Megastar Chiranjeevi : పనిలోనే.. నాకు సంతృప్తి

ABN , First Publish Date - 2023-01-01T02:35:51+05:30 IST

చినుకు సముద్రమవ్వడం ఒక అద్భుతం... విత్తనం అడవిగా విస్తరించటం ఒక అపురూపం... పిల్లగాలి తుపానులా మారడం ఒక విచిత్రం... కానీ ఒక సామాన్యుడు మెగాస్టార్‌ అవ్వడం మాత్రం మన కళ్లముందున్న నిజం. ఒకప్పుడు చినుకుగా వచ్చిన చిరంజీవి ఇప్పుడు సముద్రంగా మారాడు.

Megastar Chiranjeevi : పనిలోనే.. నాకు సంతృప్తి
Megastar Chiranjeevi

80 ఏళ్లు వచ్చినా.. యంగ్‌గా అలరించాలని..

ప్రశాంతత.. ఆహార అలవాట్లు.. వ్యాయామమే నా ఫిట్‌నెస్‌ సీక్రెట్‌

భార్య సురేఖే మార్గదర్శకురాలు.. విమర్శకురాలు

పవన్‌ యోగి లాంటివాడు.. సమాజం గురించే ఆలోచన

చినుకు సముద్రమవ్వడం ఒక అద్భుతం...

విత్తనం అడవిగా విస్తరించటం ఒక అపురూపం...

పిల్లగాలి తుపానులా మారడం ఒక విచిత్రం...

కానీ ఒక సామాన్యుడు మెగాస్టార్‌ అవ్వడం మాత్రం మన కళ్లముందున్న నిజం.

ఒకప్పుడు చినుకుగా వచ్చిన చిరంజీవి ఇప్పుడు సముద్రంగా మారాడు. విత్తనంలా పాతుకొని అరణ్యంలా విస్తరించాడు. పిల్లగాలిలా వీచి తుఫానులా చిత్రసీమను కమ్మేశాడు.

అందుకే చిరంజీవి జీవితం.. ఆయన విజయ ప్రస్థానం సినీచరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. ‘మెగా’ కిరీటాన్ని తన వశం చేసుకొని దశాబ్దాలుగా అభిమాన ప్రపంచాన్ని చక్రవర్తిలా

పరిపాలిస్తున్నా.. ఇంకా ఆయన మనసులో ఏదో తపన. జగమంతా ఉన్న తన అభిమానకుటుంబానికి ఏదో చేయాలనే కోరిక. అనునిత్యం కొత్త ఆలోచనలతో ముందుకు సాగే

మన చిరుతో నూతన సంవత్సరాన్ని స్వాగతిద్దాం.. ఆయన మది మాటలలో మునిగిపోదాం...

మెగాస్టార్‌కి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సాధారణంగా మీరు కొత్త సంవత్సరాన్ని ఎలా

ఆహ్వానిస్తారు?

మీకు.. తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ సుఖశాంతులతో.. ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక వేడుకలంటారా.. యువకుడిగా ఉన్నప్పుడు అందరిలాగా పార్టీలకు వెళ్లేవాడిని కాదు. కాలేజీ రోజుల నుంచి పెళ్లైన చాలా రోజుల దాకా.. డిసెంబర్‌ 31 రాత్రి 11.30 నుంచి పూజ గదిలో ఆంజనేయస్వామి ముందు కూర్చుని ధ్యానం చేసుకొనేవాడిని. ‘‘ఈ ఏడాది కూడా అందరూ సుఖశాంతులతో ఆనందంగా ఉండాలి స్వామి’’ అని కోరుకొనేవాడిని. 12 గంటల తర్వాత టపాసుల చప్పుడు అవుతుంది కదా... అప్పుడు లేచి అందరికీ శుభాకాంక్షలు చెప్పేవాడిని. సురేఖ ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. పిల్లలు పెద్దయిన తర్వాత న్యూ ఇయర్‌ పార్టీ చేసుకుంటున్నారు. మేమూ పాల్గొంటాం. అయితే ముందు పూజ.. ఆ తర్వాతే పార్టీ. అందరూ రాత్రి పార్టీ చేసుకొని జనవరి ఒకటి ఉదయం గుడికి వెళ్తారు. మేము ముందు పూజ చేసుకొని ఆ తర్వాతే పార్టీ చేసుకుంటాం.

