Share News

Comedian Brahmanandam, Interview : నా పుస్తకం ఆవకాయ లాంటిది

ABN , Publish Date - Dec 30 , 2023 | 03:49 AM

ఆ ‘నేను’ గురించి, దాని నేపథ్యం గురించి ‘నవ్య’తో బ్రహ్మానందం పంచుకున్న విశేషాలివి.

Comedian Brahmanandam, Interview : నా పుస్తకం ఆవకాయ లాంటిది

‘పత్రికా సమీక్షావీక్షణల వలన జగత్‌విఖ్యాతి గాంచిన పక్షివి కావు నీవు’ అని కోకిల గురించి ఒక కవి చెబుతాడు... నేనూ అంతే’ అంటారు ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం. ఆయన హాస్యంతో నవ్వించడమే కాదు, బరువైన పాత్రలతో కన్నీరు పెట్టించగలరు. చిత్రకారుడిగానూ తనదైన ప్రత్యేకత చాటుకొనే ఈ మాజీ తెలుగు మాస్టారు ఇప్పుడు తన కథను అక్షరబద్ధం చేశారు.

ఆ ‘నేను’ గురించి, దాని నేపథ్యం గురించి ‘నవ్య’తో బ్రహ్మానందం పంచుకున్న విశేషాలివి. చిరంజీవి కుర్చీలోంచి లేచి షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు విద్వత్తు విద్యుత్తులా పైకి కనబడదు. అది వెలిగించినప్పుడే విద్యుల్లత పుడుతుంది. ఎవరో మీట నొక్కాలి. ఆ మీట నొక్కిన చేయి ఎవరిది? ఒక దర్శకుడిదా... ఒక దార్శనికుడిదా... వజ్రకవచధర కటి హస్తమా ఆ చేయి? ఆ చేయి ఎవరిది? చెలువమునేలగ చెంగల లేడని కలతకు నెలవై అలసిన దేవేరి అలమేలుమంగను అనునయించిన చేయి..! ఆది మధ్యాంతరహితుడయిన ఆనందరూపుడి ఆశీస్సులు వేయి.

‘సత్యాగ్రహం’తో అనుగ్రహం పొంది... జంధ్యాల గారి ప్రాపకంలో చేరి... ఆయన్ను నేను దర్శకుడిగా అభిమానిస్తే... ఆయన నన్ను ఆత్మీయుడిలా అభిమానిస్తే... అడుగడుగునా అనుచరుడినై... విదూషకుడినై... మిత్రుడనై... చిత్రయాత్ర ప్రారంభించాను. అది నా జీవన జైత్రయాత్రగా మారబోతోందని అప్పుడు నాకు తెలీదు. ఆయనతో ప్రయాణంలో మొదటి మజిలీ వైజాగ్‌..! బీచ్‌లో షూటింగ్‌. ఆయనతో పాటు వెళ్లాను. ఆ రోజు నా జీవితంలో మరచిపోలేని రోజవ్వబోతోందని వెళ్లేదాకా నాకు తెలీదు. కారణం... ఆ రోజు నాకు మెగాస్టార్‌ చిరంజీవిగారితో పరిచయమయింది. ఆ పరిచయం... ఒక ప్రహసనంలా జరిగింది. ‘సత్యాగ్రహం’ సినిమా కోసం చేసుకున్న గుండుతో షూటింగ్‌ చూడటానికొచ్చిన వారితో నిలబడి ఉన్నాను. అప్పటికే ‘ఖైదీ’ చూసి ఉన్నాను... నా భార్య లక్ష్మితో కలిసి. కొత్త కుర్రాడు... కుర్రకారుని ఉర్రూతలూగించడానికొచ్చిన యువ హీరో. నేను కళ్లప్పగించి నోరు తెరుచుకుని... ఒక వింత జీవిలా చూస్తున్నాను. పైగా ఆ రోజు చిరంజీవి చార్లీచాప్లిన్‌ గెటప్‌లో ఉన్నారు. సినిమా పేరు ‘చంటబ్బాయ్‌’. నా నవ్వు నాకే వింతగా తోచింది. చిరంజీవిగారికి విచిత్రంగా అనిపించింది.

