చదువుతో జీవితాన్ని గెలవచ్చు
ABN , First Publish Date - 2023-05-25T00:36:57+05:30 IST
అచ్చం సినిమా కథను తలపిస్తుంది లంకా సీత జీవితం. అయితే, ఆమె కథలో హీరో, హీరోయిన్ అన్నీ తానే... విలన్ మాత్రం విధి. 19 ఏళ్లకే ఊరుకాని ఊరులో ఒంటరిగా జీవన పోరాటం

అచ్చం సినిమా కథను తలపిస్తుంది లంకా సీత జీవితం. అయితే, ఆమె కథలో హీరో, హీరోయిన్ అన్నీ తానే... విలన్ మాత్రం విధి. 19 ఏళ్లకే ఊరుకాని ఊరులో ఒంటరిగా జీవన పోరాటం సాగించడమేగాక, విజేతగా నిలిచిన ఆమె తన జీవితానుభవాలను, జ్ఞాపకాలను ‘నవ్య’తో పంచుకున్నారు.
‘‘పరిస్థితులకు తగినట్టుగా అవసరమే మనల్ని ముందుకు నడిపిస్తుంది... ఇదే నేను నమ్మిన సూత్రం. కాలం పెట్టిన విషమ పరీక్షలన్నింటినీ దాటి ఇవాళ ఇంత సంతోషంగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నానంటే అందుకు కారణం కూడా ఇదే. నేనంతగా అనుభవించిన కష్టాలేమిటి? అనుకుంటున్నారా! ఇది అరవై ఏళ్ల కిందటి మాట... నేను పుట్టిందీ, పెరిగిందీ పశ్చిమగోదావరి జిల్లా తణుకులో. మా నాన్న సోమంచి సీతారామ సోమయాజులు ఏలూరు జిల్లా కోర్టులో న్యాయమూర్తిగా పనిచేసేవారు. అక్కడే పదోతరగతి చదివాక పెళ్లి చేశారు. నా భర్త లంకా రామకృష్ణ శర్మ జాతీయ ప్రణాళికా సంఘం ఉద్యోగి కావడంతో నా చిరునామా దేశ రాజధానికి మారింది. అప్పటి వరకు అయితే ఇల్లు, లేదంటే స్కూలు... రిబ్బన్లు కొనుక్కోవడానికి కూడా ఎన్నడూ బజారు ముఖం ఎరుగను. అలాంటిది ఢిల్లీలో ఉండాలనగానే హడలెత్తిపోయాను. జీవితం సాఫీగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో పెద్ద కుదుపు. ఒక రోజు ఆయనకు తీవ్రమైన కడుపునొప్పి వస్తే పక్కింటివాళ్ల సహాయంతో ఆస్పత్రిలో చేర్పించాను. మరుసటి రోజు తెల్లవారుజామున నర్సు పిలిచి ‘హోతో మర్‌గయా’ అని చెబుతుంటే, నాకు అర్థంగాక అలానే పేపరు చదువుతూ కూర్చున్నాను. హిందీ రాదు కదా! మరొక నర్సు వచ్చి ఇంగ్లీషులో వివరిస్తుంటే కానీ నాకు తెలియరాలేదు ఆయన ఇకలేరని. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి చాలాకాలం పట్టింది.
కేంద్ర మంత్రిత్వ శాఖల్లో సేవలు...