మీ నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణం ఎలా సాగింది?

చిత్ర పరిశ్రమలోకి రావాలనుకున్నప్పుడు, అవకాశాల కోసం ఎదురుచూస్తున్నప్పుడు ‘‘ప్రేక్షకులు నన్ను ఎందుకు చూడాలి?’’ అని ప్రశ్నించుకొనేవాడిని. చెరగని జుట్టు... చక్కటి ముఖవర్చస్సుతో అందగాళ్లైన ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబులాంటి వాళ్లు హీరోలుగా ఏలుతున్న సమయంలో నేను సినీ రంగంలోకి ప్రవేశించా. నేను వాళ్లల్లా తెల్లగా.. అందంగా ఉండను. సాదాసీదాగా ఒక పక్కింటి అబ్బాయిలా ఉంటా. నాకు సినిమా ఛాన్స్‌లు రావాలంటే.. ముందు నిర్మాతలు నన్ను గుర్తించాలి. అలా గుర్తించటానికి ‘నా ఆసక్తి... నా అర్హత’ కాదు. ఆ అర్హత కోసం ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరా. అక్కడ శిక్షణ తీసుకుంటున్న సమయంలో అనుక్షణం ఏదో కొత్తగా చేయాలనుకొనేవాడిని. రియలిస్టిక్‌గా నటించాలి... మిగిలినవాళ్ల కన్నా భిన్నంగా ప్రేక్షకులకు ఏదో అందించాలనే కోరిక ఉండేది. అందుకే మొదట్లో నా సినిమాల్లో చాలా తక్కువ మేకప్‌ ఉంటుంది. అంతే కాకుండా డ్యాన్స్‌లు, ఫైట్స్‌ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టా. దీనికీ ఒక కారణముంది. అప్పట్లో హీరోల డ్యాన్స్‌ విషయంలో ప్రేక్షకులకు కొంత అసంతృప్తి ఉండేది. పాటలు వస్తే ప్రేక్షకులు వాటిని మినీ ఇంటర్వెల్స్‌లా భావించి బయటకు వెళ్లిపోయేవారు. ఇక ఫైట్స్‌లో డూప్స్‌ను పెట్టి చేయిస్తున్నారని తెలిసిపోయేది. నేను వీటిని గమనించాను. ఎలా చేయాలి? అనే విషయంపై కాకుండా ఎలా చేయకూడదు? అనే దానిపై ఎక్కువ దృష్టి పెట్టా. ఆ సమయంలో సినిమానే నా ఊపిరి. నా ప్రతి ఆలోచనా సినిమాకు సంబంఽధించినదే ఉండేది. ప్రతి సీనూ కొత్తగా చేయాలనుకొనేవాడిని.

అమితాబ్‌ లాంటి వారు తమని తాము ఒక నటుడిగా పునర్‌నిర్వచించుకున్నారు. ఇప్పటికీ సూపర్‌స్టార్‌లుగా కొనసాగుతున్నారు. మీరు ఈ దశలోనే ఉన్నారా?

