Islam : మానవాళికి మార్గదర్శి

ABN , First Publish Date - 2023-09-22T03:36:35+05:30 IST

అజ్ఞానం, అంధకారంలో కూరుకుపోయిన ఆనాటి సమాజంలో అంతిమ దైవప్రవక్త మహమ్మద్‌ ప్రవక్త జ్ఞాన జ్యోతులను వెలిగించారు. విద్యా కుసుమాలను వికసింపజేశారు. విజ్ఞానార్జన ప్రతి ఒక్కరి విధిగా ఆయన నిర్దేశించారు. ‘జ్ఞానం

Islam : మానవాళికి మార్గదర్శి

28న మిలాద్‌-ఉన్‌-నబీ

అజ్ఞానం, అంధకారంలో కూరుకుపోయిన ఆనాటి సమాజంలో అంతిమ దైవప్రవక్త మహమ్మద్‌ ప్రవక్త జ్ఞాన జ్యోతులను వెలిగించారు. విద్యా కుసుమాలను వికసింపజేశారు. విజ్ఞానార్జన ప్రతి ఒక్కరి విధిగా ఆయన నిర్దేశించారు. ‘జ్ఞానం జీవితం, అజ్ఞానం మరణం’ అని విశదీకరించారు. జ్ఞాన సంపన్నులు... జ్ఞాన విహీనులు సమానం కాజాలరని స్పష్టం చేశారు. తన జీవితంలో అత్యుత్తమ నైతిక విలువలను ఆచరించి, ప్రపంచానికి ఆదర్శప్రాయుడయ్యారు. అందుకే ఆయన జననం సర్వమానవాళికీ శుభోదయం అయింది.

కేవలం బోధల ద్వారా సమాజంలో నైతిక విలువలను స్థిరపరచడం సాధ్యం కాదు. బోధకుడు ఆ విలువలను స్వయంగా ఆచరించాలి. వాటి పునాదులతో సర్వోత్తమమైన వ్యవస్థను స్థాపించాలి. దాని పరిరక్షణకు, ప్రచారానికి కృషి చేయాలి. దైవప్రవక్త మహమ్మద్‌ వీటన్నిటినీ తన జీవిత కాలంలోనే సాధించారు. మానవజాతి సంస్కరణకు ఎంతోమంది మహనీయులు, మహాత్ములు, ప్రవక్తలు ఈ పుడమిపై ప్రభవించారు. సృష్టి ప్రారంభం నుంచి ఈనాటి వరకూ అన్ని కాలాల్లో, అన్ని జాతుల్లో, అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో ఈ మహనీయులు మానవుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారు. ఆదిమానవుడైన ఆదాము మొదలుకొని లక్షా ఇరవై నాలుగువేలమంది దైవ ప్రవక్తలు ఈ పుడమిపై ప్రభవించినట్టు ఇస్లాం ధర్మ శాస్త్రగ్రంథాల ద్వారా తెలుస్తోంది. ఆ పరంపరలో చివరి ప్రవక్తే మహమ్మద్‌.

