Samuthirakani: పవన్‌కల్యాణ్‌ చుట్టూ ఒక కాంతి వచ్చింది

ABN , First Publish Date - 2023-07-30T02:15:03+05:30 IST

మంచి నటుడు. అంతకు మించి అద్భుతమైన దర్శకుడు. భాషలకు అతీతంగా... వైవిధ్యానికి పెట్టింది పేరుగా... పాత్రలకు ప్రాణం పోయడంలో దిట్ట... సముద్రఖని.

 Samuthirakani: పవన్‌కల్యాణ్‌ చుట్టూ ఒక కాంతి వచ్చింది

సండే సెలబ్రిటీ

మంచి నటుడు. అంతకు మించి అద్భుతమైన దర్శకుడు. భాషలకు అతీతంగా... వైవిధ్యానికి పెట్టింది పేరుగా... పాత్రలకు ప్రాణం పోయడంలో దిట్ట... సముద్రఖని. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘బ్రో’ ఇటీవల విడుదలై విజయవంతంగా నడుస్తోంది. ఈ సందర్భంగా సముద్రఖని(Samuthirakani) తన సినీ నేపథ్యాన్ని ‘నవ్య’తో పంచుకున్నారు.

ఎలా ఉన్నారు? సినీ పరిశ్రమలోకి ఎలా వచ్చారు?

చాలా బావున్నాను. మనం ఏ పనిమీద వచ్చామో ఆ పని సజావుగా సాగుతుందన్న ఆనందం ఉంది. రాజబాలం, సేత్తూర్‌ దగ్గర మేట్‌పుట్టి అనే చిన్న గ్రామం మాది. మాకు ఐదెకరాల పొలం ఉంది. నాన్న సేద్యం చేసేవారు. నాన్నకు మా అమ్మ పొలం పనుల్లో సాయంగా ఉండేది. నేను 8వ తరగతికి వచ్చేదాకా ఒక్క సినిమా కూడా చూడలేదు. సినిమాలు అంటే తప్పు అనే అభిప్రాయం నాన్నలో బలంగా ఉండేది. ఒక రోజు రాత్రి ట్యూషన్‌కు వెళ్లినప్పుడు నా మిత్రుడు నన్ను సినిమాకు తీసుకెళ్లాడు. అలా నేను థియేటర్‌లో చూసిన తొలి సినిమా భారతీరాజా ‘ముదల్‌ మరియాదై’. ఇక అప్పటి నుంచి రోజూ ఆ సినిమా చూడాలనిపించేది. మా ఊళ్లో కాళేశ్వరి థియేటర్‌ ఉంది. మళ్లీ సినిమా చడాలంటే చేతిలో చిల్లిగవ్వ లేదు. సెకండ్‌ షోకు దుప్పటి తీసుకెళ్లి, థియేటర్‌ బయట పడుకుని డైలాగులు వింటూ విజువలైజ్‌ చేసుకునేవాణ్ణి. ఇది నాన్నకు తెలిసి నన్ను కొట్టారు. కాళ్లు కట్టి పడేశారు. ఆ తర్వాత రజనీకాంత్‌ సినిమా ఆ థియేటర్‌కు వచ్చింది. థియేటర్‌లో ఇంటర్వెల్‌లో తినుబండారాలు అమ్ముతానని అడిగాను. అలా వరుసగా 14 రోజులు, రోజూ నాలుగు ఆటలు చూశాను. మా నాన్నకు తెలిసి థియేటర్‌ నుంచి కొట్టుకుంటూ తీసుకెళ్లారు.

