అతిథి మర్యాద

ABN , First Publish Date - 2023-05-26T03:47:40+05:30 IST

మన దేశాన్ని పాలించిన మహమ్మద్‌ నజీరుద్దీన్‌ సద్గుణ సంపన్నుడిగా, నిరాడంబరుడిగా పేరు పొందాడు. ప్రభుత్వ ధనాగారం మీద సర్వాధికారం ఉన్నప్పటికీ... తన సొంత పోషణ కోసం చిల్లిగవ్వ కూడా తీసుకొనేవాడు కాదు. మరి విశాలమైన రాజ్యాన్ని పాలించే ఆయనకు తన అవసరాలు తీర్చుకోవడానికి ఆదాయం ఎలా?

అతిథి మర్యాద

న దేశాన్ని పాలించిన మహమ్మద్‌ నజీరుద్దీన్‌ సద్గుణ సంపన్నుడిగా, నిరాడంబరుడిగా పేరు పొందాడు. ప్రభుత్వ ధనాగారం మీద సర్వాధికారం ఉన్నప్పటికీ... తన సొంత పోషణ కోసం చిల్లిగవ్వ కూడా తీసుకొనేవాడు కాదు. మరి విశాలమైన రాజ్యాన్ని పాలించే ఆయనకు తన అవసరాలు తీర్చుకోవడానికి ఆదాయం ఎలా?

ఆ కాలంలో అచ్చు యంత్రాలు ఉండేవి కావు. అందమైన చేతిరాతతో పుస్తకాల ప్రతులు తయారు చేయడం ఆనాడు ఒక వృత్తి. దివ్య ఖుర్‌ఆన్‌, ఇంకా ఇతర గ్రంథాల ప్రతులను చేత్తో చక్కగా రాసేవారికి ఆదరణ ఉండేది. తన కుటుంబ పోషణ కోసం నజీరుద్దీన్‌ కూడా ఆ వృత్తిని ఎంచుకున్నాడు. వచ్చిన ఆదాయాన్ని సొంత ఖర్చులకు వాడుకొని, మిగిలిన మొత్తాన్ని దానధర్మాలు చేసేవాడు.

ఒకరోజు ఆయన్ను కలిసేందుకు ఒక ధనవంతుడు వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చిన పని పూర్తయిన తరువాత... తాను సువర్ణాక్షరాలతో రాసిన దివ్యగ్రంథం ప్రతిని నజీరుద్దీన్‌ అతనికి చూపించాడు. అది అందమైన అక్షరాలతో, పఠించడానికి ఎంతో అనుకూలంగా రాసి ఉంది. దాన్ని తిరగేసిన ధనవంతుడు ముగ్ధుడయ్యాడు. కానీ ఆ గ్రంథాన్ని అటూ ఇటూ తిప్పి తీవ్ర ఆలోచనలో పడ్డాడు. చివరకు ‘‘రాజా! ఇందులో కొన్ని తప్పులు ఉన్నాయి. సరిదిద్దుకోండి’’ అంటూ కొన్ని పదాలను చూపించాడు. వాస్తవానికి అవి తప్పులు కావనీ, ఒప్పులేననీ నజీరుద్దీన్‌కు బాగా తెలుసు. అయినా చిరునవ్వుతో అతనికి కృతజ్ఞతలు తెలిపాడు. అతను తప్పులుగా చూపించిన చోట గుర్తులు పెట్టుకున్నాడు. ‘‘వాటిని సరిదిద్దుకుంటాను’’ అని చెప్పాడు.

ఈ సంఘటన నిండు దర్బారులో జరిగింది. మహమ్మద్‌ నజీరుద్దీన్‌ రాత అంటే అందరికీ ఎనలేని ఇష్టం. ఎలాంటి దోషాలూ లేని రాత ప్రతుల తయారీకి ఆయన ఎంతో పేరు పొందాడు. అలాంటిది ఆ ధనవంతుడు తప్పులు ఎత్తి చూపడం, రాజు వినయంగా సమాధానం చెప్పడం చూసి వారందరూ ఆలోచనలో పడ్డారు. ఇంతలో ఆ ధనవంతుడు అక్కడి నుంచి నిష్క్రమించాడు. వెంటనే పుస్తకంలో పెట్టిన గుర్తులన్నీ రాజు చెరిపేశాడు.

సభలో ఉన్నవారు ఇంకా ఆశ్చర్యపోయారు. ‘‘ఇదంతా మాకు అర్థం కావడం లేదు. అతను తప్పులని చెప్పినప్పుడు... గుర్తులు ఎందుకు పెట్టారు? ఇప్పుడు వాటిని ఎందుకు చెరిపేశారు?’’ అని అడిగారు.

‘‘అతిథి సత్కారం చెయ్యడం నా కర్తవ్యం. వచ్చిన వ్యక్తి నాకు ముఖ్యమైన అతిథి. అతను సూచించిన పదాలలో కానీ, రాతలో కానీ ఎలాంటి తప్పులూ లేవు. అయితే తప్పులు లేవని వాదించి... అతిథికి అవమానం చెయ్యడం నాకు ఇష్టం లేదు. అతని మనసుకు కష్టం కలిగించకుండా... అతను తప్పులని చూపించిన వాటిని గుర్తు పెట్టుకున్నాను. అతను వెళ్ళిన వెంటనే తుడిచేశాను. అంతే!’’ అన్నాడు రాజు.

రాజు అధికారంతో పోలిస్తే ఆ ధనవంతుడు సామాన్యుడు. అతను అనుచితంగా ప్రవర్తించినా... అతిథి మనసును నొప్పించకుండా, చక్కగా వీడ్కోలు ఇచ్చి పంపిన రాజు వైఖరిని సభలో ఉన్నవారందరూ కొనియాడారు.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2023-05-26T03:48:09+05:30 IST