ఎంత స్టార్‌డమ్‌, సీనియారిటీ, ఇమేజ్‌ ఉన్నా వయసుకు తగ్గట్టుగా మన పాత్రలు ఉండాలి. అమితాబ్‌ అదే చేస్తున్నారు. రజనీకాంత్‌ కూడా అంతే! ఇక నా విషయానికి వస్తే... నేను చాలా కాలంగా ఈ విషయాన్ని ఆలోచిస్తున్నా. యువతరం వచ్చేసింది.. బాగా డ్యాన్స్‌లు చేస్తున్నారు. నేను ఇంకా డ్యాన్స్‌లు చేయాలా? అనే ఆలోచన కూడా వచ్చింది. అందుకే డ్యాన్స్‌లు లేకుండా ‘సైరా, గాడ్‌ఫాదర్‌’ వంటివి చేశా. హీరోయిన్‌ లేకుండా ‘ఆచార్య’ చేశా. ‘గాడ్‌ఫాదర్‌’లో నాది మధ్య వయస్కుడి పాత్ర. అయినా ప్రేక్షకులు ఆదరించారు. అయితే ఇలాంటి సినిమాలకు పరిమితమైపోయి నా పరిధిని కుదించుకుంటున్నానా? ఆ డ్యాన్స్‌, ఫైట్స్‌, కామెడీలకు ప్రేక్షకుల్లో ఆదరణ లేదు అని తప్పుగా అనుకుంటున్నానా? అనే ఆలోచన కూడా నాలో ఉంది. ‘‘ప్రేక్షకులు మీ డ్యాన్స్‌లు కోరుకుంటున్నారు. కామెడీ, యాక్షన్‌ ఆశిస్తున్నారు’’ అని సన్నిహితులు చెప్పినప్పుడు నిజమే కదా అనిపించింది. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో కొన్ని స్టిల్స్‌ చూస్తుంటే.. 1991కి ఇప్పటికీ తేడా లేదనిపిస్తోంది. 30 ఏళ్ల తర్వాత కూడా అదే జోష్‌ కనిపిస్తోంది. ఈ సినిమాను ప్రేక్షకులు తప్పనిసరిగా ఆదరిస్తారు. ఇదంతా చూసిన తర్వాత ప్రేక్షకుల ఆదరణ ఉన్నంత వరకూ నన్ను నేను పూర్తిగా పునర్‌ నిర్వహించుకోవాల్సిన అవసరం లేదనిపిస్తోంది.

ఈ స్థాయికి చేరుకోవటానికి ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చారు. ఈ ప్రయాణంలో ఎప్పుడూ అలసట గానీ, విశ్రాంతి తీసుకోవాలని గానీ అనిపించలేదా?

ఏ పనీ లేకుండా ఉన్నప్పుడే నాకు అలసటగా అనిపిస్తుంది. ఒంటరిగా ఉంటే అలసిపోయినట్లు ఉంటా. నా కుటుంబం, నా సినిమాలు, నా బాధ్యతలు... ఇవన్నీ నాకు అంతులేని శక్తినిస్తాయి. ముందుకు నడిపిస్తాయి. పనిలోనే నాకు సంతృప్తి. ‘నా కుటుంబం.. నా అభిమానులు’.. ఇదే నా ప్రపంచం. అనుక్షణం వీరికి ఏదో చేయాలనుకుంటూ ఉంటా. ఏవైనా సేవకార్యక్రమాలు చేసినప్పుడు వాటి ద్వారా లబ్ది పొందిన వారి సంతోషం, వారి కళ్లలో కనిపించే కృతజ్ఞత నాకు అపరిమితమైన ఆనందాన్ని ఇస్తుంది. ‘‘ఏదైనా పని ఉంటేనే మీరు యాక్టివ్‌గా ఉంటారు.. లేకపోతే డల్‌ అయిపోతారు..’’ అని సురేఖ అంటూ ఉంటుంది.

అసలైన చిరంజీవి ఎవరు? మీరు ఎలా నిర్వచిస్తారు?

అసలైన చిరంజీవి ఆలోచనాపరుడు. ‘నాకేంటి’ అని కాకుండా ‘పదిమందికీ ఏమిటి?’ అని నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడు. చిన్నప్పుడు మా అమ్మనాన్న గర్వించే స్థాయిలో ఉండాలనుకొనేవాడిని. మా కుటుంబంలో నేనే పెద్దవాడిని. అందువల్ల అప్పటికీ.. ఇప్పటికీ అందరి బాధ్యతా నాదే! నా తమ్ముళ్లు, చెల్లెళ్లు ఎంత పెద్ద వారైనా.. ఎంత సంపాదనాపరులైనా.. వాళ్ల బిడ్డలు కూడా సంపాదిస్తున్నా.. వాళ్లకు నేను ఏదైనా చేయగలనా? అని ఆలోచిస్తుంటా. ఇది ఒక కోణం. ఇక నేను పైకి రావటానికి కారణమైన ప్రతి వ్యక్తికి.. ప్రతి అభిమానికి తిరిగి ఏమి ఇవ్వగలననే ఆలోచన నన్ను ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. ఇది మరొక కోణం. ఈ రెండింటి కలబోతే చిరంజీవి.

మీ పిల్లల్లో ఎవరు ఆలోచనల్లో మిమ్మల్ని పోలి ఉంటారు?

