Purandardasu: దాసోత్తముడు..

ABN , First Publish Date - 2023-01-19T23:08:19+05:30 IST

ఎన్నో ఉత్కృష్టమైన కీర్తనలను, పద్యాలను రచించి... ‘‘దాసులందరిలో పురందరదాసులు ఉత్తములు’’ అని యతివరేణ్యులైన వ్యాసరాయలు (మంత్రాలయప్రభువు శ్రీ రాఘవేంద్రస్వామి పూర్వావతారం) నుంచి ప్రశంసలు ....

Purandardasu: దాసోత్తముడు..

విశేషం

ఎన్నో ఉత్కృష్టమైన కీర్తనలను, పద్యాలను రచించి... ‘‘దాసులందరిలో పురందరదాసులు ఉత్తములు’’ అని యతివరేణ్యులైన వ్యాసరాయలు (మంత్రాలయప్రభువు శ్రీ రాఘవేంద్రస్వామి పూర్వావతారం) నుంచి ప్రశంసలు అందుకున్న భాగవతోత్తముడు పురందరదాసు. పుష్య అమావాస్య (ఈ నెల 21న) పురందరదాసు పుణ్యతిథి. ఆ రోజున ఆయన ఆరాధన మహోత్సవాలు నిర్వహిస్తారు.

గురువు ద్వారా భగవత్‌ తత్త్వాన్ని తెలుసుకున్న పురందరదాసు ఏదో ఒక మూల కూర్చొని తన సాధన సాగించి ఉండవచ్చు. కానీ అలా చేయలేదు. తంబుర పట్టి, ఇంటింటికీ వెళ్ళి, సామాన్య జనులను జ్ఞాన మార్గం వైపు నడిపించే ప్రయత్నం చేశాడు.

అది పండరీపురంలోని పాండురంగని ఆలయం. స్వామివారి చేతికి ఉండవలసిన బంగారు కడియం కనిపించడం లేదని అందరూ ఆందోళన చెందుతున్నారు. ఆలయ సిబ్బందినీ, భక్తులనూ, అనుమానంగా అనిపించినవారినీ రాజభటులు విచారిస్తున్నారు. ఇంతలో వారి దృష్టి రోజూ స్వామి కొలువుకు వచ్చే ఒక ప్రముఖ వేశ్యపై పడింది. పోయిందనుకున్న స్వామివారి ఆభరణం ఆమె చేతికి ఉండడమే అందుకు కారణం. ఆ కడియాన్ని అర్చకులు గుర్తు పట్టగానే... భటులు ఆమెను పక్కకు తీసుకువెళ్ళి... విచారణ జరిపారు. అంతకుముందు రాత్రి పురందరదాసు వచ్చి ఇచ్చినట్టు ఆమె చెప్పగానే... అక్కడ ఉన్న భక్తులందరూ ఆశ్చర్యపోయారు. ‘‘నిత్యం స్వామి వారి ముందు నిలిచి, తంబురా మీటుతూ, అత్యంత భక్తితో మైమరచిపోతూ పాటలు పాడే పురందరదాసు... వేశ్య దగ్గరకు వెళ్ళడం ఏమిటి? విడ్డూరంగా ఉంది’’ అని కొందరు గుసగుసలాడారు. ‘‘ఇలాంటి దొంగ భక్తులను కఠినంగా శిక్షించాల’’ని అతనంటే గిట్టనివారు గొడవ చేశారు. చేసేదిలేక... పురందరదాసును అధికారులు ఆలయానికి రప్పించారు. ఆ ఆలయంలో రోజూ ఆయన ఏ స్తంభం దగ్గర కూర్చొని కైంకర్యం చేసేవాడో... అదే స్తంభానికి కట్టేసి, కొరడాలతో బాదారు.

ఇంతలో గర్భగుడి నుంచి ‘‘పురందరదాసు నిర్దోషి. అతణ్ణి విడిచిపెట్టండి’’ అంటూ దైవవాణి వినిపించింది. ఇంతకూ జరిగింది ఏమిటంటే...

