ఎల్‌ఈడీ క్లినిక్‌

ABN , First Publish Date - 2023-01-25T23:22:13+05:30 IST

ఇంట్లో ఎల్‌ఈడీ బల్బు పాడైతే ఏంచేస్తాం? తీసి చెత్తకుప్పలో పడేస్తాం. అంతేగా! కానీ ఇకపై ఆ అవసరం లేదంటున్నారు కేరళలోని

ఎల్‌ఈడీ క్లినిక్‌

ఇంట్లో ఎల్‌ఈడీ బల్బు పాడైతే ఏంచేస్తాం? తీసి చెత్తకుప్పలో పడేస్తాం. అంతేగా! కానీ ఇకపై ఆ అవసరం లేదంటున్నారు కేరళలోని ‘హరితకర్మ సేన’ మహిళలు. తమ ‘ఎల్‌ఈడీ క్లినిక్‌’కు తెస్తే... వాటికి ‘చికిత్స’ చేసి... మళ్లీ వెలిగిస్తామంటున్నారు. ఐదుగురు మహిళలు కలిసి తెరిచిన ఈ క్లినిక్‌ విశేషాలు వారిలో ఒకరైన దీప మాటల్లో...

‘‘ఎలక్ర్టానిక్‌ వస్తువులు ఏవైనా సరే పని చేయకపోతే రిపేరింగ్‌ సెంటర్లున్నాయి. అదేవిధంగా ఎల్‌ఈడీ బల్బులకు కూడా ఎందుకు ఉండకూడదు అనే ఆలోచనే ఈ ‘డ్రీమ్‌లైట్‌ ఎల్‌ఈడీ క్లినిక్‌’కు పునాది. అంతేకాదు... నిత్యం టన్నులకొద్దీ ఎలక్ర్టానిక్‌ వ్యర్థాలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. భూమికి భారమై, పర్యావరణానికి హానికరంగా పరిణమిస్తున్నాయి. ఆ కాలుష్యాన్ని కొంతైనా తగ్గించగలిగితే ప్రకృతికి మేలు చేసినవారమవుతాం. ఈ సంకల్పంతోనే ఐదుగురు మహిళలం కలిసి ఐదేళ్ల కిందట ‘ఎల్‌ఈడీ క్లినిక్‌’ ప్రారంభించాం. నాతోపాటు అనితా ప్రమోద్‌, రాధా వేణుగోపాల్‌, సౌమ్యా రథీష్‌, ప్రమీలా గిరీష్‌ ఇందులో భాగస్వాములు. ఎడక్కట్టువయల్‌లోని కంజీరమట్టొమ్‌ రైల్వేస్టేషన్‌ దగ్గర ఉంటుంది మా క్లినిక్‌.

జీవనాధారం కూడా...

మా పంచాయతీ ఆధ్వర్యంలో ఒకసారి ఎల్‌ఈడీ తయారీలో వర్క్‌షాప్‌ నిర్వహించారు. అందులో శిక్షణ తీసుకొనే సమయంలోనే మా ఐదుగురికీ పరిచయం అయింది. అక్కడ అలా కలిసిన మేం... శిక్షణలో నేర్చుకున్నది వదిలేయకూడదని నిర్ణయించుకున్నాం. అక్కడ సంపాదించిన నైపుణ్యం మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ‘కుటుంబశ్రీ’ ద్వారా రుణం తీసుకుని క్లినిక్‌ మొదలుపెట్టాం. ఇక్కడ కేవలం రిపేర్లే కాకుండా, ఎల్‌ఈడీ బల్బుల ఉత్పత్తి కూడా చేస్తున్నాం. తరువాత దీన్ని ఒక అంకుర సంస్థగా మార్చి... మా అందరికీ జీవనాధారంగా మలుచుకున్నాం.

పారేయద్దు... పట్టుకురండి...

