Share News

MLA Matta Ragamai : ఎమ్మెల్యే అవుతాననుకోలేదు

ABN , Publish Date - Dec 25 , 2023 | 02:04 AM

డాక్టర్‌ మట్టా రాగమయి... నిన్నటి వరకు వైద్యురాలు మాత్రమే. ఇప్పుడు ఆమె సత్తుపల్లి ప్రజాప్రతినిధి. తెలంగాణ శాసనసభలో తొలిసారిగా అడుగుపెట్టిన ఉన్నత విద్యావంతుల్లో ఒకరు. ఒకవైపు ఊపిరితిత్తుల వైద్య నిపుణురాలిగా సేవలందిస్తూనే

MLA Matta Ragamai : ఎమ్మెల్యే అవుతాననుకోలేదు

డాక్టర్‌ మట్టా రాగమయి... నిన్నటి వరకు వైద్యురాలు మాత్రమే.

ఇప్పుడు ఆమె సత్తుపల్లి ప్రజాప్రతినిధి. తెలంగాణ శాసనసభలో తొలిసారిగా అడుగుపెట్టిన ఉన్నత విద్యావంతుల్లో ఒకరు. ఒకవైపు ఊపిరితిత్తుల వైద్య నిపుణురాలిగా సేవలందిస్తూనే మరోవైపు కన్నకూతురి స్మారకంగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సత్తుపల్లి ప్రజల ఆదరాభిమానాలు పొందారు. ప్రజాక్షేత్రంలో నిలిచి గెలిచారు. ‘‘నా భర్త ప్రోత్సాహం, మా అత్తమ్మ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చా’’నని చెబుతున్న ఎమ్మెల్యే రాగమయి ‘నవ్య’తో పంచుకున్న విశేషాలివి.

రాజకీయాల్లోకి వస్తానని, ఎమ్మెల్యే అవుతానని ఎన్నడూ అనుకోలేదు. మా అత్తమ్మ ఆరోగ్యమ్మ స్ఫూర్తి, నా భర్త డాక్టర్‌ దయానంద్‌ ప్రేరణతోనే శాసనసభలో అడుగుపెట్టాను. మొదటి నుంచి మాది కాంగ్రెస్‌ కుటుంబమే. మా అత్తమ్మ మండల పరిషత్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. మామయ్య కృష్ణమూర్తి జాతీయోద్యమకాలం నుంచి కాంగ్రెస్‌ వాది. స్వాతంత్య్ర సమరయోధుడు కూడా. వారిద్దరూ కలిసి సత్తుపల్లిలో అరవై ఏళ్ల పాటు క్లినిక్‌ నడిపారు. ఎలాంటి వైద్య సదుపాయం లేని మా ప్రాంతంలో వారు అత్యవసర సమయంలో చికిత్స అందించి కొన్నివందల మంది ప్రాణాలు నిలిపారు. దాంతో పాటు చైతన్య మహిళా మండలి స్థాపించి స్త్రీల సాధికారత, ఆర్థిక స్వావలంబన కోసం మా అత్తమ్మ అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అందుకే అక్కడి వారంతా ఆమెను ‘సత్తుపల్లి మదర్‌ థెరిస్సా’ అంటారు. చిన్నప్పటి నుంచి నేను ఇంట్రావర్టుని. నలుగురి ముందు మాట్లాడటానికి కూడా భయమే. అలాంటిది నన్ను కొన్నివేల మంది పాల్గొన్న సభలో ప్రసంగించేలా తీర్చిదిద్దింది మా అత్తమ్మ. నా అభ్యున్నతికి అంతలా కారణమైన ఆమె గతేడాది జనవరిలో కన్నుమూశారు. ఆమె లేని లోటు నాకు ఎప్పటికీ తీరనిదే. అయినా, సత్తుపల్లిని అభివృద్ధి చేయడం ద్వారా అత్తమ్మ ఆశయాలను కొనసాగించడమే ఇప్పుడు నా ముందున్న కర్తవ్యం.

బాధిత మహిళలకు బాసటగా...

మా పాప కొంతకాలం కిందట తలసీమియాతో చనిపోయింది. అమ్మాయి స్మారకంగా ‘ఆషా ఫౌండేషన్‌’ స్థాపించాం. దాని ద్వారా దాదాపు పదివేల మందికి ఉచిత వైద్యం అందిస్తున్నాం. నిరుపేద మహిళలకు జీవన నైపుణ్యాల శిక్షణ ఇప్పించాం. ప్రతి ఏటా ఇరవై మంది విద్యార్థులకు కళాశాల ఫీజులు చెల్లిస్తున్నాం. నిత్యం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. పాఠశాలల్లోనూ అమ్మాయిలకు వ్యక్తిగత ఆరోగ్యంపై అవగాహనా తరగతులు చెబుతుంటాను. బాధిత మహిళలకు బాసటగా నిలిచేందుకు నా వంతుగా ప్రయత్నిస్తున్నాను. ఈ మధ్యనే ఓ గృహహింస బాధితురాలి సమస్యను మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లి తగిన సహాయం అందించగలిగాం. ఇలా నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేసి స్థానికులకు ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకొంటాను.

