Ramana Maharshi : ఊరకే ఉండు..!
ABN , Publish Date - Dec 22 , 2023 | 04:02 AM
‘ఊరకే ఉండు..’’ రమణ మహర్షి స్పురణకు వచ్చిన వెంటనే గుర్తుకొచ్చే పదాలివి. ఆయనతో నా అనుబంధం ఈ నాటిది కాదు. నా చిన్నప్పుడు- మా నాయనమ్మగారింట్లో రమణ మహర్షి
28న రమణ మహర్షి జయంతి
‘‘ఊరకే ఉండు..’’ రమణ మహర్షి స్పురణకు వచ్చిన వెంటనే గుర్తుకొచ్చే పదాలివి. ఆయనతో నా అనుబంధం ఈ నాటిది కాదు. నా చిన్నప్పుడు- మా నాయనమ్మగారింట్లో రమణ మహర్షి ఫొటో ఉండేది. దానిలో ఆయన ఒక గోచి పెట్టుకొని నిలబడి.. ఆవు పక్కన ఉండేవారు. ఆ ఫోటోను చూసినప్పుడల్లా- ‘‘అందరూ బట్టలు వేసుకుంటాం కదా.. ఆయన గోచి ఎందుకు పెట్టుకున్నాడు’’- అనుకొనేవాడిని. నాకు గుర్తున్నంత వరకూ ఆయనతో నా తొలి పరిచయం అదే. ఆ తర్వాత పరిచయం జిన్నూరు నాన్నగారితో. గోదావరి జిల్లాల్లో ఆయన గొప్ప ఆధ్యాత్మికవేత్త. ఆయన ప్రవచనాలకు అనేక మంది వస్తూ ఉండేవారు. అమ్మనాన్న ఆయన శిష్యులు. నాన్నగారి దగ్గరకు వెళ్తూ ఉండేవారు. వాళ్లతో నేను వెళ్లేవాడిని. రమణుడిని.. రమణాశ్రమాన్ని పూర్తిగా పరిచయం చేసింది ఆయనే! ఆ తర్వాత రమణుడు నా జీవితంలో ఒక భాగమయిపోయాడు. చిన్నప్పటి నుంచి నేను రమణుడికి సంబంధించిన పుస్తకాలు తప్ప వేరేవేమి చదవలేదు. ఒక సారి అవి చదవటం మొదలుపెట్టిన తర్వాత వేరేవేమి చదవాలనిపించలేదు. చదవటానికి ఏమి లేదనిపించింది. ఆ తరువాత గురువుగారు సూర్య ప్రకాష్ చేసిన సాధన వల్ల మరిన్ని విషయాలు తెలిశాయి.
నేను ఎవరు?
నా చేతి మీద ‘‘హూ యామ్ ఐ’’ అనే టాటూ ఉంటుంది. అప్పుడప్పుడు నా స్నేహితులు నన్ను ఆటపట్టించటానికి- ‘‘నువ్వు ఎవరో నీకు తెలియదా... నువ్వు రాజారవీంద్రవనే విషయాన్ని మర్చిపోతున్నావా?’’ అంటూ ఉంటారు. కానీ దాని వెనక ఒక నిగూఢార్థం ఉంది. ఆ అర్థాన్ని నాకు తెలియచెప్పింది రమణుడే! దీనిని సులభంగా అందరికీ అర్థమయ్యేలా చెబుతాను. నేను 1968లో పుట్టా. అంతకు ముందు నా శరీరానికి సంబంధించిన ఒక అణువు కూడా భూమి మీద లేదు. భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు నేను మరణిస్తా. అప్పుడు నన్ను కాల్చేస్తే నా శరీరంలో ఒక్క అణువు కూడా భూమిపై ఉండదు. ఈ మధ్యలో ఏం జరుగుతోంది? అనేదే అన్వేషణ. మన జీవితకాలంలో అనేక పనులు చేస్తూ ఉంటాం. ఈ పనులన్నింటికీ మన భావోద్వేగాలు ముడిపడి ఉంటాయి. పరిస్థితుల ప్రభావం కూడా పనిచేస్తూ ఉంటుంది. డబ్బు ఉన్నప్పుడు ఒకలా ఆలోచిస్తాం. డబ్బు లేకపోతే ఒకలా ఆలోచిస్తాం. శరీరానికి జబ్బు చేస్తే ఒకలా ఆలోచిస్తాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు వేరే విధంగా ఆలోచిస్తాం. ఇన్ని రకాల భావోద్వేగాలకు కారణమయిన శరీరం ఎవరిది? కాసేపు మనమే శరీరం అనుకుందాం. గాఢనిద్రలో ఉన్నప్పుడు మనకు శరీరం ఏమయిందో తెలియదు. ఉదయాన్నే లేచిన వెంటనే- ‘‘రాత్రి బాగా నిద్రపట్టింది’’ అనుకుంటాం. దీనిని మనకు చెప్పేదేవరు? ఇదొక ప్రశ్న. తర్కప్రకారం చూస్తే- మనమే శరీరమయితే నిద్రలో ఏం జరుగుతోందో మనకు తెలియాలి. కానీ తెలియటం లేదు. అంటే మనం శరీరం కాదు. ఇక కలల విషయానికి వద్దాం. రాత్రి పడుక్కొన్నప్పుడు కలలు వస్తాయి. అవి వాస్తవాలనిపిస్తాయి. ఆ విషయాన్ని మనకు ఎవరు చెబుతున్నారు? మళ్లీ లేచిన వెంటనే భౌతిక ప్రపంచం వాస్తవమనిపిస్తుంది. దీనిని కూడా ఎవరో మనకు చెప్పాలి. అంటే పైన చెప్పిన మూడు పరిస్థితుల్లోను శాశ్వతమైన అవస్థ ఒకటి కొనసాగుతోంది. దానికి మనం ఏపేరైనా పెట్టుకొవచ్చు. కొందరు ఆత్మ అంటారు. ఇంకొందరు స్పురణ అంటారు. ఈ స్పురణ లేకపోతే మన శరీరం ఎందుకూ పనికిరాదు.
