Sanjeeda Sheikh: అక్కడే ఆగిపోను

ABN , First Publish Date - 2023-07-15T23:36:51+05:30 IST

ఈ అందాల భామ హిందీ సీరియల్స్‌లో పేరున్న నటి. మంచి డ్యాన్సర్‌. పేరు సంజీదా షేక్‌. బుల్లితెరతో ఆమె ఆగిపోలేదు. బాలీవుడ్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. ప్రస్తుతం హృతిక్‌ రోషన్‌ జోడీగా ‘ఫైటర్‌’లో నటిస్తున్న సంజీదా గురించి కొన్ని విశేషాలివిగో...

Sanjeeda Sheikh: అక్కడే   ఆగిపోను

ఈ అందాల భామ హిందీ సీరియల్స్‌లో పేరున్న నటి. మంచి డ్యాన్సర్‌. పేరు సంజీదా షేక్‌. బుల్లితెరతో ఆమె ఆగిపోలేదు. బాలీవుడ్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. ప్రస్తుతం హృతిక్‌ రోషన్‌ జోడీగా ‘ఫైటర్‌’లో నటిస్తున్న సంజీదా గురించి కొన్ని విశేషాలివిగో... ‘‘ఎవరేమనుకున్నా బోల్డ్‌గా ఉండటం నాకిష్టం. అందాన్ని ఎక్స్‌ప్రెస్‌ చేయటం తప్పు కాదు కదా! ఇన్‌స్టాలో నాలుగున్నర మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అసలు ఈ స్థాయికి వస్తానని ఎన్నడూ అనుకోలేదు.

అలా బాలీవుడ్‌లోకి...

నేను కువైట్‌లో పుట్టి పెరిగా. చిన్నప్పటి నుంచీ డ్యాన్స్‌ అంటే మక్కువ. అందుకే స్కూల్‌లో డ్యాన్స్‌ కాంపిటీషన్‌లో పాల్గొనేదాన్ని. తరువాత ముంబయిలో నా ఫ్రెండ్‌తో కలసి డ్యాన్స్‌ స్టూడియో ఒకటి పెట్టాను. అలా కొందరి పరిచయాలతో 2003లో ‘బాగ్‌బన్‌’ చిత్రంలో అమితాబ్‌బచ్చన్‌తో కలసి నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా ఆడలేదు. ఆ తర్వాత ఓ తమిళ, కన్నడ మూవీలో నటించా. ఫలితం లేదు. సరిగ్గా ఆ సమయంలోనే బాలాజీ టెలీఫిల్మ్స్‌ నిర్మించే ‘క్యా హోగా నిమ్మో కా’ సీరియల్‌లో నటించే అవకాశం వచ్చింది. అందులో నిమ్మో పాత్రలో నటించా. ఎంతో కనెక్టయ్యారు ప్రేక్షకులు. ఆ తర్వాత ‘కయామత్‌’ సీరియల్‌లో వేశ్య పాత్రలో నటించా. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.

బుల్లితెర నుంచి కదల్లేకపోయా

బుల్లితెర నటిగా పాపులర్‌ కావటంతో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. దీంతో కాదనలేక బుల్లితెరకే పరిమితమైపోయా. అదే సమయంలో ‘నాచ్‌ బలియో3’ డ్యాన్స్‌ షోలో పాల్గొన్నా. సెలబ్రిటీ డ్యాన్స్‌ రియాలిటీ షో అది. అందులో నా డ్యాన్స్‌ పార్ట్‌నర్‌ అమీర్‌ అలీ. అప్పుడే తనతో ప్రేమలో పడిపోయా. పెళ్లి కూడా చేసుకున్నా. ఆ తర్వాత మరో డ్యాన్స్‌ రియాలిటీ షోలో విన్నరయ్యా. ఐదారు సీరియల్స్‌లో ప్యాక్‌ కావటం.. అదే సమయంలో నా డ్యాన్స్‌ పార్ట్‌నర్‌ అలీతో పెళ్లి కావటం వల్ల బుల్లితెరనుంచి కదల్లేకపోయా. టెలివిజన్‌ డ్యాన్స్‌ షోలకే కాకుండా బిగ్‌బాస్‌ లాంటి రియాలిటీషోలకు గెస్ట్‌గా వెళ్లా.

అందుకే మళ్లీ...

తరువాత ఓ పంజాబీ చిత్రంలో నటించా. అందులో ఐటమ్‌ సాంగ్‌లో కనిపించా. నా దగ్గరికి వచ్చిన కథలు నచ్చకపోవటంతో సినిమాలు చేయలేకపోయా. బి గ్రేడ్‌, సి గ్రేడ్‌ చిత్రాలకంటే హిందీ సీరియల్‌లో నటించటమే ఉత్తమం అనుకున్నా. అందుకే టెలివిజన్‌లో పలు రకాల ప్రయోగాలు చేశా. ఎన్నో అవార్డులు, రివార్డులూ వచ్చాయి. ‘గెహరియాన్‌’ అనే హారర్‌ వెబ్‌ సిరీస్‌లో నటించా. ఆరేళ్ల కిందట నుంచే మ్యూజిక్‌ వీడియోలు చేస్తున్నా. రుకా హూన్‌.., బస్‌ ఏక్‌ బార్‌..., తుమ్‌ ఆవోగే.., జస్‌ మనాక్‌.. ఇలా దాదాపు పది మ్యూజిక్‌ వీడియోలు యూత్‌ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఏదేమైనా సినిమాల్లో మంచి రోల్స్‌ చేయాలన్నదే కోరిక. ఒకప్పుడు సంజీదా షేక్‌ మంచి డ్యాన్సర్‌ అనేవారు. ఇప్పుడలా కాదు.. నా యాక్టింగ్‌ స్కిల్స్‌ బావున్నాయం టున్నారు. ఈ ప్రశంస ఎంతో సంతోషాన్నిస్తుంది. కొవిడ్‌ సమయంలో నా భర్తతో విడిపోయా. దాదాపు తొమ్మిదేళ్ల రిలేషన్‌షిప్‌ బ్రేక్‌ అయింది. జరిగేదేదో జరిగిపోయింది. నాది స్పోర్ట్స్‌ పర్సన్స్‌ మెంటాలిటీ. అక్కడే ఆగిపోను. ముందుకెళ్తాను. నా కూతురు ఆర్యతో హ్యాపీగా ఉన్నా. ఆ మాటకొస్తే ఇప్పుడిప్పుడే సీరియస్‌గా నా ప్రయాణాన్ని ప్రారంభించానని అనుకుంటున్నా. బాలీవుడ్‌లో నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం!’’

Updated Date - 2023-07-15T23:42:19+05:30 IST