Panchamukha : పంచముఖుని పంచారామాలు

ABN , First Publish Date - 2023-02-16T23:59:56+05:30 IST

పరమశివుడు పంచ ముఖుడు. నాలుగు దిక్కులా నాలుగు ముఖాలతో, ఊర్థ్వదిశలో అయిదో ముఖంతో చూస్తూ ఉంటాడు. ఆ అయిదు ముఖాలూ అయిదు నామాలతో, అయిదు క్షేత్రాలుగా నెలకొన్నాయి. అవి అఘోరం (అమరావతి), తత్పురుష (ద్రాక్షారామం),

Panchamukha : పంచముఖుని పంచారామాలు

పరమశివుడు పంచ ముఖుడు. నాలుగు దిక్కులా నాలుగు ముఖాలతో, ఊర్థ్వదిశలో అయిదో ముఖంతో చూస్తూ ఉంటాడు. ఆ అయిదు ముఖాలూ అయిదు నామాలతో, అయిదు క్షేత్రాలుగా నెలకొన్నాయి. అవి అఘోరం (అమరావతి), తత్పురుష (ద్రాక్షారామం), వామదేవ (సామర్లకోట), సద్యోజాత (భీమవరం), ఈశాన (పాలకొల్లు). యుగయుగాలుగా ఆ రూపాలతో పరమశివుడు పూజలందుకుంటున్నాడు.

పురాణగాథల ప్రకారం... తారకాసురుడనే రాక్షసుడు ఘోరతపస్సు చేసి, శివుణ్ణి మెప్పించాడు. శివ కుమారుడి చేతులోనే మరణిస్తాననే వరాన్ని పొందాడు. పైగా శివుడి ఆత్మలింగాన్ని పొంది, తన ఉదరంలో భద్రపరిచాడు. దాంతో తారకాసురుడి అహంకారం పెరిగింది. లోకకంటకుడిగా మారాడు. దక్షయజ్ఞంలో దాక్షాయిణి దేహత్యాగం చేసి, హిమవంతుడి కుమార్తెగా జన్మించింది. శివుడికోసం తపస్సు చేసి, ఆయనను పరిణయమాడింది. మరోవైపు తారకాసురుడి బారి నుంచి తమను కాపాడాలని మహావిష్ణువును దేవతలు వేడుకున్నారు. ఆయన ఆనతి మేరకు... శివపార్వతుల ఏకాంతాన్ని భగ్నం చెయ్యడానికి మన్మధుడు అస్త్ర ప్రయోగం చేశాడు. శివపార్వతుల మధ్య ప్రేమావేశం కలిగింది. కుమార సంభవం జరిగింది.

శ్రీహరి సూచనను, తండ్రి ఆజ్ఞను పొందిన కుమారస్వామి... ఆగ్నేయాస్త్రంతో తారకాసురుణ్ణి వధించాడు. అతని ఉదరంలోని ఆత్మలింగాన్ని బయటపడేలా చేశాడు. ఆ ఆత్మలింగం అయిదు ముక్కలై... అయిదు ప్రదేశాల్లో పడింది. ఇది గమనించిన దేవతలు... అవి పడిన చోటే వాటిని తక్షణం ప్రతిష్ఠించారు. అవే ‘పంచారామ క్షేత్రాలు’గా ప్రసిద్ధి పొందాయి. ఇవి పూర్వ గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో సుప్రసిద్ధమైన ఆలయాలుగా... ఆరామాలుగా విలసిల్లుతున్నాయి. నిత్యాభిషేకాలతో అలరారే ఈ ఆరామాల్లో మాస శివరాత్రులకు, మహా శివరాత్రికి జరిగే అర్చనలు, పూజలు విశేషమైనవి.

1. అమరారామం:

కృష్ణానది ఒడ్డున ఆ ఆలయం ఉంది. ఇంద్రుడు దీన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. శివుని అయిదు ముఖాల్లో ఇది అఘోర రూపం. అమరేశ్వరునిగా పూజలందుకుంటున్న ఈ లింగం పదహారు అడుగుల ఎత్తుతో సమున్నతంగా కనిపిస్తుంది. గర్భాలయం రెండు అంతస్థులు ఉంటుంది. అభిషేకాలను పై అంతస్థు నుంచీ నిర్వహిస్తారు. మూడు ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో ప్రణవేశ్వరుడు, కాశీవిశ్వేశ్వరుడు, ఉమా మహేశ్వరుడు, అగస్త్యేశ్వరుడు, పార్ధివేశ్వరుడు, శ్రీశైల మల్లికార్డునుడు పేర్లతో శివుడు కొలువై ఉన్నాడు. ఇతర శివపరివారమంతా ఆరాధనలు అందుకుంటున్నారు. ఇక్కడి అమ్మవారిపేరు శ్రీ బాలచాముండేశ్వరి. బౌద్ధుల కాలంలో... ఆ మతవ్యాప్తి కోసం ఆచార్య నాగార్జునుడు అమరావతిలో విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాడు. ఆనాటి అవశేషాలను పురావస్తుశాఖ సేకరించి మ్యూజియం ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణదేవరాయలు అమరావతి క్షేత్రంలో గోపురాలు నిర్మించి, ఎంతో అభివృద్ధి చేశాడు. మహాశివరాత్రినాడు ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి.

