ఎవ్వరినీ కించపరచటానికి సినిమాలు తీయను
ABN , First Publish Date - 2023-11-26T01:20:31+05:30 IST
మూడు సినిమాలు.. మూడు కోట్ల నుంచి 200 కోట్ల బడ్జెట్.. ‘‘అబ్బే నావి రెండు సినిమాలే..
మూడు సినిమాలు.. మూడు కోట్ల నుంచి 200 కోట్ల బడ్జెట్.. ‘‘అబ్బే నావి రెండు సినిమాలే.. కబీర్‌సింగ్ మాతృక అర్జున్ రెడ్డే కదా’’ అంటారు సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం సందీప్ దర్శకత్వం వహించిన ‘యానిమల్’ చిత్రం- విడుదల కాకముందే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మీడియాతో అరుదుగా మాట్లాడే సందీప్ తన అభిప్రాయాలను ‘నవ్య’తో పంచుకున్నారు.
మూడు కోట్ల బడ్జెట్ నుంచి 200 కోట్ల బడ్జెట్‌కు ఎదిగారు. ఈ ప్రయాణం ఎలా ఉంది?
చాలా బావుంది. సినిమాకు సంబంధించిన ప్రతి క్రాఫ్ట్‌లోను నేను భాగస్వామిని అవుతాను. మేకింగ్‌లో ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేస్తాను. అందువల్ల సినిమా పూర్తి అయిన తర్వాత చాలా సంతృప్తిగా ఉంటుంది. అయితే దీని వల్ల కొంత లేటు కూడా అవుతుంది. ఇక బడ్జెట్‌ల విషయమంటరా.. నాన్నగారు(ప్రభాకరరెడ్డి) ఈ మధ్యనే బడ్జెట్ గురించి గుర్తు చేశారు. ఇప్పుడైతే అలవాటు అయిపోయింది కానీ ఒక పదేళ్ల క్రితం 200 కోట్ల బడ్జెట్ అంటే.. ఎవ్వరూ ఊహించలేని వ్యవహారం.
రణబీర్ కపూర్‌తో ‘యానిమల్’ సినిమా తీయాలనే ఆలోచన ఎలా వచ్చింది?
‘యానిమల్’ పూర్తిగా భిన్నమైన ఒక కథ. ‘పిచ్చిగా ప్రేమించే తండ్రి.. అతని ప్రేమను కోరుకొనే కొడుకు.. ఆ కొడుకు తన కుటుంబం కోసం ఎంత దూరం వెళ్తాడనేదే ఈ కథ’. నాకు సంబంధించినంత వరకు- రణబీర్‌తో నా ప్రయాణమే నా సినిమా. ‘వేకప్ సిడ్’.. ‘రాక్‌స్టార్’ సినిమాలు చూసినప్పుడు- రణబీర్‌తో ఎప్పుడో ఒకప్పుడు ఒక్క సినిమా అయినా చేయాలనుకున్నా. కోవిడ్ రెండో దశ సమయంలో రణబీర్‌కు కథ చెప్పా. తనకు చాలా నచ్చింది. అయితే ఆ సమయంలో తనకు వరుసగా మూడు సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. వాటి పబ్లిసిటీ.. ఆ తర్వాత రిలీజ్‌లు.. ఆ తర్వాత రణబీర్ పెళ్లి. వీటన్నింటి వల్ల సినిమా మొదలుపెట్టడమే ఆలస్యమయింది.
రణబీర్‌తో జర్నీ ఎలా అనిపించింది?
చాలా మంచి నటుడు. అతనిలో ఉన్న గొప్ప లక్షణం క్రమశిక్షణ. 104 రోజులు షూటింగ్ చేశా. ఒక్క రోజు కూడా ఆలస్యంగా రాలేదు. ఒక్క రోజు కూడా అతను ఎవరిమీద చిరాకు పడటం చూడలేదు. పాత్రలో పూర్తిగా లీనమయిపోయేవాడు. షూటింగ్ గ్యాప్‌లలో చాటింగ్‌లు.. ఫోన్‌లు ఇవేమి లేవు. తన గురించి బయట రకరకాల వదంతులు వినిపిస్తూ ఉంటాయి. కానీ అతని క్రమశిక్షణ చూసి నాకే ఆశ్చర్యమేసింది.
మీ సినిమాలు వ్యక్తులపై ఆధారపడి ఉంటాయి కదా..
