాలంటే... నేను డాడీ గార్ల్‌. చెప్పగానే నాన్న కూడా వెంటనే సరే అన్నారు. అమ్మ మాత్రం ఒప్పుకోలేదు. హైదరాబాద్‌లో మేం ఉండే కాప్రా నుంచి రోజూ 32 కిలోమీటర్లు ప్రయాణించి గచ్చిబౌలికెళ్లి సాధన చేసి రావాలంటే చాలా కష్టమనేది అమ్మ ఆలోచన. అందుకే అంగీకరించలేదు. దాంతో ‘అంత దూరం వెళ్లే పని లేకుండా గోపీచంద్‌ అకాడమీ హాస్టల్‌లో ఉండి శిక్షణ తీసుకుంటా’ అని చెప్పా. ‘చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎప్పుడూ వదిలి ఉండలేదు. ఇప్పుడు ఒక్కదానివే ఎలా ఉంటావు’ అని అమ్మ వారించింది. ‘అమ్మాయికి మంచి భవిష్యత్‌ ఉండాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పద’ని అమ్మను నాన్న ఒప్పించారు. వారానికి ఒక్కసారైనా ఇంటికి రావాలనే కండీషన్‌పై అమ్మ ఒప్పుకుంది. అలా వారమంతా ట్రైనింగ్‌ తీసుకుని, వీకెండ్‌లో ఇంటికి వెళ్లి, అమ్మకు కనిపించి కుటుంబంతో సమయం గడిపేదాణ్ణి.

ఆ కోరిక నెరవేరలేదు...

మా పెదనాన్న శంకరప్పను డాడీ అనే పిలిచేదాన్ని. అప్పుడప్పుడు నాన్నయినా కొన్ని విషయాల్లో నో చెబుతారేమో కానీ, పెదనాన్న మాత్రం నేను అడిగితే ఎప్పుడూ కాదన్నది లేదు. ఎంత ఖరీదైన వస్తువైనా కొనిచ్చేవారు. నాకు 13 ఏళ్లు వచ్చేవరకు ఆయనే నన్ను చదివించారు. నా బాగోగులు తనే చూసేవారు. అలాంటి పెదనాన్న గత ఏడాది డిసెంబరులో గుండెపోటుతో హఠాత్తుగా చనిపోయారు. ఆ ముందు రోజు కూడా నేను ఆయనతో మాట్లాడా. అప్పుడు నేను తిరువనంతపురం ‘ఖేలో ఇండియా’ క్యాంప్‌లో ఉన్నా. పెదనాన్న కోసం కేరళ సంప్రదాయ పట్టు బట్టలు కొన్నా. ఆయనకు అవి తొడిగి ఎలా ఉన్నారో చూద్దామని ఎంతో ఆశపడ్డా. కానీ అది తీరని ఆశగా మిగిలిపోయింది. ఆయన చివరి చూపులు కూడా దక్కలేదు. అదే సమయంలో ‘ఖేలో ఇండియా’ క్యాంప్‌ ఇంటర్‌ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొనాల్సి ఉంది. వరల్డ్‌ యూనివర్సిటీ గేమ్స్‌కు వెళ్లాలంటే ఇందులో అర్హత సాధించాలి. నేను పెద్ద అథ్లెట్‌ కావాలనేది పెదనాన్న చిరకాల కోరిక. అందుకే దుఃఖాన్ని అదిమిపట్టి, గుండె నిబ్బరం చేసుకొని, ధైర్యం కూడదీసుకొని పోటీల్లో తలపడ్డా. రెండో స్థానంలో నిలిచా. కానీ తిరిగి వచ్చాక చాలా రోజులు పెదనాన్న లేరన్న బాధ కుంగదీసింది. దాని నుంచి బయటకు రావడానికి చాలా రోజులు పట్టింది. ప్రస్తుతం పెదనాన్న కుటుంబాన్ని గ్రామం నుంచి తీసుకొచ్చి మా దగ్గరే ఉంచుకుంటున్నాం. దీని నుంచి తేరుకుంటుండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో తాతయ్య చనిపోయారు. అథ్లెటిక్స్‌ పోటీల్లో ఉండడంతో ఆయనను కూడా కడసారి చూడలేకపోయా.

పెదనాన్నకు అంకితం...

నేను దేశం మెచ్చే అథ్లెట్‌ అవ్వాలని మా పెదనాన్న కలలు కన్నారు. ఇప్పటికీ ఆయన నాతోనే ఉన్నారనే నేను భావిస్తా. ఆసియా గేమ్స్‌లో పతకం అందుకునే సమయంలో ఆయన గుర్తొచ్చి కన్నీళ్లు ఆపుకోలేకపోయా. ఈ పతకం పెదనాన్నకు అంకితం. ఇక పోడియం మీద నిలుచున్నప్పుడు భారత జాతీయ గీతం ప్రారంభమై, త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంటే గుండె ఉప్పొంగిపోయింది. ఆ అనూభూతి ఎప్పటికి మర్చిపోలేను.

ప్రధాని ప్రశంసలు...

పతకం గెలిచాక ప్రధాని నరేంద్ర మోదీ గారు ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌)లో నన్ను ప్రశంసించడం గర్వంగా ఉంది. దేశ ప్రధాని నా గురించి ప్రస్తావించినప్పుపు ఎంతో ఆనందపడ్డా. ఆతర్వాత హాంగ్జౌలోనే ఉన్న గోపీచంద్‌ సార్‌ నేను పతకం గెలిచానని తెలుసుకొని, నా దగ్గరకొచ్చి అభినందించారు. ‘బ్యాడ్మింటన్‌లో భారత్‌ రజతం నెగ్గిన దానికంటే నువ్వు పతకం సాధించడం నాకు ఎక్కువ సంతోషం కలిగించింది’ అన్నారు. ఆ మాటలకు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

ఆ వ్యాఖ్యలు పట్టించుకోను...

