ఇంటి పంటకు సేంద్రియ విత్తనం

ABN , First Publish Date - 2023-07-10T01:19:58+05:30 IST

ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలు తినమని వైద్యులు చెబుతుంటారు. అలాంటి ఆరోగ్యకారక ఆహారమే ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుందని తెలిసి ఆ గృహిణి మనసు తల్లడిల్లింది.

ఇంటి పంటకు సేంద్రియ విత్తనం

ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలు తినమని వైద్యులు చెబుతుంటారు. అలాంటి ఆరోగ్యకారక ఆహారమే ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుందని తెలిసి ఆ గృహిణి మనసు తల్లడిల్లింది. ఓ తల్లిగా బిడ్డలకు శ్రేష్ఠమైన ఆహారాన్ని తినిపించాలనే కోరిక ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు. నగర వాసంలో ఇంటిపంట ఉత్తమమైనదని గుర్తించడమే కాదు, ‘సీడ్‌ బాస్కెట్‌’ పేరుతో సేంద్రియ విత్తనాలను ఇళ్ళ వద్దకే అందించే సేవలు ప్రారంభించారు. ఇప్పుడు ఇంటి నుంచే దేశం నలుమూలలకూ దేశీ విత్తనాలు సరఫరా చేస్తున్నారు. ఆమే గాదె చందన. తన పయనం గురించి ఆమె ‘నవ్య’తో పంచుకున్న విశేషాలిమి.

‘‘మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (ఎంసీఏ) చదివినా ఉద్యోగం చేయాలని మాత్రం ఎన్నడూ అనుకోలేదు. నా భర్త, పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ, గృహిణిగా జీవించడంలోనే ఆనందం ఉందనేది నా భావన. ఇప్పటికీ అదే నమ్ముతాను. మా అమ్మాయి లార్మిక నందనకు అన్నప్రాసన అయిన తర్వాత, ఆకుకూర పప్పుతో అన్నం పెట్టమని డాక్టరు చెప్పారు. సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్‌లో దొరికే ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివి కావని వార్తా కథనాలు వచ్చాయి. పరిశ్రమల వ్యర్థాలు కలిసిన మూసీ పరీవాహకంలో పండించిన కూరగాయలు, ఆకుకూరల్లో సీసం లాంటి విష పదార్థాలున్నట్లు కూడా కొన్ని అధ్యయనాల్లో తేలిందని విన్నాం. అవి తింటే ప్రమాదమని తెలిసిన తర్వాత కూడా వాటిని బిడ్డకు వండి పెట్టలేను కదా! కాస్త ఖరీదైనా, సేంద్రియ పద్ధతిలో పండించిన ఆకుకూరలు కొందామని ఆర్గానిక్‌ స్టోర్లకు వెళితే, అక్కడ వారానికి రెండు సార్లు మాత్రమే కూరగాయలు ఉండేవి. అదేమంటే, ‘స్టాక్‌ లేదు’ అనేవాళ్లు. అవయినా సహజసిద్ధంగా పండించినవేనని నమ్మకం ఏమిటి? అందుకే ఇంట్లోనే పాలకూర, తోటకూర లాంటివి కుండీలలో పెంచుదామని నిశ్చయించుకున్నా. అప్పుడు దేశవాళీ విత్తనాలు కొందామని ఆన్‌లైన్‌లో వెతికితే, ఎక్కడా దొరకలేదు. అసలు అలాంటి అమ్మకాలు కొనసాగించే వెబ్‌సైట్లు ఉన్నాయేమోనని ఇంటర్‌నెట్‌లో జల్లెడ పట్టాను. ఒక్కటీ కనిపించలేదు. అప్పుడు అనిపించింది, ‘మనమే సేంద్రియ కూరగాయల విత్తనాలు ఆన్‌లైన్‌ ద్వారా అమ్మితే ఎలా ఉంటుంది?’ అని!

నెలలో రెండు ఆర్డర్లు వచ్చినా...

