పెళ్లి మంత్రాలే నాట్యాభినయమై
ABN , First Publish Date - 2023-05-08T00:16:53+05:30 IST
‘పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. కానీ నేటి సమాజంలో ఎన్ని జంటలు కడవరకూ కలిసి జీవిస్తున్నాయి? నాడు విడిపోవడమంటే చాలా పెద్ద విషయం.
‘మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా
కంఠేబధ్నామి సుభగే త్వం జీవ శరదాశ్శతం’...
పెళ్లిలో వధువు మెడలో వరుడు మంగళసూత్రం కట్టేటప్పుడు చదివే మంత్రం. కానీ దీని అర్థం ఎంతమంది వధూవరులకు తెలుసు? ఇదేకాదు... హిందూ సంప్రదాయ వివాహ మహోత్సవంలో ప్రతి క్రతువుకూ, ప్రతి మంత్రానికీ ఒక అర్థం, పరమార్థం ఉన్నాయి. వాటి ఆంతర్యాన్ని, ప్రత్యేకతను నేటి తరానికి తెలియజెప్పి... భారతీయ వివాహ వ్యవస్థను బలోపేతం చేయడానికి... కూచిపూడి నాట్యాన్ని సాధనంగా ఎంచుకున్నారు యువ నర్తకి నివేదిత వంగల. ‘వివాహ విశిష్టత’ను కళారూపంగా మలిచి, ప్రదర్శిస్తున్న ఆమెతో ‘నవ్య’ మాటామంతి.
‘‘పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. కానీ నేటి సమాజంలో ఎన్ని జంటలు కడవరకూ కలిసి జీవిస్తున్నాయి? నాడు విడిపోవడమంటే చాలా పెద్ద విషయం. కానీ ఇప్పుడు..! ఎంత త్వరగా వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారో... అంతే తొందరగా వేరుపడుతున్నారు. రాను రాను భార్యాభర్తల బంధాలు బలహీనపడుతున్నాయి. చిన్న చిన్న కారణాలకే ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతోంది. ఇది వారి కుటుంబానికే కాదు... సమాజానికి కూడా మంచిది కాదు. కుటుంబ వ్యవస్థ బాగుంటేనే కదా సమాజం బాగుండేది. ఈ ఆలోచనతోనే ‘వివాహ విశిష్టత’ కూచిపూడి నృత్య రూపకానికి అంకురార్పణ జరిగింది. ఈ కళారూపానికి మూల కారకులు పిరాట్ల బాలసుబ్రహ్మణ్యం గారు. చెన్నైలో ఉండేవారు. ఆయన ఇస్రోలో సైంటిస్ట్‌గా చేసేవారు. పదవీ విరమణ తరువాత హిందూ వైదిక సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిళ్లలో ఉచ్చరించే ప్రతి మంత్రానికీ, శ్లోకానికీ ఉన్న ప్రాముఖ్యం, విశిష్టత అందరికీ... ముఖ్యంగా వధూవరులకు అర్థమయ్యేలా చెప్పాలనేది ఆయన ఉద్దేశం. తద్వారా వివాహ బంధం బలంగా ఉంటుందని భావించారు. అందుకే సంస్కృతంలో ఉన్న మంత్రాలు, శ్లోకాలు అన్నిటినీ తెలుగులోకి అనువదించారు.
తొలుత డాక్యుమెంటరీగా...
వివాహ వేడుకలో పురోహితుడు మంత్రాలు చదువుతాడు. వధూవరులు ఆయన చెప్పింది చేసుకొంటూ వెళ్లిపోతారు. వేడుక అయిపోతుంది. కానీ తాళి ఎందుకు కడతారు? మూడు ముళ్లే ఎందుకు వేస్తారు? తలంబ్రాలు ఎందుకు పోస్తారు? అరుంధతిని ఎందుకు చూపిస్తారు? పెళ్లి చేసుకొంటే ఎంతటి నిబద్ధతో ఉండాలి? అంతమంది మధ్య అన్ని మంత్రాలతో చేసుకున్న పెళ్లికి ఉన్న ప్రాముఖ్యం ఏంటి? ఇలా ప్రతిదీ జనసామాన్యానికి అర్థమవ్వాలనే ఉద్దేశంతో ఆరంభం నుంచి తుది వరకు... అంటే పెళ్లికూతుర్ని చేయడం నుంచి అప్పగింతల వరకు ప్రతి క్రతువునూ తీసుకొని, తెలుగులోకి అనువదించి, అదే క్రమంలో కూర్పు చేశారు బాలసుబ్రమహ్మణ్యం గారు. ఒక డాక్యుమెంటరీగా రూపొందించారు. దాన్ని ఒక నృత్యరూపకంగా చేయాలన్నది ఆయన సంకల్పం.
పాటలుగా మార్చి...
