Kolanupaka Jain Temple: వెయ్యేళ్ల వెయ్యి లింగాల గుడి

ABN , First Publish Date - 2023-09-07T23:46:16+05:30 IST

‘కొలనుపాక’ అనగానే మనకు పురాతనమైన జైన దేవాలయం గుర్తుకు వస్తుంది. దానికి సమీపంలోనే దేశంలోనే అతి పురాతనమైన శివాలయాల్లో ఒకటైన శ్రీ సోమేశ్వరస్వామి దేవాలయం కూడా ఉంది. సుమారు వెయ్యేళ్ల క్రితం కళ్యాణీ చాళుక్యుల కాలంలో కట్టించిన ఈ దేవాలయానికి ఏటా లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు.

Kolanupaka Jain Temple: వెయ్యేళ్ల  వెయ్యి లింగాల గుడి

ఆలయ దర్శనం

‘కొలనుపాక’ అనగానే మనకు పురాతనమైన జైన దేవాలయం గుర్తుకు వస్తుంది. దానికి సమీపంలోనే దేశంలోనే అతి పురాతనమైన శివాలయాల్లో ఒకటైన శ్రీ సోమేశ్వరస్వామి దేవాలయం కూడా ఉంది. సుమారు వెయ్యేళ్ల క్రితం కళ్యాణీ చాళుక్యుల కాలంలో కట్టించిన ఈ దేవాలయానికి ఏటా లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు.

Someswara-Temple.jpg

కాకతీయులు.. అంతకు ముందు కళ్యాణీ చాళుక్యుల పరిపాలనలో తెలంగాణ ప్రాంతంలో అనేక దేవాలయాలు వెలిసాయి. వీటిలో కొలనుపాకలోని శ్రీ సోమేశ్వరస్వామి దేవాలయం ఒకటి. సాధారణంగా కొలనుపాక అనగానే అత్యంత పురాతనమైన జైనదేవాలయం అందరికి గుర్తుకు వస్తుంది. దానికి అతి సమీపంలో ఈ సోమేశ్వరస్వామి దేవాలయం కూడా ఉంది. తెలంగాణాలోని పలు గ్రామాల్లో అనేక దేవాలయాలు ఉన్నా- కొలనుపాకకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఒక్క గ్రామంలోనే 21 రకాల కులాలకు ప్రత్యేకమైన దేవాలయాలు ఉన్నాయి. వీటిని స్థానికులు ‘మఠాలు’గా పిలుస్తారు. వీటిలో సోమేశ్వరస్వామి దేవాలయానికి కొన్ని విశిష్టతలు ఉన్నాయి. వీటిలో మొదటిది వెయ్యి లింగాలు. ఒక శివలింగంపై వెయ్యి శివలింగాలు ఉండటం అత్యంత అరుదైన విషయం. అందుకే దీనిని ‘వెయ్యి లింగాల గుడి’ అని కూడా పిలుస్తారు. ఈ వెయ్యిలింగాల స్వామిని కొలవటానికి కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వేలాది భక్తులు వస్తూ ఉంటారు.

Kolanupaka01-bigSize.jpg

శివాలయం పక్కనే అమ్మవారి ఆలయం ఉండటం మరో ప్రత్యేకత. ఈ దేవాలయంలో వెయ్యేళ్ల క్రితం నాటి కొన్ని అరుదైన శిల్పాలను చూడవచ్చు. నంది కూడా సజీవంగా ఉన్నట్లు కనబడుతుంది. ఈ శివాలయం ముందు ఉన్న మండపం పైభాగంలో పురాణ గాఽథలకు సంబంధించిన కొన్ని అరుదైన చిత్రాలు ఉన్నాయి. ఒకప్పుడు శిథిలావస్థలో ఉన్న దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమాన్ని యాదాద్రి టెంపుల్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (వైటీడీఏ) చేపట్టింది. ఈ పునరుద్ధరణ పనులు చురుకుగా సాగుతున్నాయనీ, ఒకప్పుడు ఈ దేవాలయానికి ఉన్న వైభవాన్ని మళ్లీ తిరిగి తేవటానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ శివాలయ పునరుద్ధరణ పనులు పూర్తయితే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కొలనుపాక సోమేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి వస్తారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదంటున్నారు స్థానికులు.

Updated Date - 2023-09-07T23:52:58+05:30 IST