Share News

లైక్‌లు కాదు... లైఫ్‌ తెలియాలి

ABN , First Publish Date - 2023-11-05T03:41:40+05:30 IST

చాలా బావుంది. నాన్నగారు (శివకుమార్‌) చిత్ర రంగానికి చెందినవారు. కానీ మమల్ని ఎప్పుడూ సినిమా రంగంలోకి రమ్మని అడగలేదు.

లైక్‌లు కాదు... లైఫ్‌ తెలియాలి

కార్తీ... తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. మాతృభాష తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటున్న కార్తీ- తన భావాలను ‘నవ్య’తో పంచుకున్నారు.

నన్ను ఎవరైనా యాక్టర్‌ అంటే అలా పిలవద్దని చెబుతాను. ‘ఫిల్మ్‌ యాక్టర్‌’ అని పిలవమని చెబుతాను. నాకు కెమెరా ముందు నటించటం మాత్రమే వచ్చు. ప్రేక్షకుల ముందు నాటకంలో నటించటం రాదు.

17 ఏళ్లు... 25 సినిమాలు..

మీ ప్రయాణం ఎలా సాగుతోంది?

చాలా బావుంది. నాన్నగారు (శివకుమార్‌) చిత్ర రంగానికి చెందినవారు. కానీ మమల్ని ఎప్పుడూ సినిమా రంగంలోకి రమ్మని అడగలేదు. ఆయనకు ఏదైనా చదువు తర్వాతే! నాకు సినిమాల్లోకి రావటం ఒక కల. ఒక్క సారి ప్రవేశించిన తర్వాత- అంతా మ్యాజిక్‌లా జరిగిపోతోంది. నేను చదువులో వీక్‌. అందువల్ల మామూలు ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరా! కానీ సినిమాల్లో చేరాలనుకున్నప్పుడు - సినీ పరిశ్రమకు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం లాంటి మణిసార్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేరే అవకాశమొచ్చింది. ఆయనతో పనిచేస్తే మన దృష్టి కోణమే మారిపోతుంది. సినిమా అనేది ఎంత సృజనాత్మకమైన విషయమో, దానిలో సాంకేతికపరంగా ఎలాంటి విలువలు ఉండాలో, సినీ నిర్మాణంలో నిబద్ధత ఎంత అవసరమో తెలుస్తుంది. ఇలా ప్రారంభమయిన నా ప్రయాణం ప్రేక్షకుల ఆదరణతో ముందుకు సాగుతోంది. ఒక సినిమాలో చేసిన పాత్ర మరో సినిమాలో చేయకూడదనేది నా ఉద్దేశం. దానికే కట్టుబడి ఉన్నా. అందుకే 17 సంవత్సరాలలో కేవలం 25 సినిమాలే చేశా!

సినిమా హీరో కావాలని ఎప్పుడూ అనుకోలేదా?