ఆ విఠలుడే ముందురోజు రాత్రి పురందరదాసు రూపంలో ఆ వేశ్య దగ్గరకు వెళ్ళి, తన చేతికి ఉన్న కడియం ఇచ్చి, మరునాడు రెండో కడియాన్ని తెస్తానని చెప్పి వచ్చేశాడు. తన భక్తుడైన పురందరదాసుపై నింద వచ్చేలా చేసి, అతని భక్తిని జగత్తుకు తెలియజేశాడు. అంత బాధలోనూ పురందరదాసు పరవశించిపోయాడు. ‘‘గతంలో నేను అప్పణ్ణ అనే శిష్యుణ్ణి మంచి నీరు తెమ్మని కోరాను. అతనికి బదులు... అతని రూపంలో... ఆలస్యంగా నువ్వు నీరు తెచ్చావు. అది నాకు తెలియక, అప్పణ్ణే అనుకొని, చెంబుతో నీ తల మీద మొట్టాను. ఆ మరుసటి రోజు గుడిలో విఠలుని నుదుట బొప్పి కట్టి కనిపించింది, కంట్లోంచి నీరు కారుతోంది. జరిగినది గ్రహించిన నేను గర్భగుడిలోకి వచ్చి, నిన్ను బుజ్జగించి, నన్ను క్షమించమని ప్రార్థించాను. బుడిపె మానిపోయింది, కన్నీరు ఆగిపోయింది. అప్పుడు జరిగిన దానికి బదులుగా... ఇప్పుడు దెబ్బకు దెబ్బ తీశావా స్వామీ!’’ అంటూ ఉద్వేగంగా... ‘‘ముయ్యక్కే ముయ్య తీరితు’’ అంటూ స్వామిని కీర్తన చేశాడు పురందరదాసు. పండరీపుర దేవాలయంలో ఈనాటికీ పురందర స్తంభాన్ని చూడవచ్చు.

ఒక కథ ప్రకారం... నారదుని భక్తి పారవశ్యతకు శ్రీకృష్ణుడు మెచ్చి వరం కోరుకోమంటే... ‘‘నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నీవు కనిపించాలి’’ అని నారదుడు అడిగాడు. అది కలియుగంలో తీరుస్తానని శ్రీకృష్ణుడు మాట ఇచ్చాడు. పురందరదాసు చరిత్ర ప్రకారం... అనుక్షణం నారాయణుణ్ణే స్మరించే పరమ జ్ఞాని, మహా భక్తుడు అయిన నారదుడే... శ్రీనివాస నాయకుడిగా కర్ణాటకలోని పురందరగడ అనే ఊరిలో జన్మించాడు. వజ్రాల వ్యాపారం చేసి, అత్యంత శ్రీమంతుడై, నవకోటి నారాయణుడని పిలుపులందుకున్న శ్రీనివాస నాయకుడు పరమ లోభి. చిలుము పట్టిన నాణేన్ని కాదు కదా... దానిపైన ఉన్న చిలుమునైనా దానం చేసేవాడు కాదు. డబ్బు దగ్గర అతి కఠినంగా వ్యవహరించే శ్రీనివాసనాయకుడికి మహావిష్ణువు కనువిప్పు కలిగించాడు. తనను పరీక్షించడానికి తన భార్య అయిన సరస్వతీ బాయి వద్దకు ఆ మహా విష్ణువే స్వయంగా బ్రాహ్మణ వేషధారిగా వచ్చాడని తెలుసుకొని... అతను పశ్చాత్తాపం చేందాడు. తన సమస్త సంపదనూ త్యజించాడు. హరినామ సంకీర్తన ద్వారా భక్తి ప్రచారంలో జీవనాన్ని గడుపుదామంటూ భార్యా పిల్లలను తీసుకొని, కట్టుబట్టలతో బయటికి నడిచాడు. చేత తంబురా పట్టి హరిదాసు అయ్యాడు. కర్ణాటక సంగీత పితామహుడిగా పేరుపొందాడు. భగవంతుని ఆదేశానుసారం (హంపీ) విజయనగరంలో ఉన్న శ్రీవ్యాసరాయ యతివర్యుల వద్దకు వచ్చి, ఆయనకు శిష్యుడై, పురందర విఠల అనే అంకిత నామాన్ని పొందాడు. భక్తిని, ధర్మాన్ని తన పాటలతో ప్రచారాన్ని చేసి పురందర దాసుడని ప్రసిద్ధి చెందాడు. అవతారపురుషులైన వ్యాసరాయలవారు కూడా తనలాంటివారికి ఎంతోమందికి గురువైన నారదులవారే ఇప్పుడు శ్రీనివాసనాయకుడిగా భగవత్సంకల్పం మేరకు వచ్చాడని గ్రహించి, తనకు కలిగిన భాగ్యానికి సంతోషించారు. దాస జీవితానికి కావలసిన భక్తి తత్త్వాలను బోధించారు.