సాధారణంగా నేను ఫీలింగ్స్‌పై ఆధారపడి కథ రాసుకుంటా. అందువల్ల నా సినిమాలు పాత్రలపైనే ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు అర్జున్‌రెడ్డిని తీసుకుందాం. ‘విడిపోవటం సముద్రమంత ఎమోషన్ కదా! దానిని సినిమాల్లో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే చూపిస్తారు. ఆ ఎమోషన్‌పైనే కథ రాస్తే ఎలా ఉంటుంది?’ అనుకొని ఆ కథ రాశా. దానిలో- పాటలు ఇలా ఉండాలి.. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇలా ఉండాలి లాంటి కొలతలు ఉండవు. నేను ప్లాట్‌ల ఆధారంగా కథలు రాయను. ఎందుకంటే- షూటింగ్ సమయంలో- ఇలాంటి సీను ఎవరో ఇంతకు ముందే తీసేశారే.. అనిపిస్తుంది. మళ్లీ అర్జున్‌రెడ్డి ఉదాహరణనే చెబుతాను. హీరో మూత్రం పోసుకొనే సీను ఇంటర్వెల్ సమయంలో ఎవరైనా చూపిస్తారా? కానీ నేను చూపించా. ఎందుకంటే అలాంటి సీను ఎవరు రాయలేదు. తీయలేదు.
టాలీవుడ్‌లో పనిచేశారు..బాలీవుడ్‌లో పనిచేశారు.. రెండింటి మధ్య తేడా ఏమిటి?
భాష మాత్రమే! బాలీవుడ్‌లో పనిచేయాలంటే హిందీ కూడా వస్తే మంచిది. అంత కన్నా నాకు తేడా కనిపించలేదు. మన తెలుగులో కూడా ఇతర భాషల టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు కదా. నా ఉద్దేశంలో సినిమా భాష ప్రపంచమంతా ఒకటే! మంచి కథ చెప్పి నిర్మాతను..నటులను కన్విన్స్ చేయగలిగితే కొరియాలో కూడా సినిమా తీయవచ్చు.
సినీ నిర్మాణం సమయంలో మీరు ఇతరుల సూచనలు తీసుకుంటారా?
ఎవరైనా సూచనలు ఇస్తే- అవి నాకు నచ్చితే వాటిని నేను పాటిస్తా. తీసే సీను మీద నాకు 99.9 శాతం క్లారిటీ ఉంటుంది. అందువల్ల ఇప్పటి దాకా ఎలాంటి సమస్యలు రాలేదు.
మీ నేపథ్యం గురించి కొద్దిగా చెప్పండి..
నేను పక్కా తెలంగాణ బిడ్డను. అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు కూడా తెలంగాణనే! నేను 8వ తరగతి వరకూ వరంగల్‌లో చదివా. ఆ తర్వాత ఇంటర్ హైదరాబాద్‌లో.. డిగ్రీఽ ధార్వాడ్‌లో చేశా. సిడ్నీ ఫిల్మ్ స్కూల్‌లో చదువుకున్నా. చిన్నప్పటి నుంచి నాకు ఫొటోగ్రఫి అన్నా.. పెయింటింగ్ అన్నా ఇష్టం. ఆ ఇష్టమే నన్ను ఫిల్మ్‌మేకింగ్‌లోకి దింపింది. నేను హైదరాబాద్ వచ్చి సినిమా రంగంలోకి అడుగుపెట్టే సమయానికి నాకు ఒక్కరు కూడా తెలియదు. కానీ ఏదో చేయాలనే మొండి ధైర్యం. అమ్మనాన్న కూడా ‘వీడు ఇలాగే ఉంటే పిచ్చివాడైపోతాడు.. సినిమాలోకి వెళ్తేనే బెటర్’ అనుకున్నారు. అలా అర్జున్‌రెడ్డి మొదలుపెట్టా. ఆ కథ ఎవరికి చెప్పినా అర్థం కాదు. అందుకే మేమే ప్రొడ్యూసర్‌లుగా మారి ఆ సినిమా ప్రారంభించాం. అప్పటికి విజయ్ కొత్త. తన పెళ్లి చూపులు సినిమా ఇంకా విడుదల కాలేదు. ‘ఎవడే సుబ్రమణ్యం’ మాత్రమే విడుదలయింది. తను కూడా ఏదో కొత్తగా చేయాలనుకుంటున్నాడు. నేను అంతే! మూడు కోట్లు అనుకొని సినిమా ప్రారంభించాం. ‘‘నీకు పిచ్చా.. ఇంత డబ్బులు ఎందుకు పెడుతున్నావు.. సినిమా అంటే అసలు నీకు తెలుసా?’ 500 సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అసలు నీ సినిమా రిలీజ్ అవుతుందనుకుంటున్నావా?’’ అన్నవాళ్లు కూడా ఉన్నారు. కానీ నా మీద నాకు నమ్మకం. చావో.. రేవో తేల్చుకుందామనుకున్నా. ఇప్పుడు ఆ రోజులు తలుచుకుంటే భయమేస్తుంది.
