వెంట్రుకలు ఊడిపోకుండా...
ABN , First Publish Date - 2023-01-04T23:28:30+05:30 IST
డాక్టర్! నా వయసు 20. ఈమధ్య వెంట్రుకలు విపరీతంగా ఊడిపోతున్నాయి. కారణం తెలియడం లేదు. వెంట్రుకలు ఊడకుండా దృఢంగా పెరిగే మార్గం సూచిస్తారా
డాక్టర్! నా వయసు 20. ఈమధ్య వెంట్రుకలు విపరీతంగా ఊడిపోతున్నాయి. కారణం తెలియడం లేదు. వెంట్రుకలు ఊడకుండా దృఢంగా పెరిగే మార్గం సూచిస్తారా?
- ఓ సోదరి, హైదరాబాద్.
రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం సర్వసాధారణం. అలా రాలుతూ పోతే ఇక తల మీద వెంట్రుకలే మిగలవని భయపడవలసిన అవసరం లేదు. రాలే వెంట్రుకలు రాలుతూ ఉంటే కొత్త వెంట్రుకలు పుడుతూ, పెరుగుతూ ఉంటాయి. అయితే ప్రతి రోజూ రాలే వెంట్రుకల్ని లెక్కపెట్టుకుండూ ఉండలేం కాబట్టి, వెంట్రుకలు అవసరానికి మించి రాలుతున్నాయో, లేదో తెలియాలంటే ఓ విషయాన్ని గమనించాలి. ఎప్పుడూ ఒకే పరిమాణంలో రాలుతున్న వెంట్రుకలు హఠాత్తుగా కుచ్చులుగా రాలడం మొదలుపెడితే, అప్పుడు సమస్యగా గుర్తించాలి. వెంట్రుకలు ఊడటానికి పోషకాహారలోపం ఒక్కటే కారణమైతే, దాన్ని సరిదిద్దితే సమస్య తొలగిపోతుంది. అలా జరగలేదంటే, అందుకు వేరే కారణాలు అయి ఉండొచ్చు. అవేంటంటే...
వంశపారంపర్య బట్టతల: బట్టతల పురుషులతోపాటు కొందరు స్త్రీలకూ వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది. ఇలాంటి వారికి 18 ఏళ్ల నుంచి వెంట్రుకలు ఊడడం మొదలై 35ఏళ్ల లోపు తల ముందు భాగంలో బట్టతల వచ్చేస్తుంది.
థైరాయిడ్: హైపో, హైపర్... రెండు థైరాయిడ్ సమస్యల్లోనూ వెంట్రుకలు రాలడం జరుగుతుంది.
పిసిఒడి: పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ రుగ్మతకు లోనయినప్పుడు హార్మోన్లలో జరిగే అసమతౌల్యం వల్ల వెంట్రుకలు రాలతాయి.
గర్భం: ప్రసవం తర్వాత శరీరంలో పెరిగి తరిగే హార్మోన్లు, తల్లిగా కొత్త బాధ్యతతో ఒత్తిడికి లోనవడం, నిద్ర తగ్గడం వల్ల ఈ దశలో వెంట్రుకలు ఊడొచ్చు.
హెయిర్ ఎక్స్‌టెన్షన్స్: బరువైన విగ్గులు, సవరాలు వాడటం వల్ల వెంట్రుకల మీద ఒత్తిడి పడి ఊడిపోతాయి.
హెయిర్ ట్రీట్మెంట్లు: తరచూ డైయింగ్, స్ట్రయిటెనింగ్ లాంటి బ్యూటీ ట్రీట్మెంట్లు తీసుకుంటున్నా జుట్టు రాలిపోవచ్చు.
తలలో పుండ్లు: తలలో చుండ్రు పెరిగిపోయి పుండ్లు ఏర్పడినా, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల వెంట్రుకలు రాలిపోవచ్చు.
అలొపేసియా: పేను కొరుకుడు వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతాయి.
హెయిర్ స్టైల్స్: వెంట్రుకలను బిగుతుగా వెనక్కి లాగి కట్టే ‘పోనీ టెయిల్’ హెయిర్ స్టయిల్, వెంట్రుకలను బిగుతుగా పట్టి ఉంచే క్లిప్పుల వల్ల వెంట్రుకలు ఊడతాయి.
వంశపారంపర్యంగా సంక్రమించిన బట్టతల మినహా, మిగతా సమస్యలన్నిటినీ కాలంతోపాటు, సమర్ధమైన చికిత్సలతో సరిద్దితే వెంట్రుకలు ఊడడం తగ్గి, తిరిగి చక్కగా పెరుగుతాయి.
డాక్టర్ ఎ.రవిచందర్ రావు
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, హైదరాబాద్.