లేదు. మాది సినీ కుటుంబమే అయినా ఇంట్లో సినిమాల ప్రస్తావన ఎక్కువ ఉండేది కాదు. స్టార్‌ కిడ్స్‌ అనే విషయం మాకు గుర్తుకొచ్చేదే కాదు. ఎందుకంటే నాన్న మమల్ని మధ్యతరగతి విలువలతోనే పెంచారు. నా స్నేహితులందరూ సింగిల్‌ బెడ్‌రూమ్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఉండేవారే! కాలేజీకి మేము సైకిల్‌ మీద లేదా బస్సులో వెళ్లేవాళ్లం. బస్సు పాసుల కోసం లైన్లలో నిలబడేవాళ్లం. ‘‘మా నాన్న శివకుమార్‌’’ అని ఎవరికి చెప్పేవాళ్లం కాదు. ఆ కాలంలో ఇంటర్నెట్‌ లేదు. సోషల్‌ మీడియా లేదు. అందువల్ల ఇతరుల ఆకాంక్షలకు తగ్గట్టుగా బతకాలనే ఒత్తిడి లేదు. చిన్నప్పుడు రోడ్డు మీదే ఆడుతూ ఉండేవాళ్లం. అమ్మ వచ్చి పిలిచినా ఇంట్లోకి వెళ్లేవాళ్లం కాదు. ఇక నాకు, అన్నయ్యకు ఇంట్లో ఎప్పుడూ ‘డబ్లుడబ్ల్యుఎఫ్‌’ (కుస్తీ) జరుగుతూ ఉండేది. అన్నయ్య టీనేజ్‌కు వచ్చిన తర్వాత తన సర్కిల్‌ మారిపోయింది. వాళ్ల ఫ్రెండ్స్‌తో నన్ను కలవనిచ్చేవాడు కాదు. ఆ తర్వాత నేను అమెరికా వెళ్లా. డైరక్షన్‌ కోర్సు చేశా. అమెరికా నుంచి వచ్చిన తర్వాత అన్నయ్య నన్ను మణిసార్‌ దగ్గరకు తీసుకువెళ్లాడు. ఆ సమయంలో ఆయనకు తమిళం తెలిసి, డైరక్షన్‌ కోర్సు చేసిన వ్యక్తి కావాలి. అలా ఆయన దగ్గర చేరా. ఆ తర్వాతే హీరో అయ్యా!

మీకు, మీ అన్నయ్య సూర్యకు మధ్య ఎలాంటి పోలికలు ఉన్నాయనుకుంటున్నారు?

నా ఉద్దేశంలో ఎలాంటి పోలికలు లేవు. నేను ఎక్కువగా మాట్లాడతా! అన్నయ్య రిజర్వ్డ్‌గా ఉంటాడు. కానీ నేను అన్నయ్యను చూసి చాలా నేర్చుకున్నా. తను జీవితంలో కష్టపడి పైకి వచ్చాడు. కష్టపడకుండా ఏదీ రాదనే విషయాన్ని తను నమ్ముతాడు. భిన్నమైన పాత్రలు పోషించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. సాధారణంగా ఒక సినిమా హిట్‌ అయితే- ఆ తరహా పాత్రలే ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాటికి ‘నో’ చెప్పటం అంత సులభం కాదు. కానీ అన్నయ్యకు ఆ ధైర్యం ఉంది. ‘‘అందరూ ముందుకు పరిగెడుతుంటే.. నేను వేరే దారిలో పరిగెడుతున్నా’’ అని ఒకసారి అన్నయ్యే అన్నాడు. అది అక్షర సత్యం.

మీ వృత్తి జీవితంపై మణిరత్నం ప్రభావం ఏ మేరకు ఉంది?

నా ఉద్దేశంలో మణిసార్‌ ఒక జీనియస్‌. ప్రేక్షకులను గౌరవించే వ్యక్తి. మన భావోద్వేగాలను సినిమాలో ప్రతిబించాలని పరితపించే వ్యక్తి. చాలా కష్టపడే వ్యక్తి. అందరూ మూస పద్ధతిలో ఒక దారిలో వెళ్తున్నప్పుడు ఆయన కొత్త బాటలు వేస్తూ ఉంటాడు. ఉదాహరణకు ‘గీతాంజలి’నే తీసుకుందాం. సినిమాల్లోని పాత్రలన్నీ ఒకే తరహాలో ఉన్న సమయంలో... సంగీతం చెవులను బద్దలు కొడుతున్న సమయంలో... లైటింగ్‌ కళ్లకు ఇబ్బంది కలిగిస్తున్న సమయంలో... ఆయన గీతాంజలి తీశాడు. అందులో పాత్రలు వేసుకొనే బట్టలు, మాట్లాడుకొనే విధానం, సంగీతం, దాని మధ్యలో మౌనం- మనసుకు హత్తుకుంటాయిది. సీన్లలో పొగ కూడా రొమాంటిక్‌గా ఉందనిపిస్తుంది. ఇలా సినీ గ్రామర్‌ను మార్చటానికి చాలా ధైర్యం కావాలి. నా ఉద్దేశంలో- ఇప్పటితరానికి చెందిన అనేకమంది యువ దర్శకుల కన్నా- ఆయన ఎంతో ముందు ఉంటారు. ‘ఓకే బంగారం’ ముందు లివింగ్‌ రిలేషన్స్‌ గురించి ఎవరైనా చెప్పగలిగారా? ‘సఖి’కి ముందు తల్లితండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకున్న జంట కథ ఎవరైనా చెప్పారా? అంతదాకా ఎందుకు... మొన్నటికి మొన్న.. ‘పొన్నియన్‌ సెల్వన్‌’ షూటింగ్‌ సమయంలో... సెట్లో అందరి కన్నా ఆయనే ముందు ఉండేవారు. సృజనాత్మకతను మనకు ఎవరు నేర్పలేరు. అది మనకు సహజంగా రావాలి. కానీ క్రమశిక్షణ, కొత్త విషయాలకు భయపడకుండా ఉండటం ఇతరులను చూసి నేర్చుకోవచ్చు. మణిసార్‌ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది అదే!

