సమంతతో నాది వన్‌ సైడ్‌ లవ్‌ స్టోరీ

ABN , First Publish Date - 2023-10-08T03:48:38+05:30 IST

రిజల్ట్‌ చాలా సంతోషాన్ని కలిగించిన మాట వాస్తవం. మేం మంచి సినిమా తీశామని నమ్మాం. ప్రేక్షకులు ఈ స్థాయిలో ఆదరిస్తారని అనుకొన్నాం.

సమంతతో నాది వన్‌ సైడ్‌ లవ్‌ స్టోరీ

సంగీత్‌ శోభన్‌.. చూడ్డానికి టీవీ టవర్‌లానో, కరెంటు స్తంభంలానో పొడుగ్గా ఉంటాడు కానీ... కామెడీ పండించడంలో దిట్ట.

ఇంట్లో సంతోష్‌ శోభన్‌ రూపంలో ఓ హీరో ఉన్నాడు. తండ్రి శోభన్‌ ‘వర్షం’ లాంటి సూపర్‌ హిట్‌ తీసిన దర్శకుడు. అందుకే...

సంగీత్‌కూ సినిమాలపై ప్రేమ పుట్టింది. చిన్నప్పటి నుంచీ సినిమానే ఆశగా, శ్వాసగా పెరిగిన సంగీత్‌... ఇష్టపడినట్టుగానే వెండితెరపై

మెరుస్తున్నాడు. ఈమఽధ్యే ‘మ్యాడ్‌’లో డీడీగా...

తన దూకుడు చూపించిన సంగీత్‌ శోభన్‌తో ‘నవ్య’ ముచ్చట్లు.

‘మ్యాడ్‌’తో కష్టానికి తగిన గుర్తింపు, ప్రతిఫలం లభించినట్టేనా..?

రిజల్ట్‌ చాలా సంతోషాన్ని కలిగించిన మాట వాస్తవం. మేం మంచి సినిమా తీశామని నమ్మాం. ప్రేక్షకులు ఈ స్థాయిలో ఆదరిస్తారని అనుకొన్నాం. కష్టానికి గుర్తింపు లభించింది. అయితే.. ఇది ప్రారంభం మాత్రమే. కష్టపడాల్సింది, సాధించాల్సింది చాలానే ఉంది.

షూటింగ్‌ జరుగుతున్నప్పుడు కాలేజీ రోజులు గుర్తొచ్చాయా?

ప్రతిరోజూనండీ. అందుకే సెట్లో మరింత ఉత్సాహం వచ్చేది. నేను మాస్‌ కమ్యునికేషన్‌లో డిగ్రీ చదివాను. ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ఎలా ఉంటుందో తెలీదు. అందుకే జర్నలిజం చదివి.. ఇప్పుడు మళ్లీ ఇంజనీరింగ్‌ చేసినట్టు

అనిపించింది.

మీ కాలేజీలో కూడా గ్రూపులు, గలాటాలూ ఉండేవా?

లేదండీ. చాలా కామ్‌గా ఉండేది. నేను చదివింది కర్ణాటకలో. చాలా ప్రశాంతంగా ఉండేది. ఢిల్లీ లాంటి చోట్ల కాస్త యూనియన్లు, పాలిటిక్స్‌ ఉంటాయేమో కానీ మా కాలేజీలో అలాంటి గోల లేదు.

రియల్‌ లైఫ్‌లో కూడా లాస్ట్‌ బెంచ్‌ స్టూడెంటేనా?

లాస్ట్‌లో కూర్చోకూడదు.. అలాగని ఫస్ట్‌ బెంచ్‌ కూడా కాదు. ఎక్కడ కూర్చోవాలి అనేదానికి నా దగ్గర ఓ థియరీ ఉండేది. రైట్‌ సైడ్‌ కార్నర్‌లో ఓ సీటు ఉండేది. అక్కడ కూర్చుంటే పడుకొన్నా ఎవరూ కనిపెట్టేవారు కాదు. అందుకే నా శాశ్వత సిట్టింగ్‌ ప్లేస్‌ అదే.

