సరిహద్దులు చెరిపేస్తున్న సరిగమపదనిసలు

ABN , First Publish Date - 2023-07-15T23:29:40+05:30 IST

రామ్‌ చరణ్‌ కొత్త సినిమా కోసం.. రెహమాన్‌ నాని ‘హాయ్‌ డాడీ’కి సంగీతం.. అబ్దుల్‌ వాహెబ్‌‘టైగర్‌ నాగేశ్వరరావు’కి స్వరాలు అందిస్తోంది..

సరిహద్దులు చెరిపేస్తున్న  సరిగమపదనిసలు

రామ్‌ చరణ్‌ కొత్త సినిమా కోసం.. రెహమాన్‌ నాని ‘హాయ్‌ డాడీ’కి సంగీతం.. అబ్దుల్‌ వాహెబ్‌‘టైగర్‌ నాగేశ్వరరావు’కి స్వరాలు అందిస్తోంది.. జీవీ ప్రకాశ్‌ కుమార్‌.నితిన్‌ సినిమా అయితే హారీశ్‌ జైరాజ్‌ఎన్టీఆర్‌ ‘దేవర’ బాధ్యత అనిరుధ్‌ది. ఈ లిస్టు చూస్తే చాలు. పక్క రాష్ర్టాల నుంచి సంగీత దర్శకులు తెలుగు చిత్రసీమకు ఎంతలా దిగుమతి అవుతున్నారో అర్థం అయిపోతుంది.

నిన్నా మొన్నటి వరకూ ఏ తెలుగు సినిమా చూసినా ఐతే దేవిశ్రీ ప్రసాద్‌, లేదంటే తమన్‌ల పేర్లు కనిపించేవి. మధ్యలో భీమ్స్‌ జోరు ఎక్కువైంది. ఫ్యామిలీ కథలకు మిక్కీ జే.మేయర్‌ ఎలాగూ ఉండనే ఉన్నాడు. రాజమౌళి, రాఘవ్రేంద్రరావు ప్రాజెక్టు అయితే కీరవాణి కేరాఫ్‌. అనూప్‌, కల్యాణీ మాలిక్‌, శేఖర్‌ చంద్ర.. ఇలా అడపా దడపా స్వరాల మధురిమ రుచి చూపిస్తూనే ఉన్నారు. తెలుగు సినిమాల్లో వీళ్ల హవానే ఎక్కువ. అయితే ఈమధ్య పర భాషల నుంచి సంగీత కారుల్ని తెచ్చుకొంటున్నాం. వాళ్లు కూడా గొప్ప పాటలే అందిస్తున్నారు. కొత్త తరహా సంగీతం వినే అవకాశం కల్పిస్తున్నారు.

harris-jayarajs.jpg

ఈ ట్రెండ్‌ ఇప్పటిదైతే కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే.. ఈమధ్య కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. ఇళయరాజా వారసుడు యువన్‌ శంకర్‌రాజా తెలుగులో మంచి సినిమాలే చేశాడు. ‘7 బై జీ బృందావన కాలనీ’లో ఆయన అందించిన పాటలు ఇప్పటికీ వింటూనే ఉంటాం. అయితే సక్సెస్‌ రేటు తక్కువ అవ్వడం వల్ల యువన్‌కి తెలుగులో భారీ అవకాశాలు రాలేదు. ఇప్పుడిప్పుడే యువన్‌ మళ్లీ తన హవా చూపిస్తున్నాడు. ఇటీవల ‘కస్టడీ’ కోసం ఇళయరాజాతో కలిసి స్వరాలు అందించాడు. హరీశ్‌ జయరాజ్‌కి తెలుగులో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ‘ఆరెంజ్‌’ సినిమాలో పాటలు... సూపర్‌ డూపర్‌ హిట్టయ్యాయి. సినిమా ఫ్లాప్‌ అయ్యింది కానీ, ఆల్బమ్‌ మాత్రం అదుర్స్‌. ‘నా సినిమాల్లో నా ఫేవరెట్‌ ఆల్బమ్‌ ఆరేంజ్‌’ అని రామ్‌ చరణ్‌ ఇప్పటికీ అంటుంటాడు. ‘ఘర్షణ’, ‘వాసు’ సినిమాల్లో ఆయన పాటలు అలరించాయి. కాకపోతే.. హరీశ్‌కి కూడా తెలుగులో సరైన హిట్టు లేదు. అందుకే మన దర్శకులు ఆయన్ని దూరం పెట్టారు. అయితే నితిన్‌ - వక్కంతం వంశీ చిత్రానికి ఆయన ఇప్పుడు స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో పాటలు చాలా బాగా వస్తున్నాయని టాక్‌. మరోసారి హారీశ్‌ జయరాజ్‌ పనితనం ఈ సినిమాలో కనిపిస్తే, ఒకట్రెండు పాటలైనా హిట్టయితే.. ఇంకొంత కాలం ఆయన తెలుగులో కొనసాగే అవకాశం ఉంది.

