NTR: ఎన్టీఆర్... సోషల్ టీచర్
ABN , First Publish Date - 2023-05-27T03:40:16+05:30 IST
ఎన్‌టీఆర్ సినీ జీవిత చరిత్రలో ఆయన సాంఘిక చిత్రాల పర్వం ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టినట్లుగా ఉంటుంది. నాటి పరిస్థితులను నేడు టైమ్ మెషీన్‌లో వెళ్లి చూసినట్లుగా కనిపించే హిస్టారికల్ డాక్యుమెంట్ లాంటి అంశాలెన్నో ఆ సినిమాలలో మనకు కనిపిస్తాయి.

ఎన్టీఆర్ సినీ జీవిత చరిత్రలో ఆయన సాంఘిక చిత్రాల పర్వం ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టినట్లుగా ఉంటుంది. నాటి పరిస్థితులను నేడు టైమ్ మెషీన్‌లో వెళ్లి చూసినట్లుగా కనిపించే హిస్టారికల్ డాక్యుమెంట్ లాంటి అంశాలెన్నో ఆ సినిమాలలో మనకు కనిపిస్తాయి. వాటిలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలు. 1952లో ‘పెళ్లి చేసి చూడు’ సినిమా ఆనాటి యువతలోని అభ్యుదయ భావాలను చూపిస్తూ, కట్నానికి వ్యతిరేకంగా పెద్దవాళ్లను ఎదిరించి పెళ్లి చేసుకునే నవతరం భావాలకు అద్దం పట్టడం అప్పట్లో ఒక సంచలనం. ఈ సినిమా ద్వారా చక్రపాణి-ఎల్. వి ప్రసాద్ స్ర్కీన్‌ప్లేలో ప్రవేశపెట్టిన హ్యూమరస్ ఫార్ములా ఆ తర్వాత జంధ్యాల నుంచి ఇప్పటి త్రివిక్రమ్ వరకూ కొనసాగుతున్న సినిమాలకు మూలం. అలాగే తెలుగు తెరపై సాంఘిక చిత్రాల్లో యువకుల పాత్రలు హీరో స్థానం ఆక్రమించడం ప్రారంభమైంది కూడా ఈ సినిమాతోనే.
తెలుగు నాట వాడుక భాషను సాహిత్యంలో ప్రవేశపెట్టిన గురజాడ ‘కన్యాశుల్కం’ (1955) తెలుగు తెరపై తరతరాలను అలరించిన ఓ సంచలనం. ‘శభాష్ రాముడు’ (1959)లో రిక్షా కార్మికుడిని హీరో పాత్రగా నిలిపి పేదవాళ్ల సమస్యలను అశేష ప్రేక్షకుల ముందు ఆవిష్కరించిన ఘనత ఎన్టీఆర్‌దే. హైదరాబాద్‌లో షూటింగ్ చేసిన తొలి ఎన్టీఆర్ చిత్రం ఇదే. అప్పుడు అసెంబ్లీ ఎదురుగా రిక్షా తొక్కిన ఎన్టీఆర్ పాతికేళ్ల తర్వాత అదే అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ప్రవేశించడం చారిత్రాత్మక విశేషం.
‘రాముడు భీముడు’ (1964) నాటి సమాజానికి సందేశం ఇచ్చే ప్రభోధ గీతాలతో పాటు నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మాణానికి నేటికీ విజువల్ డాక్యుమెంట్‌గా నిలిచింది. అదే కాలంలో (1970 దశకం ముందు వరకూ) దేశంలో ప్రవేశపెట్టబడిన సమష్టి వ్యవసాయ విధానాన్ని అనేక సినిమాల్లో ఆయన పాత్రల ద్వారా చర్చించి, ప్రజలకు సందేశం అందించే విధంగా నటించారు. ఆ తర్వాత వచ్చిన రేషన్ విధానాన్ని దానిలోని సమస్యలను వాటి పరిష్కారాలనూ ఆ కాలంలోని తన 75 శాతం చిత్రాల్లో చూపించారు.
కుటుంబ వ్యవస్థ సంక్షోభం ఎదుర్కొంటున్న రోజుల్లో ఉమ్మడి కుటుంబాలను సమర్థిస్తూ ‘ఉమ్మడి కుటుంబం’ (1967) ను స్వయంగా కథ, స్ర్కీన్‌ప్లే రాసి, నటించి, నిర్మించి అఖండ విజయం సాధించి అశేష ప్రజానీకాన్ని మెప్పించారు. ఈ సినిమాను నాటి భారతీయ కుటుంబ వ్యవస్థకు ప్రతిరూపంగా మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో భారతదేశం తరపున ప్రదర్శనకు నాటి ప్రభుత్వం ఎంపిక చేయడం విశేషం. అలాగే వరకట్న దురాచారాన్ని నిరసిస్తూ ‘వరకట్నం’ చిత్రాన్ని (1969) స్వీయ దర్శకత్వంలో నిర్మించి జాతీయ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా తొలిసారిగా నగదు బహుమతి అందుకున్నారు.
‘తల్లా పెళ్లామా’ (1970) సినిమాలో నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమైక్య వాదాన్ని సమర్ధిస్తూ ‘తెలుగు జాతి మనది...’ అనే పాటను పెట్టడం ఆయన కమిట్‌మెంట్‌కు, ధైర్యానికీ నిదర్శనం.
‘కోడలు దిద్దిన కాపురం’ (1970) సొంత చిత్రంలో బాబాలను, వారి వ్యవహారాలను వ్యతిరేకిస్తూ, నాటి కాలంలో రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు సందర్శించే సత్య సాయిబాబాను పోలిన అంశాలను విమర్శించడం ఈనాడు కలలోనైనా ఎవరూ సాహసించలేని విషయం.
‘తాతమ్మ కల’ (1974)లో రైతు సమస్యలతో పాటు ఆనాడు కొత్తగా ప్రవేశపెట్టిన కుటుంబ నియంత్రణను వ్యతిరేకిస్తూ సినిమా తీయడం అప్పట్లో విశేష సంచలనం అయింది.