NTR : పాము కాటు... అయినా భయపడలేదు
ABN , First Publish Date - 2023-05-27T03:44:40+05:30 IST
‘దీక్ష’ (1974) చిత్రం షూటింగ్ వాహినీ స్టూడియోలో జరుగుతోంది. అందులో హీరో నేల మీదున్న నాపరాయిని జరిపినప్పుడు దానికింద ఉన్న పాము బయటకు వచ్చి అతన్ని కాటేస్తుంది.

‘దీక్ష’ (1974) చిత్రం షూటింగ్ వాహినీ స్టూడియోలో జరుగుతోంది. అందులో హీరో నేల మీదున్న నాపరాయిని జరిపినప్పుడు దానికింద ఉన్న పాము బయటకు వచ్చి అతన్ని కాటేస్తుంది. ఇదీ షాట్. సాధారణంగా పాముతో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు దాని నోటికి కుట్టు వేస్తారు.. కానీ ఆ రోజు హడావిడిలో పాము నోరు కుట్టలేదు. ఈ విషయం ఎవరికీ తెలీదు. ఎన్టీఆర్ నాపరాయిని జరపగానే పాము బయటకు వచ్చి నిజంగానే ఆయన్ని కాటేసింది. చేతి నుంచి రక్తం రావడంతో అందరికీ అనుమానం వచ్చి పాముల వాణ్ణి నిలదీయడంతో నోరు కుట్టలేదని భయపడుతూ చెప్పాడు. దాంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఆ విషం ఒళ్లంతా వ్యాపించక ముందే ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లాలనుకుని ఎన్టీఆర్ కి ఈ విషయం చెప్పారు. అయితే షూటింగ్ మధ్యలో ఆపడానికి ఆయన ఒప్పుకోలేదు. రక్తాన్ని తుడిచేసి ఆ చేతిని అలాగే గట్గిగా పట్టుకుని కూర్చున్నారు. ఆ తర్వాతి షాట్‌కు ఏర్పాట్లు చెయ్యమని దర్శకుడు ప్రత్యగాత్మకు చెప్పారు.
ఆరు గంటల వరకూ షూటింగ్ చేసి ఆ తర్వాత తాపీగా ఇంటికి వెళ్లిపోయారు ఎన్టీఆర్. అప్పుడు కూడా ఆస్పత్రికి వెళదామంటే ఆయన ఒప్పుకోలేదు. ఎనిమిది గంటలకు భోజనం చేసి పడుకున్నారు. కానీ ఆ రాత్రంతా యూనిట్ సభ్యులెవరికీ నిద్రలు లేవు. ఏమవుతుందా అని ఒకటే టెన్షన్. ఎందుకైనా మంచిదని విషానికి విరుగుడు ఇంజెక్షన్లు సిద్దం చేశారు. ఎప్పటిలానే తెల్లారి రెండున్నరకి ఎన్టీఆర్ లేచారు. తన ఇంట్లో కనిపించిన దర్శకనిర్మాతలను చూసి ఆశ్చర్యపోయి ‘ఏమిటీ.. మీరంతా ఇక్కడే ఉన్నారు?’ అని అడిగారు. ‘మీకు పాము.. అదీ..’ అని నసిగేసరికి ‘అది మమ్మల్ని ఏమీ చెయ్యదు.. మీరు వెళ్లండి’ అన్నారు. సాధారణంగా పాము కరవగానే ఆ షాక్‌కి గుండె పోటుతో మరణిస్తుంటారు చాలా మంది. కానీ ఎన్టీఆర్ మొండితనమే ఆయన్ని కాపాడింది.