Nirmala Devi: నవ యోగానికి నాంది

ABN , First Publish Date - 2023-05-05T03:08:52+05:30 IST

ఆత్మ సాక్షాత్కార సాధనను సుగమం చేయాలనే ఆకాంక్ష శ్రీమాతాజీ నిర్మలాదేవిలో తలెత్తడానికి కారణం... ప్రపంచవ్యాప్తంగా ఆమె గమనించిన అస్తవ్యస్త పరిస్థితులే. తన చుట్టుపక్కల వ్యక్తులు వ్యక్తిగతంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న కష్టాలను ఆమె గమనించారు.

Nirmala Devi: నవ యోగానికి నాంది

మనిషి ఎటువంటి కష్టాలూ పడకుండా, ఎలాంటి త్యాగాలూ చేయనసవరం లేకుండా ఆత్మసాక్షాత్కారం పొందే ఒక మార్గాన్ని

కనుక్కోవాలని శ్రీమాతాజీ నిర్మలాదేవి పరితపించారు. అందుకోసం సాధన చేసి... సహస్రార చక్రాన్ని జాగృతం చేసుకున్నారు.

ప్రపంచ ఆధ్యాత్మిక పరిణామ చరిత్రలో ఒక అద్భుతంగా ఆమె అనుయాయులు అభివర్ణించే ఈ సంఘటన 1970 మే 5న జరిగింది.

ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా సహజయోగులందరూ ‘సహస్రార దినోత్సవం’ నిర్వహిస్తారు.

త్మ సాక్షాత్కార సాధనను సుగమం చేయాలనే ఆకాంక్ష శ్రీమాతాజీ నిర్మలాదేవిలో తలెత్తడానికి కారణం... ప్రపంచవ్యాప్తంగా ఆమె గమనించిన అస్తవ్యస్త పరిస్థితులే. తన చుట్టుపక్కల వ్యక్తులు వ్యక్తిగతంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న కష్టాలను ఆమె గమనించారు. అనైతికత, అవినీతి, అత్యాశ, లంచగొండితనం, స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం, దురలవాట్లు, దురాచారాలు... వీటన్నిటి విషవలయంలో చిక్కుకొని ప్రజలు దిక్కుతోచని స్థితితో ఉండడం ఆమెను కలచివేసింది. ఈర్ష్య, అసూయలతో పరస్పరం పగలను పెంచుకుంటూ... కుటుంబాల్లోనూ సమాజాల్లోనూ శాంతి, సామరస్యం లేకుండా చేసుకొని.. దీని నుంచి బయటపడే మార్గం తెలియని దుస్థితిలో ప్రపంచ ప్రజానీకం ఉండడం ఆమె గమనించారు. ఒకవైపు భార్యగా, తల్లిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే... సాటి మనుషుల బాధల పరిష్కారానికి ఏం చేయాలా? అని ఆలోచించారు. మనిషి ఎల్లప్పుడూ తన సుఖం కోసం, క్షణికమైన ఆనందం కోసం ఆరాటపడడం, బాహ్య ప్రపంచం వరకే తన దృష్టిని పరిమితం చేసుకోవడం, అనవసరమైన విషయాల మీద ధ్యాసపెట్టడం ఈ సమస్యలకు మూలాలని గుర్తించారు. మనిషి ధ్యాసను అంతర్ముఖంగా తీసుకువెళ్ళి, వారి చిత్తాన్ని వారి శరీరంలోనే ఉన్న... పరమాత్మ శక్తి అయిన... ఆత్మ మీదకు మళ్ళించగలిగితే ఆధ్యాత్మిక పరిపక్వత కలుగుతుందనీ, తద్వారా అతనిలో పరివర్తన వస్తుందనీ ఆమె గుర్తించారు.

T.gif

ఇది ఎలా సాధ్యమంటే... మన శరీరంలోనే భగవంతుడి శక్తి ఒకటి అంతర్గతంగా నిక్షిప్తమై ఉంటుంది. అదే కుండలినీ శక్తి. తల్లి గర్భంలో... సుమారు రెండు మూడు నెలల వయసున్న శిశువు తలలోని మాడు భాగంలో ఉండే బ్రహ్మరంధ్రంద్వారా పరమాత్ముడి శక్తి ప్రవేశిస్తుంది. వెన్నెముక భాగంలో మూడు నాడులుగా, ఏడు చక్రాలుగా ఏర్పడుతుంది. మిగిలిన శక్తి వెన్నెముక చివరిలో ఉండే త్రికోణాకారపు ఎముకలో (సాక్రమ్‌ బోన్‌) మూడున్నర సార్లు చుట్టుకొని ఉంటుంది. దాన్నే ‘కుండలినీ శక్తి’ అంటారు. ఆ శక్తి వారికి తొమ్మిది, పదేళ్ళ వయసు వచ్చేవరకూ.. వారి వెన్నెముక ద్వారా ఊర్థ్వముఖంగా ప్రయాణించి, బాహ్యమైన పరమాత్మ ప్రేమ శక్తితో అనుసంధానం అవుతూ ఉంటుంది. ఆ వయసులోని పిల్లలు భగవంతుడి రక్షణలోనే ఉంటారు. క్రమేపీ తిరిగి సాక్రమ్‌ బోన్‌లోకి వెళ్ళి, నిద్రాణ స్థితిలో ఉండిపోతుంది. అలా నిద్రాణ స్థితిలోకి వెళ్ళిన కుండలినీ శక్తిని జాగృతపరచి, అది శిరస్సుపైన ఉన్న సహస్రార చక్రాన్ని దాటి... పరమాత్మ ప్రేమశక్తి అయిన విశ్వవ్యాప్త పరమచైతన్య శక్తితో అనుసంధానమయ్యేలా చేస్తే... మనిషి మళ్ళీ తనలో దైవత్వాన్ని నింపుకోగలుగుతాడు. అప్పుడు మానవుల్లో ఈ శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలకు తావే ఉండదు. వారిలో వివేకం, మంచి చెడుల విచక్షణ జ్ఞానం స్థిరపడుతుంది. ఆలోచనల్లో, జీవన విధానంలో, ప్రవర్తనలో, అవగాహనలో సమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా మనం కోరుకొనే విశ్వమానవ సౌభ్రాతృత్వం, వసుధైక కుటుంబం సాధ్యమవుతుందని శ్రీమాతాజీ గ్రహించారు.

