Lakshadhikari : ‘లక్షాధికారి’కి షష్టి పూర్తి
ABN , First Publish Date - 2023-10-01T03:27:02+05:30 IST
‘లక్షాధికారి’... మా నాన్న తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి తొలి చిత్రం. ఎన్‌టీ రామారావు గారితో తీశారు. 1963 సెప్టెంబరు 27న విడుదలైంది. అంటే సరిగ్గా 60 సంవత్సరాలైంది.
‘లక్షాధికారి’... మా నాన్న తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి తొలి చిత్రం. ఎన్‌టీ రామారావు గారితో తీశారు. 1963 సెప్టెంబరు 27న విడుదలైంది. అంటే సరిగ్గా 60 సంవత్సరాలైంది. తెలుగులో తొలి సస్పెన్స్ థ్రిల్లర్. డీవీ రెడ్డి గారి భాగస్వామ్యంతో ‘రవీంద్ర ప్రొడక్షన్స్’ నెలకొల్పి, నాన్న గారు తీసిన చిత్రమది. తరువాత ఆ బ్యానర్‌ను ‘రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్’గా మార్చారు. లోగోలో రవీంద్రనాథ్ ఠాగూర్ సిలౌటీ, అందులో దాస్య శృంఖలాలు తెంచుకొంటున్న కార్మికుడి బొమ్మ వేసి, కింద ‘స్వాతంత్య్రం, శాంతి, అభ్యుదయం మానవాళి ధ్యేయం’ అనే క్యాప్షన్ పెట్టారు. తెర మీద లోగో కనిపిస్తుంటే... '
‘విశ్వవిజ్ఞాన గీతికల్ వెలుగు చోట/ నిర్భయముగ స్వేచ్ఛా జీవి మలుగు చోట/
మానవుడు పరిపూర్ణుడై మలచు చోట/ మాతృదేశమా అచటనే మనగదమ్మా’
...అని బ్యాక్‌గ్రౌండ్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ ‘గీతాంజలి’లోని ఒక కవిత వినిపిస్తుంటుంది. నాన్నగారే దీన్ని తెలుగులోకి అనువదించినట్టున్నారు. స్వతంత్రం అంటే ఎలా ఉండాలో ‘గీతాంజలి’లో చెప్పినదాన్ని ఆయన ఇలా వాడారు.
ఇక ‘లక్షాధికారి’ విషయానికి వస్తే... దర్శకుడిగా మధుసూదన్‌రావు గారిని, రచయితగా నార్ల చిరంజీవి గారిని, తాతినేని చలపతిరావు గారిని సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు. కృష్ణకుమారి కథానాయిక. రామారావు గారికి కూడా సస్పెన్స్ థ్రిల్లర్ చేయడం అదే మొదటిసారి. కృష్ణకుమారి గారికి స్విమ్ సూట్ వేశారు. నాకు గుర్తున్నంత వరకు తెలుగులో హీరోయిన్ స్విమ్మింగ్ డ్రెస్ ధరించడం అదే తొలిసారి. అలాగే అప్పటివరకు ఉదాత్తమైన పాత్రలు చేస్తున్న గుమ్మడి ఆ చిత్రంలో విలన్‌గా నటించారు. విలన్ పాత్రలు పోషించేవారితో అయితే చివరి వరకు ఉత్కంఠ ఉండదని గుమ్మడిని ఎంచుకున్నారు. ఇవన్నీ సినిమాకు హైలైట్స్ అయ్యాయి. సి.నారాయణరెడ్డి గారి ‘మబ్బులో ఏముంది’ పాటను డ్యూయెట్‌గా వాడుకున్నారు. అది లలిత గీతం. ఆలిండియా రేడియోలో వినిపించేది. చిత్రంలో మిగిలిన పాటలు కూడా సూపర్‌హిట్ అయ్యాయి. సినిమా బడ్జెట్ నాలుగున్నర లక్షలు. సినిమా బాగా ఆడింది. సెకండ్ రిలీజ్‌లో అంతకు మించి ఆడింది. ఎన్టీఆర్ ప్రత్యేక చిత్రాల్లో అది ఒకటిగా నిలిచిపోయింది.