తమిళంలో అనిరుథ్‌కి తిరుగులేదు. అక్కడ ఏ పెద్ద సినిమా అయినా సరే, అనిరుథ్‌ ఉండాల్సిందే. తెలుగులోనూ అనిరుథ్‌తో పాటలు చేయించాలని చాలామంది ప్రయత్నించారు. కానీ డేట్లు కుదర్లేదు. అనిరుథ్‌ చేసిన ‘అజ్ఞాతవాసి’ ఆడియో పరంగా పెద్ద హిట్‌. కానీ సినిమా ఆడలేదు. పవన్‌ కల్యాణ్‌ చిత్రాల్లో అది అతి పెద్ద ఫ్లాప్‌. దాంతో అనిరుథ్‌ని దూరం పెట్టారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు ఎన్టీఆర్‌ ‘దేవర’ కోసం అనిరుథ్‌ని మళ్లీ తీసుకొచ్చారు. కొరటాల శివకు సంగీత పరంగా మంచి టేస్ట్‌ ఉంది. ఆయ సినిమాలో పాటలన్నీ బాగుంటాయి. కాబట్టి అనిరుథ్‌తో మంచి బాణీలే రాబడతారన్న నమ్మకంఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు బలంగా ఉంది. జీ.వి ప్రకాశ్‌ కుమార్‌ సంగీతంలో ఓ ప్రత్యేకత ఉంది. యూత్‌ని ఆకట్టుకొనే బాణీలు ఇవ్వగలడు. అయితే తెలుగులో చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఈ పేరు వినిపించింది. ఇప్పుడు రెండు సినిమాలు ఒప్పుకొన్నాడాయన. నితిన్‌ - రష్మిక సినిమాకి ఆయనే స్వరకర్త. రవితేజ ‘టైగర్‌ నాగేశ్వరావు’ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నాడు. యువ హీరోల చిత్రాలకు జీవి మంచి ఆప్షన్‌. తెలుగులో ఒక్క హిట్‌ పడితే, తప్పకుండా దూసుకుపోగలడు.