వదిలేసుకోవాలి..
‘‘స్పురణ నువ్వు పుట్టకముందు ఉంది.. పుట్టిన తర్వాత ఉంది.. అంటే శరీరంలోకి వచ్చింది. మళ్లీ వెళ్లిపోయింది. అయితే నిద్రలో ఉన్న ఆనందం మెలుకువగా ఉన్నప్పుడు ఎందుకు లేదు?’’ అని ప్రశ్నిస్తాడు రమణుడు. అన్ని స్థితుల్లోను ఆ ఆనందాన్ని పొందటానికి ఆయన చెప్పిన మంత్రం- ‘‘రిమూవ్ యువర్ ఫస్ట్ థాట్’ (తొలి ఆలోచనను తొలగించటం). ఆ ఆలోచనలో రెండు భాగాలుంటాయి. మొదటిది- నేను శరీరం మాత్రమే అనే భావన. రెండోది ’’ నేను ఫలానా..’’ అనే భావన. ఈ రెండు పెనవేసుకొని ఉంటాయి. వీటిని వేరు చేయలేం. ‘‘నేను ఫలానా..’’ అనే భావన కమ్ముకున్నవెంటనే మన వ్యక్తిత్వం బయటకు వస్తుంది. ఈ ఆలోచననే తొలగించుకోగలిగితే ప్రపంచమంతా ఆనందమయిమవుతుంటారు రమణుడు.
నా అనుభవం..
మన జీవితంలో అనేక భావోద్వేగాలు ఉంటాయి. నిజ జీవితంలో ప్రతి క్షణం మనని వెంటాడుతూనే ఉంటాయి. ఒక నటుడిగా, నటులకు మేనేజర్‌గా నా జీవితంలో రకరకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఏదైనా భావోద్వేగం నన్ను కమ్మినప్పుడు- నా నిజ ఆనంద స్థితి నుంచి బయటకు వస్తున్నానని తెలుస్తుంది. వెంటనే ఆ భావోద్వేగాన్ని తొలగించుకుంటా! దీనికి ఒక ఉదాహరణ చెబుతా. మా నాన్నగారు బ్రెయిన్ డెడ్ అయ్యారు. వెంటిలేటర్ తీస్తే చనిపోతారని చెప్పారు. ఆ వెంటిలేటర్ తీసే సమయంలో కూడా నేను అక్కడే ఉన్నా. ఆయన పార్ధివదేహాన్ని జాగ్రత్తగా గుడ్డలు చుట్టి.. ఒక సూట్‌కేసులో బట్టలు సర్దినట్లు సర్ది ఇంటికి పంపారు. ఆయన చితికి నేనే నిప్పు పెట్టా! వెంటనే నేను షూటింగ్‌కు వెళ్లాల్సి వచ్చింది. లేకపోతే నిర్మాతకు నష్టం వస్తుంది. ఎటువంటి పశ్చాతాపపు ఆలోచనలు లేకుండా షూటింగ్‌కు వెళ్లా. ఆ సమయంలో అనేక మంది నన్ను విమర్శించారు. కానీ నాకు నిజమేమిటో తెలుసు. నేను ఎప్పుడూ ఆ స్థితిలోనే ఉండాలని కోరుకుంటూ ఉంటాను. రమణుడి జీవితంలో కూడా ఇలాంటిదే జరిగింది. ఆయనకు క్యాన్సర్ వచ్చింది. ఆ గడ్డను తొలగించకపోతే బతకరని వైద్యులు హెచ్చరించారు. దీనితో ఆయన శస్త్రచికిత్సకు అంగీకరించారు. ఎటువంటి మత్తుమందులు లేకుండా శస్త్ర చికిత్స చేయించుకున్నారు. నాకు నిజ జీవితంలో ఇలాంటి అనుభవాలెన్నో ఎదురయ్యాయి. వాటన్నింటి నుంచి బయటకు రావటానికి నాకు తోడ్పడింది రమణుడే! ‘బతికున్నంత కాలం మన శరీరాన్ని మనం మోసుకుంటాం..ఆ తర్వాత నలుగురు మోస్తారు..’ అనే రమణుడి వాక్యాలు ఎప్పడూ మననం చేసుకుంటూనే ఉంటా.
మూలమదే...
‘‘ఈ విశ్వంలో ఉన్నది ఒకటే వస్తువు.. ఆ వస్తువు అంతటా ఉంది. దానిని తెలుసుకోవటం జ్ఞానం. తెలియకపోవటం అజ్ఞానం’’ అంటారు రమణుడు.
ఒక వ్యక్తి ఒక చెట్టును పట్టుకొని- ‘‘నన్ను వదులు.. నన్ను వదులు’’ అని అరుస్తున్నాడట. తార్కికంగా చూస్తే- అతనే చెట్టును పట్టుకొన్నాడు. అతనే వదలమని అరుస్తున్నాడు. చెట్టును వదిలేయాల్సింది ఆ వ్యక్తే. మనం కూడా కోరికలను పట్టుకుంటాం. వాటిని వదిలేయటానికి రకరకాల ధ్యానాలు.. పూజలు.. స్వామిజీల సాంగత్యాలు చేస్తూ ఉంటాం. కానీ మనమే అన్నింటికీ కారణమనే విషయాన్ని గ్రహించం.
సంభాషణ: సీవీఎల్‌ఎన్ ప్రసాద్
రాజా రవీంద్రప్రముఖ నటుడు
9866661111