అర్జున్‌రెడ్డి.. కబీర్‌సింగ్- ఈ సినిమాల్లో హీరోయిన్ల చిత్రీకరణపై అనేక విమర్శలు వచ్చాయి కదా..
తెలుగులో తక్కువ. హిందీలో చాలా ఎక్కువ. వ్యతిరేకంగా చాలా రివ్యూలు రాశారు. పురుషాధిపత్యం.. మహిళలను అణగదొక్కటం లాంటి విమర్శలు అనేకం వచ్చాయి. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. మహిళలను తక్కువ చేసి చూపించటం నా ఉద్దేశం కాదు. ఒక కథను సినిమాగా మలచాలంటే చాలా కష్టం. బ్లాక్‌బస్టర్‌లు తీయాలంటే ఇంకా కష్టం. కేవలం 5 శాతం సినిమాలు మాత్రమే బ్లాక్‌బస్టర్‌లు అవుతాయి. అంతే కాదు. నా మొదటి సినిమాను ఆస్తులు అమ్మి మరీ నిర్మించా. ఇప్పుడు యానిమల్ సినిమాకు 200 కోట్ల బడ్జెట్ అయింది. ఇంత ఖర్చు పెట్టి.. రణబీర్‌లాంటి పెద్ద స్టార్‌ను పెట్టి తీసే సినిమాల్లో వ్యక్తిగత ఇష్టఇష్టాలు.. అజెండాలు ఉండవు.
‘యానిమల్’ కూడా అర్జున్‌రెడ్డి మాదిరిగానే ఉంటుందా?
నేను ఎవ్వరినీ కించపరచటానికి సినిమాలు తీయను. అదే సమయంలో కథకు అనుగుణంగానే హీరో, హీరోయిన్ల చిత్రీకరణ ఉంటుంది. అర్జున్‌రెడ్డి విషయంలో నేను తప్పు చేశానని అనుకోవటం లేదు. అయితే ‘యానిమల్’ విషయంలో ఎవరెవరు ఎలా స్పందించే అవకాశం ఉందనే విషయం మాత్రం ముందే తెలుస్తోంది. అనుభవం నేర్పిన పాఠం అది.
ఎన్నో భావోద్వేగాలతో సినిమాలు తీసే మీకు ఎమోషనల్ సపోర్ట్ ఎవరు?
మా అమ్మ(సుజాత) నాకు ఒకప్పుడు ఎమోషనల్ సపోర్ట్. 2019లో అమ్మ క్యాన్సర్‌తో చనిపోయింది. అర్జున్ రెడ్డి విడుదల అయిన రెండు నెలల తర్వాత తనకు క్యాన్సర్ అని తెలిసింది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నా జీవితం ఆగిపోయిందనుకున్నా! ఎందుకంటే మరణానికి సంబంధించిన ఎమోషన్స్ నన్ను భయపెట్టేవి. నా స్నేహితుల కుటుంబసభ్యులు ఎవరైనా చనిపోయినా- అంత్యక్రియలకు వెళ్లేవాడిని కాదు. కొద్దికాలం పోయిన తర్వాత వారిని ఓదార్చటానికి వెళ్లేవాడిని. అలాంటి నాకు- అమ్మకు క్యాన్సర్ అనే వార్త ఒక శరాఘాతం. కబీర్ సింగ్ విడుదల అయిన రెండు నెలలకు అమ్మ చనిపోయింది. నా జీవితంలో అతి పెద్ద విషాదమది. నా ఉద్దేశంలో - ‘‘లైఫ్ మూవ్స్ ఆన్’’ అని ఎవడు అన్నాడో వాడు చాలా గొప్పవాడు. అమ్మ లేకపోతే జీవితం ఏమయిపోతుంది అనుకున్నా. కానీ జీవితం నడుస్తూనే ఉంది. రోజు తింటున్నా. ఉద్యోగం చేసుకుంటున్నా.. ఏదైనా సమస్య వచ్చినప్పుడు - ‘‘అమ్మ లేకుండానే జీవితం నడుస్తోంది..