‘ఎవరయ్యా అతను? ఆ ఎక్స్‌ప్రెషన్‌ ఏంటి? డిస్టర్బెన్స్‌గా ఉంది. పంపించెయ్యండి’ అన్నారు. నేను బిత్తరపోయాను. జంధ్యాల గారు జోక్యం చేసుకుని... ‘ఈయన బ్రహ్మానందం గారనీ ఆర్టిస్టు. అత్తిలి కాలేజీలో లెక్చరర్‌గా చేస్తున్నారు’ అని పరిచయం చేశారు. చిరంజీవిగారు వెంటనే కుర్చీలోంచి లేచి షేక్‌హ్యాండిచ్చారు. ఆయన ఎందుకంత పెద్ద హీరో అయ్యారో అర్థమైంది. నాలోని లెక్చరర్‌ను ఆయన గౌరవించారు. షూటింగ్‌ గ్యాప్‌లో జంధ్యాలగారు నా గురించి చెప్పారు. నా జోక్స్‌నీ, మిమిక్రీనీ చిరంజీవి గారు చాలా ఎంజాయ్‌ చేశారు. ‘నువ్వు పెద్ద కమెడియన్‌వి అవుతావు’ అని కాంప్లిమెంట్‌ కూడా ఇచ్చారు. బ్రహ్మానందానికి పరమానందం కలిగింది. షూటింగ్‌ అయిపోగానే ఆయన ఉండే డాల్ఫిన్‌ హోటల్‌కు వెళ్లేవాడిని. మనసారా నవ్వుకునేలా ఎన్నో జోక్స్‌ చెబుతూ ఉండేవాడిని. అలా నేను చిరంజీవి గారికి అభిమాన పాత్రుడనయ్యాను.

నేను అన్వీక్షికి పబ్లిషర్స్‌, హైదరాబాద్‌

ధర: రూ.275; ప్రతులకు: అమేజాన్‌

మీ ఆత్మకథ రాయాలనే ఆలోచన ఎందుకొచ్చింది?

నా జీవితచరిత్ర పదిమందికి తెలియాలనేది నా ఉద్దేశం కాదు. నేను పడిన కష్టాలు, ఎదుర్కొన్న సమస్యలు, వాటిని నేను అధిగమించిన తీరు తెలియాలనేది నా ఉద్దేశం. ఒక మారుమూల గ్రామంలో... పేదరికంలో పుట్టిన ఒక వ్యక్తి ఎలా ఎదిగాడు, ఎన్ని అవరోధాలు దాటుకొని... డాక్టరేట్‌, ‘పద్మశ్రీ’, గిన్ని్‌సబుక్‌ రికార్డులు సొంతం చేసుకున్నాడనే విషయం అందరికీ తెలియాలి. నేను పేదరికాన్ని ప్రేమించా. దాన్ని దాటుకొని పైకి వచ్చా. వాస్తవానికి ఇది నేను రాయాలనుకున్న పుస్తకం కాదు. నా సంకల్పం కాదు. ఏదో శక్తి నాతో రాయించింది. ఈ విషయం చెబితే కొందరు ‘బ్రహ్మానందానికి పిచ్చి’ అనుకుంటారు. కానీ ఇది నిజం. ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అంటారు. ఒక రసాత్మకమైన వాక్యం రాయగలిగినప్పుడు.. దాన్ని లక్షల మంది చదువుకోగలిగినప్పుడు... అందులో ఉన్న భావాన్ని ఒక్కరైనా తెలుసుకొని ముందుకు వెళ్తే అంతకన్నా ఏం కావాలి? ఈ నా పుస్తకం ఒకరికి పాఠ్యాంశం కావచ్చు. ఈ ఆలోచనతోనే ఆత్మకథ రాశా.

ఆత్మకథ రాయటం కష్టంగా అనిపించిందా?