అప్పట్లో ‘సినిమా ఎక్స్‌ప్రెస్‌’ అని ఓ పత్రిక వచ్చేది. అందులో టి.రాజేందర్‌, కె.భాగ్యరాజా అడ్రస్‌ వచ్చింది. అప్పటికి నా పదో తరగతి పూర్తయింది. ఇక సినిమానే లోకం అనుకున్నా. మా నాన్న చొక్కాలో రూ.130 ఉంటే తీసుకొని చెన్నై వెళ్లాను. పది రోజుల పాటు చెన్నై అంతా తిరిగాను. చివరకు పది రూపాయలు మిగిలాయి. వాటితో మా ఊరు వెళ్లలేను. విల్లుపురం దాకా వెళ్లాను. అక్కడ ఒక హోటల్‌కి వెళ్లి నా పరిస్థితి చెప్పాను. ‘చార్జీలకి డబ్బులు ఇస్తాను. ఇంటికెళ్లు’ అని యజమాని చెప్పాడు. కానీ ‘నాకు ఊరికే డబ్బు వద్దు. ఏదైనా పని చేస్తా’ అన్నాను. దాంతో ఆయన పనిలో పెట్టుకున్నాడు. ఆకు వేసి, మంచి నీళ్లు సప్లై చేయడం నా పని. వారం రోజులు చేశాను. రోజూ 5 రూపాయలు ఇచ్చాడు. ఆ డబ్బుతో ఇంటికెళ్లాను. అప్పుడు మాత్రం నాన్న కొట్టలేదు. అమ్మ కొట్టింది. నాన్న అడ్డం వచ్చారు. ‘నీకు.. నాకు తెలియని విషయం గురించి వాడు వెతుకుతున్నాడు. వాడికి మనం సాయం చేద్దాం’ అని అమ్మకు సర్దిచెప్పారు. ‘నువ్వు ముందు బాగా చదువుకో. లేదంటే ఆగమైపోతావు. తర్వాత నీకు నచ్చిన పని చేసుకో. నీకు నాన్న ఉన్నాడు’ అని నాన్న భుజం తట్టారు.

ఆ మాటతో నాకు కొండంత శక్తి వచ్చింది. కానీ ఇది జరిగిన నెలకే నాన్న చనిపోయారు. ప్లస్‌2 పూర్తయ్యాక అమ్మను చెన్నై వెళ్లడానికి డబ్బులు ఇవ్వమని అడిగాను. ‘నీకు అక్కడ ఎవరూ తెలియదు. ఎందుకు వెళ్లడం’ అంది. ‘ఓసారి వెళ్లొస్తాను’ అన్నాను. అప్పుడు అమ్మ తన గొలుసు తాకట్టు పెట్టి, రెండు వేలు తెచ్చింది. 1,800 రూపాయలు ఖర్చులకు, అవి అయిపోతే తిరిగి రావడానికి ఉంచుకోమని మిగిలిన రెండు వందలు చీర కొంగు చించి అందులో కట్టి ఇచ్చింది. అక్కడకు వెళ్లి ఒక నెల ఉండి వెనక్కువచ్చాను. తర్వాత బీఎస్సీ చదివాను. 1992లో డిగ్రీ పూర్తయింది. ఇక జీవితం చెన్నైలోనే అనిపించింది. 92లో నాతోపాటు ఇండస్ట్రీకి వచ్చినవాళ్లు ఎవరూ ఇప్పుడు లేరు. ఇద్దరు ముగ్గురు స్నేహితులు పిచ్చోళ్లయిపోయారు. ఎంతోమందిని దాటొచ్చి, ఇప్పుడు ఈ స్థానంలో నిలిచాను. ఒక లక్షమంది డైరెక్టర్‌ అవ్వాలనుకుంటే, వెయ్యిమందికి అవకాశం దొరుకుతుంది. అందులో ఒక్కణ్ణి సక్సెస్‌ వరిస్తుంది. ఒక కోటి మందిలో ఒక్కడే సక్సె్‌సఫుల్‌ డైరెక్టర్‌ ఉంటారు. మనకు ఇంత గొప్ప స్థానాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు తిరిగి ఏం ఇచ్చాం? ఏదైనా బాధ్యతగా చేయాలి. మన దగ్గర ఉన్న ప్రొడక్ట్‌ వాళ్లకు ఏదోలా రీచ్‌ అవ్వాలి.