ఈ విషయం నా భర్త నవీన్‌తో చెబితే, ఆలోచన బావుందన్నారు. ఆయన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు కావడంతో నాకు వెబ్‌సైట్‌ తాలూకు వ్యవహారాల్లో సాయంగా ఉంటానన్నారు. కానీ విత్తనాలు సేకరించడం ఎలా? ఇదే నా ముందున్న పెద్ద ప్రశ్న. మా సొంత ఊరు భద్రాది కొత్తగూడెం జిల్లా గుండేపూడి గ్రామం. మాదీ వ్యవసాయ కుటుంబమే. చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే... సెలవుల్లో అమ్మ, నాన్నకు సాయంగా పొలానికి వెళ్లడం అలవాటే. ఆ అనుభవంతో మొదట ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోని కొంతమంది రైతులతో మాట్లాడి... తోటకూర, చుక్కకూర, పాలకూర, గోంగూర, బెండ, వంగ, దోస, టమోటా లాంటి కొన్ని రకాల దేశవాళీ విత్తనాలు సేకరించాను. వాటితో ‘సీడ్‌ బాస్కెట్‌’ పేరిట 2016లో ఆన్‌లైన్‌ అమ్మకాలు ప్రారంభించాం. మొదటి నెలలో కేవలం రెండు ఆర్డర్లు మాత్రమే వచ్చాయి. అలా మూడేళ్ల పాటు అరకొర అమ్మకాలతోనే బండి నడిచింది. అయినా నిరుత్సాహపడలేదు. నా ప్రయత్నాన్ని ఆపలేదు. లాభనష్టాలను బేరీజు వేసుకోలేదు. కస్టమర్లు కొద్దిమందే అయినా... వారికి నాణ్యమైన సేవలు అందివ్వడమే ధ్యేయంగా పెట్టుకున్నాను. బ్రొకోలి, ఎర్ర బెండ లాంటి ఎగ్జాటిక్‌ వెజిటెబుల్స్‌ విత్తనాలు కావాలని ఒకరిద్దరు వినియోగదారులు అడిగినా, ‘లేవు’ అనకుండా... వాటిని ఐర్లాండ్‌ లాంటి ఇతర దేశాల నుంచి తెప్పించి ఇచ్చేవాళ్లం. దాంతో కస్టమర్లు మా పట్ల చాలా అభిమానంతో మెలిగేవారు. అలా ఆ నోట ఈ నోట నలుగురికీ మా గురించి తెలిసింది. మెల్లగా వ్యాపారం పుంజుకుంది. కోల్‌కతా, బెంగళూరు, ముంబయి, పూణె, అహ్మదాబాద్‌ లాంటి నగరాల నుంచి ఆర్డర్లు రావడం మొదలైంది. అమ్మకాలూ పెరిగాయి.

కలిసొచ్చిన కరోనా కాలం....

తొమ్మిదేళ్ల కిందట నెలకు ఐదు వందల రూపాయల ఆర్డర్లతో మొదలైన మా ‘సీడ్‌ బాస్కెట్‌’ సంస్థ వార్షిక టర్నోవర్‌ ఇప్పుడు యాభై లక్షల రూపాయలకు చేరింది. ఒక విధంగా కరోనా కాలం మాకు పెద్ద బ్రేక్‌ ఇచ్చిందని చెప్పచ్చు. ఆ సమయంలో చాలామంది పట్టణ ప్రాంత ప్రజలు ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు. అది మాకు బాగా కలిసొచ్చింది. ఇప్పటికీ బెంగళూరు, పూణె, కోల్‌కతా, హైదరాబాద్‌ నగరాల నుంచి మాకు ఎక్కువ ఆర్డర్లు వస్తుంటాయి. కొద్దిపాటి స్థలం ఉన్నా అందులో కాయగూరలు పండించుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. నగరాల్లో అర్బన్‌ ఫార్మింగ్‌ పెరిగిందనడానికి మాకు లభిస్తున్న ఆదరణే నిదర్శనం. ఇప్పుడు మేము 200 రకాల విత్తనాలను కస్టమర్లకు అందుబాటులో ఉంచాం. అందులో గోధుమ గడ్డి, కృష్ణతులసి లాంటి ఔషధ గుణాలు కలిగిన (మైక్రో గ్రీన్స్‌, హెర్బల్‌) మొక్కల విత్తనాలు బాగా అమ్ముడవుతున్నాయి. దాదాపుగా దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఈ మధ్యే జమ్మూ నుంచి కూడా వచ్చాయి. కొందరు ఎన్నారైలు అయితే అమెరికా, ఇంగ్లండ్‌, కెనడా తదితర దేశాలకూ విత్తనాలు తీసుకెళుతున్నారు. అంతేకాదు... గ్రామీణ ప్రాంతాల వారికి కూడా కొన్ని రకాలు దొరకనప్పుడు... మమ్మల్ని సంప్రతిస్తున్నారు. ఇది ఎంతో సంతోషం కలిగిస్తోంది.

పరీక్షించాకే మార్కెట్లోకి...

