Nun : కోట్లను వదిలి సన్యాసినిగా మారి

ABN , First Publish Date - 2023-02-07T23:41:47+05:30 IST

కోట్లకు పడగలెత్తిన వజ్రాల వ్యాపారి కుమార్తె, తెల్ల చీర ధరించి, పాదరక్షలు లేకుండా ఇంటింటికీ తిరుగుతూ భిక్షమెత్తే సన్యాసినిగా మారింది.

Nun : కోట్లను వదిలి సన్యాసినిగా మారి

కోట్లకు పడగలెత్తిన వజ్రాల వ్యాపారి కుమార్తె, తెల్ల చీర ధరించి,

పాదరక్షలు లేకుండా ఇంటింటికీ

తిరుగుతూ భిక్షమెత్తే సన్యాసినిగా మారింది. సర్వత్రా ఆసక్తినీ,

విమర్శలనూ ఎదుర్కొంటున్న

ఆ ఎనిమిదేళ్ల అమ్మాయే సూరత్‌కు చెందిన దేవాంశి సాంఽఘ్వి. ఆ పాప

గురించిన ఆసక్తికరమైన కథనమిది.

రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం భారతదేశంలో పుట్టిన, ప్రపంచంలోనే అత్యంత పురాతన జైన మతాన్ని నాలుగున్నర లక్షల మంది అనుసరిస్తున్నారు. వీరిలో సాంఘ్వి సన్యాసినులు కూడా ఉన్నారు. భౌతిక ప్రపంచాన్ని త్యజించి, జైన మతాన్ని స్వీకరిస్తున్న వారి సంఖ్య కొన్నేళ్లుగా అసాధారణంగా పెరిగిపోతోంది. వీరిలో దేవాంశి లాంటి ముక్కుపచ్చలారని ఆడపిల్లలూ ఉంటున్నారు. గత బుధవారం గుజరాత్‌లోని సూరత్‌ నగరంలో పెద్దలైన జైన సన్యాసుల సమక్షంలో దేవాంశి దీక్షను స్వీకరించింది. ఆభరణాలు, పట్టు వస్త్రాలు, వజ్రాల కిరీటం ధరించి, తల్లితండ్రులతో పాటు వేదిక దగ్గరకు చేరుకున్న దేవాంశి దీక్ష తీసుకున్న తర్వాత సాటి సన్యాసులతో కలిసి పోయింది. తెల్లని చీర ధరించి, శిరోజాలు తొలగించిన తలను పవిట చెంగుతో కప్పుకుని, చేతిలో చీపురును పట్టుకుంది. నడిచే దారిలో ఉండే పురుగూపుట్రా తన పాదాల కింద పడి చనిపోకుండా ఊడుస్తూ ఉండడం కోసమే ఆ చీపురు. సన్యాసిగా మారిన క్షణం నుంచి దేవాంశి జైన సన్యాసులు, సన్యాసినులు ఆరామమైన జైన మఠంలో నివసించడం మొదలుపెట్టింది.

అది ఆమె అభీష్ఠమే!

దేవాంశి సన్యాసిగా మారిన వైనాన్ని గుర్తు చేసుకుంటూ ‘‘ఆ అమ్మాయి ఇక ఇంట్లో నివసించడానికి వీల్లేదు. ఆ అమ్మాయి తల్లుల ఇకపై ఆమెకు తల్లితండ్రులు కారు. ఆవిడ ఇప్పుడు సాధ్వి కాబట్టి ఎంత దూరాలైనా నడుచుకుంటూ వెళ్లాలే తప్ప ఎలాంటి రవాణా సాధనాలనూ ఉపయోగించకూడదు. అలాగే నేల మీద పరిచిన తెల్లని వస్త్రం మీదే నిద్రించాల్సి ఉంటుంది. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆహారం ముట్టకూడదు’’ అంటూ సూరత్‌లోని వజ్ర వ్యాపారి, దేవాంశి తండ్రికి స్నేహితుడు అయిన క్రితి షా చెప్పుకొచ్చాడు. అయితే అంత చిన్న వయసులో దేవాంశిని జైన సన్యాసినిగా మార్చడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అందుకు దేవాంశి తల్లితండ్రులు, అది ఆ అమ్మాయి అభీష్టమనీ, చిన్నప్పటి నుంచీ దేవాంశి టివి చూడడం, సినిమాలకూ, మాల్స్‌, రెస్టారెంట్లకు వెళ్లడం లాంటివి చేసేది కాదనీ, బాల్యం నుంచే రోజుకు మూడుసార్లు ప్రార్థన చేస్తూ ఉండేదనీ, రెండేళ్ల పసి వయసులోనే ఉపవాసాలను మొదలుపెట్టిందనీ వివరణ ఇవ్వడం విశేషం.

ఆదరణలూ... విమర్శలూ

భౌతిక ప్రపంచాన్ని త్యజించి, సన్యాసినిగా దీక్షను స్వీకరించడానికి ఒక రోజు ముందు, సాంఘ్వి తల్లితండ్రులు సూరత్‌లో భారీ ఉత్సవ ఊరేగింపును నిర్వహించారు. ఒంటెలు, గుర్రాలు, ఎడ్ల బండ్లతో వీధులు నిండిపోయాయి. తల పాగాలు ధరించినవాళ్లు పందిళ్లను మోస్తూ వీధుల్లో నడుస్తూ ఉంటే, వేలాది మంది ప్రజలు ఆ వేడుకను తిలకించడానికి విచ్చేశారు.

ఏనుగు అంబారీపై కూర్చుని ఉన్న దేవాంశి, ఆమె తల్లితండ్రుల మీద అక్కడ గుమి గూడిన జనం గులాబీ రేకులను కురిపించారు. అయితే దేవాంశి కుటుంబం సాంఘ్వి సన్యాసినిగా మారడానికి మద్దతు పలికినప్పటికీ, జైన సమాజంలోని వ్యక్తుల నుంచే వారికి వ్యతిరేకత ఎదురైంది. దేవాంశి త్యాగం ఎన్నో చర్చలకు దారి తీసింది. ఆ పాప యుక్తవయసుకు చేరుకునే వరకూ ఆ కుటుంబం ఎందుకు ఆగలేకపోయిందని జైన మతస్తులే ప్రశ్నిస్తూ ఉన్నారు. ముంబయికి చెందిన చైల్డ్‌ ప్రొటెక్షన్‌ కన్సల్టెంట్‌ ప్రొఫెసర్‌ నీలిమా మెహతా, ఆ పాప ఎదుర్కొనే కష్టం, లోటుపాట్లు అపారమైనవి’’ అంటూ తన వ్యతిరేకతను వ్యక్తం చేయడం గమనార్హం.

Updated Date - 2023-02-07T23:41:49+05:30 IST