Tashi Chodup : వివక్షపైనే నా పోరాటం

ABN , First Publish Date - 2023-05-04T00:57:25+05:30 IST

సాధారణంగా ట్రాన్స్‌ మహిళలు అనగానే వాళ్ళ రూపం ఇలా ఉంటుందనే ఒక అభిప్రాయం ఉంటుంది. వాళ్ళ జీవనం గురించి రకరకాల అపోహలు..

Tashi Chodup : వివక్షపైనే నా పోరాటం

సాధారణంగా ట్రాన్స్‌ మహిళలు అనగానే వాళ్ళ రూపం ఇలా ఉంటుందనే ఒక అభిప్రాయం ఉంటుంది. వాళ్ళ జీవనం గురించి రకరకాల అపోహలు ఉంటాయి. అవేవీ సరికాదనడానికి ట్రాన్స్‌ మహిళగా తనదైన అస్తిత్వంతో ప్రయాణం మొదలుపెట్టి, పారమార్థిక జీవితాన్వేషణలో భాగంగా బౌద్ధ సన్యాసినిగా మారిన తాషి చోడుప్‌ ‘నవ్య’తో ముచ్చటించారు.

పెళ్లికి మించిన స్వేచ్ఛ

మేమంతా ఈ సమాజాన్ని అభ్యర్థిస్తున్నది ఒక్కటే... అది మమ్మల్ని మనుషులుగా గుర్తించాలని. ఈ మధ్యకాలంలో స్వలింగ వివాహాల మీద సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో... బయట బాగా చర్చ నడుస్తోంది. కొందరు వద్దని, ఇంకొందరు కావాలని... ఇలా భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి అనే బంధంలో ఆధిపత్యానికి ఆస్కారం ఉంటుంది. కనుక నేనైతే మాత్రం పెళ్లికన్నా... అంతకు మించిన స్వేచ్ఛను కల్పించమని కోరతాను.

‘‘నేనొక ట్రాన్స్‌ మహిళను. హిందూ మతంలో పుట్టినా, సాంత్వన కోసం రక రకాల మతాలను ఆశ్రయించాను. చాలామంది మత గురువులను కలిశాను. వివిధ మతాల గ్రంథాలు చదివాను. వాటిల్లో నాకు దొరకని సమాధానం బౌద్ధంలో లభించింది. హేతుబద్ధంగా ఆలోచించాలని బౌద్ధం బోధిస్తుంది. ప్రశ్నించడాన్ని స్వాగతిస్తుంది. కనుక నన్ను నేను ఉన్నతీకరించుకోవడానికి ఇదే సరైన మార్గమనుకున్నాను. టిబెటన్‌ బౌద్ధ మతాచారాలను అనుసరిస్తూ... ఆరేళ్ళ కిందట సన్యాసం స్వీకరించాను. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతటా వెతికినా– ట్రాన్స్‌ జెండర్‌ సమూహానికి చెందిన బౌద్ధ సన్యాసులు వేళ్ళమీద లెక్కపెట్టేంత మందే కనిపిస్తారు. అందుకు కారణం నాకూ తెలియదు. కాకపోతే, ఫ్రాన్స్‌, రష్యా దేశాల ట్రాన్స్‌ మహిళలు కొందరు నన్ను బుద్ధ గయలో కలిశారు. వాళ్ళల్లో ఒకరిద్దరు తర్వాత బౌద్ధం స్వీకరించారు. అయితే... బౌద్ధంలోనో, మరొక మతంలోనో సన్యసించగానే మనలోని లోపాలు మాయమై, పరమ పవిత్రులుగా మారిపోయినట్టు కాదు. అజ్ఞానం, ద్వేషం, దురాశ, దుర్బుద్ధి లాంటి దుర్గుణాలను వీడి, సర్వమానవ ప్రేమతత్వాన్ని ఇనుమడింపజేసుకోవడానికి ఇదొక సాధనా మార్గం. ఇంకా చెప్పాలంటే, ‘నేను’, ‘నాది’ నుంచి... ‘మనం’, ‘మనది’ అనే పారమార్థిక భావనలోకి ప్రయాణించడం. అంతేతప్ప దీన్ని వైరాగ్యంగానో లేదంటే సాంసారిక జీవితాన్ని త్యజించడంగానో చూస్తే పొరపాటు!

కొందరు విడ్డూరంగా చూశారు...

