Freedom: ఆ కానుక స్వీకరిద్దాం

ABN , First Publish Date - 2023-03-30T23:17:16+05:30 IST

స్వేచ్ఛ అనేది మనిషిలో ఉండే ఒక సహజమైన గుణం. కానీ అసలైన స్వేచ్ఛ ఎక్కడుందో తెలుసా? అది మన హృదయంలో దాగి ఉంటుంది. చాలామంది మనుషులు తాము స్వేచ్ఛా జీవులం అని భావిస్తూ ఉంటారు.

Freedom: ఆ కానుక స్వీకరిద్దాం

చింతన

స్వేచ్ఛ అనేది మనిషిలో ఉండే ఒక సహజమైన గుణం. కానీ అసలైన స్వేచ్ఛ ఎక్కడుందో తెలుసా? అది మన హృదయంలో దాగి ఉంటుంది. చాలామంది మనుషులు తాము స్వేచ్ఛా జీవులం అని భావిస్తూ ఉంటారు. అయితే మనిషి కామ, క్రోధ, మద, మోహాలనే బంధనాల్లో చిక్కుకొని ఉన్నాడు. అసలైన స్వేచ్ఛ హృదయంలో ఉంటుందనేది మరచిపోయాడు. ఆ సంగతి గుర్తించినప్పుడే అసలైన స్వేచ్ఛానుభూతిని పొందగలడు.

పారే నదిని చూడండి... అది స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. ఎటు వైపు ప్రవహించాలో ఎవరినీ అడగదు కదా! తనకు ఇష్టమైన, అనుకూలమైన దారిని స్వయంగా వెతుక్కుంటుంది. దారిలో ఒక పెద్ద కొండ అడ్డు వస్తుంది. ఆ ప్రవాహానికి కొండ దారి ఇవ్వదు. నది పక్కకు మళ్ళి, వెళ్ళిపోతుంది. దారి ఇవ్వకుండా తాను విజయం సాధించినట్టు కొండ భావించవచ్చు. నీటికి ఉన్న శక్తి సామర్థ్యాలు దానికి తెలియకపోవచ్చు. నీరు నిరంతరం అలా ప్రవహిస్తూ పోతూ ఉంటుంది. కొంతకాలానికి ఆ కొండని తొలిచివేస్తుంది. చాలాకాలం తరువాత అక్కడ కొండ పూర్తిగా కనుమరుగైపోవచ్చు. ఇలాంటి సంఘటనలకు ప్రకృతిలో మనకు సాక్షాలు కనిపిస్తాయి. నీరు ఎంతో వినయంగా తన కృషిని చేస్తూనే ఉంటుంది. ఆ నిరంతర ప్రవాహం వల్లా, నీటి కృషి ఫలితంగా కొండ కనుమరుగై పోతుంది. అంతటి దృఢమైన కొండ చరియలు కూడా నీటి ప్రవాహం ముందు తలవంచవలసి వస్తుంది.

మనిషి తన హృదయం వినయంతో, మానవతా విలువలతో నిండేలా సాధన చేస్తే... ఆ హృదయంలోనే అసలైన శాంతినీ, ఆనందాన్నీ అనుభూతి చెందగలడు. తన జీవితాన్ని సఫలం చేసుకోగలడు. ఎందుకంటే మనం జీవితంలో దేన్నైతే ఎక్కువ సాధన చేస్తామో, అందులోనే ప్రావీణ్యం సంపాదిస్తాం. కామ, క్రోధాలను సాధన చేస్తే అందులోనే ప్రవీణులవుతాం. అవి అలవడితే... ఆ తరువాత ‘ఆలోచించడం, అర్థం చేసుకోవడం’ అనేవి పూర్తిగా అంతరించిపోతాయి. అదే విధంగా మానవత్వంతో ఉండడాన్ని సాధన చేస్తే... అందులో ప్రవీణులవుతాం. ప్రేమ, సత్యం లాంటి విషయాల్లో సాధన చేస్తే... అందులో ప్రతిభావంతులం అవుతాం. ఈ విషయాల గురించి మీరు కాస్త ఆలోచించాలి. మనిషిగా ఉండడం అలవరచుకోవాలి. మానవతా విలువలను కాపాడాలి. మీకు ఈ జీవితం ఒక కానుకగా లభించింది. దాన్ని స్వీకరించండి, మీ జీవితాలను ధన్యం చేసుకోండి. మీ జీవన యాత్ర... మీ తొలి శ్వాసతోనే ప్రారంభమవుతుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఈ ప్రయాణం ఆగలేదు. జీవితాతం మీకు తోడుగా ఉంటుంది కాబట్టి... మీలోకి వస్తూ, పోతూ ఉన్న ఆ శ్వాసపై కాస్త దృష్టి సారించండి. అలా చేస్తే మీ జీవితంలో అసలైన శాంతి, సంతృప్తి, ఆనందాల అనుభూతి మీకు కలుగుతుంది. మీకు ఈ మానవ జన్మ లభించినందుకు... మీ జీవించి ఉన్నంతవరకూ మీ హృదయంలో కృతజ్ఞతాభావాన్ని నిరంతరం కలిగి ఉండండి.

Updated Date - 2023-03-30T23:17:16+05:30 IST