పెళ్లి అయిన రెండేళ్లకే సంతోషాలన్నీ ఆవిరయ్యాయి. తర్వాత కారుణ్య నియామకం కింద ప్రణాళికా సంఘంలో టెక్నికల్ క్లర్క్ పోస్టు ఇచ్చారు. ఆఫీసుకు వెళ్లాలన్నా, సరుకులు కొనాలన్నా... ఇలా ఎక్కడికెళ్లాలన్నా మరొకరి మీద ఆధారపడటమే. అంత అశక్తురాలిని. మరోవైపు ఆయన పోయారనే బాధ. దాని నుంచి బయటపడేందుకు నాకు కనిపించిన మార్గం చదువు. పట్టుదల, ధైర్యం కూడా నాలో ఎక్కువే. సాధనతో రానిదేదీ లేదని నమ్ముతాను. ప్రభావతి అనే స్నేహితురాలి సహకారంతో ఇంటర్‌లో చేరాను. ఉత్తీర్ణత సాధించడంతో ఆత్మ విశ్వాసం కలిగింది. పంజాబ్ యూనివర్సిటీలో డిగ్రీ, తర్వాత ఎంఏ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ పూర్తి చేశాను. డిప్యుటేషన్ మీద స్వదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశోధన, రూపకల్పన విభాగంలో అనలిస్టుగా పదోన్నతి పొందాను. అదే శాఖ నుంచి ఇందిరాగాంధీ హత్యకు కారణాల అధ్యయనంలో... డేటా సేకరణ బృందానికి నేతృత్వం వహించాను. ఇలా ఒకటి, రెండు కాదు... కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని పలు అధ్యయన, అభివృద్ధి కార్యక్రమ విభాగాల్లో ముఫ్ఫైఏళ్లు పనిచేశాను. మరో నాలుగేళ్లు సర్వీసు ఉన్నా, చివరి దశలో మంచంలో ఉన్న అమ్మను చూసుకోవడం కోసం 1998లో స్వచ్ఛందంగా పదవీవిరమణ చేశాను.
జేఎన్‌యూలో చైనీస్ చదివా....
ఒకనాడు తెలుగు తప్ప ఇంకొక భాష తెలియని నేను, తర్వాత ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ, తమిళ, మలయాళ భాషలు నేర్చుకున్నాను. సీనియర్ ఎనలిస్టుగా కేంద్ర ప్రభుత్వ అధ్యయనాల నివేదికలను హిందీ, ఇంగ్లీషు భాషల్లో రాయాల్సి ఉంటుంది. కనుక ఆ అవసరమే నన్ను బహు భాషా ప్రవీణురాలుగా చేసింది. చైనా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద పీహెచ్‌డీ చేయాలనే కోరికతో, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో చైనీస్ భాషలో రెండేళ్ల పీజీ డిప్లొమా చదివాను. భారతీయ విద్యాభవన్‌లో పీజీ జర్నలిజం కూడా చేశాను. కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్‌లో అడ్వాన్స్డ్ కోర్సుతో పాటు ప్రత్యేక శిక్షణ పొందాను. వృత్తిరీత్యా నైపుణ్యాలు పెంచుకోవడం కోసం కోర్సులు చాలానే చేశాను. తద్వారా నన్ను నేను అప్‌డేట్ చేసుకుంటూ వచ్చాను. కానీ అమ్మ బాధ్యతల వల్ల పీహెచ్‌డీ మాత్రం పూర్తి చేయలేకపోయాను. ఏలూరు ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదివిన నేను జేఎన్‌యూ వరకు వెళ్లడం... అదొక గొప్ప అనుభూతి. అణ్వాయుధాలతో ప్రపంచ దేశాలను జయించవచ్చోలేదో నాకు తెలియదుకానీ, ‘చదువు అస్త్రంతో జీవితాన్ని గెలవచ్చు’ అని స్వీయానుభవం ద్వారా తెలుసుకున్నాను.
సేవా రంగంలోకి...
