పరుగు.. సాయం... అందులోనే ఆనందం

ABN , First Publish Date - 2023-06-01T00:00:41+05:30 IST

నలభై రెండేళ్ల వయసులో అథ్లెటిక్స్‌ మొదలుపెట్టారు. ‘ఈ వయసులో ఈ పరుగులేంట’ని అంతా చులకన చేశారు. పాతిక వేలకు మించని జీతం...

పరుగు.. సాయం... అందులోనే ఆనందం

నలభై రెండేళ్ల వయసులో అథ్లెటిక్స్‌ మొదలుపెట్టారు. ‘ఈ వయసులో ఈ పరుగులేంట’ని అంతా చులకన చేశారు. పాతిక వేలకు మించని జీతం... కానీ ఉన్నదాంట్లోనే సేవ చేస్తున్నారు. ‘నీకే లేదు. మళ్లీ వేరెవరి కోసమో ఖర్చు చేస్తావెందుకు’ అన్నారు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. పరుగులో పతకాలు సాధిస్తూ... ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఉచితంగా విద్యనందిస్తూ... స్ఫూర్తి నింపుతున్నారు 50 ఏళ్ల మైలవరపు భవాని. తన ‘ట్రాక్‌ రికార్డ్‌’ను ఆమె ‘నవ్య’తో పంచుకున్నారు.

‘‘నాకు మొదటి నుంచీ ఒక బలమైన కోరిక... పోలీస్‌ కావాలని. అందుకు కారణం లేకపోలేదు... మా నాన్న ఆర్‌ఎ్‌సఐగా చేసేవారు. ఆయనకు పోలీస్‌ సేవా పతకాలు వచ్చాయి. బంధువుల్లో కూడా చాలామంది ఆ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నారు. వాళ్లందరినీ చూసి నేను కూడా పోలీస్‌ కావాలని అనుకున్నాను. అయితే పెళ్లి తరువాత నా జీవితం మారిపోయింది. నా కల కలగానే మిగిలిపోయింది. కాకినాడ మా స్వస్థలం. చదువుతో పాటు నేను గేమ్స్‌లో కూడా ముందుండేదాన్ని. స్కూల్‌లోనే మొదలైంది అథ్లెటిక్స్‌తో నా అనుబంధం. ఇంటర్‌లో చేరాక జిల్లా స్థాయిలో పోటీపడ్డాను. పోలీస్‌ మీట్స్‌లో కూడా మెడల్స్‌ గెలుచుకున్నాను. సర్టిఫికెట్లు ఇచ్చారు. అంతవరకే. ఆ తరువాత రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలుంటాయని... వాటిల్లో పాల్గొంటే పేరు, పరపతి వస్తాయని ఎవరూ చెప్పలేదు. నాకూ అవగాహన లేదప్పుడు. ఇదంతా 1990లో. మరోవైపు ఇంటర్‌ కూడా ఫెయిల్‌ అయ్యాను. ఒకేసారి నా పరుగుకి, చదువుకు బ్రేక్‌ పడింది.

ఉద్యోగం వచ్చినా...

అదే సమయంలో, అంటే 1992 డిసెంబర్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులు పడితే... సెలక్షన్స్‌కు వెళ్లాను. అథ్లెట్‌ను కావడంతో ఫిజికల్‌ టెస్టులన్నీ సులువుగా క్లియర్‌ చేసేశాను. ఈ లోపు ఇంట్లోవాళ్లు నాకు పెళ్లి చేశారు. తరువాతి ఏడాది డిసెంబర్‌లో పరీక్ష ఫలితాలు ప్రకటించారు. నాకు ఉద్యోగం వచ్చింది. కానీ నా ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. మావారు, మా అత్తమామలు ఉద్యోగానికి పంపలేదు. ఆడవాళ్లకు ఆ ఉద్యోగం అంత బాగుండదనేది వారి అభిప్రాయం. అప్పుడు కాకినాడ ఎస్పీగా ఉన్న గోపీనాథ్‌రెడ్డి గారు నన్ను, మావారిని పిలిపించి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మావారు ససేమిరా అన్నారు. అప్పటికి ఆయనకూ ఉద్యోగం లేదు. నాకు చాలా బాధ కలిగింది. కష్టపడి తెచ్చుకున్న కొలువు అది. చిన్నప్పటి నుంచి కన్న కల. అత్తింటివారి పట్టుదలతో అన్నీ కల్లలైపోయాయి. ఆ బాధతో నెల రోజులకు పైగా మంచాన పడ్డాను.

కొత్త జీవితం...