ఊరి నుంచి ఇక్కడకు వచ్చామంటేనే జనాలకు ఇవ్వాల్సింది మన దగ్గర ఏదో ఉందని అర్థం. అదేంటి అని నన్ను నేను ప్రశ్నించుకునేవాణ్ణి. ఆ అన్వేషణ నుంచి ‘అప్పా’ సినిమా చేశాను. మంచి పేరొచ్చింది. తర్వాత ‘వినోదాయ సిత్తం’... దాంతో దాదాపు నా లక్ష్యాన్ని సాధించానని అనిపించింది. ఒక డైరెక్టర్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరదామని చాన్నాళ్లు ప్రయత్నించినా అవకాశం లభించలేదు. ఆ డైరెక్టర్‌ ‘వినోదాయ సిత్తం’ చూశారు. ఆయనకు 65 ఏళ్లు. ఆయన నా డ్రీమ్‌ డైరెక్టర్‌. సినిమా అయిపోయాక స్ర్కీన్‌ ముందు నిల్చున్నాను. ఆయన వచ్చి కిందకు వంగి నా పాదాలను తాకారు. నేను వారించబోతుంటే ‘ఈ 65 ఏళ్లూ నేనొక మనిషిని. ఈ సినిమా చూసిన తర్వాత కొత్త మనిషిగా బయటకు వెళ తాను. నేను లేకపోతే నా పిల్లలు ఏమవుతారు అనే పెద్ద ప్రశ్న నన్ను ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. మనం లేకపోయినా అన్నీ జరుగుతాయి అని తెలుసుకున్నాను. ఆ బాధలేం నీకు వద్దు అని క్లీన్‌గా చెప్పావురా’ అని మెచ్చుకున్నారు. ఆ తర్వాత ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి నుంచి ఫోన్‌ వచ్చింది. అప్పుడు నేను త్రివిక్రమ్‌ అన్న దగ్గర ఉన్నాను. ఆయన లక్ష కోట్ల ఆస్తిపరుడు. ఒక్కసారిగా భోరుమని ఏడ్చేశాడు. ‘జీవితమంటే ఏంలేదని ఇలా చెప్పేశావా నువ్వు’ అన్నాడు. ‘పెద్ద వ్యాపార సామ్రాజ్యం నిర్మించాను. నేనే గొప్పోణ్ణి అనుకున్నాను. నాదేం లేదు. నీతో మాట్లాడాక హ్యాపీగా ఉంది. మిగిలిన జీవితాన్ని బాగా ఎంజాయ్‌ చేసి చచ్చిపోతాను’ అన్నాడు. తర్వాత త్రివిక్రమ్‌... విషయం ఏంటని అడిగాడు.