ఒకవైపు ఉద్యోగం, మరోవైపు చదువు కొనసాగిస్తునే... ఢిల్లీలో ఆనాటి మంత్రి కేఎల్ రావు భార్య వరలక్ష్మి లాంటి వాళ్లు నెలకొల్పిన ‘ఆంధ్ర వనితా మండలి’ సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేదాన్ని. అక్కడే నాకు తర్వాత కాలంలో కర్ణాటక మాజీ గవర్నరుగా పనిచేసిన వీఎస్ రమాదేవి పరిచయం అయ్యారు. ఆమె తుది వరకు నన్ను ఓ తోబుట్టువులా చూశారు. రమాదేవి రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌గా ఉన్న కాలంలో నేను నేరుగా పార్లమెంటులోకి వెళ్లేదాన్ని. సెక్యూరిటీ కూడా నన్ను రమాదేవి చెల్లెలు అనుకొని ఏమీ అనేవారు కాదు. నా పట్ల ఆమెకు అంత అవ్యాజమైన ప్రేమ. ‘‘నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తోంది’’ అంటూ దుర్గాబాయ్‌దేశ్‌ముఖ్ నన్ను ఓ సారి ప్రత్యేకంగా అభినందించారు. ఆంధ్ర వనితా మండలి కార్యదర్శిగా, తాత్కాలిక అధ్యక్షురాలిగా చాలాకాలం ఉన్నాను. ఆ సమయంలో నా ప్రత్యేక చొరవతో లీగల్ అవేర్‌నెస్ సెంటర్, ‘న్యాయవాణి’ పేరుతో బాధిత మహిళల న్యాయ సహాయ కేంద్రం ప్రారంభమయ్యాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజా సమస్యలపై అధ్యయనం చేయడంతో పాటు పేదరిక నిర్మూలనకు నా వంతుగా పనిచేయాలనే లక్ష్యంతో 2002లో ‘‘సీత ఆల్‌ఇండియా రీసెర్చ్ అండ్ సోషల్ స్టడీస్’’ (సాయిరాస్) అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాను.
గ్రామాలను దత్తత తీసుకున్నా...
‘సాయిరాస్’ ద్వారా ఢిల్లీ చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పటి వరకు 500కుపైగా ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించాం. మండవాలి, ఘాజీపూర్, జోషి కాలనీలను దత్తత తీసుకున్నాం. పేద విద్యార్థులకు చదువుకోవడానికి సహాయం చేస్తున్నాం. తాహిర్పూర్ కుష్ఠు రోగుల ఆశ్రమ నిర్వహణకు తోడ్పాటునందిస్తున్నాం. వైజాగ్‌లో ఒంటరి మహిళల కోసం జీవననైపుణ్య శిక్షణా కేంద్రాన్ని నిర్వహిస్తున్నాం. వాళ్లు తయారుచేసిన వస్తువులతో ఢిల్లీలోనూ చాలాసార్లు ప్రదర్శనలు ఇచ్చాం. ఆరోగ్యంతో పాటు న్యాయపరమైన విషయాలపై మహిళల్లో అవగాహన కల్పించేందుకు రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నాం. మన జీవితానికి మనమే శిల్పులం. మనల్ని మనం ఎలా మలుచుకుంటామనేది ముఖ్యం.
పెన్షనంతా సేవా కార్యక్రమాలకే...
ప్రతినెలా నాకు వచ్చే మొత్తం పెన్షన్‌ను మా ‘సాయిరాస్’ సంస్థ సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నాను. దానికితోడు బంధు, మిత్రులు విరాళాలు అందిస్తుంటారు. నాకు పిల్లలు లేరు. ఆ బాధ కూడా లేదు. మా తోబుట్టువుల పిల్లలంతా నా పిల్లలే! ఇప్పుడు నా వయసు 82 ఏళ్లు. ఇవాళ ఇంత ఆనందంగా ఉన్నానంటే, అదంతా చదువు వల్లనే! కనుక అమ్మాయిలకు ఆభరణాలు చేయించకపోయినా పరవాలేదు... చదువు మాత్రం తప్పనిసరిగా చెప్పించాలి. అదే వాళ్లకు పెద్ద ఆభరణం, ఆసరా అవుతుంది. నేను ఆనాడు చదువుకున్నాను కనుకనే... 19వ ఏట భర్తపోయినా, జీవితాన్ని నెగ్గుకురాగలిగాను. ఆభరణాలు ఇవ్వలేని ఆత్మస్థైర్యాన్ని చదువు ఇస్తుంది.’’
ఫ కె. వెంకటేశ్