చరణ్‌... నాలాగే తను కూడా అందరూ తన కుటుంబమే అనుకుంటాడు. ఈ మధ్యనే సురేఖ ఒకసారి... ‘‘రేప్పొద్దున మనం లేకపోయినా... మిగిలిన వారిని ఎవరు చూసుకొంటారని ఆలోచించాల్సిన అవసరం లేదండి. చరణ్‌ అన్నీ చూసుకుంటాడు..’’ అంది. అయితే ఒక్క విషయంలో మాత్రం మా ఇద్దరికీ పోలిక లేదు. చరణ్‌ చాలా గుంభనంగా ఉంటాడు. నేను చాలా ఓపెన్‌గా ఉంటా. చరణ్‌ ఎప్పుడూ పొరపాటున కూడా ఒక్క మాట తూలడు. నేను కొన్నిసార్లు ఎమోషన్‌లో ఓ మాట అనేస్తాను. నా మనసులో ఉన్న మాట బయటపెట్టడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇక మా పెద్ద పాప సుష్మితది మా నాన్నగారి పోలిక. ఏదో సాధించాలని పరితపిస్తూ ఉంటుంది. తను కూడా కష్టపడి పనిచేస్తోంది. సినీ పరిశ్రమలో స్థిరపడుతోంది. చిన్నమ్మాయి శ్రీజ... వాళ్ల అమ్మలాగ సాత్వికురాలు. మా పిల్లలందరికీ స్వతంత్రంగా ఆలోచించే గుణం, కష్టపడే తత్వం ఉన్నాయి. మా పెంపకమో... వాళ్లకు సహజంగా అబ్బిన గుణమో తెలియదు కానీ ఎవ్వరికీ హంగు, ఆర్భాటాలు లేవు.

సురేఖ గారికి మీ మీద ఉన్న ప్రధానమైన కంప్లైంట్‌?

నేను షూటింగ్స్‌లో బిజీగా ఉన్నప్పుడు రాత్రిళ్లు ఎప్పుడో వచ్చేవాడిని. ‘‘పిల్లల్ని పలకరించి ఎన్నాళ్లు అవుతుందో గుర్తుందా’’ అని అడిగేది. అదే తన కంప్లైంట్‌. ఈ మధ్య నేను మనవరాళ్లతో ఆడుకుంటుంటే చూసి.. ‘‘మన పిల్లలతో ఇలా ఎప్పుడైనా ఆడారా’’ అంది. ‘‘కష్టపడి పైకి రావాలనుకొనే తండ్రి ఎవరైనా పిల్లలతో ఎక్కువ ఆడడు. మనవరాళ్లతోనే ఆడుకుంటాడు’’ అన్నా. అది కూడా నిజమేగా!

ఈ వయసులోనూ మీరు ఇంత ఫిట్‌గా ఉండడానికి కారణం ఏమిటి?

ప్రశాంతంగా ఉండటం. అదే ముఖ్యం. మిగిలినవన్నీ తర్వాతే! చాలా మంది ఫిట్‌గా ఉండడానికి ఆహారపు అలవాట్లు మార్చుకుంటారు. వ్యాయామం చేస్తారు. ఇవన్నీ చేసినా మానసిక ప్రశాంతత లేకపోతే ఫిట్‌గా కనిపించరు. ఇక్కడ మీకో విషయం చెప్పాలి... ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమా ముందు నా మైండ్‌సెట్‌ వేరు. ఆ సినిమా తర్వాత వేరు. ‘‘మీ రియల్‌ ఇమేజ్‌ వేరు.. స్ర్కీన్‌ ఇమేజ్‌ వేరు. సినిమాల్లో ఒకప్పుడు ఎలాంటి చిరంజీవిని చూశామో మాకు అలాంటి చిరంజీవే కావాలని’’ తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాని విజయవంతం చేశారు. దాంతో నాలో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. ఇప్పుడు వాల్తేరు వీరయ్య ట్రైలర్స్‌ చూసినవాళ్లు ‘ఖైదీ నంబర్‌ 150’ కన్నా యంగ్‌గా ఉన్నారని కామెంట్‌ చేస్తున్నారు. నేను ఇంత ఫిట్‌గా మారడానికి ఎంత వ్యాయామం చేస్తానో... ఎంత కఠినమైన ఆహార నియమాలు పాటిస్తానో నాకే తెలుసు. కానీ ఆ కష్టమంతా ప్రేక్షకుల ఆదరణ చూసిన తరువాత ఆనందంగా మారిపోతుంది.

