Overqualified housewives : మళ్లీ పనికి..!

ABN , First Publish Date - 2023-06-03T00:04:04+05:30 IST

పెళ్లి తరువాత చాలామంది మహిళల కెరీర్‌ అర్థంతరంగా ఆగిపోతోంది. ఇల్లు, పిల్లల్ని వదిలి బయటకు వెళ్లలేని పరిస్థితి. ఒకవేళ ఉద్యోగం చేద్దామనుకున్నా... దొరకడం కష్టమైపోతోంది. తనకు ఎదురైన ఈ సమస్య మరొక ఇల్లాలికి రాకూడదనుకున్నారు 30 ఏళ్ల శాంకరీ కర్పగం. అలాంటివారందరి కోసం ‘..

 Overqualified housewives : మళ్లీ పనికి..!
శాంకరీ కర్పగం

పెళ్లి తరువాత చాలామంది మహిళల కెరీర్‌ అర్థంతరంగా ఆగిపోతోంది. ఇల్లు, పిల్లల్ని వదిలి బయటకు వెళ్లలేని పరిస్థితి. ఒకవేళ ఉద్యోగం చేద్దామనుకున్నా... దొరకడం కష్టమైపోతోంది. తనకు ఎదురైన ఈ సమస్య మరొక ఇల్లాలికి రాకూడదనుకున్నారు 30 ఏళ్ల శాంకరీ కర్పగం. అలాంటివారందరి కోసం ‘ఓవర్‌క్వాలిఫైడ్‌ హౌస్‌వైవ్స్‌’ పేరిట ఒక వేదిక ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఇల్లు కదలకుండా... కుదిరినప్పుడే పని చేసేలా తల్లులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.

‘‘జీవితంలో బాగా స్థిరపడదామని చిన్నప్పటి నుంచి చదువు మీద శ్రద్ధ పెట్టాను. నేనే కాదు... మా అమ్మానాన్న కూడా నన్ను బాగా చదివించాలని కోరుకున్నారు. దాని కోసం మా కుటుంబంలో ఎవరూ చేయని సాహసం చేశారు. ప్లస్‌ టూ తరువాత నన్ను ఉన్నత చదువుల కోసం చెన్నై పంపించారు. అప్పటివరకు మా బంధువుల్లో ఏ ఆడపిల్లా చదువు కోసం ఊరు దాటి బయటకు వెళ్లలేదు. నా విషయంలో వాళ్లంతా మా నాన్నను ఆక్షేపించారు. అంత అవసరం ఏముందని నిలదీశారు. కానీ నాన్న అవేవీ పట్టించుకోలేదు. కట్టుబాట్ల పేరుతో తన కూతురు బంగారు భవిష్యత్తును పణంగా పెట్టదలుచుకోలేదు ఆయన.

తమిళనాడులోని తూత్తుకుడి గ్రామంలోని ఓ మధ్యతరగతి కుటుంబం మాది. అక్కడే ప్లస్‌ టూ వరకు చదివాను. టెన్త్‌, ప్లస్‌ టూలో నేనే టాపర్‌ని. ఆ తరువాత మా నాన్న సహకారం, ప్రోత్సాహం వల్ల ‘అన్నా విశ్వవిద్యాలయం’లో కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తి చేయగలిగాను. 2014లో ఇంజనీరింగ్‌ అవ్వగానే మైసూరు ఇన్ఫోసిస్‌లో ట్రైనీ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా చేరాను. అక్కడ వివిధ హోదాల్లో ఏడేళ్లకు పైగా పని చేశాను.

దృష్టి కోణం మారింది...

మైసూరులో ఉద్యోగం... ప్రపంచం పట్ల నా దృష్టి కోణాన్ని మార్చింది. అక్కడ కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రకాల వ్యక్తులను కలిసే అవకాశం లభించింది. నా జీవితం మీద వాళ్లందరి ప్రభావం పడింది. అదే నేడు నన్ను మీ ముందు ఇలా సరికొత్త శాంకరిగా నిలబెట్టింది. అయితే ఐటీ ఉద్యోగం కావాలని నేను ఎప్పుడూ కలలు కనలేదు. ఏదో భిన్నంగా చేయాలని అనుకుంటుండేదాన్ని. అదేంటన్నది అప్పటికి నాకూ స్పష్టత లేదు.

బాబు పుట్టాక...

ఈలోగా నాకు పెళ్లయింది. 2021లో బాబు పుట్టాడు. సిజేరియన్‌ తరువాత నా శరీరంలో చాలా మార్పులు సంభవించాయి. నిస్సత్తువ ఆవహించింది. చంటిబిడ్డను చూసుకోవడమే కష్టమైపోయింది. అంతలా బలహీనపడ్డాను. ఇక నావల్ల కాక ఉద్యోగం వదిలేయాల్సి వచ్చింది. ఐటీ ప్రొఫెషనల్‌గా స్థిరపడాలని నేను ఎన్నడూ కోరుకోకపోయినా... కెరీర్‌ అలా అర్థంతరంగా ముగిసినందుకు చాలా బాధ పడ్డాను. ఇకపై నా ఉద్యోగం ఒక గృహిణిగా మాత్రమేనని తెలిసి మానసికంగా ఆందోళన మొదలైంది. ఇక నా జీవితం ఇంతేనా? ఒకరిపై ఆధారపడి బతకాల్సిందేనా? ఇవే ప్రశ్నలు నాలో. దాంతో మళ్లీ ఉద్యోగ వేట మొదలుపెట్టాను. మధ్యలో కొన్నేళ్లు గ్యాప్‌ రావడంతో ఇంటర్వ్యూకు వెళ్లిన ప్రతిచోటా నిరాశే ఎదురైంది. ఇది నన్ను మరింతగా కుంగదీసింది.