అప్పుడే మా నాన్న హైదరాబాద్‌లోని ‘అప్పా’కు బదిలీ అయ్యారు. అమ్మా నాన్నతో పాటు నేను, మావారు కూడా హైదరాబాద్‌ వచ్చేశాం. నాన్నకు అప్పాలో మంచి పేరు. నాన్న చొరవతో అప్పాలో ఎస్టీడీ బూత్‌, పాల బూత్‌, డ్రైఫూట్స్‌ షాపు పెట్టుకున్నాం. అలా హైదరాబాద్‌కు వచ్చాక కొత్త జీవితం ప్రారంభమైంది. తక్కువ వ్యవధిలోనే మంచి లాభాలు చూశాం. అదే సమయంలో నాన్నకు ప్రమోషన్‌ వచ్చింది. కాకినాడకు బదిలీ అయ్యారు. మేం ఇక్కడే ఉండిపోయాం. కొద్ది రోజులకు షార్ట్‌సర్క్యూట్‌వల్ల మా షాపు కాలిపోయింది. లక్షల్లో నష్టం వచ్చింది. ఎస్టీడీ బూత్‌ కోసం నాలుగైదు కిలోమీటర్ల దూరం నుంచి టెలిఫోన్‌ కేబుల్‌ వేయించాం. దానికి దాచుకున్న డబ్బంతా పెట్టుబడిగా పెట్టాం. ఇంతలో మొబైల్‌ ఫోన్స్‌ యుగం మొదలైంది. దీంతో కోలుకోలేనంతగా నష్టపోయాం.

ఇందిరమ్మ ఇంట్లో...

నాన్న వెళ్లిపోవడంతో పోలీస్‌ క్వార్టర్స్‌ ఖాళీ చేసి, అద్దె ఇంట్లోకి దిగాం. నేను, మావారు, మా ఇద్దరు ఆడపిల్లలు. ఇల్లు గడవని పరిస్థితి. ఇది గమనించిన స్థానిక నాయకులు మాకు తెల్ల రేషన్‌ కార్డు, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించారు. ఇప్పుడు అక్కడే ఉంటున్నాం. అద్దె భారం అయితే తప్పింది కానీ, మిగిలిన ఖర్చుల మాటేమిటి? అందుకే నేను ఉద్యోగం చేయాలనుకున్నా. ఇంటర్‌, తరువాత ప్రైవేటుగా డిగ్రీ, పీజీ చదివాను. కంప్యూటర్స్‌ నేర్చుకున్నాను. ‘కార్వీ’లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా చేరాను. షేర్‌ మార్కెట్‌ నష్టాల్లో ఉందని ఆరు నెలల తిరక్కుండానే ఉద్యోగాలు తీసేశారు. వేరే సంస్థల్లో దరఖాస్తు చేసుకున్నాను. ఖాళీగా ఉంటే రకరకాల ఆలోచనలతో మనసంతా ఆందోళన, కలవరం. దీంతో దగ్గర్లోని సర్కారు బడికెళ్లి పాఠాలు చెప్పాను. ఈలోగా ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో ప్రిన్సిపాల్‌ పీఏగా ఉద్యోగం లభించింది. ఏడేళ్లు అక్కడ చేశాను. తరువాత మరో కాలేజీలో మరో ఏడేళ్లు. అది మానేసి సీబీఐటీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా చేరాను. ప్రస్తుతం అక్కడే పని చేస్తున్నాను. కటింగ్‌లు పోనూ చేతికి ఇరవై వేలు వస్తుంది.

పరుగు మళ్లీ మొదలైంది...

కాలేజీలో ఆగిపోయిన పరుగు అనుకోకుండా మళ్లీ మొదలైంది. అది 2017. మా కమ్యూనిటీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఒకావిడతో పరిచయం అయింది. ‘మళ్లీ గేమ్స్‌ మొదలుపెట్టవచ్చు కదా! పైగా సన్నగా ఉన్నావ్‌’ అన్నారు. అప్పుడు నా వయసు 42 సంవత్సరాలు. ‘ఇప్పుడేం గేమ్స్‌’ అన్నాను. ‘ఫిట్‌నెస్‌ ముఖ్యం. అది నీకు ఉంది’ అన్నారు ఆమె. ఆవిడ ప్రోత్సాహంతో మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ జిల్లా స్థాయి సెలక్షన్స్‌కు వెళితే సెలెక్ట్‌ అయ్యాను.

జాతీయ స్థాయి పతకాలు...