గత 17 ఏళ్లలో సినిమా ఎలా మారుతూ వచ్చింది?

నేను అమెరికాలో చదువుకుంటున్న సమయంలో వారికి బాలీవుడ్‌ తప్ప వేరే సినిమాలు తెలియవు. యూర్‌పలో మణిరత్నం, ప్రభుదేవా వంటి వారు తెలుసు. మళయాళం సినిమాలు తెలుసు. కానీ పరిస్థితులు మారుతూ వచ్చాయి. మణిరత్నం, శంకర్‌లతో ప్రారంభమయిన పాన్‌ ఇండియా సినిమా రాజమౌళి ద్వారా పాన్‌ వరల్డ్‌కు చేరుకుంది. ఇప్పుడు రాజమౌళి ప్రపంచమంతటికీ తెలుసు. నేను చెప్పిన దర్శకులందరూ ప్రపంచవేదికపై మన సంస్కృతికి గౌరవం తెచ్చారు. ‘బాహుబలి’ అన్ని వయసుల వారిని హత్తుకుంది. ఎక్కడిదాకానో ఎందుకు... మా ఇంట్లో మా అమ్మాయి దేవసేవ లాంటి బట్టలు వేసుకొని, బొమ్మ కత్తి పట్టుకొని తిరిగేది. ఆ తర్వాత ‘కాంతర’, ‘కేజీఎఫ్‌’ వంటివి- మన వాళ్ల ప్రజంటేషన్‌ స్కిల్స్‌ను ప్రపంచానికి చాటి చెప్పాయి.

ప్రేక్షకులకు ఎలా మారుతూ వచ్చారు?

మంచి కథలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అయితే వారి అటెన్షన్‌ స్పాన్‌ తగ్గిపోయింది. ఎక్కువ నిడివి ఉన్న సీన్స్‌ను చూడటానికి ఇష్టపడటం లేదు. రీల్స్‌ మాదిరిగా సీన్లు 30 సెకన్లలో మారిపోవాలి. దీన్ని గమనించిన యువ దర్శకులు ఎక్కువ థ్రిల్స్‌ ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో 20 నిమిషాల్లో నాలుగు మలుపులు ఉంటే. . ఇప్పుడు నిమిషానికో మలుపు కావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అయితే కథ లేకుండా కేవలం మలుపులు మాత్రమే ఉంటే కుదరదు. అందుకే రహమాన్‌ ఒకసారి- ‘‘మనకు గొప్ప లోకల్‌ కథలు ఉన్నాయి. కానీ అవి అంతర్జాతీయ స్థాయికి చేరుకోవాలంటే ప్రజంటేషన్‌ ఆ స్థాయిలోనే ఉండాలి’’ అన్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్పాలి. మళయాళం సినిమా కథలు- సాధారణంగా నెమ్మదిగా నడుస్తాయి. వాటిని కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అంటే కథకు తగ్గట్టుగా గమనం ఉండాలి. కానీ ప్రజంటేషన్‌ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి. కొరియా సినిమా పరిశ్రమ దీన్ని సాధించగలిగినప్పుడు మనమెందుకు సాధించలేం?