ఈ పుస్తకం రాయటానికి ముందు నేను ప్రసవవేదన పడ్డాననే చెప్పాలి. పుస్తకం రాయటానికి అవసరమైన విషయం నా జీవితంలో ఉందా? లేదా? అనే విషయంపై తీవ్రంగా తర్జనభర్జన పడ్డాను. సుమారు 200 మంది మిత్రులను- ‘‘నేను జీవిత చరిత్ర రాయనా?’’ అని అడిగేవాడిని. అందరూ రాయమనే చెప్పేవారు. అందరూ నన్ను గొప్పగా చూడాలనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. ఎందుకంటే అలాంటి కోరిక ఉంటే- నిరాశ చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కోరిక ఎలాంటిదంటే- మనకు మనం తీసుకొనే గొయ్యిలాంటిది. అందుకే మనం మనలా ఉంటూ ముందుకు వెళ్లాలని నమ్మాను. మనం నిబద్ధతతో ఉంటే- మనని ఎలా ఉంచాలో పైవాడికి తెలుసు. ఇక పుస్తకం ఎలా రాయాలి? భాష ఎలా ఉండాలి? ఏ సైజులో ఉండాలి? ఇలాంటి ఆలోచనలేవీ నాకు లేవు. నేను చెప్పిన విషయాలను హాసం శ్రీనివాస్‌ చాలా బాగా అక్షరబద్ధం చేశాడు. ఇక్కడ మీకో రహస్యం చెబుతా. నేను పెన్ను పట్టుకొని పేపరు మీద ఠావులు ఠావులు రాయలేను. అలా రాసేవాళ్లంటే నాకు జెలసీ! ఒక వాక్యం రాసేలోపు బుర్రలో వంద వాక్యాలు వచ్చేస్తూ ఉంటాయి. అవన్నీ రాయలేనేమోననే భయం నాకు ఉంది. అందుకే శ్రీనివాస్‌ నాకు సహకరించాడు.

ఈ పుస్తకం తొలి ప్రతిని మీ శ్రీమతి లక్ష్మికి ఇచ్చారు కదా... పుస్తకం రాస్తానన్నప్పుడు ఆమె అభిప్రాయం ఏమిటి?

46 సంవత్సరాల వైవాహిక జీవితం మాది. ఏ ఒక్క రోజు ఆమె నాకు అడ్డు చెప్పలేదు. ‘సై’ అంటే ‘సై’ అంది. అప్పుడప్పుడు పుస్తకం చదివి కొన్ని సలహాలు ఇచ్చేది. ఇక్కడ ఆమె గురించి కూడా చెప్పాలి. నా జీవితంలో లక్ష్మిది ఒక ప్రధానమైన పాత్ర. నా జీవితానికి మెరుగులు దిద్దిన వ్యక్తుల్లో ఆమె కూడా ఒకరు. మేమిద్దరం వేర్వేరు కాదు, ఒకటే. ఒకరిపై ఒకరు ఆధారపడినవాళ్లమే. లక్ష్మి లాంటి భార్య అందరికీ ఉంటే ఇలాంటి పుస్తకాలు ఎన్నో బయటకు వస్తాయి.

మీ పుస్తకంపై ఇప్పటిదాకా ఎలాంటి వివాదాలు రాలేదు కదా?

అవును. వివాదాలు సృష్టించటం నా ఉద్దేశం కాదు. కొన్ని విషయాల గురించి రాస్తే వివాదాలు చెలరేగుతాయి. దానివల్ల ఒక హైప్‌ వస్తుంది. అలాంటి పాపులారిటీ నేను కోరుకోవటం లేదు. ‘‘పత్రికా సమీక్షావీక్షణల వలన జగత్‌విఖ్యాతి గాంచిన పక్షివి కావు నీవు’’ అని కోకిల గురించి ఒక కవి చెబుతాడు. నేనూ అంతే! ప్రతి జీవితంలోను సన్మానాలతో పాటు అవమానాలూ ఉంటాయి. వాటిని నిజాయితీగా రాయటంలో తప్పు లేదు. కానీ సెన్సేషన్‌ కోసం, ఎమోషన్‌ కోసం రాయటం తప్పని నేను నమ్ముతాను. చెడును చెప్పి... ఆ చెడును చేయవద్దని చెప్పటం సరి కాదు. మంచి చెబితే- వినేవారు వింటారు. లేకపోతే లేదు. వేల కాపీలు అమ్ముడుపోవటం నా లక్ష్యం కాదు. ఉదాహరణకు రికార్డింగ్‌ డ్యాన్స్‌కు ఎక్కువ మంది జనం వస్తారు. వెంటనే ఆకర్షితులవుతారు. కూచిపూడి నృత్యం చూడటానికి తక్కువ మందే వస్తారు. కానీ దాని ఒక వెనక ఒక శాస్త్రం ఉంది. జీవన పరిణామ సిద్ధాంతం ఉంది. కొబ్బరి పచ్చడి చేసుకొని కమ్మగా ఉందని వెంటనే తినేస్తాం. కానీ ఆవకాయ పెట్టి, దాన్ని జాగ్రత్తగా దాచుకొని... ఏడాదంతా తింటాం. నా పుస్తకం ఆవకాయలాంటిది. దీన్ని తినేవాళ్లు ఐదుగురు ఉన్నా చాలు.

