success: విజయం వరించాలంటే..

ABN , First Publish Date - 2023-01-19T22:58:05+05:30 IST

మీకు చిన్నప్పుడు నడకరాని వయసులో... నడవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. ఎన్నోసార్లు పడిపోయి ఉంటారు.

success: విజయం వరించాలంటే..

చింతన

మీకు చిన్నప్పుడు నడకరాని వయసులో... నడవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. ఎన్నోసార్లు పడిపోయి ఉంటారు. కానీ నడవాలనే ఉద్దేశం మీకు ఉండేది కాబట్టి... ఎన్ని సార్లు ఓడిపోయినా, ఆ ఓటమిని ఎన్నడూ అంగీకరించకుండా... మళ్ళీ లేచి, నడవడం మొదలుపెట్టారు. అలా ప్రయత్నం చేస్తూ, చేస్తూ... ఒక రోజు సఫలం అయ్యారు. కానీ ఇప్పుడు మీరు ఏ విషయంలోనైనా ప్రయత్నం చెయ్యడానికి ముందు... దాన్ని సాధించలేమేమో అనే ఎక్కువగా ఆలోచిస్తారు. ఆ ఆలోచన కారణంగానే అనుకున్నది సాధించడంలో చాలాసార్లు విఫలమవుతారు. కాబట్టి జీవితంలో ఏదైనా ముఖ్యమైనది సాధించాలనుకున్నప్పుడు... సాధించగలమనే ఆలోచనతో మొదలుపెట్టండి. అప్పుడే మీరు విజయపథంలో సాగిపోగలరు.

మనం జీవించి ఉన్నామంటే... ఆ భగవంతుడి కృప మన మీద ఉన్నట్టే. మనం ఏం చేయాలనుకుంటే అది చేయగలిగే అవకాశం మన ముందు ఉంది. కానీ అన్నిటికన్నా మనం జీవించి ఉండడం ప్రధానం. ఏదైనా చేయాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మన లోపలి నుంచే వస్తుంది. శ్వాస మీ లోపలికి వస్తూ, పోతున్నంతకాలం... మీరు ఓటమి పాలైనట్టు కాకుండా, విజయం సాధించినట్టుగా జీవించండి.

నేను మీకు ఒక కథ చెబుతాను. ఒక చిన్న కుక్కపిల్ల దారి తప్పి... దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ కారడవిలో అటూ ఇటూ తిరుగుతూ... తనకు దగ్గరలో ఒక సింహం ఉన్నట్టు పసిగట్టింది. అటూ ఇటూ చూస్తే... ఒక పెద్ద సింహం తనవైపు వస్తూ కనిపించింది. వెనక్కి తిరిగి పారిపోదామనుకుంటూ ఉండగా... పక్కనే ఒక పెద్ద ఎముకల గుట్ట కనిపించింది. కుక్కపిల్ల ఆ గుట్ట దగ్గరకు వెళ్ళి, తనను ఏదో విధంగా కాపాడుకోవడానికి ఉపాయం ఆలోచించడం మొదలెట్టింది.

ఇంతలో సింహం గర్జిస్తూ... ఆ కుక్క పిల్ల దగ్గరకు వచ్చింది. కుక్కపిల్ల ఆ ఎముకల గుట్ట మీద... సింహానికి వ్యతిరేక దిశలో కూర్చొని, ఓ ఎముకను కొరుకుతూ... ‘‘ఆహా! సింహం రుచే వేరు. ఇన్ని సింహాలను తిన్నా ఇంకా నా తనివి తీరలేదు. చివరిగా ఇంకో సింహం దొరికితే చాలు, నా ఆకలి తీరుతుంది’’ అంది.

ఆ మాటలను విన్న సింహం ‘‘ఇది సింహాలని తినేస్తుందా! దొరికితే నన్ను కూడా తినేస్తుందేమో’’ అనుకుంటూ, భయంతో వెనక్కి తిరిగి పారిపోయింది.

ఆ పక్కనే ఉన్న చెట్టు మీద ఉన్న కోతి ఇదంతా చూసింది. సింహం దగ్గరకు వెళ్ళి ‘‘ఆ కుక్క చాలా తెలివైనది. అది ఏ సింహాన్నీ తినలేదు. ఈ అడవికి మీరే రాజు. అది మిమ్మల్ని భయపెట్టింది’’ అని చెప్పింది.

కోతి మాటలు విన్న సింహం కోపంతో రగిలిపోయింది. కోతిని తన మీద కూర్చోబెట్టుకొని ఆ కుక్క వైపు పరుగులు తీసింది.ఇంకా ఆ ఎముకల కుప్ప దగ్గరే ఉన్న కుక్క పిల్ల... ఆ రెండూ తన వైపు శరవేగంతో వస్తూ ఉండడం చూసింది. ‘‘ఇప్పుడేం చెయ్యాలి? ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి’’ అనుకొని, ‘‘ఈ కోతి ఎక్కడికి పోయిందో! ఒక్క సింహాన్నైనా తీసుకురమ్మని చెప్పి అరగంట అవుతోంది. ఇంకా రాలేదేమిటి?’’ అని అరవడం మొదలుపెట్టింది.

ఆ మాటలు విన్న సింహం వెంటనే కోతిని కింద పడేసి... అక్కడి నుంచి పారిపోయింది. అలా తన తెలివితేటలతో... సింహం బారి నుంచి ఆ కుక్కపిల్ల చాకచక్యంగా తప్పించుకొని, అడవి నుంచి బయటపడింది.

అదే విధంగా మనం కూడా మన జీవితంలో ఏ ఇబ్బంది ఎదురైనా ఓటమిని అంగీకరించకుండా సంయమనం పాటించాలి. చాకచక్యంగా వ్యవహరించాలి అప్పుడే సఫలీకృతులం కాగలం. ఎప్పుడైతే మనం ఓటమిని అంగీకరిస్తామో... అప్పుడు విజయం సాధించడం అసాధ్యమనిపిస్తుంది. ఓటమిని ఒప్పుకోకుండా, ధైర్యంగా ముందుకు సాగితే... విజయం తప్పకుండా వరిస్తుంది.

- ప్రేమ్‌ రావత్‌, 9246275220

www.premrawat.com

Updated Date - 2023-01-19T22:58:10+05:30 IST