Bumper Prize Money : విన్నర్స్‌ అయినా..

ABN , First Publish Date - 2023-08-02T23:44:26+05:30 IST

కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలంటారు. కేరళ పారిశుద్ధ్య కార్మికులు సరిగ్గా అదే పని చేశారు. 250 రూపాయల లాటరీ టిక్కెట్టుతో ఏకంగా 10 కోట్ల బంపర్‌ ప్రైజ్‌ మనీ కొట్టేశారు. అలాగని ఆ డబ్బుతో విలాసాల్లో

Bumper Prize Money : విన్నర్స్‌ అయినా..

కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలంటారు. కేరళ పారిశుద్ధ్య కార్మికులు సరిగ్గా అదే పని చేశారు. 250 రూపాయల లాటరీ టిక్కెట్టుతో ఏకంగా 10 కోట్ల బంపర్‌ ప్రైజ్‌ మనీ కొట్టేశారు. అలాగని ఆ డబ్బుతో విలాసాల్లో తేలిపోకుండా, లాటరీ టిక్కెట్‌ కొనడానికి తోడ్పడిన వాళ్ల వృత్తుల్లోనే కొనసాగాలని నిర్ణయించుకుని అందరితో శభాష్‌ అనిపించుకుంటున్నారు.

ఒక మహిళా పారిశుద్ధ్య కార్మికుల బృందం, కేరళ, మలప్పురం జిల్లాలోని, పరప్పనంగడిలో ఉన్న ఇళ్ల నుంచి ప్రతి రోజూ చెత్తను సేకరిస్తూ ఉంటుంది. అందుకు వాళ్లందరికీ కలిపి 250 రూపాయలు జీతంగా దక్కుతూ ఉంటాయి. స్థానిక కార్పొరేషన్‌ ఆ చెత్తను అమ్మడం ద్వారా సమకూరిన డబ్బు వాళ్లకు అదనపు ఆదాయం. అయినా ఆ సంపాదన వాళ్ల అవసరాలకు ఏ విధంగానూ సరిపోదు. పిల్లల చదువుల కోసం లోన్లు తీసుకున్న వాళ్లు కూడా ఈ బృందంలో చాలా మంది ఉన్నారు. ఇంటి ఖర్చులూ, చికిత్సల ఖర్చులూ, పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలూ, ఇళ్ల అద్దెలూ... ఇలా వాళ్ల ఆర్థిక ఇబ్బందులు ఒకటీ రెండూ కావు. అయితే ఎన్ని ఇబ్బందులున్నా ఆ మహిళలు లాటరీ టిక్కెట్‌ను కొనే ఒక అలవాటును మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. లక్కులో లాటరీ గెలిస్తే కష్టాల నుంచి బయటపడవచ్చనేది వాళ్ల ఆలోచన. ఈ గ్రూపు తరఫున రాధ అనే మహిళ, లాటరీ టిక్కెట్‌ కొంటూ ఉంటుంది. ‘‘ఒకసారి మేం కొన్న లాటరీ టిక్కెట్‌కు వెయ్యి రూపాయలను గెలుచుకున్నాం. అప్పటి నుంచీ క్రమం తప్పకుండా సీజనల్‌ లాటరీ టిక్కెట్లను కొంటూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాం’’ అంటూ చెప్తోంది రాధ.

250 రూపాయల టిక్కెట్‌తో...

ఆ క్రమంలో 250 రూపాయల విలువైన మాన్‌సూన్‌ బంపర్‌ ప్రైజ్‌ లాటరీ టిక్కెట్‌ ఆ మహిళా బృందం నిర్ణయించుకుంది. కానీ తన వంతుగా టిక్కెట్‌ కోసం డబ్బు ఇవ్వడానికి 72 ఏళ్ల కుట్టిమాలు మనసు ఒప్పుకోలేదు. అసలే ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నప్పుడు, గెలుస్తామో లేదో తెలియని లాటరీ టిక్కెట్లు కోసం డబ్బు ఖర్చుపెట్టడం అవసరమా? అనేది ఆవిడ ఆలోచన. అలా సతమతమాడుతున్న కట్టిమాలు పరిస్థితి గమనించిన తోటి పారిశుద్ధ్య కార్మికురాలు, చెరుమన్నిల్‌ బేబీ, ఇద్దరికీ కలిపి పాతిక రూపాయలూ తానే చెల్లిస్తానని చెప్పింది. అలా వాళ్లిద్దరూ చెరొక పన్నెండున్నర రూపాయలను టిక్కెట్‌ కోసం ఇచ్చేశారు. మిగతా తొమ్మిది మందీ తలా పాతిక రూపాయలు వేసుకుని, 250 రూపాయలతో లాటరీ టిక్కెట్‌ కొనేశారు. అయితే లాటరీ గెలిస్తే, వచ్చిన డబ్బును సమంగా పంచుకోవాలని ఒక నియమాన్ని కూడా పెట్టుకున్నారు. కానీ లాటరీ గెలుస్తామని ఏ ఒక్కరికీ నమ్మకం లేదు.