‘సీడ్‌ బాస్కెట్‌’ ద్వారా మేము అందించే దేశవాళీ విత్తనాలన్నీ చాలావరకు రైతుల దగ్గర నుంచి, మిగతావి ఉత్పత్తిదారుల నుంచి పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుంటాం. మహారాష్ట్ర, పంజాబ్‌, తమిళనాడు లాంటి ఇతర రాష్ట్రాల రైతుల నుంచి కొన్ని తెప్పిస్తుంటాం. అలా మేము కొనుగోలు చేసిన వాటిని బోయినపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లోని శీతల గిడ్డంగుల్లో భద్రపరుస్తాం. విత్తనాలను వినియోగదారులకు అందివ్వడానికి ముందుగా షాబాద్‌ దగ్గరున్న మా వ్యవసాయ భూమిలో పరీక్షిస్తాం. అవి నిర్ణీత గడువులో మొలకలు వేసిన తర్వాత, నాణ్యమైనవని నిర్ధారించుకున్నాకే అమ్మకానికి వెబ్‌సైట్‌లో ఉంచుతాం. అయినా... కొన్ని సందర్భాల్లో విత్తనాలు మొలకెత్తలేదని కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వస్తుంటాయి. అలాంటప్పుడు వాళ్లకు ప్రొడక్టు రీప్లేస్‌ చేస్తాం. లేదా డబ్బు తిరిగి చెల్లిస్తాం. బహుశా ఆ జవాబుదారీతనమే మార్కెట్‌ పోటీలో మేము నిలబడటానికి ప్రధాన కారణం అనుకుంటాను. ఇక మేము అమ్మే వాటిల్లో హైబ్రీడ్‌ రకాలు చాలా తక్కువ. ‘విత్తేముందు ఎంత మట్టి కలపాలి, వాటికి ఎన్నిరోజులు నీళ్లు పోయాలి, ఎంత మోతాదులో పోయాలి?’ లాంటి ప్రశ్నలు కస్టమర్ల నుంచి మాకు తరచుగా వస్తుంటాయి. సందేహాలను తీర్చేలా ప్రత్యేక కరపత్రాన్ని రూపొందించి, ప్రతి కస్టమర్‌కూ ఇస్తున్నాం.

విదేశాల నుంచి విత్తనాలు...

నేనెన్నడూ కలలో కూడా ఊహించలేదు పారిశ్రామిక రంగంలోకి అడుగుపెడతానని. ఓ తల్లిగా నా పిల్లలకు మంచి ఆహారం అందించాలన్న ఉద్దేశంతో మొదలు పెట్టిన నా ఈ ప్రయాణం మరో నలుగురికి ఉపాధి కల్పించే వరకు సాగడం... గర్వంగా ఉంది. అంతకుమించి పట్టణ ప్రజల ఆరోగ్యానికి మేలు కలిగించే సేంద్రీయ విత్తనాలను అందిస్తున్నందుకు మరింత ఆనందిస్తున్నాను. దీన్నొక వ్యాపారంలా ఎన్నడూ భావించలేదు. ఇందులో కష్టనష్టాలు బోలెడు. కస్టమర్ల కోరిక మేరకు కొన్నిరకాల విత్తనాలను ఇతర రాష్ట్రాల నుంచి, మరికొన్నింటిని ఇతర దేశాల నుంచి కూడా తెప్పిస్తుంటాం. అలాంటప్పుడు అవసరమైన పరిమాణం కన్నా కొంత పెద్ద మొత్తంలోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కప్పుడు అవి అమ్ముడుపోక వృఽథా అవుతుంటాయి. ఇంకొన్ని సార్లు కొరియర్‌ సర్వీసు ఆలస్యమవుతుంటుంది. ఇలా బోలెడు సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకెళుతున్నాను. అదే సమయంలో కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. రెండింటినీ సమన్వయం చేసుకుంటున్నాను. మార్కెటింగ్‌ విషయంలో నా భర్త సలహాలు, సూచనలు తీసుకుంటాను. ఆయన ప్రోత్సాహం లేకుంటే గృహిణిగానే ఉండిపోయేదాన్నేమో! పట్టణ ప్రాంత వ్యవసాయం మరింత విస్తృతం అయ్యేందుకు నా వంతు సేవలందించాలనీ, ప్రతి ఒక్కరూ ఇంటిపంట మీద ఆధారపడేలా అవగాహన కల్పించాలనీ నా కోరిక. ఆ దిశగా అడుగులు వేస్తున్నాను.’’

సాంత్వన్‌

ఫొటోలు: ఆర్‌. రాజ్‌కుమార్‌

Updated Date - 2023-07-10T02:30:07+05:30 IST