గిరిజన వాడల్లో వైద్య శిబిరాలు...

రాజకీయాల్లోకి రాక ముందు వరకు వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 14ఏళ్లు వైద్యురాలిగా పనిచేశాను. విధి నిర్వహణలో భాగంగా కావడిగుండ్ల, కోయిడా, అనంతారం లాంటి రవాణా సౌకర్యం కూడా లేని మారుమూల పల్లెలకు వెళ్లి వైద్యసేవలు అందించాం. వాటిని పోలియో రహిత గ్రామాలుగా చేయగలిగాం. కొన్ని గిరిజన ప్రాంతాలలో సెలబ్రిల్‌ మలేరియాతో చాలామంది చనిపోయేవారు. డాక్టర్లమంతా కలిసి అలాంటి తండాలకు వెళ్లి వైద్యశిబిరాలు నిర్వహించాం. ఒక్కోసారి వారం పాటు అక్కడే ఉండి, ఆరోగ్య సమస్యల పట్ల వారిలో అవగాహన పెంచాం. తద్వారా మలేరియా మరణాలు తగ్గించగలిగాం. ఇలా ప్రజల మధ్య పనిచేస్తున్న క్రమంలోనే, ఒక డాక్టరుగా కంటే రాజకీయాల ద్వారా సమాజానికి మరింత సేవ చేయచ్చు కదా.! అనిపించింది. ఆ వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి నా భర్తతో పాటు రాజకీయాల్లోకి వచ్చాను.

స్వతంత్రంగానే వ్యవహరిస్తా

ఇప్పుడు నా దృష్టంతా నియోజకవర్గ అభివృద్ధి మీదే.! బుగ్గపాడు మెగా ఫుడ్‌పార్కును ప్రారంభించడం నా ముందున్న సవాల్‌. దాని ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సత్తుపల్లిలో వంద పడకల ఆస్పత్రిని వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలి. శిథిలావస్థలోని డిగ్రీ కళాశాల భవనాన్ని పునర్నిర్మించాలి. వీటితో పాటు సింగరేణి కార్మికులకు అండగా ఉండటం లాంటి వాగ్ధానాలను నిలబెట్టుకొనే దిశగా పని మొదలుపెట్టాను. నా భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చాను. అంతమాత్రాన పరిపాలన విషయంలో ఆయన మీద ఆధారపడతాను అనుకొంటే పొరపాటే.! ఒక ఉన్నత విద్యావంతురాలిగా సొంతంగా ఆలోచించగల శక్తిసామర్థ్యాలు నాకున్నాయి. కనుక నియోజకవర్గ అభివృద్ధి కోసం నా భర్త సలహాలు, సూచనలు కూడా వింటాను. అందుకు తగిన నిర్ణయాలు మాత్రం స్వతంత్రంగానే తీసుకుంటాను.

నన్ను ‘నాన్‌లోకల్‌’ అన్నారు

మా సొంతూరు కర్నూలు జిల్లా పోతిరెడ్డిపాడు. మా నాన్న ఎన్‌వై రత్నం అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ కావడంతో ఉద్యోగ బదిలీల వల్ల నా పాఠశాల విద్య కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో సాగింది. ఎంబీబీఎస్‌ మాత్రం విజయవాడ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలో చదివాను. కర్నూలు వైద్య కళాశాలలో ‘పల్మనాలజీ’లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాను. నా భర్త డాక్టర్‌ దయానంద్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌లో నిపుణుడు. ఆయన స్వస్థలం సత్తుపల్లి. మాకు ముగ్గురమ్మాయిలు. పెద్దమ్మాయి మెడిసిన్‌ చదువుతుంది. మిగతా ఇద్దరూ నీట్‌కు సిద్ధమవుతున్నారు. మేము పదేళ్లుగా రాజకీయాలలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాం. అలా అని ప్రాక్టీసుకు దూరం కాలేదు. ఎన్నికల సమయంలో మమ్మల్ని విమర్శించడానికి లోపాలేమీ కనిపించక, నన్ను ‘నాన్‌-లోకల్‌’ అంటూ ప్రత్యర్థులు దుష్ప్రచారం చేశారు. పాతికేళ్ల కిందట సత్తుపల్లిలోని అత్తగారింట అడుగుపెట్టిన నేను ప్రాంతేతరురాలిని ఎలా అవుతాను.! కనుక ప్రజలు దాన్ని అస్సలు పట్టించుకోలేదు. వారంతా నన్ను గెలిపించారు.

with-sitakka.jpg

తోటి సభ్యురాళ్లతో కలసి మెలసి...

అసెంబ్లీ సమావేశాలప్పుడు చాయ్‌ బ్రేక్‌, భోజన సమయాల్లో రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా మహిళా సభ్యులమంతా కలసి మెలసి మెలగడం నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డి, కొండా సురేఖ, సీతక్క లాంటి సీనియర్‌ సభ్యులు... కొత్తగా ఎన్నికైన మమ్మల్ని తోబుట్టువుల్లా ఆదరిస్తూ వారి అనుభవాలను మాతో పంచుకోవడం బావుంది.

స్వాంతన్‌

Updated Date - Dec 25 , 2023 | 02:04 AM