Shri Mataji Nirmala Devi: అవన్నీ మనలోనే ఉన్నాయి

ABN , First Publish Date - 2023-05-26T03:58:56+05:30 IST

ఒక సంస్థ సక్రమంగా పని చెయ్యడం కోసం ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, సెక్రటరీలు... ఇలా అనేక పదవులను క్రమబద్ధంగా ఏర్పరచి, తన కార్యకలాపాలను సజావుగా సాగిస్తుంది. అదే విధంగా ఈ సృష్టి పరిణామక్రమంలో మానవ సృష్టికి ముందుగానే అనేక శక్తులను సృష్టికర్త అయిన ఆదిశక్తి సృష్టించింది. అందులో భాగమే పంచ మహా భూతాలు. అవే భూమి, అగ్ని, వాయువు, జలం, ఆకాశం.

 Shri Mataji Nirmala Devi: అవన్నీ మనలోనే ఉన్నాయి

సహజయోగ

ఒక సంస్థ సక్రమంగా పని చెయ్యడం కోసం ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, సెక్రటరీలు... ఇలా అనేక పదవులను క్రమబద్ధంగా ఏర్పరచి, తన కార్యకలాపాలను సజావుగా సాగిస్తుంది. అదే విధంగా ఈ సృష్టి పరిణామక్రమంలో మానవ సృష్టికి ముందుగానే అనేక శక్తులను సృష్టికర్త అయిన ఆదిశక్తి సృష్టించింది. అందులో భాగమే పంచ మహా భూతాలు. అవే భూమి, అగ్ని, వాయువు, జలం, ఆకాశం.

ఈ పంచ మూలకాలతోనే మానవ శరీరంలో అంతర్గతంగా ఉన్న సూక్ష్మ శరీరంలోని ఆరు చక్రాలు రూపొందుతాయి. భూతత్వంతో మూలాధార చక్రం, అగ్నితత్వంతో స్వాధిష్టాన చక్రం, చలతత్వంతో నాభీ చక్రం, భవసాగరం, వాయుతత్వంతో అనాహాత చక్రం, ఆకాశతత్వంతో విశుద్ధి చక్రం, అగ్ని (కాంతి) తత్వంతో ఆజ్ఞాచక్రం తయారవుతాయి. ఈ చక్రాలే అధిష్టాన దేవతలు అధిష్టించే ఆసనాలుగా ఉపయోగపడతాయి.

మనలోని శక్తి కేంద్రాలను తయారు చేసే ఈ మూలకాలను సహజయోగ సాధన ద్వారా మనం సరిదిద్దుకోవచ్చు. అదుపులో పెట్టుకోవచ్చు. సమతుల్యంగా ఉంచుకోవచ్చు. వాటన్నిటినీ అనుసంధానం చేసుకోవచ్చు. సహజ యోగంలో ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు... కుంజలినీ జాగృతమై, పైకి వెళ్ళి, బ్రహ్మరంధ్రాన్ని ఛేదించి, సహస్రారాన్ని చేరుకున్నప్పుడు... మీరు ఆ పరమాత్మ శక్తితో అనుసంధానం అవుతారు. ఆ బ్రహ్మ చైతన్యం మీలో ప్రవహిస్తుంది. ఆత్మసాక్షాత్కారం పొందుతారు. భగవంతునితో మీకు సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు మీలో అంతర్గతంగా... సూక్ష్మ స్థాయిలో జరిగేది ఏమిటంటే, ఈ పంచభూతాలు ఏఏ మూలకాలతో నిర్మితమయ్యాయో అవన్నీ క్రమంగా వాటి సూక్ష్మతత్వాలలోకి కరిగిపోతాయి. ఇవన్నీ మీ పిలుపు కోసం ఎదురుచూస్తూ ఉంటాయి.

మీలోని సమస్యను తొలగించాలని అగ్నిని అడిగితే, వెంటనే అది తీసేస్తుంది. సముద్ర తత్వాన్ని అడిగితే... అది మీ సమస్యను తనలోకి తీసుకుంటుంది. భూమాతను ప్రార్థిస్తే... మీ సమస్యలన్నిటినీ తనలోకి గ్రహించుకుంటుంది. పంచభూతాలు మనలోనే ఉన్నాయి. అయితే క్రమం తప్పని ధ్యాన సాధన ద్వారా మాత్రమే వాటిని గుర్తించగలుగుతాం. వాటి సహాయాన్ని పొందగలుగుతాం. ఇలా మనలో సమస్య ఎక్కడుందో ఆ చక్రానికి సంబంధించిన మూలకం వాటిని తనలోకి తీసుకుంటుంది సమస్యను నివారిస్తుంది. అలాగే మొదట బయటకువచ్చేది కాంతి. కాంతి పర్యవసానం తేజస్సు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఆత్మసాక్షాత్కారం పొందగానే... అతనిలోంచి వెలువడే కాంతి అతని ముఖంలో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఆ ముఖంలోని తేజస్సు బయటవారిని ఆకర్షిస్తుంది. అతణ్ణి చూసినవారు ఈ మనిషిలో ఏదో ఒక విశేషం ఉందని అనుకుంటారు. కాంతి తరువాత వెలువడేది వాయువు.