చిరంజీవి గారు ఎంత పెద్ద హీరోనో... అంత చిన్న చంటబ్బాయ్‌ కూడా. అదెలా తెలిసిందంటే... ఆ ‘చంటబ్బాయ్‌’ సినిమాలో నాకూ వేషం ఇచ్చారు జంధ్యాల గారు. ఆ షూటింగ్‌లో చిరంజీవి గారూ, జంధ్యాల గారూ కలిసి నన్ను ర్యాగింగ్‌ చేశారు. అది నాకు తెలుసు. వాళ్లు నాకు తెలీదనుకునేవారు. షూటింగ్‌లో భాగంగా... ఒకరోజు నాకు జంధ్యాల గారు సీన్‌ చెప్పారు. ‘నేను యాక్షన్‌ చెప్పి చెయ్యూపుతాను. నువ్వు అక్కడ నుంచి పరుగెత్తుకుంటూ రోడ్డు దాటుకుని ఇవతలికొచ్చి కలెక్టర్‌ ఆఫీస్‌ ముందాగి డైలాగ్‌ చెప్పాలి’ అన్నారు. ఆ డైలాగేమిటో చెప్పారు. నేను వెళ్లి సముద్రానికి దగ్గరగా నిలబడ్డాను. డైరెక్టర్‌ గారు మైక్‌లో యాక్షన్‌ చెప్పి, చెయ్యూపారు. నేను పరుగెత్తడం మొదలుపెట్టాను. సముద్రం దగ్గర నుంచి రోడ్డు దగ్గరకొచ్చి... అది దాటి కలెక్టరాఫీసు ముందుకొచ్చి డైలాగ్‌ చెప్పాను. అంతా బాగానే జరిగింది. కానీ డైరెక్టర్‌ గారు ‘అబ్బే... లేటయిందయ్యా. మళ్లీ రా’ అన్నారు. నేను సముద్రం వైపు చూశాను. రోడ్డు వైపు చూశాను. మళ్లీ రోడ్డు దాటి అక్కడికి వెళ్లాలి. అక్కడ నుంచి పరుగెత్తుకు రావాలి. నా ఎక్స్‌ప్రెషన్స్‌ చూసి చిరంజీవిగారూ, జంధ్యాలగారూ నవ్వుకుంటున్నారని నాకు అర్థమైంది. అయినా సరే ‘ఓకే సార్‌’ అని చెప్పి మళ్లీ వెళ్లాను. మళ్లీ పరుగెత్తుకుంటూ వచ్చి డైలాగ్‌ చెప్పాను. ఈసారి డైలాగ్‌ చెప్పడంలో టైమింగ్‌ మిస్సయిందన్నారు. ‘ఇక్కడ ఈ ఆర్టిస్టు ఏ డైలాగ్‌ చెబుతున్నాడో ఆ టైమింగ్‌ నాకెలా తెలుస్తుంది సార్‌’ అని నేనడగవచ్చు. కానీ అడగలేదు. నేనడిగితే వాళ్ల ఎంజాయ్‌మెంట్‌ అక్కడితో కట్టయిపోతుంది. వాళ్ల ఎంజాయ్‌మెంట్‌ కట్టయిపోతే నన్ను పిలవరు. వాళ్లు నన్ను పిలిపించిందే ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం. అది నాకు అర్థమైంది. బికాజ్‌ అయాం నాట్‌ ఎ కిడ్‌. ఆ తరువాత వాళ్లు నిజం చెప్పి నవ్వేశారు. నేను వాళ్లకో పిట్టకథ చెప్పి నవ్వించేశాను. ఆ పిట్ట కథ ఏంటంటే...