బౌద్ధం స్వీకరించాలనుకోగానే హిమాచల్‌ప్రదేశ్‌లోని పాలంపూర్‌ వెళ్లాను. అక్కడ టెంజిన్‌ పాల్మో అనే పెద్ద బౌద్ధ భిక్షుణిని కలిసి, నా పరిస్థితి వివరించాను. బౌద్ధ సంఘాల నియమావళిలో భిక్షువు (మగ), భిక్షుణి(ఆడ) అనే స్పష్టమైన విభజన ఉంటుంది. మరొక జెండర్‌కు అవకాశం ప్రశ్నార్థకమే! అయితే, స్త్రీ, పురుషులిద్దరికీ మొదటి (రబ్‌జంగ్‌), రెండవ (గెట్‌సుల్‌) దశల వరకు దాదాపుగా ఒక్కటే బౌద్ధ ధర్మాలు, నియమ, నిబంధనలు వర్తిస్తాయి. ఆ తర్వాత... గెలాంగ్‌ దశ నుంచి ఆచార, వ్యవహారాలన్నీ మారతాయి. కనుక ‘గెట్‌సుల్‌’ స్థాయి వరకు వెళ్ళడానికి ఎలాంటి అడ్డంకి లేదు. కనుక టెంజిన్‌ పాల్మో సూచన ప్రకారం లామా(బౌద్ధ మతగురువు) తాషీజాంగ్‌ చేతుల మీదుగా సన్యాసం స్వీకరించాను. ఆనాటి నుంచి నా ఆహార్యం, జీవనశైలి మార్చుకోవడమే కాదు... అనుక్షణం నన్ను నేను చేతనలో ఉంచుకుంటూ బోధిసత్త్వుడి బోధలకు అనుగుణంగా నడిచేందుకు ప్రయత్నిస్తున్నాను. ఆ తర్వాత మూడేళ్ళు సంఘంలో ఉంటూనే, బోధ్‌ గయలోని ‘రూట్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ విజ్డమ్‌ కల్చర్‌’లో బుద్ధిస్ట్‌ సైకాలజీ కోర్సు చదివాను. ఈ క్రమంలో ప్రతి సందర్భంలోనూ ట్రాన్స్‌ మహిళగానే నా అస్తిత్వాన్ని ప్రకటించాను. అప్పుడు కొందరు సన్యాసులు అర్థమైనట్టుగాను, ఇంకొందరు అర్థంకానట్టుగాను ప్రవర్తించారు. మరికొందరు నన్ను విడ్డూరంగానూ చూశారు. అలాంటి వాళ్ళనూ ప్రేమించడమే బౌద్ధ ధర్మం.

బౌద్ధ సంఘాల్లో సమానత్వం...

అన్ని మతాల్లోలాగే బౌద్ధంలోనూ పితృస్వామ్యం చాలా బలంగా పాతుకొని ఉంది. బౌద్ధ సంఘాల్లో భిక్షువుకు, భిక్షుణికి మధ్య చాలా వివక్షలు ఉంటాయి. ఇరువురికీ ఒకే రకమైన విద్యను బోధించరు. బౌద్ధ ధర్మశాస్త్రాల అభ్యాసంలోనూ భిక్షుణిలకు అనేక పరిమితులుంటాయి. ఓ భిక్షువు కన్నా ఒక నిమిషం ముందు సన్యసించిన మరొకరిని సీనియర్‌గా పరిగణించడం సంఘ నియమం. అలాంటిది ధ్యానం లాంటి ఇతర క్రతువులు, సమావేశాల్లో ఇరవై ఏళ్ళు సీనియర్‌ అయిన భిక్షుణి కంటే అప్పుడే సన్యసించిన భిక్షువుకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం గమనించాను. మరొకటి... లామా లాంటి పెద్ద హోదాల్లో భిక్షుణిలు మనకెక్కడా కనిపించరు. అయితే, ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితి మారుతోంది. కొందరు భిక్షుణిలు బౌద్ధ సంఘాల్లో సమానత్వం కోసం ప్రయత్నిస్తున్నారు. వివక్షను ప్రక్షాళన చేసేందుకు కృషి చేస్తున్నారు. ఆ క్రమంలో మిగిలిన వాళ్ళకూ అవగాహన కల్పిస్తున్నారు.