4.gif

అంటే గాలి. స్థూలంగా అనంతమైన గాలి తాలూకు సూక్ష్మ స్వరూపమే చల్లని వాయు తరంగాలు. మీరు ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందేకొద్దీ ఈ సూక్ష్మ తరంగాలు అనుభవంలోకి వస్తాయి. ఆ తరువాతది నీరు. నీటి తాలూకు సూక్ష్మ తత్వం... గట్టిగా ఉండే శరీరాన్ని మృదువుగా చేస్తుంది. చర్మం మెత్తగా, సున్నితంగా అవుతుంది. మీరు మాట్లాడేటప్పుడు, ఎవరికైనా ఏదైనా విషయం వివరిస్తున్నప్పుడు నీటికి ఉన్న ధర్మంలా మీ ప్రసంగం చల్లగా, మృదువుగా, శుద్ధి చేస్తున్నట్టుగా జరిగిపోతుంది. అనంతరం వెలువడేది అగ్ని, వేడి. మీలో కూడా అగ్ని ఉంది. అది చాలా నిశ్శబ్దంగా ఉండే అగ్ని. అది ఎవరినీ దహించదు. కానీ మీలోని మాలిన్యాలనూ, చెడును దహిస్తుంది. అంతేకాదు, ఇతరులలో ఉన్న చెడును కూడా దహిస్తుంది. ఉదాహరణకు... కోపోద్రేకంతో మీ మీదకు ఎవరైనా వచ్చారనుకోండి, మీలో ఉన్న అగ్నితత్వం ద్వారా అతనిలోని కోపం చల్లబడిపోతుంది. అయితే మీరు తప్పులు చేస్తే మాత్రం మిమ్మల్ని అది వదిలిపెట్టదనేది గ్రహించాలి.

చివరిది భూతత్వం. ఇది చాలా ముఖ్యమైనది. అది తల్లిలాంటిది. భూతత్వం మిమ్మల్ని పోషిస్తుంది. మీరు ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది. అదే మనలో సూక్ష్మంగా స్థిరపడుతుంది. దీని ద్వారా ఆకర్షణశక్తి కలుగుతుంది. ఇది బాహ్యపరమైనది కాదు. కానీ ఆధ్యాత్మికంగా అందరినీ ఆకర్షిస్తారు. భూమికి ఆకర్షణ శక్తే లేకపోతే మనం ఇక్కడ నిలబడి ఉండేవాళ్ళం కాదు. భూతత్వం ద్వారా మిగిలిన మాతృత్వ గుణాలైన ఓర్పు, సహనం లాంటివి మనలో సూక్ష్మంగా స్థిరపడతాయి. భూమాతను మనం ఎంత అవమానపరచినా, ఎంత అమర్యాదగా ప్రవర్తించినా భరిస్తుంది, సహిస్తుంది. అందుకనే ఉదయం లేవగానే భూమి మీద కాళ్ళు ఆనించినప్పుడు ‘‘అమ్మా! పృధ్వీ మాతా! పవిత్రమైన నీపైన నా పాదాలు మోపినందుకు నన్ను మన్నించు’’ అని ప్రార్థన చెయ్యాలి. ఇంతటి మహత్తరమైన, సుందరమైన భూమి మీద జన్మించి కూడా మనం ఎన్నో సమస్యలకు గురవుతున్నాం. అంటే మనం భూమాతకు, ఆమె సృష్టించిన ప్రకృతికి, నీటికి ఇవ్వవలసిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వడం లేదని అర్థం. భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ కాలుష్యం లాంటివన్నీ భూమాత శక్తికి ఉన్న ప్రాధాన్యతను తెలుసుకోకపోవడం, భూమాతను దైవశక్తిగా గుర్తించకపోవడం వల్ల జరుగుతున్నాయని చెప్పవచ్చు.

(శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా)

5.gif

• డాక్టర్‌ పి. రాకేష్‌, 8988982200

‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవిసహజయోగ ట్రస్ట్‌’, తెలంగాణ

Updated Date - 2023-05-26T03:58:56+05:30 IST