Director Sivanageswar Rao : నన్ను ఎవరూ దోచుకోలేరు!

ABN , First Publish Date - 2023-03-12T00:26:52+05:30 IST

‘‘నవ్వటం ఒక భోగం.. నవ్వకపోవటం ఒక రోగం’’ అంటారు కొందరు. దీనిని గాఢంగా నమ్మిన దర్శకుల్లో శివనాగేశ్వరరావు ఒకరు. ఎంత క్లిష్టమైన విషయాన్నైనా హాస్యస్ఫూరకంగా చెప్పటంలో శివనాగేశ్వరావు దిట్ట.

 Director Sivanageswar Rao : నన్ను ఎవరూ దోచుకోలేరు!

‘‘నవ్వటం ఒక భోగం.. నవ్వకపోవటం ఒక రోగం’’ అంటారు కొందరు. దీనిని గాఢంగా నమ్మిన దర్శకుల్లో శివనాగేశ్వరరావు ఒకరు. ఎంత క్లిష్టమైన విషయాన్నైనా హాస్యస్ఫూరకంగా చెప్పటంలో శివనాగేశ్వరావు దిట్ట. అందుకే ఆయన తీసిన ‘మనీ’ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటుంది. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన ‘దోచేవారెవరురా’ సినిమా విడుదల నేపథ్యంలో ‘నవ్య’ ఆయనను పలకరించింది.

మీ సినిమా జర్నీ ఎలా సాగుతోంది?

బావుంది. వాస్తవానికి చాలా బావుంది. నేను సినిమా మనిషిని. సినిమాలు తీయచ్చు. ఖాళీగా ఉండచ్చు. కానీ సినిమా కోసం ఏదో ఒక పని చేస్తూనే ఉంటా. నా ఉద్దేశంలో ఇదొక ప్రక్రియ. ఊపిరి ఆగేదాకా సాగుతూనే ఉంటుంది.

ఎప్పుడూ సినిమా గురించే ఆలోచించే ప్రక్రియ వల్ల ప్రయోజనం ఉందా?

ఉంటుంది. నాకు సినిమా రంగంలో అనేక అనుభవాలు ఉన్నాయి. వీటిని అందరికీ చెప్పాలనే ఆలోచన వచ్చింది. వన్స్‌మోర్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నా. దీనిని ప్రారంభించే ముందు- ఈ ఛానల్‌లో ఏ ఒక్క విషయంలోనూ అబద్ధం చెప్పకూడదని ఒట్టు పెట్టుకున్నా. ఇప్పటి దాకా ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. వీటికి మంచి స్పందన వచ్చింది. ఎంత మంచి స్పందనంటే- ఈ ఇంటర్వ్యూలు చూసి- కోటేశ్వరరావుగారు- నాతో ‘దోచేవారెవరురా’ సినిమా తీసారు.

ఈ మధ్యనే సుకుమార్‌ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ - ‘‘నాగేశ్వరావుగారికి నేను గొప్ప ఫ్యాన్‌ని. మనీ వచ్చిన సమయంలో నేను లెక్చరర్‌గా పనిచేసేవాడిని. నా పని అయిపోయిన తర్వాత నేరుగా ఆ సినిమాకు వెళ్లి చూసేవాడిని..’’ అన్నారు. ఇంత కన్నా ప్రయోజనం ఏముంటుంది?

సినిమాలు ఫెయిల్‌ అయితే నిరాశ చెంది

డిప్రషన్‌లోకి వెళ్లిపోయేవారు ఎంతో మంది.. మీరెలా స్పందిస్తారు?

నాకూ జయాపజయాలు ఉన్నాయి. ఒక సినిమా ఆడకపోయినంత మాత్రన నిరాశ చెందను. డిప్రషన్‌లోకి వెళ్లిపోను. చాలా మందికి సినిమా తీయటం ఒక గమ్యం. నాకు అది ఒక ప్రయాణం. సినిమాలు లేకపోయినా నేను నిరాశ చెందను. ప్రతిఫలం కూడా ఆశించకుండా సాయం చేస్తా. ఇది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. మీకో ఉదాహరణ చెబుతా. నా మొదటి సినిమా పూర్తయిన పోయిన తర్వాత - ఆ సినిమాలో వాడిన క్లాప్‌ను ఇంటికి పట్టుకువెళ్లిపోయా! ప్రొడక్షన్‌ ఆఫీసులో ఇచ్చేదామనకున్నా. కానీ మనసొప్పలేదు. నేనే ఉంచేసుకున్నా. ఆ సమయంలో అసిస్టెంట్‌ డైరక్టర్‌లుగా చేరటానికి చాలా మంది మద్రాసుకు వచ్చేవారు. నా దగ్గరకు వచ్చి ఏదైనా పని ఇప్పించమని అడిగేవారు. వాళ్లకి ముందు - నా దగ్గర ఉన్న బోర్డుతో క్లాప్‌ కొట్టడం నేర్పేవాడిని. ఆ తర్వాత ప్రొడక్షన్‌ ఆఫీసులకు పంపేవాడిని.