ఇంట్లోవాళ్ళు అడ్డుచెప్పలేదు

కరోనా కాలంలో పరిస్థితుల వల్ల బోధ్‌ గయ నుంచి ఇంటికి తిరిగి వచ్చాను. ఇప్పుడు హైదరాబాద్‌లోనే మా అమ్మ, నాన్నతో కలిసి ఉంటున్నాను. వాళ్ళు నన్ను, నా అస్తిత్వాన్ని అంగీకరిస్తున్నారా? అంటే, పూర్తిగా కాకపోయినా కడుపున పుట్టిన బిడ్డగా మాత్రం ఆదరిస్తున్నారు. పిల్లల భవిష్యత్తు మీద వాళ్ళకంటూ కొన్ని ఆశలుంటాయి. అవి నెరవేరనప్పుడు... బాధ ఉండటం సహజమే. ఇంటర్‌ తర్వాత మా నాన్న నన్ను మెడిసిన్‌ చదివించాలనుకున్నారు. లేదు, నేను పొలిటికల్‌ సైన్స్‌ చదువుతానని నిజాం కాలేజీలో చేరాను. అక్కడ నాకు ప్రొఫెసర్‌ కోదండరాంతో పరిచయం అయింది. ఆయన ప్రోత్సాహంతో మొట్టమొదటిసారి అన్ని రాజకీయ పార్టీల నాయకులను కాలేజీకి ఆహ్వానించి, విద్యార్థులతో చర్చాగోష్ఠి నిర్వహించాను. అదే సమయంలో ‘అన్వేషి మహిళా అధ్యయన కేంద్రం’ సునీత, సజయ కలిశారు. వాళ్ళ సహకారంతో... గ్రామాల్లోని రైతు ఆత్మహత్య కుటుంబాలను కలవడం, కేన్సర్‌ చివరి దశలో పోరాడుతున్న రోగులకు ఉపశమనం కలిగించడం (పాలియేటివ్‌ కేర్‌) లాంటి రకరకాల సేవా కార్యక్రమాల్లో వలంటీర్‌గా పాల్గొన్నాను. డిగ్రీ పూర్తవ్వగానే, ‘అన్వేషి’లో రెండేళ్ళు రీసెర్చ్‌ ఫెలోగానూ పనిచేశాను. అప్పుడే నా అస్తిత్వాన్ని ప్రకటించుకున్నాను. ట్రాన్స్‌ మహిళగా నాదైన జీవితంలోకి అడుగుపెట్టాను. మొదట ఇంట్లో వాళ్ళు అంగీకరించలేదు. దాంతో కొంతకాలం కుటుంబానికి దూరంగా బతికాను. తర్వాత అమ్మ, నాన్న నన్ను దగ్గరకు తీసుకున్నారు. అయినా, నేను స్థిమితపడలేదు. సత్యాన్వేషణ ప్రారంభించాను. బౌద్ధంతోనే నా జీవితానికి పారమార్థికత చేకూరుతుందని విశ్వసించాను. బౌద్ధ సన్యాసం తీసుకోవాలనుకుంటున్నానని ఇంట్లో చెబితే, ‘అవసరమా’ అన్నారు కానీ, అడ్డు చెప్పలేదు. ఒక్కగానొక్క బిడ్డను కదా.!

క్యూటీ సేవలు...

హైదరాబాద్‌ తిరిగి వచ్చాక... ‘అన్వేషి’ సునీత సూచనతో తిరిగి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాను. ఈ విషయంలో దలైలామా నాకు ఆదర్శం. సమాజం నుంచి తీవ్ర వివక్షలను అనుభవిస్తోన్న సమూహాలకు సహాయంగా నిలవాలని అనుకున్నాను. ట్రాన్స్‌ మహిళల కోసం తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన జీవన నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్లో రచన ముద్రబోయిన లాంటి వాళ్ళతో కలిసి పనిచేశాను. ఇప్పుడు హబ్సీగూడలో ‘క్వియర్‌–ట్రాన్స్‌ వెల్‌నెస్‌ సపోర్టు సెంటర్‌’ (క్యూటీ)ని ప్రారంభించాం. ఈ కేంద్రం ద్వారా ఎల్జీబీటీక్యూ వ్యక్తులకు ‘పాజ్‌ ఫర్‌ పెర్స్‌పెక్టివ్‌’ సహకారంతో మానసిక వైద్య సహాయం, కౌన్సెలింగ్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. ‘భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌’ ద్వారా బాధిత ట్రాన్స్‌ వ్యక్తులకు ఉచిత హెల్ప్‌లైన్‌నూ నిర్వహిస్తున్నాం. హైదరాబాద్‌ లీగల్‌ సెల్‌ అథారిటీ తోడ్పాటుతో ఉచిత న్యాయసహాయం అందిస్తున్నాం. అలాగే కుటుంబం, సమాజం నుంచి తిరస్కారానికి లోనవుతూ, నిత్యం మానసిక వేధనకు గురవుతున్న ట్రాన్స్‌ వ్యక్తులకు ఉపశమనం కలిగించేలా ఆహ్లాద స్థలం, మినీ గ్రంథాలయం అందుబాటులో ఉంచాం. మా ‘క్యూటీ’ సెంటర్‌కు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల నుంచి మంచి స్పందన వస్తోంది.’’

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లకు చెందిన ట్రాన్స్‌ జెండర్‌ వ్యక్తులకు ఉచిత హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1800 425 2908 ద్వారా న్యాయసహాయంతో పాటు కౌన్సెలింగ్‌ లాంటి సేవలను పూర్తి ఉచితంగా అందిస్తున్నాం.నేను బౌద్ధ సంఘానికి వెలుపల ఉన్నా, బౌద్ధ ధర్మానికి లోబడి జీవిస్తున్నాను. నిత్యం బుద్ధుని బోధనలు పఠించడం, ఒంటిపూట భోజనం లాంటి అన్ని ఆచార వ్యవహారాలనూ ఆచరిస్తూ, సంఘం కోసం నావంతు సేవ చేస్తున్నాను. కేవలం దొంక, షంథాప్‌, జెన్‌ వస్త్రాలను ధరించడమేకాదు, అంతఃశుద్ధితో బౌద్ధాన్ని ఆకళింపు చేసుకొని, దాన్ని ఆచరించేందుకు ప్రయత్నిస్తున్నాను.

• కె. వెంకటేశ్‌

Updated Date - 2023-05-04T00:58:59+05:30 IST