ఈ సినిమా తరువాత నాన్న ఎన్నో సినిమాలు చేశారు. నాగేశ్వరరావు గారితో ‘జమిందారు, ధర్మదాత, దత్తపుత్రుడు’, శోభన్‌బాబు గారితో ‘సిసింద్రీ చిట్టిబాబు, డాక్టర్ బాబు, ఇద్దరు కొడుకులు’, కృష్ణంరాజు గారితో ‘అమ్మానాన్న’... ఇలా చాలా సినిమాలు తీశారు.
సొంత బ్యానర్ స్థాపించకముందు నాన్న సారథి స్టూడియోస్‌లో జనరల్ మేనేజర్‌గా ఉండేవారు. ఆయన సినీ ప్రయాణం ఎన్టీఆర్‌తోనే మొదలైంది. ‘పల్లెటూరు’ చిత్రం ప్రొడక్షన్ మేనేజర్‌గా తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టారు. అంతకుముందు కృష్ణా జిల్లాలో ఉండకూడదని నాన్నకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందట. దాంతో మద్రాసు వెళ్లి, ప్రైవేట్లు చెప్పేవారు. ఆ సమయంలోనే ‘పల్లెటూరు’ సినిమాలో ప్రొడక్షన్ మేనేజర్‌గా అవకాశం వచ్చింది. ప్రకాశరావు గారు, వి.మధుసూదన్‌రావు గారు... ఎన్టీఆర్ కూడా... వీళ్లంతా ‘ప్రజా నాట్యమండలి’లో పని చేసినవారే కాబట్టి, అంతా కలిసి ఆ సినిమా చేశారు. ఒకరకంగా చెప్పాలంటే... ఆ చిత్రంతో వాళ్ల జీవితాలను తిరిగి ప్రారంభించారు. ఆ తరువాత నాన్న ‘సారథి ఫిలిమ్స్’లో చేరారు.
‘లక్షాధికారి’లో ఎన్టీఆర్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ వాడతారు. నాకు తెలిసి ఆ బైక్ ఆయన కొనుక్కున్నదే. దాన్నే సినిమాలో వాడామని అప్పట్లో నాన్న చెప్పారు. అంటే ఆర్టిస్టులు కూడా అనవసరంగా బడ్జెట్‌ను పెంచేవారు కాదు.
1955లో ‘రోజులు మారాయి’ విడుదలైంది. 100 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా అది. ఆ చిత్రం విజయోత్సవానికి హైదరాబాద్ వచ్చినప్పుడు... ఇక్కడ స్టూడియో నెలకొల్పాలని రామకృష్ణ ప్రసాద్ అనుకున్నారు. ఆ బాధ్యత నాన్న గారికి, సీవీఆర్ ప్రసాద్ గారికి అప్పగించారు. దాంతో వారు ఇప్పుడున్న ‘సారథి స్టూడియో’ సైట్ చూశారు. చదువు కోసం మేం ముందే హైదరాబాద్ వచ్చేశాం. స్టూడియో నిర్మాణానికి ఏడాది పట్టింది. 1956 ప్రాంతంలో నాన్నావాళ్లు పూర్తిగా ఇక్కడకు వచ్చేశారు. వీళ్లంతా అప్పుడు నెల జీతగాళ్లు. తరువాత 1960-61 ప్రాంతంలో సొంతగా సినిమా తీద్దామనుకుని ‘లక్షాధికారి’ నిర్మించారు.
ఈ చిత్రం విడుదలై అరవై ఏళ్లు అయిన సందర్భంగా ఇలా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో మధురానుభూతులు మళ్లీ మదిలో మెదిలాయి. అవే మీతో పంచుకున్నాను.
తమ్మారెడ్డి భరద్వాజ (దర్శకనిర్మాత)