ఒక ఊళ్లో ఒక పిచ్చోడున్నాడు. ఆ ఊరికో ప్రిసిడెంట్‌ ఉన్నాడు. ఆ ప్రెసిడెంట్‌ ఊరికి ఎవరైనా కొత్తవాళ్లొస్తే, పిచ్చోడి గురించి చెప్పి... ‘వీడొక పిచ్చివాడు. ఎంత ముదురు పిచ్చివాడంటే... మీరే చూడండి’ అని ఆ పిచ్చివాడి ముందు పది నోటు, ఐదు నోటు, రెండు రూపాయల నోటు, రూపాయి నోటు పెట్టి ‘నీకు నచ్చింది తీసుకోరా’ అనేవాడు. ఆ పిచ్చివాడు వాటిల్లోంచి ఒక్క రూపాయి నోటు మాత్రమే తీసుకుని పరుగెత్తేవాడు. అలా ఊరొచ్చిన ప్రతివాడికీ పిచ్చివాడి గురించి చెప్పడం, వాడి ముందు నోట్లు పెట్టడం, వాడు రూపాయి మాత్రమే తీసుకుని పరుగెత్తడం జరుగుతూ ఉండేది. ఒకరోజు ఒక వ్యక్తి వాడిని పట్టుకుని ‘ఒరేయ్‌... అన్ని నోట్లు ముందు పెడితే పది రూపాయలు తీసుకోకుండా ఎప్పుడూ ఒక్క రూపాయే తీసుకుంటావేమిట్రా’ అని అడిగాడు. అందుకు పిచ్చివాడు ఒక పిచ్చి నవ్వు నవ్వి... ‘ఒకవేళ నేను పది రూపాయలు తీసుకుని ఉంటే ఆయన ఆ పదితోనే ఇవ్వడం ఆపేసుండేవాడు. ఒక్క రూపాయి తీసుకున్నాను గనకనే ఇప్పటికీ ఓ ముప్పయ్‌ నలభై మందికి చెప్పాడాయన’ అని చెప్పాడు. అడిగిన వ్యక్తి నోరు తెరిచాడు. ఈ కథ చెప్పగానే పగలబడి నవ్వారు జంధ్యాల గారు, చిరంజీవి గారు. ఆ విధంగా నేను నవ్వులతోనే చిరంజీవి గారికి దగ్గరయ్యాను. చిరంజీవి గారు నన్ను మొదటిసారి ఫ్లయిట్‌ ఎక్కించారు. చెన్నైలోని ఆయన ఇంటికి తీసుకువెళ్లారు. అలా నేను ఒక మంచి దర్శకుడికీ, ఒక పెద్ద హీరోకీ నచ్చిన ఆర్టిస్టునై ఇప్పటికీ మీ ముందున్నాను.

ముందే చెప్పాలి...

ఆత్మకథలు జీవిత చరమాంకంలో చెబితే ప్రయోజనం ఉండదు. ముందే చెప్పాలి. ఈ పుస్తకంలో కామెడీ, జోకులు ఉండవు. బ్రహ్మానందానికి ఉన్న రెండో పార్శ్వం దీనిలో ఉంది. నేను వేసిన పాత్రలు మీకు తెలుసు. నా సన్మానాల గురించి తెలుసు. తెలిసిన వీటన్నింటి గురించి మళ్లీ రాయాల్సిన అవసరం లేదని నేను భావించా. ఇక ‘కామెడీ కమ్స్‌ ఫ్రమ్‌ జెనిత్‌ పాయింట్‌ ఆఫ్‌ ట్రాజడీ’ అంటారు. నా జీవితంలో నేను పడిన కష్టాల నుంచే నా కామెడీ వచ్చింది. విషాదపు అంచుల నుంచే నవ్వు వస్తుంది. ఈ పుస్తకం చదివితే ఈ విషయం అర్థమవుతుంది. భవిష్యత్తులో ఎవరైనా, ఎప్పుడైనా- ‘బ్రహ్మానందం అనే ఒక కామెడీ యాక్టర్‌ ఉండేవాడు... అతని జీవితం ఎలా ఉండేది?’ అని ఆరా తీస్తే- వారికి నా పుస్తకం ద్వారా అనేక విషయాలు తెలుస్తాయి. 300 పేజీల్లో ఎవరికైనా మూడు పేజీలు నచ్చితే చాలు.

జీవిత సత్యం..

పేదరికాన్ని ప్రేమించండి.. దరిద్రాన్ని ద్వేషించకండి. ఇదే నేను తెలుసుకున్న జీవిత సత్యం. పేదరికం నా కన్నతల్లి. నేను పుట్టక ముందే మా ఇంట్లో దరిద్రం పుట్టింది. అయినా నేను ఎవరితోను పోల్చుకోలేదు. ఒకరితో పోల్చుకోవటం మొదలుపెడితే కష్టాలు కొనితెచ్చుకున్నట్లే. నువ్వు నువ్వులా ఉండాలనుకుంటే సుఖాలను ఆహ్వానించినట్లే! ఇదే నా జీవన విధానం.

సంభాషణ: సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - Dec 30 , 2023 | 04:44 AM