‘ఒక సినిమా చేశాను. విడుదలై పది రోజులు అవుతోంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది’ అన్నాను. సబ్జెక్ట్‌ ఏంటని అడిగాడు. కథ చెప్పాను. ‘ఇక్కడా నువ్వే నటించొచ్చుగా’ అన్నాడు. ‘లేదన్నా పెద్ద హీరోతో చేస్తే ఎక్కువ మందికి చేరుతుంది’ అన్నాను. ‘అందరూ కోపంలో, కలల్లో బతుకుతున్నారు. ప్రశాంతంగా ఉండడం లేదు. జీవితం అంటే ఏంలేదు సింపుల్‌ అని ఒక మంచి ఆర్టిస్ట్‌ చెబితే, ప్రేక్షకుల మైండ్‌లో పడాలి. ఒక సైకలాజికల్‌ ట్రీట్మెంట్‌లా జరగాలి’ అన్నాను. ‘పవన్‌ కల్యాణ్‌ గారు చేస్తే నీకు ఓకేనా’ అన్నారు త్రివిక్రమ్‌. చకచకా స్ర్కిప్ట్‌ వర్క్‌ జరిగింది. ఇతర భాషల నుంచి అప్పుడే ఆ సినిమా చేయాలంటూ పిలుపొచ్చినా చేయనన్నాను. తేజ్‌తో కూర్చొని మార్కండేయులు క్యారెక్టర్‌ను డిజైన్‌ చేశాను. నా లక్ష్యం చిన్న ప్లిలలకు అర్థమయ్యేలా చెప్పడం. ఎందుకంటే వాళ్లకు సమాజం అంటే భయం. తల్లితండ్రులు కూడా పిల్లలతో సరిగ్గా మాట్లాడడం లేదు. పిల్లలకు భవిష్యత్‌ గురించి భయం వద్దు అని చెప్పాలనుకున్నాను. సినిమా సెట్స్‌పైకి వెళ్లే టైమ్‌ వచ్చింది. స్ర్కిప్ట్‌ చదివాక ‘ఎప్పుడు షూటింగ్‌కు వెళతావు’ అని పవన్‌ సార్‌ అడిగారు. ‘రేపే వెళతాం’ అన్నాను. ‘రేపేనా’ అన్నారు. ‘అన్నపూర్ణ స్టూడియో’లో నాలుగు ఫ్లోర్‌లు మన దగ్గరే ఉన్నాయి. అంతా సిద్ధం చేసి ఉంచాం. 71 రోజులు పనిని 21 రోజుల్లో చేయవచ్చు’ అని చెప్పాను. మరుసటిరోజే ముంబయి నుంచి నీతా లుల్లా వచ్చారు. కాస్ట్యూమ్స్‌ వేసి చూశాం. తెల్లారి షూటింగ్‌ మొదలుపెట్టాం. 21 రోజుల్లో ప్లాన్‌ చేసింది చేసినట్టు తీశాం.

మీకు మీరు నచ్చేది యాక్టర్‌గానా? డైరెక్టర్‌గానా?

నటిస్తాను కానీ ఇలాంటి విషయాలు చెప్పాలంటే కుదరదుగా. నటిస్తే డబ్బులు వస్తాయి కానీ సంతృప్తి రాదుగా. ఇంకా ఇలాంటివి నా దగ్గర ఆరు స్ర్కిప్ట్‌లు ఉన్నాయి. టైమ్‌ వచ్చినప్పుడు వాటిని మొదలుపెడతాను. నేను టైమ్‌ని నమ్ముతాను. ఇక నటుడిగా... మనందరం రోజూ లేచినప్పటి నుంచి యాక్టింగ్‌ చేస్తున్నాం. కెమెరా ముందు యాక్టింగ్‌ చేయకుండా ఉంటే అదే మంచి యాక్టింగ్‌.

తెలుగులో మీ జర్నీ ఎలా మొదలైంది?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ ప్రాసె్‌సలో ఉండగా ‘అల వైకుంఠపురంలో’ అవకాశం వచ్చింది. ‘15 నిమిషాలు స్ర్కీన్‌ టైమ్‌ ఉంటుంది. మిమ్మల్ని ఎవరూ మర్చిపోరు’ అని అన్న చెప్పారు. రాజమౌళి, త్రివిక్రమ్‌ కథ వినకుండానే డేట్లు ఇస్తానంటే ఒప్పుకోరు. ‘నువ్వేం చేయాలో నీకు తెలియాలిగా కూర్చో’ అన్నారు. దర్శకుల మీద మనకు ఉండే నమ్మకమే మంచి అవుట్‌పుట్‌ తెస్తుంది.


Samudrakhani-Pawankalyan-(8.jpg

దర్శకుడిగా మీ లక్ష్యం?

కళాకారులుగా సమాజానికి ఉపయోగపడే సినిమాలు చేయాలి. విలన్‌గా నటిస్తే వచ్చే ప్రయోజనం లేదు. జనం మైండ్‌లో చిన్న మార్పు రావాలి. ‘విమానం’ చేశాక చాలామంది నన్ను ‘నాన్నా’ అని పిలిచారు. మనం ప్రేమిస్తే, జనాలు మనల్ని ప్రేమిస్తారు.