అలా ఎవరో ఒకరికి సాయం చేయటం నాకిష్టం. కొన్ని సార్లు సినిమాలు వరసగా ప్లాప్‌ అయితే - నాలోంచి కూడా మరో ‘అసంతృప్తి నాగేశ్వరావు’ బయటకు వస్తూ ఉంటాడు. వాడిని తిట్టి పంపేస్తా. ఎందుకో నాకు అసంతృప్తిగా ఉండటం ఇష్టం ఉండదు. అందుకే నన్ను ఎవ్వరూ ఎంత ప్రయత్నించినా దోచుకోలేరు.

మీ కెరీర్‌లో మరిచిపోలేని అనుభవాలేమిటి?

మీరు అడుగుతుంటే రెండు గుర్తుకొచ్చాయి. మనీ పెద్ద సక్సెస్‌ అయిన తర్వాత తిరపతికి వెళ్లి తిరిగి వస్తున్నా. ట్రైన్‌లో మద్రాసులో నాతో పనిచేసిన ఒక ప్రొడక్షన్‌ మేనేజర్‌ కనిపించాడు. అతనికి మంచి జడ్జిమెంట్‌ ఉండేది. నాకు కూడా సలహాలు ఇచ్చేవాడు. కాలం కలిసిరాక మానసిక సమస్యలు వచ్చాయి. పిచ్చివాడిలా తిరిగేవాడు. మాటలు కూడా ముద్దగా వచ్చేవి. నన్ను చూసి - ‘‘నాగేశ్వరావు.. మనీ రెండు సార్లు చూశా. బావుంది..’’ అన్నాడు. అతని పరిస్థితిని చూసి జాలి పడాలో.. లేక అతను మెచ్చుకున్నందుకు ఆనందపడాలో తెలియని స్థితి నాది. ఇలాంటిదే మరొక అనుభవం ఉంది. ‘మనీ’ సినిమాలో- బిచ్చగత్తెకు బంధువవుతావని అని డబ్బు మీద ఒక పాట ఉంటుంది. దాంట్లో ఒక షాట్‌లో కొంత మంది ఒక శవాన్ని మోసుకువెళ్తుంటే జేడీ చక్రవర్తి వెళ్లి శవానికి వంద రూపాయల నోటు చూపిస్తాడు. అప్పుడా శవం లేచికూర్చుంటుంది. ‘మనీ’ సినిమా తర్వాత మా నాన్నగారు క్యాన్సర్‌తో మరణించారు. ఆయనకు నాతో పాటు హైదరాబాద్‌లో ప్రివ్యూ థియేటర్‌లో కూర్చుని మనీ సినిమా చూడాలని ఉండేది. కానీ అది తీరకుండానే ఆయన మరణించారు. నేను కర్మకాండలు చేయటానికి ఊరు వెళ్లాను. ఆయన దేహాన్ని శ్మశానానికి తీసుకువెళ్తున్నాం. శ్మశానానికి తీసుకువెళ్లే సమయంలో - ఒక సారి పాడేను కిందకు దింపి- మరణించిన వ్యక్తి చెవిలో పేరు పెట్టి పిలుస్తారు. ఇలా చేయటాన్ని దింపుడు కళ్లెం అంటారు. నాన్న దేహాన్ని కూడా అలా దింపారు. అప్పుడు మనీ సినిమాలో సీను గుర్తుకొచ్చి షాక్‌ కొట్టినట్లనిపించింది. ఇంత సీరియస్‌ విషయాన్ని నేను కామెడీ చేశానా అనిపించింది.

సినిమా హిట్‌ కాకపోతే బాధ్యత ఎవరిది?

ప్రేక్షకులదా? దర్శకుడిదా?

ఆడియన్స్‌ది ఎప్పుడూ తప్పు కాదు. నచ్చితే చూస్తారు. వారు కాలంతో పాటు మారిపోతూ ఉంటారు. వారిని అందుకోవాలంతే! నా ఉద్దేశంలే టెక్నాలజీతో పాటుగా మనిషి ఐడియాలజీ కూడా మారుతోంది. ఇది కాలం తెచ్చిన మార్పు. అయితే సినిమాలో ఏం మారినా- మానవ సంబంధాలు.. భావోద్వేగాలు మాత్రం మారవని నేను నమ్ముతాను. ఇవి బలంగా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు.

దోచేవారెవరురా! అనే డిఫరెంట్‌ టైటిల్‌ ఎందుకు పెట్టారు?

ఈ సినిమా జర్నీ చాలా చిత్రంగా అనిపిస్తుంది. నా ఇంటర్వ్యూలు చూసి బొడ్డు కోటేశ్వరరావుగారు నాతో సినిమా తీద్దామనుకున్నారు. ఆయను ఒక కథ చెప్పా. ఆయనకు నచ్చింది. కానీ నాకు ఎక్కడో అసంతృప్తి ఉంది. అందుకు వేరే కథ చెప్పా. అలా ప్రయాణం మొదలయింది. కొత్త యాక్టర్స్‌.. పాత యాక్టర్స్‌.. కలగలిపి సినిమా తీసాం. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది.

సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - 2023-03-12T00:27:17+05:30 IST