మిమ్మల్ని విమర్శించే వారు ఎవరైనా ఉన్నారా?

నా భార్యేనండి. ఆమే నాకు పెద్ద విమర్శకురాలు. సినిమాలైనా.. జీవితమైనా.. తను విమర్శలు చేస్తుంది. తను ఒక అభిమానిగా ఆలోచించగలదు.. విమర్శకురాలిగా సూచనలూ చేయగలదు. తను చేసే సూచనలు నాకు అనేకసార్లు ఉపయోగపడ్డాయి. కొన్నిసార్లు నా బాధ్యతలను కూడా గుర్తు చేస్తుంది. ఎక్కడిదాకానో ఎందుకు.. ‘వాల్తేరు వీరయ్య’లో కూడా తను కొన్ని సూచనలు చేసింది. ఆమే నా డ్రైవింగ్‌ఫోర్స్‌.. గైడింగ్‌ ఫోర్స్‌.

ఈ మధ్యకాలంలో మీకు అమితమైన సంతోషాన్ని ఇచ్చిన సందర్భమేమిటి?

చరణ్‌ తండ్రికావటమే! ఆ సంతోషం మాటల్లో చెప్పలేను. సుమారు మూడు నెలల క్రితం ఒక రోజు చరణ్‌, ఉపాసన వచ్చారు. ‘‘నాన్న ఎక్కడ? ఒక విషయం చెప్పాలి’’ అని సురేఖను అడిగాడట. సురేఖ వచ్చి... ‘మీతో ఏదో చెప్పాలట’ అంది. నాకు విషయం అర్థంకాలేదు. చిరు టెన్షన్‌ కూడా వచ్చింది. ‘‘మొన్న టాంజానియా, జపాన్‌ టూర్‌ వెళ్లొచ్చాం కదా.. తిరిగొచ్చాక పరీక్ష చేయించుకుంటే.. తను తల్లి కాబోతోందని తెలిసింది. రెండో నెల’’ అని వాళ్లు చెబుతుంటే నేను ఒక రకమైన ఉద్వేగానికి లోనయ్యాను. నాకు, సురేఖకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. చరణ్‌ను గట్టిగా ముద్దు పెట్టుకున్నా. ఉపాసనను అప్యాయంగా దగ్గరకు తీసుకున్నా. మేము ఆ రోజు కోసం ఆరేళ్ల నుంచి వేచి చూస్తున్నాం. ‘‘ఎన్నాళ్లో వేచిన ఉదయం..’’లాంటి సందర్భం అది. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పాలి. రెండు నెలల క్రితం... సురేఖ అనంతపద్మనాభస్వామి దేవాలయానికి తన స్నేహితులతో కలిసి వెళ్లింది. నాటి హీరోయిన్‌ రాధ తనకు అక్కడ అన్నీ చూపించింది. అప్పుడు ఒక చోటకు తీసుకువెళ్లి... ‘‘ఇక్కడ ఊయలలు ఉన్నాయి. మీ కుటుంబంలో పిల్లలు పుట్టాలనుకుంటే ఈ బొమ్మను ఊయలలో వేసి ఊపండి’’ అని ఒక చిన్న పాప బొమ్మ ఇచ్చిందిట. సురేఖ ఊయలలో పాపను వేసి ఊపిందిట. ఆ తర్వాత సరిగ్గా రెండు నెలలకు ఈ వార్త తెలిసింది. సురేఖ ఆనందానికి హద్దులు లేవు. ‘‘భగవంతుడిని కోరుకున్నా.. నా కోరిక ఫలించింది’’ అని ఎంతో ఆనందపడింది. 3 నెలలు పూర్తయిన తర్వాత అందరికీ చెబుదామని ఒక నెల ఆగాం.

పవన్‌ కల్యాణ్‌పై అనేక రకాల విమర్శలు వస్తూ ఉంటాయి. వాటిని విన్నప్పుడు మీకెలా అనిపిస్తుంది?