కమర్షియల్‌ సినిమాలపై మీ అభిప్రాయం?

మనం నటిస్తే డబ్బులిచ్చేవాళ్లకు న్యాయం చేయాలి. దర్శకుడిగా సినిమా తీస్తే బిజినెస్‌ కూడా సేఫ్‌ సైడ్‌ ఉండేలా చూసుకోవాలి. ‘అప్పా’ సినిమాకు కొంత ఫైనాన్స్‌ అవసరమైంది. మా మేనేజర్‌ వెళ్లి అడిగితే ‘వాడికా! ఎంతైనా ఇస్తాను’ అన్నారు. నా మీద అంత నమ్మకం.

మీ కుటుంబం గురించి చెప్పండి?

మా అక్క కూతురుని పెళ్లి చేసుకున్నాను. తన పేరు జయలక్ష్మి. మా బాబు, పాప చదువుకుంటున్నారు. నా పిల్లలతో ‘మీకు ఇష్టం వచ్చింది చేయమ’ని చెప్పాను. అమ్మ ఊళ్లోనే చెల్లెలితో ఉంటున్నారు.

మీరు ఉండాలనుకున్న స్థాయిలో ఉన్నారా?

నేను ఈ స్థాయిలో ఉండాలి అని ఎప్పుడూ అనుకోలేదు. 1,050 రూపాయలతో చెన్నై వచ్చాను. అవి ఎప్పుడో తిరిగి వచ్చాయి. యాక్టర్‌, డైరెక్టర్‌ అనేది బోనస్‌. మనం కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదనేది నా నమ్మకం. అందుకే నేను చేసే సేవ గురించి బయటకు తెలియనివ్వను.

ఈ పాత్ర కోసం పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారా?

ఆ దేవుడి పాత్రకు న్యాయం చేయాలని పవన్‌కల్యాణ్‌ నెల ముందు నుంచే సన్నద్ధమయ్యారు. ఉదయం 7 గంటలకు సార్‌ సెట్‌కు వస్తారు. దైవత్వ భావన కనిపించాలని ఆయన షూటింగ్‌ చేసినన్ని రోజులూ నిరాహారంగా ఉన్నారు. కేవలం పండ్ల రసాలు, వేడి నీళ్లు, పాలు మాత్రమే తాగారు. తోలు చెప్పులు ధరించలేదు. ఆయన చుట్టూ ఓ ఆరా (కాంతి వలయం) వచ్చింది. ఆయన ఇప్పటిదాకా చేసిన 27 సినిమాల్లోని మంచి విషయాలను ఇందులో పెట్టాలనుకున్నాను. అప్పుడు అభిమానులు ఆనందిస్తారు. 21 రోజుల్లో సార్‌ పోర్షన్‌ పూర్తి చేశా. సార్‌ లేకుండా ఇతర సన్నివేశాలు 31 రోజులు షూట్‌ చేశాం. మొత్తం 52 రోజుల్లో సినిమా పూర్తి చేశాం.