మీరు రైతుల కోసం ఫౌండేషన్‌ స్థాపించారు కదా... అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది?

నా చిన్నతనమంతా మా తాతయ్య (మా అన్న నాన్న) ముత్తుస్వామి దగ్గర గడిచింది. ఆయన మోతుబరి రైతు. ఊరి పెద్ద. మనుషులకు, పశువులకు వైద్యం చేసే వైద్యుడు కూడా. నా చిన్నప్పుడు బంధువులందరూ వ్యవసాయం చేసేవారు. నేను పెద్దయ్యే నాటికి అందరూ వ్యవసాయం మానేసి వ్యాపారాల్లోకి వచ్చేశారు. తాతయ్య మరణం తర్వాత - మా ఊర్లో వ్యవసాయం చేసే వారే లేకుండా పోయారు. మా ఊరికి కళ పోయింది. ఆ మారుతున్న పరిస్థితులు చూస్తుంటే నాకు చాలా బాధ కలిగేది. ఏదైనా చేయాలనుకొనేవాణ్ణి. అలాంటి సమయంలో నేను ‘చినబాబు’ అనే సినిమా చేశాను. రైతులకు సంబంధించిన సినిమా అది. పెద్ద హిట్‌. అది హిట్‌ అయిన తర్వాత అన్నయ్య- ఏదైనా రైతు ఫౌండేషన్‌కు కోటి రూపాయలు విరాళం ఇవ్వాలనుకున్నాడు. అనేకమందితో మాట్లాడాడు. వారిలో చాలా మంది- ‘‘మీరు చెబితే ఎక్కువ మందికి తెలుస్తుంది. అందువల్ల మీరు రైతులకు సంబంధించిన కార్యక్రమం ప్రారంభించండి’’ అని చెప్పారు. దాంతో పౌండేషన్‌ ప్రారంభించాం. సమాజం దృష్టిలో సినిమా నటులు, క్రీడాకారులు మాత్రమే హీరోలు. కానీ పంట పండించి అన్నం పెట్టే రైతు కూడా హీరోనే! అందుకే ప్రతి ఏడాదీ ఉత్తమ రైతులకు లక్ష రూపాయలు చొప్పున అవార్డులు ఇవ్వటం మొదలుపెట్టాం. అంతేకాదు... వ్యవసాయానికి సంబంధించిన పరిశోధనల కోసం కోయంబత్తూరులో ఐదు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాం. ఇక్కడ చిన్న కమతాల రైతులకు అవసరమైన పనిముట్లకు సంబంధించిన పరిశోధనలు జరుగుతున్నాయి. నదుల పరిరక్షణకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం.

మీరు చాలా ప్రైవేట్‌ పర్సన్‌. మీ కుటుంబ సభ్యుల వివరాలు బయటకు తెలియనివ్వరు.. కారణమేదైనా ఉందా?

నా ఉద్దేశంలో పిల్లలకు లైక్‌ల కన్నా లైఫ్‌ గురించి ఎక్కువ తెలియాలి. లైఫ్‌ గురించి తెలియని నాడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మా చిన్నప్పుడు సోషల్‌ మీడియా లేదు కాబట్టి సమస్యలు లేవు. సోషల్‌ మీడియా బాగా పెరిగిపోయిన తర్వాత రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే పిల్లల విషయంలో కొంత ప్రైవేట్‌గా ఉంటా. అయితే వాళ్లకు నిజ జీవితం తెలియాలనేది నా ఉద్దేశం. అందుకే నా భార్య- వాళ్లను సాధారణ మార్కెట్‌లకు తీసుకువెళ్తుంది. అక్కడ పరిస్థితులు చూపిస్తుంది. నేను కూడా సోషల్‌ మీడియాకు దూరంగానే ఉంటా. ఎందుకంటే అది కొద్దిమంది అభిప్రాయాలనే ప్రతిబింబిస్తుంది. అసలైన సమాజం వేరే చోట ఉంది.