చాలా బాధ కలుగుతుంది. వాడు నాకొక కిడ్‌ బ్రదర్‌. బిడ్డలాంటి తమ్ముడు. వాణ్ణి నా చేతులతో ఎత్తుకొని పెంచా. వాడికి నేను, సురేఖ తల్లితండ్రులలాంటి వాళ్లం! వాడికీ మేమంటే అంతే ప్రేమ. కించిత్‌ స్వార్థం కూడా లేని వ్యక్తి. డబ్బు యావ లేదు. పదవీ కాంక్ష లేదు. తన కోసం ఎప్పుడూ ఆలోచించుకోడు. నేను ఒక అన్నగా చెప్పడంలేదు. తనని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా చెబుతున్నా. అంతెందుకు.. మొన్నటిదాకా వాడికి సొంత ఇల్లు లేదు. ‘‘మా అందరికీ ఉన్నాయి.. నువ్వు కూడా కట్టుకో..’’ అంటే.. ‘‘చూద్దాం’’ అని దాటేసేవాడు. వేళకు అన్నం తినడు. బట్టలు సరిగ్గా వేసుకోడు. సమాజానికి ఏదైనా చేయాలనే తపనతో అన్నీ వదిలేసిన యోగిలాంటి వాడు. అంత చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్న వ్యక్తి... రాజకీయాలనే మురికి కూపంలోకి వెళ్లాడు. అక్కడ ఉన్న మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నాడు. ఆ ప్రయత్నంలో కొంత మురికి తనకు కూడా అంటుకుంటుంది. మురికిని తీసేవాళ్లకు మురికి అంటడం సహజమే కదా! ఒక స్వచ్ఛమైన ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం సహకరించాలి.. ప్రొత్సహించాలి. అయితే మితిమీరి వాడిని అనరాని మాటలు అంటున్నప్పుడు బాధ కలుగుతుంది. పైగా పవన్‌ను తిట్టినవాళ్లు మళ్లీ నా దగ్గరకు వచ్చి పెళ్లిళ్లకు, పేరంటాలకు పిలుస్తారు. రమ్మని బతిమాలతారు. ‘నా తమ్ముడిని అన్ని మాటలు అన్నవాళ్లతో మళ్లీ మాట్లాడాల్సి వస్తోందే.. వాళ్లను కలవాల్సి వస్తోందే’ అని బాధగా ఉంటుంది.

ఇప్పటి దాకా మీరు ఎవరితోనూ పంచుకొని ఒక రహస్యాన్ని మా పాఠకులకు చెప్పండి...

‘నా వయస్సుకు తగ్గట్టుగా ఫెర్‌ఫార్మెన్స్‌లోనూ... ప్రేక్షకులను అలరించటంలోనూ... గ్రేస్‌ఫుల్‌గా ట్రాన్స్‌ఫార్మ్‌ అవుతాను’ అని పైకి అంటుంటా కానీ నా మనసులో మాత్రం 80 ఏళ్లు వచ్చినా అందరినీ అలరించేలా కుర్ర వేషాలు వేయాలని ఉంది. అదే నేను ఎవరికీ చెప్పని సీక్రెట్‌ (నవ్వులు).

సేవ... మరింత విస్తృతంగా...

బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌ల ద్వారా నాకు లభించే తృప్తి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చినా రాదు. నేను ఒక వ్యక్తిని. కార్పొరేట్‌ సంస్థల మాదిరిగా నా దగ్గర మంది మార్బలం ఉండదు. కేవలం అభిమానుల చేయూతతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నా. బయట నుంచి చూస్తున్నప్పుడు... ‘‘ఇంత అభిమానగణం.. ఇంత స్థాయి ఉంది కదా.. ఇంకా చేయచ్చు కదా’’ అనిపించవచ్చు. ఎస్‌.. ఇంకా చేయాలి. అయితే దానికి సమయం కేటాయించాలి. ముందు సినిమాల వల్ల.. ఆ తర్వాత రాజకీయాల వల్ల ఎక్కువ సమయం కేటాయించలేకపోయా. ఇప్పుడు మళ్లీ దృష్టి పెడుతున్నా. గత 22 ఏళ్లుగా నేను ఎవ్వరినీ ఒక్క పైసా విరాళం అడగలేదు. అంతా సొంత సొమ్మునే ఖర్చుపెట్టా. నేను చేసే సేవా కార్యక్రమాలు చాలా వరకూ బయటకు తెలియవు. అందుకే కొందరు... ‘‘ప్రచారం అవసరం లేదు కానీ సమాచారమైనా ఇవ్వాలి కదా’’ అని అంటున్నారు. సమాచారం తెలిస్తే మరింత మంది ప్రభావితం కావచ్చు. ఇకపై సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తా. ముందుగా సినీ కార్మికుల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. నాకున్న దాంట్లో అత్యధిక భాగాన్ని సేవా కార్యక్రమాల కోసమే ఖర్చు పెట్టాలనుకుంటున్నా!