నాలాంటివారి కోసం...

నేనే కాదు... నాలా ఇంకా ఎంతోమంది తల్లులు అటు ఇంటిని... ఇటు ఉద్యోగాన్ని సమన్వయం చేసుకోలేక కెరీర్‌ను వదులుకొంటున్నారు. తరువాత ఎప్పుడో అన్నీ కుదురుకున్నాక ఉద్యోగం చేద్దామనుకున్నా... దొరకడం కష్టపోతోంది. మరి దీనికి పరిష్కారం? అటు కంపెనీలను, ఇటు మహిళలను కలిపే వేదిక ఒకటి అవసరమని అర్థమైంది. నాకు కూడా ఎక్కడికో వెళ్లి ఉద్యోగం చేయాలనే ఆలోచన లేదు. ఈ క్రమంలోనే ‘ఓవర్‌క్వాలిఫైడ్‌ హౌస్‌వైవ్స్‌’ స్టార్టప్‌ పురుడు పోసుకుంది. గత ఏడాది ఆగస్టులో అంకుర సంస్థగా దీన్ని ప్రారంభించాను. ఈ పేరే ఎందుకంటే... నా దృష్టిలో ప్రతి గృహిణీ ఓవర్‌క్వాలిఫైడే. అంటే తను ఇంట్లో చేసే పనితో పోల్చినప్పుడు.

ఇంటి నుంచే పని...

మా సంస్థ ప్రధాన ఉద్దేశం ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకున్న గృహిణులకు ఇంట్లోనే పని చేసుకొనే వెసులుబాటు కల్పించడం. అదికూడా వారికి అనుకూలమైన సమయంలో. చెన్నైలో ప్రారంభించిన మా సంస్థకు కొద్ది కాలంలోనే విశేష స్పందన వచ్చింది. దానికి తగినట్టుగానే పలు రంగాల కంపెనీలతో కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్నాను. మహిళలు ఎవరైనా సరే... తమ పేర్లను మా వెబ్‌సైట్‌లో ఉచితంగా రిజిస్టర్‌ చేసుకోవచ్చు. వారి అనుభవం, ఎన్ని గంటలు కేటాయించగలరు... ఏ సమయంలో పని చేయగలరు... తదితర వివరాల ఆధారంగా పని కల్పిస్తాం. ఇంటి పనులు చూసుకొంటూనే ఉద్యోగం చేసుకోవచ్చు. జీతం కూడా కచ్చితంగా సమయానికి అందించే బాధ్యత నేనే తీసుకున్నాను.

సేవలు ఉచితం...

మావారు సుందరం గణపతి సహకారం లేకుంటే నేను ఈ స్టార్టప్‌ నెలకొల్పగలిగేదాన్ని కాదు. ఆయన బిజినెస్‌మ్యాన్‌. తన అనుభవాన్ని నాతో పంచుకున్నారు. స్టార్టప్‌ సరైన దిశగా ప్రయాణిస్తుందంటే ఆయన మార్గదర్శనం కూడా ఒక కారణం. ప్రస్తుతం 175 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాను. వెయ్యి మందికి పైగా గృహిణులు పేర్లు నమోదు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి రుసుమూ వసూలు చేయం. ఉద్యోగం వచ్చిన తరువాత కంపెనీలే మాకు ఇంతని కమీషన్‌ ఇస్తాయి. అదే మాకు ఆదాయం. చాలామంది మహిళలు మా సంస్థ ద్వారా ఉద్యోగాలు పొందారు. కుదిరిన సమయంలో ఇంటి నుంచే పని చేసుకొంటున్నారు. ఇది నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది.

సవాళ్లు ఎన్నో...

గృహిణులు అనగానే చిన్న చూపు చూసేవారు చాలామంది ఉన్నారు. వారి విద్యార్హతలు, అనుభవం, నైపుణ్యం పట్టించుకోకుండా డేటా ఎంట్రీలాంటి ఉద్యోగాలు ఇస్తామనేవారు. ఒక కంపెనీలో అయితే మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దాంతో ఆమె కలత చెంది ఉద్యోగం మానేసింది. ఆ కంపెనీతో వెంటనే కాంట్రాక్ట్‌ రద్దు చేసుకున్నాం. ఇలాంటివి పునరావృతం కాకుండా ఏంచేయాలని ఆలోచించాను. ఇంటర్వ్యూ సమయంలోనే సదరు కంపెనీ ప్రతినిధులు ఎలాంటివారన్నది తెలుసుకొంటున్నాను. అలాగే వాళ్ల తీరు, నడవడి గుర్తించడానికి నేను కూడా ఇంటర్వ్యూ బోర్డులో కూర్చొంటున్నాను. ఇలా ఊహించని సవాళ్లు ఎన్నో నిత్యం ఎదురవుతూనే ఉంటాయి. వాటిని అధిగమిస్తూ, సమస్యలను పరిష్కరించుకొంటూ పోతుండాలి.

నవ్య ‘స్మార్ట్‌ పేజీ’ లో ఆసక్తికర కథనాల కోసం... ఈ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి. లేదా ఈ కింది యూఆర్‌ఎల్‌

https://qr.page/g/3yoLsG9FHWr లో చదవండి.

Updated Date - 2023-06-03T00:04:04+05:30 IST