నాన్నలా మెగాఫోన్‌ పట్టాలని ఎందుకు అనిపించలేదు?

డైరెక్టర్‌ అవ్వాలంటే ఓ విజన్‌ ఉండాలి. నాకూ, మా అన్నకు అది లేదు. మాకు యాక్టింగ్‌ ఒక్కటే తెలుసు. అమ్మ మాత్రం నన్ను డైరెక్టర్‌గా చూడాలనుకొంది. చాలా పుష్‌ చేసింది కూడా. నా టాలెంట్‌ ఏంటో నాకు తెలుసు. అందుకే అటువైపు ఆలోచించలేదు. కాలేజీ రోజుల్లో కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌ కూడా తీశాను. అవి చూశాక నా డైరెక్షన్‌ స్కిల్స్‌ ఎంత దారుణంగా ఉన్నాయో నాకూ, మా స్నేహితులకూ అర్థమైంది. ‘నాకు డైరెక్షన్‌ చేతకాదు’ అని మరింత గట్టి నమ్మకం ఏర్పడింది.

మాస్‌ కమ్యూనికేషన్‌ కోర్సు ఎందుకు చేశారు? జర్నలిజంపై ఆసక్తి ఉండేదా?

నిజాయితీగా చెప్పాలంటే... తొందరగా అయిపోతుందని... అంతే. అంతకు మించి ఏంలేదు. పైగా మాస్‌ కమ్యూనికేషన్‌లో ‘సినిమా’ అనేది కూడా ఓ సబ్జెక్ట్‌. దానివల్ల సినిమాని ఇంకొంచెం బాగా అర్థం చేసుకోవచ్చు అనిపించింది. రేడియో, వీడియో ప్రొడక్షన్‌ గురించి నేర్చుకోగలిగాను. అవన్నీ నాకు బాగా ఉపయోగపడ్డాయి. పైగా.. మా ఇంట్లో డిగ్రీ ఎవరూ చేయలేదు. కనీసం నా చేతిలో అయినా డిగ్రీ సర్టిఫికెట్‌ ఉంటే బాగుంటుందని అనిపించింది.

‘నేను హీరో మెటీరియల్‌ని’ అని మీకు ఎప్పుడు అనిపించింది?

నాకు ఇప్పటికీ అనిపించడం లేదు. నన్ను చూసి, నా కోసం జనాలు థియేటర్లకు వస్తే అప్పుడు హీరో అనుకోవొచ్చు. సినిమా బాగుంటే వస్తారు. అప్పుడు నన్ను చూస్తారు. అంతే.

కాలేజీ రోజుల్లో ప్రేమ లేఖలు అందాయా?

ఇప్పుడు లవ్‌ లెటర్లు రాసేవాళ్లెవరు? అంతా ఇన్‌స్టాలోనే జరిగిపోతున్నాయి. కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయితో బాగా క్లోజ్‌గా ఉండేవాణ్ణి కానీ, లవ్‌ లెటర్స్‌ వరకూ వెళ్లలేదు.

హీరోయిన్లపై క్రష్‌ ఉందా?

సమంతగారంటే చాలా ఇష్టం. ఓ రకంగా వన్‌ సైడ్‌ లవ్‌ స్టోరీలా అన్నమాట. ఆమె మాటలు, చేసే ఛారిటీస్‌ అన్నీ గొప్పగా ఉంటాయి. కష్టాల్లో కూడా మనోనిబ్బరంగా నిలబడిన విధానం

అందరికీ స్ఫూర్తినిస్తుంది.అన్నతో కలిసి చేసిన ‘మ్యాడ్‌’ పనేంటి?

నాదీ అన్నయ్యదీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో వెంకీ- మహేష్‌ టైపు స్టోరీ. ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుంది కానీ, బయటకు చెప్పుకోం. సినిమల్లోకి రాకముందు వరకూ.. అలానే ఉండేవాళ్లం. ఇప్పుడు కాస్త క్లోజ్‌నెస్‌ పెరిగింది. చిన్నప్పుడు ఇద్దరం తెగ కొట్టుకొనేవాళ్లం. ఓసారి అయితే రక్తాలు వచ్చేట్టు కొట్టుకొన్నాం. అదే మేం చేసిన మ్యాడ్‌ పని.