శత్రువులను కూడా

శత్రువులను కూడా మిత్రులుగా చేసుకోవాలని నేను ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటా. వాళ్లు నన్ను ఏమీ చేయలేరనే విషయం నాకు తెలుసు. అయినా నాకు ఒక శత్రువు ఉన్నాడనే విషయమే ఇబ్బందిగా ఉంటుంది. మనిషిగా పుట్టినందుకు ఎంతమంది మనుషులను నీకు దగ్గర చేసుకున్నావు అనేదే ప్రధానం. ఆర్థికంగా ఒకటి పక్కన ఎన్ని సున్నాలు చేర్చుకుంటూ వెళ్లాననేది నాకు ముఖ్యం కాదు. మనసు పక్కన ఎన్ని మనసులు చేర్చుకుంటూ వెళ్తాననేదే నాకు ముఖ్యం. అదే నా ఫిలాసఫీ.

సాధారణ వ్యక్తులు కూడా...

అన్నీ సహజంగా చేయడంవల్లే నాకు అంతటి ఆదరణ వచ్చింది. సాధారణ వ్యక్తులు కూడా నాలా అవ్వచ్చు అని ఊహించుకోవడానికి అది దోహదపడింది. ‘స్టార్స్‌లా మనం అవ్వలేం కానీ చిరంజీవిలా ఉన్నా మనం కూడా సినిమాల్లోకి వెళ్లిపోవచ్చు’ అనే టాక్‌ వచ్చింది. నాలో వాళ్లని ఊహించుకోవడానికి నన్ను అభిమానించడానికి కారణమైంది. నన్ను స్ఫూర్తిగా తీసుకొని పరిశ్రమలోకి రావడానికి నేను కారణమవడం నాకు గర్వకారణం. జెడి చక్రవర్తి, శ్రీకాంత్‌, రవితేజ ఆ జనరేషన్‌ నుంచి తర్వాతి తరం సత్యదేవ్‌, కార్తికేయ దాకా అందరూ నాకు హార్డ్‌కోర్‌ ఫ్యాన్స్‌. దర్శకుల్లో బాబి, మెహర్‌ రమేశ్‌ లాంటివారు చాలామంది ఉన్నారు.

వారు సాధించేది ఏమీ లేదు...

ఒకప్పటి అభిమానులు వేరు. అభిమాన హీరో సినిమా వస్తే... థియేటర్ల దగ్గర పండగ వాతావరణం ఉండేది. పాలాభిషేకాలు చేసేవారు. వారు నిజంగా అభిమానించేవారు. ఇప్పుడు ఆ ఎక్సైట్‌మెంట్‌ పోయింది. దాని స్థానంలో సోషల్‌ మీడియాలో చీత్కారాలు, తిట్లు, ఒకరినొకరు ఆడిపోసుకోవటం ఎక్కువైపోయాయి. అంతా ఆన్‌లైన్‌ కాబట్టి బయటకు కనిపించమనే ధైర్యంతో తమ శాడిజాన్ని చూపించుకోవటానికి కొందరు సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. ఇలా మాట్లాడటంవల్ల వాళ్లకి శాడిస్టిక్‌ ప్లజర్‌.. చిన్న సంతృప్తి తప్పితే ఏం రాదు. సాధించేదీ ఏమి లేదు.