గురువు ద్వారా భగవత్‌ తత్త్వాన్ని తెలుసుకున్న పురందరదాసు ఏదో ఒక మూల కూర్చొని తన సాధన సాగించి ఉండవచ్చు. కానీ అలా చేయలేదు. తంబుర పట్టి, ఇంటింటికీ వెళ్ళి, సామాన్య జనులను జ్ఞాన మార్గం వైపు నడిపించే ప్రయత్నం చేశాడు. భిక్షాటనతో జీవనం గడిపాడు. తన సాహిత్యానికి సమ్మోహనకరమైన సంగీతాన్ని జోడించాడు. కన్నడ సంగీత. సాహిత్యాలకు సమున్నత స్థానాన్ని కల్పించాడు.

‘దనియా నోడిదెను వెంకటనా’ అనే కీర్తనలో తిరుపతి వెంకప్ప ఉప్పుడు ఎర్ర బియ్యాన్ని తింటాడని, వడ్డీలలో తేడావస్తే సహించడని, దోసెలు, అన్నం అమ్ముకుంటాడని పరాచికాలు ఆడుతాడు పురందరదాసు. ఆయన లాలి పాటలు అత్యంత మనోహరంగా, సంగీతబద్ధంగా ఉంటాయి. అలాగే దాస సాహిత్యంలో చిన్నికృష్ణుని బాల్యం చిలిపి చేష్టలు ప్రత్యేక స్థానానం కలిగి ఉంటాయి. ‘అనంత అపరాధ ఎన్నలి’్ల, ‘సాకు సాకిన్న సంసారం సుఖవు’, ‘నా డొంక నాదరే’, ‘అపరాధి నా నల్ల’ తదితర గీతాల్లో భక్తుడి అపరాధ భావం, నిస్సహాయత, పశ్చాత్తాపం, శరణాగతి లాంటి భావాలను పురందర దాసు భగవంతుడి పాదాలను తాకే విధంగా వ్యక్త పరుస్తాడు. ‘మాడి మాడి ఎందు మూరు మారు హారతి’, ‘చర్మవు తోళిదరే’, ‘ఆచారవిల్లాదే నాలికే’ అనే గేయాల్లో అంతఃశుద్ధి ప్రాధాన్యతను చాటిచెప్పాడు. ప్రజా శ్రేయస్సును కోరి, ప్రజల కోసం సృజించిన కీర్తనలవి. నారదాంశసంభూతుడు కనుకనే పురందరదాసు కీర్తనలు, సాహిత్యం వేదోపనిషత్తుల సారాన్ని సులువైన కన్నడ పదజాలంలో సామాన్యులకు సైతం అర్థం అయ్యే రీతిలో సొగసుగా వివరిస్తాయి. మహాభక్తునిగా, సంకీర్తనాచార్యుడిగా పురందరదాసుది అచంచలమైన స్థానం.

-రవీంద్రనాథ్‌, 9440258841

Updated Date - 2023-01-19T23:08:20+05:30 IST