5.jpg

తెలుగులో రెహమాన్‌ పాటలు చాలా తక్కువ వినే అవకాశం దక్కింది. దానికి కారణం.. రెహమాన్‌కి సైతం తెలుగులో హిట్లు లేవు. పవన్‌ కల్యాణ్‌తో చేసిన ‘పులి’ డిజాస్టర్‌. అందులో ఒక్క పాట కూడా గుర్తుండే విధంగా ఉండదు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి రెహమాన్‌ పాటలు సరిపడవన్నది చాలామంది ఉద్దేశ్యం. అందుకే రెహమాన్‌ పేరు తెలుగు సినిమాల్లో పెద్దగా వినిపించలేదు. చాలా కాలం తరవాత ఓ తెలుగు చిత్రానికి పని చేస్తున్నారాయన. రామ్‌ చరణ్‌ - బుచ్చిబాబు కాంబోలో రూపొందిస్తున్న చిత్రానికి రెహమాన్‌ స్వరాలు అందిస్తున్నారు. ‘కేజీఎఫ్‌’తో రవి బస్రూర్‌ దుమ్ము దులిపాడు. పాటల సంగతి ఎలా ఉన్నా, నేపథ్య సంగీతంతో అదరగొట్టాడు. ఇక ‘కాంతార’తో మరో స్థాయికి వెళ్లిపోయాడు. ఈ రెండు చిత్రాల్లోనూ సౌండ్‌ డిజైనింగ్‌ పరంగా మంచి మార్కులు పడ్డాయి. దాంతో తెలుగు దర్శకుల దృష్టి అతనివైపు మళ్లింది. నేపథ్య సంగీతానికి స్కోప్‌ ఉన్న కథలకు ఇప్పుడు ఈ పేరు పరిశీలిస్తున్నారు. తాజాగా ‘విరూపాక్ష’ చిత్రానికి సైతం తన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో ప్రాణం పోశాడు. మలయాళ చిత్రం ‘హృదయం’ సినిమాలో పాటలన్నీ హిట్టే. ‘దర్శన’ అయితే కల్ట్‌ క్లాసిక్‌ అయిపోయింది. ఈ చిత్రానికి అబ్దుల్‌ వాహబ్‌ సంగీతాన్ని అందించాడు. ‘హృదయం’ తరవాత ఈ యువ సంగీత దర్శకుడికి తెలుగు నుంచి వరుస ఆఫర్లు అందాయి. ముఖ్యంగా ప్రేమ కథా చిత్రాలకు అబ్దుల్‌ మంచి ఆప్షన్‌. విజయ్‌ దేవరకొండ, సమంతల ‘ఖుషి’ చిత్రానికి తనే సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటి వరకూ రెండు పాటలు బయటకు వచ్చాయి. రెండూ హిట్టే. ఇవి కాకుండా తన చేతిలో మరో మూడు తెలుగు సినిమాలున్నాయి. ‘సీతారామం’తో విశాల్‌ చంద్రశేఖర్‌ పాటలు ఓ ఊపు ఊపేశాయి.

6.jpg

చక్కని మెలోడీ పాటలకు విశాల్‌ చిరునామాగా నిలిచాడు. తన కోసం ఇప్పుడు తెలుగు దర్శకులు క్యూ కడుతున్నారు. తెలుగు, తమిళం అనే హద్దుల్ని ఈ సంగీత దర్శకులు చెరిపేసి, సంగీతాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం అభినందించదగిన విషయం. టాలెంట్‌ ఎక్కడున్నా వాళ్లని ప్రోత్సహించి అవకాశాలు ఇవ్వడం టాలీవుడ్‌కి అలవాటే. అందుకే వీళ్లంతా తెలుగులో మంచి ఛాన్సులు దక్కించుకొంటున్నారు. పైగా ఈరోజుల్లో తెలుగు, హిందీ అనే బేధాల్లేవు. అన్నీ పాన్‌ ఇండియా కథలే. కాబట్టి అన్ని భాషల వాళ్లూ.. తెలుగు సినిమాల్లో భాగం పంచుకోగలుగు తున్నారు. పైగా తెలుగులో నిర్మితమయ్యే చిత్రాల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఎప్పుడూ తమన్‌, దేవిశ్రీ అంటే కుదరదు. వాళ్లకూ పని ఒత్తిడి ఎక్కువ అవుతోంది. కొత్త తరహా కాంబోల్ని వెదికే క్రమంలో.. ఇలా పక్క రాష్ట్రాల సంగీత దర్శకులకు విరివిగా అవకాశాలు వస్తున్నాయి. ‘‘జీవీ ప్రకాశ్‌, అనిరుధ్‌ తెలుగులో మంచి పాటలు ఇచ్చారు. ‘మాస్టారు.. మాస్టారు’ పాట నాకు బాగా నచ్చింది. ప్రతిభావంతులు మరింతమంది వస్తే.. నాలాంటి వాళ్లకు ఉత్సాహంగా ఉంటుంది. పోటీ ఎక్కువైనప్పుడు మరింత ఉత్తమ ప్రతిభ కనబరచడానికి ప్రయత్నిస్తాం. ఎంత మంది కొత్త సంగీత దర్శకులు టాలీవుడ్‌కి వస్తే.. అంత మంచిది. అన్ని మంచి పాటలొస్తాయి’’ అని చెప్పుకొచ్చారు తమన్‌.

Updated Date - 2023-07-15T23:29:40+05:30 IST