Bharadwaja : రాము కుదరదన్నాడు
ABN , Publish Date - Dec 17 , 2023 | 06:15 AM
రామ్‌గోపాల్‌వర్మ ‘మనీ’ చిత్రం విడుదలకు ముందు అన్నపూర్ణా స్టూడియోలో చాలా షోలు వేశారు. సినిమా బాలేదనే టాక్‌తో బిజినెస్ అవ్వలేదు. విడుదల వాయిదా పడుతోంది. అప్పుడు నన్ను కూడా పిలిచి సినిమా చూపించారు. నాకు నచ్చలేదు. ‘ఎందుకు బాలేదు? ఏంచేస్తే
రామ్‌గోపాల్‌వర్మ ‘మనీ’ చిత్రం విడుదలకు ముందు అన్నపూర్ణా స్టూడియోలో చాలా షోలు వేశారు. సినిమా బాలేదనే టాక్‌తో బిజినెస్ అవ్వలేదు. విడుదల వాయిదా పడుతోంది. అప్పుడు నన్ను కూడా పిలిచి సినిమా చూపించారు. నాకు నచ్చలేదు. ‘ఎందుకు బాలేదు? ఏంచేస్తే మెరుగవుతుంది?’ అని రాము నన్ను అడిగారు. అందులో జయసుధ గారిని కుర్రాళ్లు కిడ్నాప్ చేస్తారు. ఏదో ఇంగ్లీష్ చిత్రం చూసి తీశారు దాన్ని. అది చాలా బాగుంటుంది. వీళ్లు తీసింది కూడా బాగుంది కానీ... కామెడీ అనుకున్నంతగా పండలేదని అనిపించింది. ‘అదీ కాకుండా జయసుధ గారి పాత్రకు సింపతీ లేదు. ఆవిడకు మోడ్రన్‌గా డ్రెస్‌లు వేశారు. ఆమె పాత్ర కూడా గాలిగా ఉన్నట్టు అనిపించింది. అలా కాకుండా నిజాయతీ గల భార్యగా... భర్త వేధింపులు తట్టుకోలేక విడిపోతాను అని తను అనేలా కాస్త సెంటిమెంటల్‌గా ఏదైనా పెడితే బాగుండేదేమో’ అన్నాను. ‘మీరు చెప్పినట్టు తీయాలంటే ఆవిడకు మళ్లీ వేరే డ్రెస్‌లు వేసి, అంతా రీషూట్ చేయాలి కదా. అది కుదిరే పని కాదండీ’ అన్నారు రాము. ఇద్దరం గంటకు పైగా చర్చించాం. నేను చెప్పింది చేశారని కాదు... ఈ విషయంలో ఆయన నాతో మాట్లాడినట్టే చాలామందితో మాట్లాడి ఉంటారు. ఆ తరువాత రాము, దర్శకుడు శివనాగేశ్వరరావు ఆలోచించుకుని బ్రహ్మానందం గారి కామెడీ ట్రాక్ వేశారు. దాని కోసం మూడునాలుగు రోజులు మళ్లీ షూటింగ్ జరిపి, సినిమా విడుదల చేశారు. సూపర్‌డూపర్ హిట్ అయింది. మిగతా కథంతా అందరికీ తెలిసిందే.
‘మనీ’ వెనకాల కథ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... దర్శకుడు కావచ్చు, నిర్మాత కావచ్చు, రచయిత కావచ్చు... ఎవరి ఆలోచనాతీరు వారిదే. కథను ఒక్కొక్కరూ ఒక్కోలా చూస్తారు. దాన్ని ఎన్ని రకాలుగా అయినా ప్రజెంట్ చేయవచ్చు. ఒకవేళ నేను చెప్పిన మార్పులు చేసి తీసివుంటే విజయవంతమయ్యేదేమో! తెలియదు.
ఎవరు ఎలా ఆలోచించినా మనం తీసిన సినిమాను కాపాడి, దాన్ని హిట్ ఎలా చేయాలనేది ఇక్కడ కీలకం. అలానే రాము, శివనాగేశ్వరరావు ఆలోచించారు. దానికి కామెడీ ట్రాక్ జత చేస్తే ఆదరణ లభిస్తుందని వారు భావించారు. అనుకున్నట్టుగానే కామెడీ ట్రాక్ పండింది. సినిమా కూడా పండింది. నిజానికి అప్పటికి అది మోడ్రన్ సినిమా. అందులో నేను చెప్పిందే ఉండాలని లేదు. నా ఆలోచన ఒకటి ఉండచ్చు. వాళ్లు అనుకున్నది వేరొకటి అయుండచ్చు.