క్రీస్తుశకం 571 ఏప్రిల్‌ మాసం 20వ తేదీ సోమవారం నాడు... అరేబియా దేశంలోని మక్కా నగరంలో మహమ్మద్‌ ప్రవక్త జన్మించారు. ఆయన తల్లిపేరు అమీనా, తండ్రి అబ్దుల్లాహ్‌. మహమ్మద్‌ జన్మించకముందే తండ్రినీ, ఆరేళ్ళ ప్రాయంలో తల్లినీ కోల్పోయారు. అనాథ అయిన ఆయనను తాతయ్య అబ్దుల్‌ ముతల్లిబ్‌ అక్కున చేర్చుకున్నారు. ఆ తరువాత మహమ్మద్‌ పోషణ, సంరక్షణ బాధ్యతను ఆయన బాబాయి అబూతాలిబ్‌ స్వీకరించి, అల్లారుముద్దుగా పెంచారు. చిన్నవయసునుంచే బాల మహమ్మద్‌ తన ప్రవర్తనతో సర్వత్రా ప్రశంసలు అందుకున్నారు. నీతి, నిజాయితీ, సేవాతత్పరత, సత్యసంధత ఆయనకు ఉగ్గుపాలలోనే అలవడ్డాయి. ఇచ్చినమాట నిలబెట్టుకోవడం, నిష్పక్షపాతంగా, న్యాయంగా వ్యవహరించడం లాంటి సుగుణాల రీత్యా ప్రజల మనసులు చూరగొన్నారు. ‘సాదిక్‌’ (సత్యసంధుడు), ‘అమీన్‌’ (విశ్వసనీయుడు) అని ఆయనను పిలిచేవారు. తల్లితండ్రులకు సేవ చేసే భాగ్యం మహమ్మద్‌కు కలుగలేదు. కానీ తల్లితండ్రులను గౌరవించాలని, వారి మాటలు విశ్వసించడం పిల్లల బాధ్యత అని ఆయన ఎల్లప్పుడూ చెప్పేవారు. తనకు పాలుపట్టిన దాయీ హాలిమాను సొంత తల్లిలా చూసుకున్నారు. అలాగే... పిల్లలను ప్రేమించడం, విద్యాబుద్ధులు నేర్పించి, సజ్జనులుగా తీర్చిదిద్దడం తల్లితండ్రుల బాధ్యత అని మహమ్మద్‌ బోధించారు. తన కుమార్తె హజ్రత్‌ ఫాతిమాను ఉన్నత విద్యావంతురాలుగా, సజ్జనురాలిగా తీర్చిదిద్దారు. ఆయన తన సహచర మిత్రులను ఎంతో ఇష్టపడేవారు. వారి యోగక్షేమాలు తెలుసుకొనేవారు. అయితే న్యాయం విషయానికి వచ్చినప్పుడు స్నేహితులనైనా, ఎవరినైనా ఒకేలా చూసేవారు. ధనికులు, పేదలు, స్వతంత్రులు, బానిసలు... ఇలా ఎవరి ఆహ్వాన్నైనా మన్నించేవారు. వ్యాధిగ్రస్తులు సొంతవారైనా, పరాయివారైనా... స్వయంగా వెళ్ళి పరామర్శించేవారు.

పరలోకాన్ని విశ్వసించేవారు తమ అతిథులను ఆదరించి, సత్కరించాలని దైవప్రవక్త చెప్పేవారు. అలాగే ఆతిథ్యం మూడు రోజుల విధి అని ఆయన పేర్కొన్నారు. ‘‘మొదటి రోజు విందు, సత్కరింపుల దినం. ఆ రోజు అతిథికి వీలైనంత మంచి అన్నపానీయాలు సమకూర్చాలి. రెండవరోజు వారికోసం శ్రమించవలసిన అవసరం లేదు. మూడు రోజుల తరువాత అతిథికి చేసే సేవలు సదకా (దానం)గా పరిగణనలోకి వస్తాయి. ఇంటివారిని కష్టపెట్టేవరకూ బసచేయడం అతిథికి ధర్మసమ్మతం కాదు’’ అని ఆయన ఉద్బోధించారు. అలాగే పొరుగువారితో మంచిగా ఉండాలని, వారితో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలనీ సూచించారు. అదే విధంగా అనాథల ఆలనా పాలనా చూడడం, వారికి విద్యాబుద్ధులు నేర్పించడం, సాటి మనుషులుగా పరిగణించడం సమాజం బాధ్యత అనీ, ఆపన్నులకు ఆహారం, నీరు సమృద్ధిగా వితరణ చేయాలనీ దైవ ప్రవక్త ఆదేశించారు. తనను ఏదైనా కోరినవారికి ఏనాడూ లేదనని దానశీలిగా ఆయన నిరూపించుకున్న సందర్భాలు ఉన్నాయి. న్యాయాధిపతిగానూ అందరిపట్లా సమానంగా వ్యవహరించేవారు. సమన్యాయ వ్యవస్థను స్థాపించి చరిత్రలో నిలిచారు. అదే విధంగా మహిళలకు ఆస్తులలో సమాన హక్కులను చట్టబద్ధం చేశారు. వితంతువును వివాహం ఆడి... స్త్రీజనోద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఇలా ఆదర్శవంతమైన తన జీవనం ద్వారా, తన బోధనల ద్వారా మానవాళికి మార్గదర్శిగా నిలిచారు.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2023-09-22T03:36:35+05:30 IST