2. ద్రాక్షారామం:

సూర్యుడు ప్రతిష్ఠించిన ఈ లింగాన్ని భీమేశ్వరుడిగా కొలుస్తారు. శివుని అయిదు ముఖాలలో ఇది తత్పురుష రూపం. సప్తగోదావరీ తీర్థంగా ప్రసిద్ధి పొందిన ఈ ఆలయం ‘దక్షిణ కాశీ’గా పేరుపొందిన ద్రాక్షారామంలో ఉంది. ఇక్కడి అమ్మవారి పేరు శ్రీ మాణిక్యాంబాదేవి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది ఒకటి. శివుడి భుజంపై ఉన్న సతీదేవిని శ్రీ మహావిష్ణువు ఖండిస్తున్నప్పుడు... ఆమె కణత భాగం పడిన స్థలంగా దీన్ని పురాణాలు వర్ణించాయి. ఆలయానికి నాలుగు పక్కలా ఎత్తైన గోపురాలు, ఆలయ శిల్పకళా నైపుణ్యం కనువిందు చేస్తాయి. క్షేత్రపాలకుడు శ్రీ లక్ష్మీనారాయణుడు. తూర్పుచాళుక్యులు నిర్మించిన ఈ ఆలయంలోని భీమేశ్వరలింగం... భోగలింగం. కాబట్టి సుగంధ ద్రవ్యాలు కలిపిన జలాన్ని అభిషేకిస్తారు. పది అడుగుల భీమేశ్వరుడి ఆలయంలో గర్భాలయం రెండు అంతస్థులుంటుంది. అభిషేకాలను పై అంతస్థు నుంచి నిర్వహిస్తారు. లింగం తెలుపు, నలుపు చాయల్లో ఉంటుంది. ఇక్కడ పలు దేవీదేవతల ఉపాలయాలు కూడా ఉన్నాయి.

3. కుమారారామం:

కుమారస్వామి ప్రతిష్ఠించిన వామదేవ స్వరూపుడు ఇక్కడ కుమార భీమేశ్వరునిగా పిలుపులందుకుంటున్నాడు. ఇది యోగలింగం. సామర్లకోటలో... రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉంది. అమ్మవారి పేరు బాలాత్రిపురసుందరీ దేవి. క్షేత్రపాలకుడు మాండవ్య నారాయణుడు. ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్యులు నిర్మించినట్టు ఆధారాలు ఉన్నాయి. రెండంతస్థుల ఈ ఆలయంలోని శివలింగంపై - చైత్ర, వైశాఖ మాసాల్లోని ఉభయసంధ్యల్లో సూర్యకిరణాలు పడడం విశేషం. ఆలయ ఆవరణలోని భీమకుండంలో స్నానం సర్వపాపహరంగా భావిస్తారు. కార్తికమాసంలో, మాసశివరాత్రులలో భక్తులు విశేషంగా స్వామిని దర్శిస్తారు. మహా శివరాత్రి రోజున మహోత్సవాలు జరుగుతాయి.

4. సోమారామం:

సద్యోజాత రూపమైన ఈ లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు. అందుకే ఇది ‘సోమారామం’గా పేరు పొందింది. పౌర్ణమి రోజున... చంద్రుడి షోడశకళలతో శ్వేతవర్ణంలో కనువిందు చేసే ఈ లింగం... కృష్ణపక్షంలో క్రమేపీ వన్నె తగ్గి, అమావాస్య నాడు బూడిద వర్ణంలో కనిపిస్తుంది. తిరిగి శుక్ల పక్షంలో చాయ క్రమేపీ పెరుగుతూ... పౌర్ణమినాటికి శ్వేతవర్ణానికి వస్తుంది. భీమవరం సమీపంలోని గునుపూడిలో ఉన్న సోమారామంలో.. కార్తిక మాసంలో, మాస శివరాత్రుల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి. క్షేత్రపాలకుడు జనార్దన స్వామి. దీన్ని చాళుక్య భీముడు నిర్మించాడని పురావస్తు శాస్త్రవేత్తల అభిప్రాయం.

5. క్షీరారామం:

ఈశాన రూపుడైన ఈ శివలింగాన్ని మహా విష్ణువు ప్రతిష్ఠించాడని ప్రతీతీ. తారకాసురుడి ఆత్మలింగంలోని కొప్పు భాగం... అంటే ఊర్థ్వముఖంగా ఉండే ఈశాన రూపం... క్షీరపురంలో పడిందని స్థలపురాణం చెబుతోంది. త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి గురువైన సాందీపుడు దర్శించిన క్షేత్రంగానూ ఇది విఖ్యాతి పొందింది. మునిబాలకుడైన ఉపమన్యుడు శిశుప్రాయంలో పాలు లేక సతమతమవుతున్నప్పుడు... శివుడు తన త్రిశూలంతో భూమిపై గుచ్చాడనీ, నేలలోంచీ స్వచ్ఛమైన పాలు ఉబికి వచ్చి, కొలనుగా మారాయనీ, ఆ పాల కొలనే ‘పాలకొల్లు’గా మారిందనీ క్షేరత్ర మహాత్మ్యం వెల్లడిస్తోంది. గోస్తనీ నదీతీరాన నెలకొన్న ఈ ఆలయంలో శివుని కొప్పు భాగం దర్శనమిస్తుంది కాబట్టి ఆయనను ‘కొప్పు లింగేశ్వరుడి’గానూ వ్యవహరిస్తారు. అమ్మవారిపేరు పార్వతీదేవి. క్షేత్రపాలకుడు శ్రీ మహా విష్ణువు. కార్తిక మాసంలో, మాస శివరాత్రులలో విశేష పూజలు, శివరాత్రి సందర్భంగా మహోత్సవాలూ ఇక్కడ నిర్వహిస్తారు. ఈ ఆలయంలో శివ కేశవ పరివార దేవతలకు ఆలయాలున్నాయి. వాటన్నిటికీ గోపుర విమానాలు ఉండడం విశేషం.

ఆయపిళ్ళ రాజపాప

Updated Date - 2023-02-16T23:59:57+05:30 IST