ప్రభుదేవాకు తెలిసిన బెస్ట్‌ డ్యాన్సర్‌

నా ఇన్‌స్పిరేషన్‌తోనే ప్రభుదేవా వచ్చాడు. ఆ తర్వాత ప్రభుదేవా నుంచి నేను కొంత మోడిఫై చేయగలిగాను. తను గొప్ప వైవిధ్యం ఉన్న డ్యాన్సర్‌. తను అనుకున్నది అనుకున్నట్లు నేను చేయగ లిగాను. వాణ్ణి అడిగితే ‘నాకు తెలిసిన బెస్ట్‌ డ్యాన్సర్‌ చిరంజీవే’ అంటాడు. ‘ప్రభు ఇంతమంది ఉన్నారు కదా... నాకే ఎందుకు చెబుతున్నావు ఇవన్నీ’ అంటే... ‘ఈ రోజు చిన్నపిల్లలు కూడా అద్భుతంగా చేస్తున్నారు. వాళ్లందరికీ ఇన్‌స్పిరేషన్‌ మీరు. మీకు మీరుగా క్రియేట్‌ చేసుకున్నారు. మీరు చేసి, మాకు నేర్పించారు. ఆ తర్వాత నేను కొంత నేర్చుకొని మీకు నేర్పగలిగాను. మిమ్మల్ని చూసిన ఫస్ట్‌ ఇంప్రెషన్‌ అలా నాపైన ఉండిపోయింది. యూ ఆర్‌ ద బెస్ట్‌ సార్‌’ అంటుంటాడు. అలాగే లారెన్స్‌. వాళ్లలో ఉన్న టాలెంట్‌ను గుర్తించి నేను వాళ్లకు అవకాశం ఇవ్వడం... వాళ్ల నుంచి నేను నా నుంచి వాళ్లు పరస్పర సహకారంతో ముందుకెళ్లగలిగాం.

హనుమంతుడే స్నేహితుడు...

చిన్నప్పటి నుంచి నేను హనుమంతుడినే పూజిస్తూ వచ్చా. నాకు దేవుడు, మిత్రుడు, మార్గదర్శి... అన్నీ ఆయనే. తనతోనే నా బాధలు, కోరికలు, ఆశలు, ఆలోచనలు పంచుకుంటూ ఉంటా. నేను చిన్నప్పటి నుంచి క్రమశిక్షణగా ఉండటానికి ఆయనే కారణం. ‘‘స్వామీ.. నేను ఎటువంటి అలవాట్లకూ లోనుకాను. నీ భక్తుడిగా క్రమశిక్షణగా ఉంటాను’’ అని చిన్నప్పుడే ప్రమాణం చేశా. ఆ ప్రమాణమే నన్ను ఇప్పటికీ ముందుకు నడిపిస్తోంది.

నచ్చిన డ్యాన్సర్‌ చిరంజీవే..!

ఎందుకంటే నా మూమెంట్స్‌ నేనే డిజైన్‌ చేసుకొనేవాడిని. ఎక్కడా ఏ సోర్స్‌ లేనప్పుడు నాకు నేనుగా ఇలా బాడీ మూమెంట్స్‌ చేస్తే బాగుంటుందని చేశాను. విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌లు చూసి నేర్చుకున్నాను. ‘బ్రేక్‌ డ్యాన్సా... ఇదేదో కొత్తగా ఉందే’ అని మన మాస్టర్స్‌కు చెప్పాను. ‘బ్రేక్‌ డ్యాన్స్‌ అని వస్తోంది. మొన్న లండన్‌ వెళ్లినప్పుడు చూశాను’ అని! నా వీడియో కెమెరాలో షూట్‌ చేసిన ఫీడ్‌ను సలీం, తారా మాస్టర్లకు చూపించి నేర్చుకున్నాను. నాకు రిఫరెన్స్‌లు లేవు.

అప్పట్లో ‘డేంజరస్‌’ అని మైఖేల్‌ జాక్సన్‌ ఆల్బమ్‌ విడుదలైంది. అమెరికా వెళ్లినప్పుడు, అక్కడ జాకెట్లు అమ్ముతుంటే ఒకటి కొనుక్కున్నాను. ఆ ఆల్బమ్‌లోని మూమెంట్స్‌ కొన్ని కెమెరాలో షూట్‌ చేసుకొని వచ్చి, దాన్ని కొరియోగ్రాఫర్లకు చూపించాను. ఆ జాకెట్‌ వేసుకొని ‘దొంగ’లో ‘గోలీమార్‌...’ సాంగ్‌ చేశాను.

సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - 2023-01-01T09:31:42+05:30 IST