సంగీతం మా ఇంట్లోనే ఉంది

ABN , First Publish Date - 2023-06-05T00:48:34+05:30 IST

ఆహూతులను మంత్రముగ్ధులను చేసిన మధురాలాపనలు...అతిథుల అభినందనల జల్లులో తడిసి ముద్దయిన సందర్భాలు... ఊహ తెలిసినప్పటి నుంచి సంగీతంతోనే ఆమె సహవాసం. ..

సంగీతం  మా ఇంట్లోనే ఉంది

ఆహూతులను మంత్రముగ్ధులను చేసిన మధురాలాపనలు...అతిథుల అభినందనల జల్లులో తడిసి ముద్దయిన సందర్భాలు... ఊహ తెలిసినప్పటి నుంచి సంగీతంతోనే ఆమె సహవాసం. పెళ్లితో మధ్యలో బ్రేకులు పడినా... అత్తింటి... పుట్టింటి ప్రోత్సాహంతో తిరిగి పాట బాట పట్టారు ముప్ఫై ఏళ్ల సౌజన్య భాగవతుల. ఇప్పుడు ‘ఆహా’ వారి ‘తెలుగు ఇండియన ఐడల్‌-2’లో గెలిచి... ట్రోఫీని తన కుటుంబానికి కానుకగా ఇచ్చారు. ఆ సంతోషాన్ని... దాని వెనుకనున్న కృషిని... సౌజన్య ‘నవ్య’తో పంచుకున్నారు...

‘‘నా గురించి చెప్పాలంటే ముందుగా మా తాతగారు భాగవతుల కృష్ణారావును పరిచయం చేయాలి. ఆ రోజుల్లో ఆయన నాటకాలు వేసేవారు. కథలు, కవితలు, పద్యాలు... అన్నీ రాసేవారు. అద్భుతంగా పద్యాలు పాడేవారు. దాంతో ఇంట్లో అందరికీ తెలుగు సాహిత్యం మీద, సంగీతంమీద ఆసక్తి, ఇష్టం పెరిగాయి. మా నాన్న కూడా చాలా బాగా పాడతారు. మాది విశాఖపట్టణమే అయినా నాన్న ఉద్యోగరీత్యా ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌లో ఉండేవాళ్లం. నేను పుట్టింది అక్కడే. ఆరో తరగతి వరకు రాయ్‌పూర్‌లోనే చదువుకున్నాను. ఇంట్లో ఎప్పుడూ పాటలు, పద్యాలు వినిపిస్తుండేవి. చెప్పాలంటే... మా ఇంట్లోనే సంగీతం ఉంది. నాకు నాలుగేళ్లప్పటి సంగతి ఇది. స్కూల్లో తెలుగు పండుగలు జరిపేవారు. ఆ పండుగల్లో నేను, మా చెల్లి శిరీష భాగవతుల మా తాతగారి పద్యాలు, పాటలు పాడేవాళ్లం. అంత్యాక్షరి లాంటి వాటిల్లో పాల్గొనేవాళ్లం. అది చూసి ఇంట్లోవాళ్లు మాకు సంగీతం నేర్పిస్తే మరింత బాగా పాడతామనుకున్నారు. ఇద్దర్నీ తీసుకువెళ్లి కర్ణాటక సంగీత శిక్షణలో చేర్పించారు. అలా నాకు ఆరేళ్లప్పుడు సంగీత అభ్యాసం మొదలైంది. తరువాత అమ్మానాన్న మాకు మరింత మెరుగైన శిక్షణ ఇప్పించాలనుకున్నారు. అందుకే విశాఖపట్టణం వచ్చి స్థిరపడ్డాం. నాటి నుంచి సంగీత సాధన ఆగలేదు.

పాశ్చాత్య సంగీతం కూడా...

తరువాత నేను రెండేళ్లు పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం కూడా నేర్చుకున్నాను. అందులో ఇంగ్లీష్‌, జర్మన పాటలు ఉంటాయి. మన శాస్త్రీయ సంగీతంలానే చాలా ప్రాచీనమైనది అది. విభిన్నంగా ఉంటుంది. ‘ట్రినిటి కాలేజ్‌ ఆఫ్‌ లండన’ అఫిలియేషనతో అందులో గ్రేడ్‌-5 పూర్తి చేశాను. ఇంకా నేర్చుకొంటున్నాను. చాలా ఏళ్ల కిందట కొన్ని టీవీ రియాలిటీ షోస్‌లో పాల్గొన్నాను. తెలుగు, తమిళం ‘సూపర్‌ సింగర్‌’లో పాడాను. 2012లో ‘షిరిడీ సాయి గీతామృతం’ అని పోటీ పెట్టారు. నాలుగు ఎపిసోడ్స్‌. కీరవాణి గారు న్యాయనిర్ణేతగా వచ్చిన ఆ పోటీలో నేనే విన్నర్‌ని.

‘అర్జునరెడ్డి’లో అలా...