తరువాత రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లాను. రెండింటిలో మెడల్స్‌ గెలిచాను. ఉద్యోగం చేస్తూనే ఆటలు కూడా కొనసాగించాను. ఫిబ్రవరిలో హరియాణాలో జరిగిన ‘జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌’లో మూడు పతకాలు సాధించాను. 1500 మీటర్ల పరుగులో స్వర్ణం, 400 మీటర్ల రిలేలో రజతం, 5కె వాక్‌లో కాంస్యం దక్కించుకున్నాను. అంతకుముందు మెదక్‌లో నిర్వహించిన చాంపియన్‌షి్‌పలో రెండు స్వర్ణం, రెండు రజతాలు గెలుచుకున్నాను. మేలో దక్షిణ కొరియా వెళ్లాల్సింది. దానికి రెండు లక్షల రూపాయలు ఖర్చవుతుందంటే వదిలేశాను. ఎన్ని విజయాలు సాధించినా ప్రభుత్వం నుంచి గానీ, కార్పొరేట్‌ సంస్థల నుంచి గానీ ఎలాంటి ప్రోత్సాహం లేదు. నాలాంటివారికి ఈ ఖర్చులు తలకు మించిన భారమే. గేమ్స్‌కు వెళ్లినప్పుడు సెలవులు దొరకడం కూడా కష్టమే. లాస్‌ ఆఫ్‌ పే మీద లీవ్స్‌ తీసుకొంటాను. ఆటల మీద ఆసక్తి, అభిరుచులే నన్ను ముందుకు నడిపిస్తున్నాయి.

ఉన్నదాంట్లోనే...

ప్రస్తుతం నాకు ఉన్నదాంట్లో సామాజిక సేవ కూడా చేస్తున్నాను. పాతిక మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రోజూ ఇంట్లో ఉచితంగా ట్యూషన్‌ చెబుతున్నాను. పేద పిల్లలకు స్టేషనరీ కొనిస్తుంటాను. వృద్ధాశ్రమాలకు వెళ్లి సాయం చేస్తుంటా. రోజూ మా ఇంటికి ఐదారు ఆవులు వస్తున్నాయి. వాటికి పప్పు, బెల్లం, బియ్యం... ఏదుంటే అది పెడుతుంటాను. అలాగే ఇరవైకి పైగా పిల్లుల్ని పెంచుతున్నాం. మావారు కూడా చిన్న ఉద్యోగం చేస్తున్నారు. మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా ఇస్తారు. మా ఇద్దరి సంపాదనతో మా ట్రస్ట్‌, నా క్రీడలు, ఇల్లు నెట్టుకొస్తున్నాం. నాకు వచ్చే జీతంలో కొంత మా ట్రస్ట్‌ కోసం పక్కన పెడతాను. ఈ సేవలు, క్రీడా ప్రతిభను గుర్తించి పలు సంస్థలు, సంఘాలు నాకు అవార్డులను ఇచ్చి గౌరవించాయి.’’

అవహేళనలు భరించి...

మా బంధువులు చాలామంది అనేవారు... ‘ఈ వయసులో నీకు పరుగు పందాలు అవసరమా? ఇలా నిక్కర్లు వేసుకొని పరుగెట్టడమేంటి’ అని! ఆఫీస్‌లో లీవ్‌ అడిగితే... ‘ఈ వయసులో ఆటలేంటి? మీరు వెళితే ఇక్కడ పని ఎవరు చేస్తారు’ అన్న సందర్భాలూ ఉన్నాయి. మెడల్స్‌ చూసి... ‘పర్లేదే... ఇంకా బాగానే పరుగెత్తుతున్నావే’ అని వెకిలిగా మాట్లాడినవారూ, పిల్లలకు స్టేషనరీ అవీ కొనిస్తుంటే... ‘నీకే డబ్బులు లేవు. మళ్లీ వేరేవాళ్లకు ఖర్చు చేస్తున్నావా’ అన్నవారూ ఉన్నారు. ఇవేవీ నా చెవికి ఎక్కించుకోను. తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు చేసుకొని ఐదున్నరకల్లా వాకింగ్‌కు వెళతాను. రాగానే వంట చేసి, అందరికీ బాక్స్‌లు సర్ది ఎనిమిదిన్నరకు ఆఫీస్‌ బస్సు ఎక్కుతాను. ఇంటికి రాగానే ట్యూషన్‌ పిల్లలు సిద్ధంగా ఉంటారు. ఇష్టంగా కష్టపడుతున్నాను. ఉన్నదాంట్లో సాయం చేయడం, ఫిట్‌నెస్‌ ఉన్నంతకాలం పరుగులో పోటీ పడడం... ఇవే నాకు సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చేవి!

హనుమా

Updated Date - 2023-06-01T00:00:41+05:30 IST