మీ కామెడీ టైమింగ్‌ చాలా బాగుంటుంది. ఈ విషయంలో స్ఫూర్తి ఎవరు?

యాక్టర్‌గా స్థిరపడాలి అనుకొన్నప్పుడు నాకు గుర్తొచ్చింది బ్రహ్మానందం గారు. ఆయన కామెడీ టైమింగ్‌ చాలా ఇష్టం. ఆయనలా.. కమెడియన్‌ అవ్వాలనుకొన్నా. బహుశా.. కామెడీ విషయంలో ఆయన ప్రభావం నాపై ఎక్కువ ఉందేమో!

అన్వర్‌

‘‘నాకూ... మా అన్నకూ సినిమా తప్ప వేరే ఏం తెలీదు. మరో పనిచ్చినా చేయలేం. అందుకే పడినా, లేచినా, మునిగినా ‘సినిమా’లోనే అనుకొన్నాం. అన్న పడిన స్ట్రగుల్‌ ముందు నేను నథింగ్‌. అన్న వచ్చిన కొత్తల్లో ఓటీటీ లేదు. ఏం చేసినా, చేయాలనుకొన్నా సినిమాలతోనే చేయాలి. నా టైమ్‌ వచ్చేసరికి ఓటీటీ అనే ఓ గోల్డెన్‌ ఫ్లాట్‌ఫామ్‌ ఉంది. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్‌ సిరీ్‌సల వల్ల నేను ఇండస్ర్టీకి తెలిశాను. అదే నాకు సినిమాల్లో అవకాశాల్ని కల్పించింది. అన్నకు ఇప్పటి వరకూ సరైన సక్సెస్‌ రాలేదు. కానీ ఏదో ఓ రోజు తప్పకుండా తను నిరూపించుకొంటాడు. తన టాలెంట్‌ నాకు పూర్తిగా తెలుసు. నా కంటే పది రెట్లు గొప్పగా నటించగలడు’’.

‘‘మా అమ్మ చదువుకొంది ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ వరకే. కానీ తను చేసిన ఉద్యోగాలు చూస్తే మతి పోతుంది. పీహెచ్‌డీ పూర్తయినవాళ్లు కూడా అన్ని చేసుండరు. యోగా టీచర్‌గా చేశారు. ఓ పొలిటికల్‌ లీడర్‌ దగ్గర పీఏగా పని చేశారు. మహేష్‌ ‘బుర్రిపాలెం’ గ్రామాన్ని దత్తత తీసుకొన్నప్పుడు దానికి సంబంధించిన పనులు దగ్గరుండి చూసుకొన్నారు. ఇలా ఒకటా రెండా... చాలా చాలా చేశారు. ఓ మాటలో చెప్పాలంటే తను ఆల్‌ రౌండర్‌. తను అంత కష్టపడింది కాబట్టే నేనూ, అన్న ఇప్పుడు ఇలా ఉన్నాం. నాన్న సడన్‌గా చనిపోయినప్పుడు ఇంటి బాధ్యత అంతా తన నెత్తి మీద వేసుకొంది. ఏ కష్టాన్నీ మా వరకూ రానివ్వలేదు. ప్రతి విషయాన్నీ మాకు అర్థమయ్యేలా విడమర్చి చెబుతుండేది. పాకెట్‌ మనీ కోసం ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. అడక్కుండానే అన్నీ ఇచ్చింది. మా అమ్మని అలా చూసి.. ‘సినిమాల్ని వదిలేసి ఏదో ఓ క్యాబ్‌ డ్రైవర్‌గా సెటిల్‌ అవుతాం’ అని ఎన్నోసార్లు అనుకొన్నా. మా అమ్మ వల్లే.. ఆడవాళ్లందరిపై గౌరవం పెరిగింది.’’

Updated Date - 2023-10-08T03:48:38+05:30 IST