Buddha: చెడును తొలగించాలంటే...

ABN , First Publish Date - 2023-03-09T23:01:06+05:30 IST

మనిషికి కేంద్రం మనస్సు. మనస్సుకు కేంద్రం ఆలోచనలు. ఆ ఆలోచనలే మనస్సును కదిలిస్తాయి. ఆ కదలికలే మనిషిని నడిపిస్తాయి. కాబట్టి మంచి మనస్సుతో, మంచి ఆలోచనలతో చేసిన పనులు మంచిని కలిగిస్తాయి, మంచిని పెంపొదిస్తాయి. ఆ మంచి మాత్రమే మానవ సమాజాన్ని మంచిగా నడిపిస్తుంది.

Buddha: చెడును తొలగించాలంటే...

ధర్మపథం

మనిషికి కేంద్రం మనస్సు. మనస్సుకు కేంద్రం ఆలోచనలు. ఆ ఆలోచనలే మనస్సును కదిలిస్తాయి. ఆ కదలికలే మనిషిని నడిపిస్తాయి. కాబట్టి మంచి మనస్సుతో, మంచి ఆలోచనలతో చేసిన పనులు మంచిని కలిగిస్తాయి, మంచిని పెంపొదిస్తాయి. ఆ మంచి మాత్రమే మానవ సమాజాన్ని మంచిగా నడిపిస్తుంది. మనుషులు దుఃఖం అనే ఊబిలో దిగబడకుండా చేస్తుంది. సుఖంగా, ధైర్యంగా బతికిస్తుంది. కాబట్టి, మనిషి సుఖంగా, ధైర్యంగా బతకాలంటే మంచి పనులు (కుశల కర్మలు) చేయాలి. తృష్ణ, ద్వేషం, మోహం లేని కర్మలే కుశల కర్మలు. కానీ మనుషులు రాగ, మోహ, ద్వేషాలకు లోనై... ఎదుటి వారికి దుఃఖాన్ని కలిగిస్తారు. చివరకు తమకు తాముగా దుఃఖాన్ని కోరి తెచ్చుకుంటారు. కనుక, మనలో పుట్టిన, పుట్టి వేళ్ళూనుకుంటున్న ఆలోచనలను మనకు మనంగా గుర్తించాలి. ఎదుటివారు చెప్పకుండా.... మనకు మనంగా గుర్తించగలిగితే, వాటిని మనలోంచీ పెరికి పారెయ్యడానికి ప్రయత్నిస్తాం. ఈ విషయం గురించి బుద్ధుడు ఒకసారి ఇలా చెప్పాడు:

అది శ్రావస్తి నగరానికి దగ్గరలో ఉన్న జేతవనంలో.. అనాథపిండికుడి ఆరామంలో ఉన్నాడు బుద్ధుడు. ఆ ఆరామానికి సమీపంలో ఒక నూతన భవన నిర్మాణం జరుగుతోంది. వడ్రంగులు పెద్ద పెద్ద దూలాలను గోడల మీదకు ఎక్కిస్తున్నారు. దూలాల మధ్య తాత్కాలికమైన పెద్ద పెద్ద సీలలు బిగించారు. ఆ దూలాలను సరైన ప్రదేశంలోకి లాగి, ఒక దానిపై మరొకటి అమర్చారు. తరువాత వాటి మధ్య ఉన్న సీలల్ని... మరో సన్నని సీల సాయంతో పెకిలిస్తున్నారు.