2019లో ఉడుపిలో జరిగిన సౌత్‌జోన్‌ చాంపియన్‌షి్‌పలో స్వప్నా బర్మన్‌ పేరిటున్న జాతీయ హెప్టాథ్లాన్‌ రికార్డును నేను బద్దలుకొట్టా. ఆమెతో నాకు పెద్దగా పరిచయం లేదు. ఈ ఏడాది జూన్‌లో భువనేశ్వర్‌లో జరిగిన అంతర్‌ రాష్ట్ర పోటీల్లోనే స్వప్నను తొలిసారి నేరుగా చూశా. ఆ పోటీల్లో ఆమె ప్రథమ స్థానం దక్కించుకుంది. నేను రెండో స్థానంలో నిలిచా. అప్పుడు ఆమె నన్ను అభినందించింది. నేను కూడా కంగ్రాట్స్‌ చెప్పా. మళ్లీ మేమిద్దరం కలిసింది లేదు. ఆసియా క్రీడల హెప్టాథ్లాన్‌లో నేను ఒక్కొక్క ఈవెంట్లో మెరుగైన ప్రదర్శన చేస్తూ వస్తున్న కొద్దీ... నాతో ఆమె ప్రవర్తించే తీరులో మార్పు వచ్చింది. అయితే నేను అవేవీ పట్టించుకోకుండా ఈవెంట్స్‌ పైనే దృష్టిపెట్టా. ఎప్పుడైతే నాకు కాంస్య పతకం వచ్చిందని తెలిసిందో ఆమె ఆక్రోశం వెళ్లగక్కింది. నన్ను ‘ట్రాన్స్‌జెండర్‌నని’ అన్నది. వేరే దేశానికి చెందిన ప్రత్యర్థులు ఆ మాటలనుంటే వేరే రీతిలో సమాధానం చెప్పేదాన్ని. సీనియర్‌ క్రీడాకారిణి, మన దేశానికే చెందిన వ్యక్తి అలా మాట్లాడేసరికి చాలా బాధపడ్డా . అక్కడ తనతో గొడవ పడి దేశం పరువు తీయకూడదని నన్ను నేను నియంత్రించుకున్నా. అందులోనూ అమ్మకు ఆరోగ్యం బాగోలేదని ఇంటికొచ్చేశా. ఆ తర్వాత ‘ఎక్స్‌’లో స్వప్న ఒక ట్వీట్‌ చేసి, తొలగించింది. నా విజయాన్ని గౌరవించుంటే హుందాగా ఉండేది. నేను గెలిచా కాబట్టి తను ఈ విధమైన వ్యాఖ్యలు చేసింది. అదే నేను ఏ ఐదో స్థానంలోనో నిలిచుంటే తను స్పందించేది కాదు. మొదట్లో బాధపడ్డా... విజయాలతో పాటు ఇలాంటి విమర్శలూ ఉంటాయని భావించి వాటిని పట్టించుకోవడం మానేశా. ఈ విషయాన్ని జాతీయ అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ దృష్టికి తీసుకెళ్తా.

సంజయ్‌ ఎస్‌ఎ్‌సబిమిషన్‌

ఒలింపిక్స్‌పై ఫోకస్‌...

పదిహేను రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాక మిషన్‌ ఒలింపిక్స్‌ను ప్రారంభిస్తా. నేషనల్‌ గేమ్స్‌, అంతర్‌ రాష్ట్ర పోటీలతో మొదలుపెట్టి, ఇంటర్నేషనల్‌ ఈవెంట్లలో పోటీ పడాల్సి ఉంది. ఆసియా క్రీడల ప్రదర్శనను మరో ఇరవై శాతం పెంచగలిగితే ఒలింపిక్స్‌ మెడల్‌ను అందుకోవచ్చు. ఇందుకోసం ప్రణాళికబద్ధంగా శ్రమించాల్సి ఉంది. ఫిట్‌నె్‌సను కాపాడుకుంటూ, మరింత కష్టపడితే పతకం సాధించొచ్చు.


తమ్ముళ్లతో డిషూం.. డిషూం..

తమ్ముళ్లు హర్షిత్‌, భాను నేను ఒక్క చోట ఉన్నామంటే దేనికో దానికి కొట్టుకుంటాం. ఏ విషయంలోనైనా ముగ్గురిలో తప్పు ఎవరిదుంటే వాళ్లని మిగితా ఇద్దరం కలిసి కొడతాం. ఈ లోపు అమ్మ వచ్చి నా వీపు వాయిస్తుంది. ‘పెద్దదానివి... నువ్వు వాళ్లతో కలిసి కొట్లాడతావా’ అని నన్ను తిడుతుంది. చాన్స్‌ దొరికిందని తమ్ముళ్లు ఇద్దరూ నన్ను బుక్‌ చేసి, తెలివిగా తప్పించుకుంటారు. తమ్ముళ్లు, మావయ్య ఉమేష్‌... నా బెస్ట్‌ ఫ్రెండ్స్‌. నాన్నకి స్మార్ట్‌ ఫోన్‌, ఇంటర్నెట్‌ వంటివి ఉపయోగించడం పెద్దగా తెలియదు. నేను ఎక్కడికి వెళ్లాలన్నా, నా వ్యక్తిగత పనులు ఏవైనా మావయ్యే చక్కబెడతారు.

Updated Date - 2023-10-04T04:05:54+05:30 IST