సాధారణంగా అయితే ఇలాంటి సినిమాకు 120 రోజులు పడుతుంది. త్రివిక్రమ్‌ అన్న రెండు రోజుల్లో డైలాగ్స్‌ రాశారు. చివరి 25 నిమిషాలు ఒక ఎమోషనల్‌ రైడ్‌, థియేటర్‌ నిశ్శబ్దంగా ఉంటుంది. అప్పుడు మనకు సైకలాజికల్‌ ట్రీట్‌మెంట్‌ మొదలవుతుంది. మన లైఫ్‌లో మనం ఏం చేస్తున్నాం. మనం లేకపోతే పిల్లలు ఏమవుతారు? అనుకుంటాం కానీ... ఏం కాదు. మనం వచ్చిన పని అయిపోతే మనం వెళ్లిపోవాలి. వాళ్లకంటూ ఓ జీవితం ఉంది. ఇలాంటి కంటెంట్‌ దొరకడం చాలా కష్టం. దాన్ని కరెక్ట్‌గా డెలివరీ చేయడం ఇంకా కష్టం. నేను ఆల్మోస్ట్‌ 100 సార్లు, 150 సార్లు చూసుకుంటాను. చివరి 20 నిమిషాలు చూసి నాకు షేక్‌ వచ్చింది. ఇన్నిసార్లు చూసిన నాకే ఆ ఫీలింగ్‌ వచ్చిందంటే తొలిసారి చూసే ప్రేక్షకుడికి, సైకలాజికల్‌గా ట్రీట్మెంట్‌ జరుగుతుంది. అప్పుడే పుట్టిన మనిషిలా థియేటర్‌ నుంచి బయటకు వస్తాడు. ఆ ఫ్రెష్‌నెస్‌ వస్తుంది.

మీకు నచ్చిన నటులు, దర్శకులు?

నాకు అందరూ బాగా నచ్చినవాళ్లే. ‘బాహుబలి’ చూశాక ప్రభాస్‌ నచ్చాడు. అల్లు అర్జున్‌ సర్‌ ఎప్పుడు చూసినా ఏదో ఒక హోమ్‌వర్క్‌లో ఉంటారు. ‘అల వైకుంఠపురంలో’ లాస్ట్‌ సాంగ్‌లో అలా వచ్చి గుచ్చేస్తాడు. ఆ సన్నివేశంలో టైమ్‌ వేస్ట్‌ కాకూడదని కుర్చీలో కాకుండా మెట్లపైనే కూర్చున్నాను. అది గమనించి అల్లు అర్జున్‌ నా దగ్గరకు వచ్చి ‘మీరు ఎప్పుడూ ఇలానే ఉంటారా’ అని చేయి పట్టుకున్నాడు. అది ప్రొఫెషన్‌పై ఉన్న ప్రేమ. ఆ ప్రేమ మా ఽమధ్య ఇప్పటికీ అలానే ఉంది. ప్రతి షాట్‌లో ఏదో ఒకటి ప్రత్యేకంగా ఉండాలని ఆయన వెతుకుతూనే ఉంటాడు. రామ్‌చరణ్‌ చాలా సిన్సియర్‌. ఎన్టీఆర్‌ ఎనర్జీ లెవల్స్‌ మామూలుగా ఉండవు. వాళ్లందరినీ తెరపైన చూడడం వేరు. ఇలా దగ్గరగా ఉండి చూడడం వేరు. రవితేజ ఎనర్జీ లెవల్స్‌ పదేళ్ల కన్నా ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. నచ్చిన దర్శకుడు రాజమౌళి సార్‌. సెట్‌లో ఆయనతో పాటే తిరుగుతూ అన్నీ చూస్తాను. సెట్‌లో వెయ్యిమంది ఉన్నా ‘తమ్ముడూ’ అనే ఒక్క మాటతో అందరినీ కంట్రోల్‌ చేస్తారు. త్రివిక్రమ్‌, లోకేశ్‌ కనకరాజ్‌, శంకర్‌, వెట్రిమారన్‌కు పెద ్ద ఫ్యాన్‌ని.

నాతోపాటు ఇండస్ట్రీకి వచ్చినవాళ్లు ఎవరూ ఇప్పుడు లేరు. ముగ్గురు స్నేహితులు పిచ్చోళ్లయిపోయారు. లక్షమంది డైరెక్టర్‌ అవ్వాలనుకుంటే వెయ్యిమందికి అవకాశం దొరుకుతుంది. అందులో ఒక్కణ్ణి సక్సెస్‌ వరిస్తుంది.

-సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - 2023-07-30T04:47:29+05:30 IST