NTR: వెండితెర పూరించిన విజయ శంఖారావం

ABN , First Publish Date - 2023-05-27T03:37:18+05:30 IST

ఏ పాత్రకు తను సరిపోనని ఎన్టీఆర్‌ మొదట్లో అనుకున్నారో, ఆ శ్రీకృష్ణ పాత్రతోనే తరువాతి కాలంలో ఒక కొత్త ఒరవడి సృష్టించారు. ఎన్టీఆర్‌. సాక్షాత్తు ఆ కృష్ణుడే అని నమ్మిన జనం ఆయన ఫొటోలను పూజా మందిరాల్లో పెట్టుకుని పూజలు చేసేవారు.

NTR: వెండితెర పూరించిన  విజయ శంఖారావం

థియేటర్లను దేవాలయాలుగా మార్చిన మాయ పేరు... ఎన్టీఆర్‌!

హీరో కాస్తా.. ఇలవేల్పు అయిపోయిన రూపం.. ఎన్టీఆర్‌!

అభిమానుల్ని అనుచరులుగా తీర్చిదిద్దిన ఆశయం.. ఎన్టీఆర్‌!

తెలుగు సినిమా చరిత్రని మూడు అక్షరాల్లో కుదించాలంటే కనిపించే ప్రత్యామ్నాయం.. ఎన్టీఆర్‌!

వెండి తెర పూరించిన విజయశంఖారావం ఆయన..

కాలం కూడా మర్చిపోలేని కథానాయకుడు ఆయన..

ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ‘నవ్య’ ఏరి

కూర్చిన నట విఖ్యాత జ్ఞాపకాల మాలిక ఇదీ!

తమిళంలోనూ కృష్ణుడంటే ఎన్టీఆరే!

ఏ పాత్రకు తను సరిపోనని ఎన్టీఆర్‌ మొదట్లో అనుకున్నారో, ఆ శ్రీకృష్ణ పాత్రతోనే తరువాతి కాలంలో ఒక కొత్త ఒరవడి సృష్టించారు. ఎన్టీఆర్‌. సాక్షాత్తు ఆ కృష్ణుడే అని నమ్మిన జనం ఆయన ఫొటోలను పూజా మందిరాల్లో పెట్టుకుని పూజలు చేసేవారు.

అంతవరకూ సినిమా కృష్ణుడంటే ‘ఈలపాట’ రఘురామయ్యే. అయితే ‘మాయాబజార్‌’ చిత్రంలో ఎన్టీఆర్‌ను ఆయన స్థానంలో నిలబెట్టారు దర్శకుడు కె.వి.రెడ్డి. పాతికేళ్ల కాలంలో 18 చిత్రాల్లో కృష్ణుని పాత్ర పోషించారు ఎన్టీఆర్‌. తెలుగు సినిమాల్లోనే కాదు తమిళ చిత్రాలలో సైతం కృష్ణుడంటే ఎన్టీఆరే! ఒకే పాత్రను ఇన్నిసార్లు ర పోషించిన నటుడు ప్రపంచంలో మరెవరూ లేరంటే అతిశయోక్తి కాదు.

మూడున్నర దశాబ్దాలకు పైగా ఉన్న తన నట జీవితంలో ఎన్టీఆర్‌ నటించిన చిత్రాల్లో సాంఽఘీకాలదే సింహ భాగం అయినప్పటికీ ఆయనకు అపారమైన పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టినవి పౌరాణిక చిత్రాలే. ముఖ్యంగా శ్రీ కృష్ణుని పాత్రను అనితర సాధ్యమైన రీతిలో పోషించి తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవం అయ్యారు ఎన్టీఆర్‌. ఆయన చిత్రరంగంలో ప్రవేశించిన సమయానికి పౌరాణిక చిత్రాల ప్రభ తగ్గు ముఖం పట్టింది. పైగా ఆ రోజుల్లో రూపుదిద్దుకొన్న పౌరాణికాల్లో అధిక శాతం స్టేజీ నాటకాల ధోరణిలో ఉండేవి. ఎన్టీఆర్‌ పోషించిన తొలి పౌరాణిక పాత్ర నలకుబురుడు. ‘మాయా రంభ’ చిత్రంలో ఆ పాత్ర పోషించారాయన. ఈ సినిమా కూడా నాటక ఫక్కీలోనే తయారైంది. అటువంటి తరుణంలో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్‌ తన ప్రతిభతో పౌరాణికాలకు పునర్జీవం పోశారు. పౌరాణిక పాత్రలను అద్భుతంగా పోషించే నటుడు దొరకడంతో ఎంతో మంది దర్శకనిర్మాతలు మళ్లీ పౌరాణిక చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు.

