Allaha: ముక్తి మార్గం...

ABN , First Publish Date - 2023-03-09T22:46:55+05:30 IST

‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంద’ని ఒక నానుడి. నోటిలోని నాలుకను మనిషి కొని తెచ్చుకోలేదు. దాన్ని దైవం ప్రసాదించింది. అయితే ఆ నాలుకను ఎవరు మంచి కోసం, సత్యం పలకడానికి వినియోగించారో, అధర్మం కోసం, అన్యాయం కోసం, అబద్ధాలు ఆడడానికీ, అసభ్యమైన సంభాషణలకూ వినియోగించారో అల్లాహ్‌ గమనిస్తూనే ఉంటాడు.

Allaha: ముక్తి మార్గం...

సందేశం

‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంద’ని ఒక నానుడి. నోటిలోని నాలుకను మనిషి కొని తెచ్చుకోలేదు. దాన్ని దైవం ప్రసాదించింది. అయితే ఆ నాలుకను ఎవరు మంచి కోసం, సత్యం పలకడానికి వినియోగించారో, అధర్మం కోసం, అన్యాయం కోసం, అబద్ధాలు ఆడడానికీ, అసభ్యమైన సంభాషణలకూ వినియోగించారో అల్లాహ్‌ గమనిస్తూనే ఉంటాడు. ప్రళయదినాన వారు ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నాలుకను సద్వినియోగపరిస్తే స్వర్గంలో ప్రవేశిస్తారు, దుర్వినియోగం చేసినవారు నరకానికి పోతారు.

‘‘ఓ విశ్వాసులారా! కచ్చితమైన, సమతుల్యమైన మాటనే పలకండి. అల్లాహ్‌ మీ ఆచరణలను సంస్కరిస్తాడు. మీ పాపాలను క్షమిస్తాడు. ఎవరైతే అల్లా్‌హకూ, ఆయన ప్రవక్తకూ విధేయులై మసలుకుంటారో వారు గొప్ప సాఫల్యాన్ని పొందుతారు’’ అని దివ్య ఖుర్‌ఆన్‌ చెబుతోంది. ‘‘మానవులారా! మంచికీ చెడుకూ మానవుని నాలుకే ఎక్కువ దోహదకారి అవుతుందంటే అతిశయోక్తి కాదు. అది మంచిదైతే లోకంలోకెల్లా మంచి వస్తువు. చెడ్డదైతే ప్రపంచంలోకెల్లా హీనమైన వస్తువు’’ అని పేర్కొంటోంది. ‘‘ఒక వ్యక్తి వాస్తవిక స్వభావాన్ని అతని సంభాషణ వ్యక్తపరచినంతగా మరేదీ ప్రతిబింబించలేదు. అందుకే ప్రతి మానవుడూ తన నాలుక వెనుక దాగి ఉన్నాడు’’ అని అల్లాహ్‌ అనుయాయుడైన హజ్‌రత్‌ అలీ చెప్పారు. అలాగే, ‘‘ముక్తిని పొందడానికి మార్గం ఏమిటి?’’ అని దైవప్రవక్త మహమ్మద్‌ను అఖ్‌బర్‌ బిన్‌ అమీర్‌ ప్రశ్నించినప్పుడు... ‘‘మీ నాలుకను అదుపులో ఉంచుకోవడమే. నాలుకను జాగ్రత్తగా వినియోగించుకుంటే మీరు ముక్తి పొందగలరు’’ అని ఆయన బదులిచ్చారు.

అబద్ధం, పరోక్ష నింద, చాడీలు చెప్పడం, తిట్లు శాపనార్థాలు, హేళన చేయడం, కించపరచడం, ఇతరుల మీద అపనింద మోపడం, చెడ్డ పేర్లతో ఇతరులను పిలవడం, అవిశ్వాసానికి చెందిన మాటలు ఉచ్చరించడం... ఇలా నాలుక ద్వారా ఎన్నో పాపాలు జరుగుతాయి. అటువంటి పాపాల నుంచి రక్షణ పొందాలంటే... ఎల్లప్పుడూ దైవ స్మరణ చేస్తూ ఉండాలి.

-మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2023-03-09T22:46:55+05:30 IST