నా బీటెక్‌ అయిపోయాక ఇన్ఫోసి్‌సలో చేరాను. మంచి ప్లేబ్యాక్‌ సింగర్‌ కావాలన్నది నా కోరిక. అందుకే ఉద్యోగం చేస్తూనే చిన్న చిన్న సినిమాలకు, షార్ట్‌ ఫిలిమ్స్‌కు, రీరికార్డింగ్స్‌కు పాడేదాన్ని. ఒకసారి ‘అర్జునరెడ్డి’ చిత్రంలో క్లైమాక్స్‌ పాట ‘గుండెలోన..’ ట్రాక్‌ పాడించారు నాతో. అది విన్న ఆ చిత్ర దర్శకుడు సందీ్‌పరెడ్డి... ‘బాగా పాడుతోంది. ఈ అమ్మాయితోనే ఒరిజినల్‌ సాంగ్‌ కూడా పాడిద్దాం’ అన్నారు. అలా ‘అర్జునరెడ్డి’లో అవకాశం వచ్చింది.

పెళ్లి తరువాత...

‘అర్జునరెడ్డి’ విడుదలైన నెలకు నా పెళ్లి అయింది. మావారు సోమేశ కూరెళ్ల ఇంజనీర్‌. అప్పుడు పుణెలో పని చేసేవారు. దాంతో నేను హైదరాబాద్‌ వదిలేసి పుణె వెళ్లిపోయాను. తరువాత వైజాగ్‌ వెళ్లడం, పాప పుట్టడం, కుటుంబ బాధ్యతలు మీద పడడం... ఇలా దాదాపు ఐదేళ్లు నాకు పాడడం కుదరలేదు. పరిశ్రమ నుంచీ నన్ను ఎవరూ పిలవలేదు. సౌజన్య అంటే ఎవరికీ తెలియకుండా పోయింది. మరోవైపు నాతో కలిసి మొదలుపెట్టిన మా చెల్లి శిరీష కెరీర్‌లో దూసుకుపతోంది. ఎఆర్‌ రహమాన గారి సంగీతంలో ‘పీఎస్‌-1, 2’కు పాడింది. తెలుగు, తమిళం, హిందీ సినిమాలకు పాడుతోంది. ‘కలా’ హిందీ చిత్రంలో తను ఆలపించిన ‘ఘోడేపే సవార్‌’ పాట సూపర్‌హిట్‌ అయింది. దానికి గానూ తనకు మంచి పేరు, ఎన్నో అవార్డులు వచ్చాయి. చెల్లిలా నేను కూడా మంచి ప్లేబ్యాక్‌ సింగర్‌గా పేరు తెచ్చుకోవాలని, ఆ ఒక్క పాటతో నా పాటల ప్రయాణం ఆగిపోవడానికి వీల్లేదని అనుకున్నాను. దాని కోసం ఉద్యోగం వదిలేశాను.

నేనేంటో నిరూపించుకోవాలని...

కల నెరవేర్చుకోవాలన్న నా పట్టుదలకు మావారు, మా అత్తామామలు, అమ్మానాన్నలు... అందరూ మద్దతునిచ్చారు. వాళ్లందరి దీవెనలతో సంగీత సాధన తిరిగి ప్రారంభించాను. అయితే దాదాపు ఐదేళ్ల విరామం వచ్చింది. ఇప్పుడు నన్ను నేను నిరూపించుకోవాలంటే ఒక మంచి వేదిక కావాలి. ఆ ప్రయత్నాల్లో ఉండగా ‘ఆహా’ ఓటీటీ వారి ‘తెలుగు ఇండియన ఐడల్‌’ సీజన-2కు ఆడిషన్స జరుగుతున్నాయని తెలిసి వెళ్లాను. అలా మళ్లీ నా సంగీత ప్రయాణం మొదలైంది.

నాపై నాకు నమ్మకాన్నిచ్చింది...

ఈ షోలో పాల్గొనడం ద్వారా నాలో వచ్చిన అతిపెద్ద మార్పు... నాపై నాకు నమ్మకం. ఇక్కడకు వచ్చేముందు ‘ప్లేబ్యాక్‌ సింగర్‌గా మళ్లీ కెరీర్‌ మొదలుపెట్టగలనా’ అనే సందేహం ఉండేది. కానీ ఈ వేదికపై అంతపెద్ద సంగీత దర్శకులు, గాయకుల సమక్షంలో అన్ని రకాల పాటలూ పాడే అవకాశం లభించింది. వారి సూచనలు, సలహాలు పాటిస్తూ ముందుకు సాగడంవల్ల ఎంతో పరిణతి వచ్చింది. అదే నన్ను ‘తెలుగు ఇండియన ఐడల్‌-2’ విజేతగా నిలబెట్టిందని అనుకొంటున్నాను. నిజంగా నన్ను నేను నిరూపించుకోవడానికి దొరికిన అతిపెద్ద వేదిక ఇది. దీనివల్ల నా కెరీర్‌ తిరిగి ఆరంభమైంది. ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయి. తమనగారే నాకు అవకాశం ఇచ్చారు... ఆయన రాబోయే చిత్రంలో.