తెలుగులో మీ డబ్బింగ్‌ మీరే చెప్పుకుంటారు కదా... మంచి తెలుగు మాట్లాడటం ఎలా వచ్చింది?

నా చిన్నప్పుడు సుమారు 10 ఏళ్ల పాటు నూతన్‌ ప్రసాద్‌ గారు మా ఇంటి పక్కనే ఉండేవారు. ఆయన పిల్లలతో నేను ఆడుకుంటూ ఉండేవాణ్ణి. అలా తెలుగు అర్ధం కావటం మొదలుపెట్టింది. అయితే తెలుగు సినిమాలు చేయటం మొదలుపెట్టిన తర్వాత తెలుగు మాట్లాడటం నేర్చుకున్నా. ‘ఊపిరి’ సమయంలో డైలాగులు ముందు తీసుకువెళ్లి ప్రాక్టీసు చేసేవాణ్ణి.

జపాన్‌లో మీది చాలా భిన్నమైన పాత్ర అనుకుంటా?

అవును. దాన్ని నేనే డిజైన్‌ చేసుకున్నా. ఈ సినిమాలో ఒక దొంగ ఉంటాడు. పూర్తి స్వార్థపరుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుత ప్రపంచపు ప్రతినిధి. అలాంటి వాడు ఎలా ఉంటాడనే విషయంపై చాలా పరిశోధన చేశాం. ఒకో మేనరిజం ఒక్కొక్కరి నుంచి తీసుకున్నాం. ఉదాహరణకు బాగా శక్తిమంతుల గొంతులు పీలగా ఉంటాయి. ఈ సినిమాలో నేను కూడా అలాంటి మాడ్యులేషన్‌లోనే మాట్లాడతా! అందరికీ ఈ పాత్ర బాగా నచ్చుతుంది.

సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

నా స్ర్కిప్ట్‌లను అన్న, నాన్నలతో చర్చించను. వాళ్లు కూడా అడగరు. ప్రస్తుతం ‘ఖైదీ 2’, ‘సర్దార్‌ 2’ సినిమాలు జరుగుతున్నాయి. బాలీవుడ్‌లో కొన్ని ఆఫర్స్‌ వచ్చాయి. కానీ నాకు అంత

ఆసక్తిగా అనిపించలేదు. అందువల్ల వదిలేశాను. ఒక హాలీవుడ్‌ ప్రాజెక్టు కూడా

అనుకున్నాం. కానీ అందులో నటుడికి నల్లటి చర్మం కావాలి. అందువల్ల అది కూడా వదిలేశాను.

నాకు నా భార్యే పెద్ద ఎమోషనల్‌ సపోర్టు. తనే కాకుండా నాకు కొందరు స్నేహితులు ఉన్నారు. వాళ్లకు నా గొంతు వింటే నా మూడ్‌ ఎలా ఉందో అర్థమయిపోతుంది. నా చెల్లెలు బృందకు కూడా అన్నీ చెప్పగలను. ఇక్కడ అమ్మ గురించి కూడా చెప్పాలి. అమ్మ డిగ్రీ దాకా చదివింది. మేము జీవితంలో ఆనందంగా ఉండాలనేదే తన కోరిక. తను అంత నిస్వార్ధంగా ఎలా ఉంటుందో అర్ధం కాదు. బహుశా అందుకే అమ్మలు అమ్మలే!

నేను ‘పొన్నియన్‌ సెల్వన్‌’లో చేసిన పాత్రను ఎంజీఆర్‌, కమల్‌హాసన్‌, రజనీకాంత్‌, విజయ్‌... ఇలా అందరూ చేయాలనుకున్నారు. కానీ చివరకు నాకు ఆ అవకాశం వచ్చింది. ఆ పాత్ర నన్ను వెతుక్కుంటు రావటమంటే- ఏనుగు వచ్చి దండ వేసినట్లే!

Updated Date - 2023-11-05T03:41:43+05:30 IST