ఇది గమనించిన బుద్ధుడు తన అనుయాయులతో ‘‘భిక్షువులారా! మనం ఏదైనా విషయం ఆలోచించడం వల్ల మనలోని తృష్ణ, ద్వేషం, మోహాలకు సంబంధించిన ఆలోచనలు పుట్టినప్పుడు... వాటిని వదిలించుకోవాలి. దాని కోసం మనలో పుట్టిన ఆ అకుశల విషయాలను గుర్తించాలి. వాటివల్ల కలిగే దుష్ఫలితాలను గ్రహించాలి. అప్పుడే వాటిని తొలగించుకోగలుగుతాం. అంటే... అంటే ఏవి అకుశలాలో గుర్తించడం ద్వారా. అదిగో, దూలంలో దిగిన పెద్ద సీలను వడ్రంగులు ఎలా పెరికివేస్తున్నారో చూడండి. మరో చిన్న సీల సహాయంతోనే కదా! సీలను సీలతోనే పెకిలించినట్టు... అకుశలాలను మనం పెకిలించాలి. అప్పుడే కుశలాల గురించి ఆలోచించి, కుశల కర్మలు చేస్తాం. కల్మషం లేని మన చిత్తంలోకి అంత త్వరగా చెడు తలపులు రావు, రాలేవు. వచ్చినా అవి మనకు చాలా అసహ్యం పుట్టిస్తాయి. మన మనస్సు వాటిని వెంటనే బయటకు నెట్టేస్తుంది’’ అని చెప్పాడు.

ఆ మాటలను భిక్షువులు శ్రద్ధగా విన్నారు. దూలాలను కోస్తున్న రంపాల ధ్వని లయబద్ధంగా వినిపిస్తోంది. సీలలను ఊడపెరుకుతున్న సుత్తి దెబ్బలు మధ్య మధ్యలో గట్టిగా వినబడుతున్నాయి. తమ మనస్సుల్లోంచీ అకుశలాలను ఎలా పెకిలించుకోవాలో వారు ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించిన కొద్దీ వారి మనస్సులు తేట పడుతున్నాయి, తేలిక అవుతున్నాయి. వారి ముఖాలను పరిశీలించిన బుద్ధునికి... వారి మనోక్షేత్రాలు నిర్మలమవుతూ కనిపించాయి.

బుద్ధుడి మధురస్వరం గంభీర స్వరం వినిపించి, భిక్షువులు అటువైపు చూశారు.

‘‘భిక్షువులారా! మన మనస్సు మంచి తలపులతో నిండిపోయాక... ఆపైన ఎలాంటి చెడ్డ తలపులకూ అంత తేలికగా అది తలుపులు తెరవదు. ఆ ఆలోచనలు, ఆ పనులు మనకు పరమ అసహ్యంగా తోస్తాయి. ఒక యువతి గానీ, యువకుడు గానీ మెడలో పూలమాలనో, బంగారు ఆభరణాలతో ధరించడానికి ఇష్టపడతారు. అంతేకానీ, వారి కంఠాభరణంగా కుళ్ళిపోయిన కుక్క పేగునో, ఎండిన పాము కళేబరాన్ననో ధరించడానికి ఇష్టపడతారా? పైగా వాటిని ఎవరైనా ధరిస్తే ఏవగించుకుంటారు. మన మనస్సు మంచిని ధరించాక... చెడ్డను ధరించడానికి అంగీకరించదు. చెడును ఏవగించుకుంటుంది. కాబట్టి... మనకూ, మనల్ని చూసేవారికీ ఏవగింపు లేని ఆలోచనలను మన మనస్సు ధరించాలి. అలాంటి కుశల కర్మలనే మన ఆభరణాలుగా అలంకరించుకోవాలి’’ అని చెప్పాడు.

ఆ మాటలను భిక్షువులు ఎంతో శ్రద్ధగా విన్నారు. దృష్ణ, ద్వేషం, మోహం, రాగం, ఈర్ష్య అనేవి కుళ్ళిన కుక్క పేగుల్లా, ఎండిన పాములా కనిపించాయి. వేటిని ధరించాలో, వేటిని ధరించకూడదో అర్థమయింది. అందుకే బుద్ధుడి ప్రబోధాలను ‘ధర్మం’ అంటారు. ‘ధర్మం’ అంటే ‘ధరించవలసినది’ అని అర్థం. మనిషికి, మనుస్సుకు సంతోషాన్ని ఇచ్చేదీ, గౌరవాన్ని తెచ్చేదే ధర్మం.

-బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2023-03-09T23:01:06+05:30 IST