ఇలా రీషూట్ చేసినవి, మళ్లీ ఎడిటింగ్ చేసినవి చాలా సినిమాలు ఉంటాయి. ఏదో ఎందుకు... నా సినిమా విషయంలోనే అలా జరిగింది. ‘మొగుడు కావాలి’ షూటింగ్ పూర్తయిన తరువాత చూస్తే నిడివి పదివేల అడుగులో ఎంతో వచ్చింది. అప్పట్లో పదకొండు వేల అడుగులు ఉంటే కానీ అది ఫీచర్ ఫిలిమ్ అవ్వదు. నాలుగైదు వందల అడుగులు తక్కువ పడింది. అందుకుని నూతన్ ప్రసాద్ గారితో ఒక సన్నివేశం తీద్దామనుకున్నాం. ఆయన తాగేసి వచ్చి ఇల్లు గుర్తుపట్టకుండా తిరిగేస్తుంటారు. మాకు పెద్దగా బడ్జెట్ లేదు కాబట్టి రోడ్డు మూలన ఒక కెమెరా పెట్టి తీసేశాం. ఆ సన్నివేశంలో నూతన్ ప్రసాద్ వచ్చి ఇళ్ల తలుపులు కొడుతుంటారు. మొత్తం నాలుగు వందల అడుగులు షూట్ చేశాం. వాస్తవానికి సెన్సార్ పూర్తయ్యాక ఆ సన్నివేశం తీసేద్దామని అనుకున్నాం. అయితే అంతకముందు చెప్పాను కదా... చాలా కష్టాలు పడి ఆ సినిమా తీశాం అని. ఆ కష్టాలవల్ల సినిమాను మళ్లీ ఎడిట్ చేసి, ఆ సన్నివేశం తొలగించడానికి మా దగ్గర డబ్బు లేదు. దాన్ని అలాగే వదిలేశాం. అదృష్టమో ఏమో తెలియదు కానీ... సినిమా విడుదలయ్యాక ఆ సన్నివేశానికి థియేటర్‌లో విపరీతమైన విజిల్స్ పడ్డాయి. ఇలా మనకు తెలిసీ, తెలియక చాలా జరిగిపోతుంటాయి.
ఇప్పుడు కూడా కొంతమంది డైరెక్టర్ల చిత్రాలు చూడండి... వాటిల్లో పెద్ద పెద్ద హీరోలు ఉంటారు. కానీ ప్రధాన కథ కంటే కామెడీ ట్రాక్‌లు సినిమాకు ఊపిరి పోస్తుంటాయి. ఆ మధ్య కాలంలో బ్రహ్మానందం గారు కాపాడిన చిత్రాలు చాలా ఉన్నాయి. కాపాడటం అంటే... ఆయన కామెడీ పండిన చిత్రాలు. అలాగే జూనియర్ వేణుమాధవ్, ఎంఎస్ నారాయణ గారి సినిమాలు కొన్ని. పెద్ద హీరోలు ఓపెనింగ్స్ తీసుకువస్తారు. కాదనను. అయితే వీళ్ల కామెడీ పండడం వల్ల సినిమాకు అదనపు ఆకర్షణ అవుతోంది. సినిమాకు మరింత బలాన్ని ఇస్తోంది.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే... ఇవాళ విడుదలకు ముందు సినిమా చూసే పరిస్థితి లేదు. కాపీ ఎడిటింగ్ రూమ్ నుంచి నేరుగా థియేటర్‌కు వెళ్లిపోతోంది. అలాకాకుండా నెలో రెండు నెలల ముందే కాపీ తెచ్చుకొని చూసి, అదనపు హంగులు ఏవైనా కావాలంటే సమకూర్చుకొని విడుదలకు వెళితే బాగుంటుంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. మన చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోతున్నాయంటే దానికి ప్రధాన కారణం ఇదేనని నా అభిప్రాయం.
హిట్ చిత్రమైనా... ఫ్లామ్ చిత్రమైనా నిర్మాత, ఆర్టిస్టులు, టెక్నీషియన్ల కష్టం ఒకటే. ఇంత శ్రమ శుక్రవారం మార్నింగ్ షోతో ఫట్ అయిపోయే పరిస్థితి రాకుండా... లేదంటే సినిమా విడుదల అయ్యే పరిస్థితి తలెత్తకుండా ముందే జాగ్రత్త పడాలి. దాని మంచి చెడులు బేరీజు వేసుకొనే పరిస్థితి ఉండాలి. ఏంచేసి సినిమాను నిలబెట్టుకోవాలి అనేది ఆలోచించుకోవాల్సిన అసవరం ఎంతైనా ఉంది.
ప్రతి వ్యక్తీ ఒక ప్రేక్షకుడేనని గమనించాలి. నిర్మాత కానీ, దర్శకుడు కానీ, రచయిత కానీ... వాళ్లు కూడా ఒక ప్రేక్షకుడిగా ఆలోచిస్తే అందులో లోతుపాతులు ఏంటనేది తెలుస్తాయి. అలా తెలుసుకొని సరి చేసుకొంటే విజయాన్ని అందుకోవడం కష్టమేమీ కాదు.
ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి... నేను సినిమా చూడగానే... ‘ఇది ఆడదు. ఒకవేళ విడులైతే ఇక నీకు అవకాశాలు కూడా రావు. కావాలంటే కథ తెచ్చుకొని మన దగ్గర ఒక సినిమా చేసుకో’ అని శివనాగేశ్వరరావుకు చెప్పాను. కథ చూస్తానని అతను అన్నాడు.
శివనాగేశ్వరరావు నాకు కథ ఇచ్చేసరికి, ‘మనీ’ విడుదలైపోయింది. అద్భుత విజయం అందుకుంది. తరువాత మా చిత్రం
‘వన్ బై టు’ కూడా హిట్ అయింది. ఈ మధ్యనే ఆ సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిన్న ఫంక్షన్ కూడా చేశాం. అందరం కలిశాం. చాలా సంతోషంగా ఉంది.
తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకనిర్మాత