బాలసుబ్రహ్మణ్యం గారి అనువాదాన్ని దండిబొట్ల వైకుంఠనారాయణమూర్తి గారు పాటలుగా మలిచారు. హైదరాబాద్‌లో ఉంటారు ఆయన. అరవైకి పైగా కూచిపూడి నృత్యరూపకాలు రాశారు. వీఎస్పీ శాస్త్రి గారు బాణీలు కట్టారు. నేను నృత్య దర్శకత్వం (కొరియోగ్రఫీ) వహించాను. అలా అందరి కృషితో ‘వివాహ విశిష్టత’ కళారూపం ఆవిష్కృతమైంది. కూచిపూడిలోనే ఎందుకంటే... ఒక కథను, దాని ప్రాధాన్యతను అందరికీ అర్థమయ్యేలా వర్ణించగలదు. ఏ అంశమైనా ఈ నాట్యాభినయం ద్వారా వీక్షకులకు త్వరగా చేరుతుంది. అంతకుముందు ప్రముఖ కూచిపూడి నాట్య గురువు శోభానాయుడు గారితో పాటు పలువురు కళాకారులు, సామవేదం షణ్ముకశర్మ గారి లాంటి పండితుల సూచనలు, సలహాలు తీసుకున్నాం. పరిశోధన చేశాం. వారందరి స్ఫూర్తితో నృత్య రూపకానికి తుది మెరుగులు అద్దాం. మొత్తం గంటా ఇరవై నిమిషాలసేపు సాగే కళారూపం ఇది. 2016లో చెన్నైలో పదిహేను మంది డ్యాన్సర్స్‌తో కలిసి తొలి ప్రదర్శన ఇచ్చాం. ఆహూతుల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘ఇలాంటి కళారూపం ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేశారు. అద్భుతం’ అంటూ కళాకారులు, కళాభిమానులు అభినందించారు.
ఆయన గుర్తుగా...
చివరిసారాగా గత నెలలో ఒక ప్రదర్శన ఇచ్చాం. కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెదముత్తేవిలోని శ్రీలక్ష్మీపతి స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. అక్కడే ఎందుకంటే... ‘వివాహ విశిష్టత’ నృత్య రూపకం స్వీకరణ, కూర్పు, అనువాదం బాలసుబ్రహ్మణ్యం గారు చేశారు. ఆయన స్వస్థలం అది. అనువాదానికి ముందు అక్కడ శ్రీకృష్ణాశ్రమం స్వామిజీ సలహాలు కూడా తీసుకున్నారు. అయితే గత ఏడాది బాలసుబ్రహ్మణ్యం గారు మరణించారు. ఆయన గుర్తుగా పెదముత్తేవిలో నిర్వహించాలని ఆలయ, ఆశ్రమ నిర్వాహకులు కోరారు. మా ప్రదర్శనకు అనూహ్య ఆదరణ లభించింది. ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి, సాంస్కృతిక వేదిక రవీంద్రభారతిల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. రెండు మూడు నెలల్లో ఈ కార్యక్రమాలు కూడా ఉంటాయి.
ఈతరం కోసం...
మా నృత్యరూపకం ఒక సామాజిక అంశానికి సంబంధించినది. ముఖ్యంగా నేటి తరాన్ని దృష్టిలో ఉంచుకొని రూపకల్పన చేసింది. ప్రభుత్వ, సాంస్కృతిక సంస్థల తోడ్పాటు కూడా ఉంటే దీన్ని మరింత మందికి చేరవేసే అవకాశం లభిస్తుంది. అలాగే మా ప్రదర్శనలన్నీ కలిపి ఒక డాక్యుమెంటరీగా రూపొందించి, యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచమంతటికీ చేరవేసే ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా ఇతర దేశాలవారికి భారతీయ వివాహ వ్యవస్థ గొప్పదనాన్ని చెప్పే ప్రయత్నం మాది.
• హనుమా
పదిమందికీ చేర్చాలని...
నాకు మొదటి నుంచీ డ్యాన్స్ అంటే మక్కువ. మా ఇంట్లోవాళ్లు నా ఇష్టాన్ని గమనించి, పదో ఏటనే నన్ను తీసుకువెళ్లి కూచిపూడి నాట్య శిక్షణలో చేర్పించారు. అది మొదలు ఇరవై రెండేళ్లుగా డ్యాన్స్‌తో నా అనుబంధం కొనసాగుతోంది. ఒక పక్క చదువుకొంటున్నా... డ్యాన్స్‌ను ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు. మా స్వస్థలం హైదరాబాద్‌లో ఎంబీయే తరువాత తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ డ్యాన్స్ చేశాను. ప్రస్తుతం డెలాయిట్‌లో కంప్లెయన్స్ ఎనలిస్ట్‌గా పని చేస్తున్నా. ఉద్యోగంతో పాటు నా నాట్యమూ కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో రెండు వందలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. అత్యద్భుత కళారూపం కూచిపూడి. దాన్ని మరింతమందికి చేరవేయాలన్న సంకల్పంతో 2013లో ‘శ్రీ నటేశ్వరీ ఫౌండేషన్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్’ ప్రారంభించాను. ప్రస్తుతం 75 మంది నా దగ్గర నేర్చుకొంటున్నారు. ఇక్కడ అభ్యసించినవారిలో చాలామంది సొంతంగా ఇనిస్టిట్యూట్‌లు నడుపుతూ, కూచిపూడిని విస్తరిస్తున్నారు. కొంతమంది కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు కూడా పొందారు. ఇవన్నీ చూసినప్పుడు నాకు సంతోషంగా, గర్వంగా ఉంటుంది.