పూర్వం కుండలినీ శక్తి జాగృతం చేసుకోవడం అంటే... సర్వస్వాన్నీ త్యాగం చేసి, అడవులకో, హిమాలయాలకో వెళ్ళి, వందల ఏళ్ళు కఠోర తపస్సు చేస్తే కాని దొరకని భాగ్యం. ఆధునిక కాలంలో అది అసాధ్యం. అయితే మనిషి ఏ త్యాగం చెయ్యనవసరం లేకుండా, దేన్నీ పరిత్యజించనవసరం లేకుండా, రోజువారీ జీవితానికి ఏ ఆటంకం లేకుండా... ఆత్మ సాక్షాత్కారం పొందే మార్గం కనుక్కోవాలని శ్రీమాతాజీ నిర్మలాదేవి నిర్ణయించుకున్నారు. అది కూడా 1970 మే ఆరో తేదీ లోపే జరగాలని కోరుకున్నారు. గుజరాత్‌ రాష్ట్రంలోని నర్గోల్‌ సముద్ర తీరాన... ఒక సరుగుడు చెట్టు కింద ఒక రాత్రంతా సుదీర్ఘమైన ధ్యానంలో నిమగ్నమయ్యారు. మే అయిదో తేదీ తెల్లవారుజామున... ఆమె సహస్రార చక్రం ఒక్కసారిగా తెరుచుకుంది. భూగర్భ జలం ఉవ్వెత్తున ఆకాశం వైపు ఎగసినట్టు... తనలోని కుండలినీ శక్తి ఉత్థానం జరిగిందనీ, శరీరంలోని చక్రాల్లోంచీ ఒక కాంతి పుంజం బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని... ఆకాశంలోకి ప్రయాణించి, ఏడు రంగుల హరివిల్లులా విచ్చుకుందనీ ఆ అనుభవాన్ని మాతాజీ వర్ణించారు. రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపినప్పుడు... అది అత్యంత వేగంగా నిప్పులు కక్కుతూ... ఒక్కొక్క దశనూ దాటుతూ, రంగురంగుల కాంతులు విరజిమ్ముతూ... ఆకాశంలోకి ఎలా దూసుకువెళ్తుందో... అలాంటి అనుభూతి కలిగిందని ఆమె వివరించారు. ఇది ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే, అద్వితీయమైన, అపూర్వమైన ఘట్టమనీ, మానవ మాత్రులకు అసాధ్యం అనుకున్నది సుసాధ్యం అయిందనీ చెప్పారు. దీన్నే ‘సహజయోగ మార్గం’గా ఆమె బోధించారు.

ఈ విధంగా... ముంబయికి సమీపంలో, గుజరాత్‌ రాష్ట్ర పరిధిలో ఉన్న సముద్ర తీరాన... శ్రీమాతాజీ నిర్మలాదేవి సహస్రార చక్రం తెరుచుకున్న ఆ ప్రదేశాన్ని పుణ్యస్థలిగా ప్రపంచంలోని సహజయోగ సాధకులందరూ పరిగణిస్తారు. దాన్ని ‘సహస్రారధామ్‌’గా వ్యవహరిస్తారు. ప్రతి సంవత్సరం మే అయిదో తేదీని ‘సహస్రార దినోత్సవం’గా... ‘నవ యోగానికి నాంది పలికిన రోజు’గా జరుపుకొంటారు. ‘సహ’ అంటే మనతో పాటు, ‘జ’ అంటే జన్మించిన (కుండలినీ), ‘యోగా’ అంటే కలయికగా శ్రీమాతాజీ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా పర్యటించి... కులం, మతం, జాతి, ప్రాంతాలకు అతీతంగా... సుమారు 120 దేశాల్లో లక్షలాది మందికి సహజయోగాన్ని అందించారు. సహజయోగ సాధన ద్వారా ఎంతోమంది వారి శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యల నుంచి సునాయాసంగా స్వాంతన పొందడానికి దోహదపడ్డారు.

డాక్టర్‌ పి. రాకేష్‌, 8988982200

కన్వీనర్‌, ‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజయోగ ట్రస్ట్‌’, తెలంగాణ.

Updated Date - 2023-05-05T03:08:52+05:30 IST