ఈ సమస్య ఒక లెక్క..’’ అనుకుంటూ ఉంటా! ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. అమ్మ చనిపోయిన తర్వాతే- నాకు జీవితం అంటే ఒక ఐడియా వచ్చింది. అప్పటి దాకా అన్నింటికీ అమ్మనాన్నలపైనే ఆధారపడేవాడిని.
‘‘నేను చాలా ఎమోషనల్. అమ్మ- ‘నువ్వు అంత ఎమోషనల్ అయితే ఎలా బతుకుతావురా?’ అనేది. తనకు నేను ఈ సమాజంలో ఇమడలేనని.. బతకలేననే భయం ఉండేది’’
‘‘ అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రభా్‌సతో సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది. ఈ కథ గురించి ఇప్పుడే చెప్పను’’.
‘‘ విజయ్, షాహిద్, రణబీర్- ఈ ముగ్గురు చాలా నిబద్ధత ఉన్న నటులు. షూటింగ్‌కి వచ్చి ఫోన్లు చూసుకుంటూ.. సీన్ల మధ్యలో చాట్ చేసుకుంటూ ఉండరు. పాత్రలో లీనమవుతారు. ఈ ముగ్గురు వేర్వేరు వ్యక్తిత్వాలు ఉన్నవారు. కానీ ముగ్గురికీ వృత్తి పట్ల నిబద్ధత ఉంది’’
విశ్వనాధ్‌గారు, కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావుగారు, సుకుమార్‌గారు, రాజమౌళిగారు అంటే నాకు ఇష్టం. ఒక్కొక్కరిది ఒకో శైలి.
‘యానిమల్’ను పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో చాలా సార్లు చూశా. అనుకున్నది అనుకున్నట్లు వచ్చింది. బోరు కొట్టలేదు. ఏ సినిమాకైనా బోరు కొట్టకపోవటం మంచి లక్షణం. సినిమా బోరు కొడితే ప్రేక్షకులను అన్యాయం చేసినట్లే!
నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ‘‘నీకు ఆంధ్ర తెలుగు రాదు కదా.. డైలాగ్స్ ఎట్లా రాస్తావు? ’’ అనేవారు. నేను చాలా ఆలోచనలో పడిపోయేవాడిని. అవసరమైతే డైలాగ్ రైటర్‌ను పెట్టుకుందామనుకున్నా.
అయితే అర్జున్‌రెడ్డికి డైలాగ్స్ ఒక ఫ్లోలో రాసుకుంటూ వెళ్లిపోయా! విజయ్ కూడా తెలంగాణ కాబట్టి ఎటువంటి ఇబ్బంది రాలేదు. డైలాగ్స్ చాలా సహజంగా అనిపించాయి. మళ్లీ తెలుగులో సినిమా తీసినప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి.
ప్రేక్షకులను థియేటర్ల దాకా తీసుకువచ్చేది టీజరే! నేను చదువుకొనే సమయంలో అన్ని సినిమాలు చూసేవాడిని. ఆ తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలు తప్ప- మిగిలినవి- టీజర్ నచ్చితేనే చూసేవాడిని. నా ఉద్దేశంలో ఇప్పటికీ చాలా మంది అలాగే సినిమాలను ఎంపిక చేసుకుంటారు.
నా సినిమాల కథలు చెప్పటం చాలా కష్టం. అర్జున్ రెడ్డి స్టోరీ చెబితే ఎవరు డేట్స్ ఇవ్వరు. ఏదో పిచ్చి స్టోరీ అనుకుంటారు. కబీర్ సింగ్ షూటింగ్ సమయంలో షాహీద్ కపూర్ - ‘సందీప్.. తెలుగులో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయింది కాబట్టి నేను చేస్తున్నా! నువ్వు నాకు కథ చెబితే చేసేవాడిని కాదు’’ అని. అంత కన్నా బేర్ ట్రూత్ ఏదీ ఉండదు.
బాలీవుడ్‌లో పనిచేయాలంటే హిందీ కూడా వస్తే మంచిది. అంత కన్నా నాకు తేడా కనిపించలేదు. మన తెలుగులో కూడా ఇతర భాషల టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు కదా.
నా ఉద్దేశంలో సినిమా భాష ప్రపంచమంతా ఒకటే!