33 సార్లు కృష్ణునిగా..

సినిమాల్లోని అంతర్నాటకాలతో కలిపి మొత్తం 33 సార్లు శ్రీకృష్ణ పాత్ర పోషించారు ఎన్టీఆర్‌. ఆ పాత్రను అన్ని సార్లు పోషించడం, ఒకే ఆహార్యం, ఒకే వయసును ప్రతిబింబిస్తూ నటించడం ఆయనకు మాత్రమే సాధ్యమైంది. ఆయన సమకాలికులైన కొందరు నటులు కృష్ణుని పాత్రలు పోషించారు కానీ ప్రతి సారీ వారిని ఎన్టీఆర్‌తో పోల్చుకునేవారు ప్రేక్షకులు. అందుకే ఆ పాత్ర ధరించాలనే కోరిక మనసులో ఉన్నా , ధైర్యం చాలక ‘అమ్మో’ అనేవారు. ఎన్టీఆర్‌ స్యయంగా నచ్చజెప్పి కొంత మంది నటులతో శ్రీకృష్ణుని పాత్ర పోషింపజేశారు. ‘భీష్మ’ చిత్రంలో హరనాథ్‌ శ్రీకృష్ణ పాత్ర పోషించడానికి ఎన్టీఆర్‌ ప్రోత్సాహమే కారణం.

ఎన్టీఆర్‌ మొత్తం 22 తమిళ చిత్రాల్లో నటించారు . ‘మాయాబజార్‌’, ‘దీపావళి’, ‘వినాయక చవితి’ తమిళ వెర్షన్స్‌లో కూడా ఎన్టీఆర్‌ కృష్ణుడిగా నటించారు. శివాజీ గణేశన్‌ కర్ణుడిగా నటించిన ‘కర్ణన్‌’ చిత్రంలో ఆయన కృష్ణుడిగా నటించారు. ఆదే సినిమాను తెలుగులోకి డబ్బింగ్‌ చేశారు. స్వీయ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నిర్మించిన ‘శ్రీ కృష్ణ పాండవీయం’ చిత్రంలో ఆయన శ్రీకృష్ణ, దుర్యోధన పాత్రలు పోషించారు. ఇదే చిత్రాన్ని ‘రాజసూయం’ పేరుతో తమిళంలో తీసినప్పుడు అందులో కృష్ణుని పాత్రను మాత్రమే ఎన్టీఆర్‌ పోషించారు. దుర్యోధనుడి పాత్రను తమిళ నటుడు పోషించారు. అలాగే ‘కన్నన్‌ కరుణై’ తమిళ చిత్రంలో కూడా ఎన్టీఆర్‌ కృష్ణుడిగా అతిధి పాత్రను పోషించారు. తెలుగులో వచ్చిన ‘వీరాభిమన్యు’ చిత్రంలో ఎన్టీఆర్‌ కృష్ణుడిగా, శోభన్‌బాబు అభిమన్యుడిగా నటించారు. అదే చిత్రం తమిళ వెర్షన్‌లో జెమినీ గణేషన్‌ కృష్ణుడి పాత్ర పోషించడం గమనార్హం.

Updated Date - 2023-05-27T03:37:28+05:30 IST