ఎల్‌ఈడీ బల్బు పని చేయకపోతే... పక్కన పడేస్తాం. కానీ వాటిని కూడా బాగు చేయవచ్చని చాలామందికి తెలియదు. అందుకే మా క్లినిక్‌ ఆరంభించిన మొదట్లో చుట్టుపక్కలవారికి ఒక్కటే విజ్ఞప్తి చేశాం... ‘పారేయద్దు... పట్టుకురండి. మళ్లీ వెలిగిస్తాం’ అని. పాడైన బల్బుల రిపేరుకు నలభై రూపాయలు చార్జి చేస్తున్నాం. మేం బాగుచేసిన బల్బులు అచ్చం కొత్తవాటిలానే కాంతినిస్తాయి. ఒకవేళ కొత్తది కావాలంటే కెపాసిటీని బట్టి వంద నుంచి రెండు వందల రూపాయల వరకు విక్రయిస్తున్నాం. సీరియల్‌ ఎల్‌ఈడీ బల్బులు కూడా తయారు చేస్తున్నాం. వీటికి గ్యారెంటీ కూడా ఇస్తున్నాం. దీనివల్ల వినియోగదారులకు ఎంతో డబ్బు ఆదా అవుతుంది. పర్యావరణానికి కొంతైనా మేలు జరుగుతుంది. క్రమంగా మా క్లినిక్‌ గురించి అందరికీ తెలిసింది. మా వద్దకు వచ్చేవారితో పాటు ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. మొన్న క్రిస్టమస్‌, న్యూఇయర్‌లకు అయితే ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా ఆర్డర్లు వచ్చాయి.

మా స్ఫూర్తితో...

మాతోపాటు మరికొంతమంది మహిళలకు దీని ద్వారా ఉపాధి కల్పించగలుగుతున్నాం. ఆసక్తి ఉన్నవారికి ఉచితంగా శిక్షణనిస్తున్నాం. మా క్లినిక్‌ను ఎంతో మంది అధికారులు సందర్శించారు. అభినందించారు. ఈ స్ఫూర్తితో దీన్ని మోడల్‌గా తీసుకొని స్థానికంగా ఉన్న స్వయంసహాయక బృందాల్లోని మహిళలకు బల్బుల రిపేరింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. ‘కేరళ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లోకల్‌ అడ్మినిస్ర్టేషన్‌’ పంపా నది తీర ప్రాంతాల్లోని పంచాయతీల్లో ఇప్పటికే ఈ తరహా క్లినిక్‌లు ప్రారంభించింది.

ఎంతో ఆదా...

ఎల్‌ఈడీ బల్బులనగానే మనం ఇంట్లో ఉపయోగించే వాటి గురించే ఆలోచిస్తాం. కానీ వీధి దీపాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించేవి లెక్కకు మించి ఉంటాయి. ఉదాహరణకు మా పంచాయతీ తీసుకొంటే... అన్నీ కలిపి ఐదు వందల బల్బులు ఉన్నాయి. ఇంతకముందు ఇవి చెడిపోతే చెత్తకుప్పలో పడేయడం మినహా వేరే ఆలోచన ఉండేది కాదు గతంలో. దీనివల్ల ఎలక్ర్టానిక్‌ వ్యర్థం ఏ స్థాయిలో పేరుకుపోతుందో... ఫలితంగా ప్రకృతికి ఎంత హాని జరుగుతుందో ఊహలకు అందదు. అదే రిపేరు చేసి తిరిగి ఉపయోగించడంవల్ల ప్రభుత్వానికి పెద్దమొత్తంలో డబ్బు కూడా ఆదా అవుతుంది. అధికారులు అనుభవపూర్వకంగా ఈ విషయం తెలుసుకున్నారు కనుకనే నేడు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ‘ఎల్‌ఈడీ క్లినిక్‌’లు వెలుస్తున్నాయి. అయితే వాటిని మాకు పోటీగా ఎప్పటికీ భావించం. ఎందుకంటే మా స్ఫూర్తితో ఇంతమంది ఉపాధి పొందుతున్నారన్న సంతృప్తి, సంతోషానికి మించింది మాకు ఏదీ లేదు.’’

Updated Date - 2023-01-25T23:22:14+05:30 IST