అందరివీ గడ్డు పరిస్థితులే

లాటరీ టిక్కెట్‌ డ్రా తీశారు. ఆ మహిళల్లో ఒకరు తన భర్తను ఫలితాలను తెలుసుకోమని అడగడంతో, వాళ్లు కొన్న టిక్కెట్‌ ఏకంగా 10 కోట్ల రూపాయలను గెలుచుకున్న విషయం తెలిసి, వాళ్ల ఆనందానికి అంతే లేకుండా పోయింది. ‘‘నాకెప్పుడూ అదృష్టం కలిసి రాదు. 2018లో కేరళను ముంచెత్తిన వరదల్లో నా ఇల్లు కొట్టుకుపోయింది. ఇప్పుడు గెలుచుకున్న లాటరీ డబ్బుతో ఒక ఇల్లును కట్టుకోవాలని ఉంది’’ అంటూ కళ్లు చెమరుస్తూ చెప్పింది 62 ఏళ్ల బేబీ. గత ఏడాది కిడ్నీ ఫెయిల్యూర్‌తో భర్తను కోల్పోయింది 50 ఏళ్ల బిందు. అతని డయాలసిస్‌ కోసం అప్పులు చేసి మరీ డబ్బులు కూడబెట్టేవాళ్లమనీ, కానీ ఆ డబ్బును తన భర్త లాటరీ టిక్కెట్ల కోసం ఖర్చు చేసేసేవాడనీ, అలా అంతిమంగా అతను ప్రాణాలు కోల్పోయాడనీ చెప్పుకొస్తోంది. ఆయన పోవడంతో ఇంటి నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడీ డబ్బుతో ఇల్లును కట్టుకుంటాను’’ అంటూ ఆనందంగా చెప్తోంది బిందు. అలాగే ఆవిడ తన 15 ఏళ్ల పాప చదువు కోసం ఆ డబ్బును వెచ్చించి, ఉన్నత చదువులు చదివిస్తానని కూడా అంటోంది. 49 ఏళ్ల లక్ష్మి ఇంట్లో పరిస్థితి కూడా అంతంత మాత్రమే! వానలతో భవన నిర్మాణ పనులు ఆగిపోయి భర్త ఇంట్లో ఖాళీగా ఉండిపోవలసి వస్తోంది. దాంతో ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారాయి. కూతురికి పెళ్లి చేసి అప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన ఆ కుటుంబం, ఆ ఇబ్బందుల నుంచి ఇంకా కోలుకునే క్రమంలో ఉంది. 56 ఏళ్ల లీలా అనారోగ్యం నుంచి కోలుకోవడం కోసం కూతురికి సర్జరీ చేయించవలసి వచ్చింది. ‘ఈ కష్టం నుంచి బయటపడేదెలా భగవంతుడా’ అని బాధపడుతున్న సమయంలో లాటరీ గెలుచుకున్నామనే విషయం వాళ్లకు తెలిసింది. ఇలా లాటరీ కొన్న బృందంలోని మహిళలందరి జీవితాలూ దుర్భరమైనవే!

లాటరీ గెలిపించిన వృత్తికే అంకితం

‘‘లాటరీ కొట్టారు కాబట్టి ఇక వాళ్లు నేల మీద నడవరు. పారిశుద్ధ్య పనులకు గుడ్‌ బై చెప్పేస్తారు’’ అనుకున్న వాళ్లందర్నీ ఆశ్చర్యపరుస్తూ, లాటరీ గెలుచుకున్న మరుసటి రోజు నుంచే ఆ 11 మంది మహిళా పారిశుద్ధ్య కార్మికులందరూ విధులకు హాజరయ్యారు.

‘‘లాటరీ కొనడానికి తోడ్పడిన వృత్తిని ఎప్పటికీ వదులుకోకూడదని మేం నిర్ణయించుకున్నాం. కాబట్టి బ్రతికినంత కాలం ఈ వృత్తుల్లోనే కొనసాగుతాం’’ అంటూ ఆ మహిళలందరూ తమ ఉన్నతమైన వ్యక్తిత్వాలను చాటుకోవడం విశేషం.

లాటరీ గెలుచుకున్న మరుసటి రోజు నుంచే ఆ 11 మంది మహిళా పారిశుద్ధ్య కార్మికులందరూ విధులకు హాజరయ్యారు. ‘‘లాటరీ కొనడానికి తోడ్పడిన వృత్తిని ఎప్పటికీ వదులుకోకూడదని మేం నిర్ణయించుకున్నాం. కాబట్టి బతికినంత కాలం ఈ వృత్తుల్లోనే కొనసాగుతాం’’ అంటూ ఆ మహిళలందరూ తమ ఉన్నతమైన వ్యక్తిత్వాలను చాటుకోవడం విశేషం.

Updated Date - 2023-08-02T23:44:26+05:30 IST