ఆరాధించేవారే అభినందిస్తే...

ఈ షోలో న్యాయనిర్ణేతలు, అతిథులుగా వచ్చినవారందరూ నన్ను శ్రేయా ఘోషాల్‌తో పోల్చారు. ఆవిడను, చిత్రమ్మను నేను దేవతల్లా ఆరాధిస్తాను. వాళ్ల పాటలు ఎక్కువగా వింటుంటాను. ముఖ్యంగా శ్రేయా ఘోషాల్‌ పాటలు తరచూ పాడుతుంటాను. అలాంటిది తమన గారు పంపిన నా పాటల క్లిప్పింగ్‌ చూసి ‘చాలా బాగా పాడావు’ అంటూ ఆమె మెచ్చుకున్నారు. చిత్రమ్మగారు నా పాట విని లేచి నిలబడి చప్పట్లు కొడుతూ అభినందించారు. నా ఆరాధ్య గాయనీమణులు నా గురించి అలా గొప్పగా చెప్పడం ఎప్పటికీ నాకు గుర్తుండిపోయే మధురానుభూతి. అలాగే అల్లు అర్జున గారి చేతుల మీదగా విన్నర్‌ ట్రోఫీ అందుకోవడం నా ఆనందాన్ని రెట్టింపు చేసింది. చిన్నప్పుడైతే సుశీల, జానకి గార్ల పాటలు ఎక్కువగా పాడేదాన్ని. బాలు గారు నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌. ఆయనను ఒక పాటల పోటీలో కలిశాను. చాలా చిన్నప్పుడు. తరువాత బాగా నేర్చుకుని ఆయన ముందు పాడాలనుకున్నాను. కానీ ఆ కోరిక తీరలేదు.

అదే నా ఆకాంక్ష...

‘ఇండియన ఐడల్‌’ ఫైనల్స్‌లో విజేతలను నిర్ణయించేది ప్రేక్షకుల ఓట్లేనని తెలిసినప్పుడు చాలా ఒత్తిడికి లోనయ్యాను. ఇప్పటివరకు జడ్జీల మార్కులతో ఎలాగో ఒక్కో స్టేజీ దాటుతూ వచ్చాను. కానీ ప్రేక్షకులకు నా పాట నచ్చిందా? వాళ్లు నాకు ఓటు వేస్తారా? అనే సందేహాలు. అయితే నేను పరిచయం ఉన్నా లేకపోయినా నాకు ఓటు వేసి నన్ను గెలిపించారు. ముఖ్యంగా నేను చిన్నప్పుడు రాయ్‌పూర్‌లో చదివిన ‘బాలాజీ విద్యామందిర్‌’కు ధన్యవాదాలు చెప్పాలి. వాళ్లకు తెలుగు భాష రాకపోయినా, నేను ఒకప్పుడు అక్కడ చదివానన్న ప్రేమతో ఓట్లు వేయించారు. ఇంతమంది నా మీద చూపించిన ప్రేమాభిమానాలకు రుణపడి ఉంటాను. ఇక కెరీర్‌లో ఏ స్థాయికి వెళతానో తెలియదు కానీ... ఊపిరి ఉన్నంతవరకు సంగీతంతో ప్రయాణించాలనేది నా ఆకాంక్ష. ఎప్పుడూ స్టూడియోలో పాడుతూ ఉండాలి. పాటలతో బిజీగా ఉండాలి. ఇదే నేను కోరుకొనేది.’’

ఫ హనుమా

6.jpg

వారే నా బలం...

ఈ విజయాన్ని నా పాపకు, మావారికి, మా అత్తమామలు, అమ్మానాన్నలకు... అందరికీ అంకితం చేస్తున్నాను. ఎందుకంటే ప్రతిఒక్కరూ నాకు అండగా నిలబడ్డారు. మా పాపకు ఏడాదిన్నరే అయినా ఎవర్నీ ఏడిపించకుండా, ఇబ్బంది పెట్టకుండా ఇన్ని రోజులూ సంతోషంగా ఉంది. వీడియోకాల్‌లో మాట్లాడినప్పుడు కూడా అమ్మ లేకపోతే ఉండలేనన్న బెంగ తన ముఖంలో కనిపించలేదు. మావాళ్ల ఇళ్లల్లో తను ఆనందంగా ఉంది. నన్ను నవ్వుతూ పలుకరించేది. అందువల్లే నేను ఇంత దూరంలో ఉన్నా కూడా పాప గురించి ఎలాంటి ఆందోళన లేకుండా పాటల సాధన మీద పూర్తిగా దృష్టి పెట్టగలిగాను. ఇదంతా నా కుటుంబం సహకారంవల్లే సాధ్యమైంది. వాళ్లే నా బలం, ప్రోత్సాహం. ఇక సంగీతం విషయానికి వస్తే... ఎప్పుడూ అప్‌డేట్‌ అవ్వడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, విభిన్నంగా పాడడానికి ప్రయత్నిస్తాను. అదే నా పెద్ద బలం.

Updated Date - 2023-06-05T00:48:34+05:30 IST