Saraswati: పలుకు తేనెల తల్లి

ABN , First Publish Date - 2023-01-19T23:04:55+05:30 IST

మాఘ శుద్ధ పంచమి చదువుల తల్లి సరస్వతీదేవి జన్మదినం. దీన్ని ‘వసంతపంచమి’, ‘శ్రీ పంచమి’ అని కూడా పిలుస్తారు. ‘సరస్వతి సకల విద్యా స్వరూపిణి.

Saraswati: పలుకు తేనెల తల్లి

పర్వదినం

మాఘ శుద్ధ పంచమి చదువుల తల్లి సరస్వతీదేవి జన్మదినం. దీన్ని ‘వసంతపంచమి’, ‘శ్రీ పంచమి’ అని కూడా పిలుస్తారు. ‘సరస్వతి సకల విద్యా స్వరూపిణి. సమస్త వాఙ్మయానికి, సమస్త సంపదలకు, శక్తి యుక్తులకు మూలం. భాష, లిపి, కళలకు అధిష్టాత్రి. వేదాలకు జనయిత్రి. వీణా పుస్తకధారిణి. పలుకు తేనెల తల్లి. ‘‘సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్య రూపిణీ’’ అని లలితా సహస్రనామ స్తోత్రం వర్ణించింది. ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానానికి ప్రతీక సరస్వతి. జలం జీవశక్తికి సంకేతం. ప్రకృతిలో ఉత్పాదక, సాఫల్య శక్తులను ప్రసాదించే దైవం సరస్వతి. ‘సరః’ అంటే తేజస్సు. అదే జ్ఞాన శక్తి. మానవులు ఆ జ్ఞానతేజస్సుతో, కాంతి యశస్సుతో తమ జీవితాలను సర్వశక్తిమయం చేసుకోవడం సరస్వతీ అనుగ్రహంతోనే సంభవిస్తుంది. వసంత పంచమి రోజున సరస్వతీ పూజ నిర్వహించడం, పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయడం సంప్రదాయం.

సరస్వతిని వాగ్దేవిగా పూజిస్తారు. వాక్కు, ధారణ, ప్రజ్ఞ, మేధ, స్ఫురణ, బుద్ధి లాంటి లక్షణాలు సరస్వతీ శక్తులని చండీ సప్తశతి చెబుతోంది. ‘కరణం కరవాణి శర్మదంతే / చరణం వాణి చరాచరోపజీవ్యన్‌’ అన్నాడు మల్లినాథసూరి. ‘‘జగత్తంతా సరస్వతీ మాతను ఆశ్రయించే జీవిస్తోంది. ఆ తల్లి పాదాలను నమ్ముకొనే జీవిస్తున్నాను’’ అని అర్థం.

సరస్వతీదేవి రూప గుణాలను అనేక రీతులుగా ఋషులు దర్శించారు. ఆమె హృదయస్థానంలో వేదాలు, బుద్ధి స్థానంలో ధర్మ శాస్త్రాలు, శ్వాసలో పురాణాలు, తిలకంలో కావ్యాలు, జిహ్వలో వాఙ్మయం, నేత్రాల స్థానంలో ఆధ్యాత్మిక, లౌకిక విద్యలు, ఉదరంలో సంగీత, నాట్యకళలు వికసిస్తూ ఉంటాయని ప్రస్తుతించారు. మన కంటికి కనిపించే సుందరమైన జగత్తు అంతా సరస్వతీ స్వరూపమేమని బ్రహ్మవైవర్త పురాణం పేర్కొంది. వసంత పంచమినాడే త్రిమూర్తులు జ్ఞాన సంబంధమైన దివ్యత్వాన్ని సరస్వతికి ఆపాదించారని పద్మపురాణం తెలియజేస్తోంది.

సరస్వతీ రూపం ఆధ్యాత్మికతకు, తాత్త్వికతకు ప్రతిరూపం. ఆమె హంసవాహిని. పాలను, నీళ్ళను వేరు చేసి... కేవలం పాలను మాత్రమే స్వీకరించే నైజం హంసది. అదే విధంగా మంచి చెడులను, యుక్తాయుక్తాలను, ధర్మాధర్మాలను వేరు చేసి... సముచిత విషయాలను మాత్రమే గ్రహించి ఆచరణలో పెట్టాలన్న తత్త్వానికి అది ప్రతీక. సరస్వతి చేతిలోని పుస్తకం సకల విద్యలకు, కళలకు ప్రతీక. జపమాల పవిత్రతకు చిహ్నం. ఒక చేతి మీద చిలుక మధురమైన పలుకులకు, మరో చేతిలోని పద్మం సంపదలకు సంకేతాలు. అందుకే ‘అక్షరధామ శుక వారిజ పుస్తక రమ్యపాణి’ అంటూ సరస్వతీమాతను స్తోత్రం చేస్తాం.

సరస్వతిని వీణాపాణిగా వ్యవహరిస్తాం. ఆమె రెండు చేతులతో వీణ పట్టుకొని దర్శనమిస్తుంది. ఆ వీణకు ముప్ఫై రెండు మెట్లు ఉంటాయి. దాని పేరు కచ్ఛపి. యోగశాస్త్ర ప్రకారం... మనిషి వెన్నెముకకు ముప్ఫై రెండు పూసలు ఉంటాయి. వీణా దండాన్ని సుషుమ్నానాడితో పోలుస్తారు. మూలాధారం నుంచి సహస్రారం వరకూ సంచరించే ఈ నాడే మన ప్రాణం. తల్లి చేతిలోని వీణరాగాల వలే మన జీవనశైలి ఉంటుంది. వీణ పలకడం మానేస్తే సృష్టి స్తంభిస్తుంది. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలి.

సరస్వతి ఆదిపరాశక్తి అంశారూపం. మూలా నక్షత్రం ఆమె జన్మ నక్షత్రం. అందుకే శారదా నవరాత్రులలో ఆ నక్షత్రం నాడు సరస్వతికి ప్రత్యేకంగా పూజ చేస్తారు. ఒకప్పుడు సృష్టి చేయడంలో బ్రహ్మ అశక్తుడై ఆదిశక్తిని ప్రార్థించగా, సరస్వతిని తన అంశగా సృష్టించి అందించిందనీ, అప్పటి నుంచి సృష్టి నిర్విఘ్నంగా కొనసాగుతోందనీ పురాణ కథనం. ఆ శక్తిని బ్రహ్మకు అందిస్తున్నది సరస్వతి. బ్రహ్మ నాలుగు ముఖాలు నాలుగు వేదాలను వల్లిస్తూ ఉంటాయనీ, సరస్వతి చతుర్భుజాలలో ఉన్న పుస్తకం, జపమాల, పద్మం, శుకం (చిలుక)... నాలుగు పురుషార్థాలకు సంకేతమనీ పండితులు చెబుతారు.

-ఆయపిళ్ళ రాజపాప

Updated Date - 2023-01-19T23:10:15+05:30 IST