Kolla Sushmita Chaudhary: ‘రాత’ మార్చుకున్న ప్రొఫెసర్‌

ABN , First Publish Date - 2023-08-15T23:30:58+05:30 IST

గులాబీ మొక్కకు అంటుకట్టి.. అందంగా,పద్ధతిగా.. మట్టిలో నాటి.. నీరు పోసి.. ప్రకృతిలో కుదురుకునేట్లు చేసినట్లుంటాయి ఆమె రాసే అక్షరాలు. ఆమే కొల్ల సుస్మితా చౌదరి. ప్రస్తుతం గుంటూరులో సివిల్‌ ఇంజనీర్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సుస్మిత ఇటీవలే ‘మహిళా రక్షణ’ అంశంపై రాసిన కాలిగ్రఫీ పోటీల్లో రాష్ట్రస్థాయి అవార్డు సాధించారు. ఈ సందర్భంగా ‘నవ్య’తో ఆమె పంచుకున్న విశేషాలివి.

Kolla Sushmita Chaudhary: ‘రాత’ మార్చుకున్న ప్రొఫెసర్‌

గులాబీ మొక్కకు అంటుకట్టి.. అందంగా,పద్ధతిగా.. మట్టిలో నాటి.. నీరు పోసి.. ప్రకృతిలో కుదురుకునేట్లు చేసినట్లుంటాయి ఆమె రాసే అక్షరాలు. ఆమే కొల్ల సుస్మితా చౌదరి. ప్రస్తుతం గుంటూరులో సివిల్‌ ఇంజనీర్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సుస్మిత ఇటీవలే ‘మహిళా రక్షణ’ అంశంపై రాసిన కాలిగ్రఫీ పోటీల్లో రాష్ట్రస్థాయి అవార్డు సాధించారు. ఈ సందర్భంగా ‘నవ్య’తో ఆమె పంచుకున్న విశేషాలివి.

చదువుల్లో ముందుండేదాన్ని. స్కూలింగ్‌లో ప్రతి ఏడాది ప్రధానమంత్రి స్కాలర్‌షిప్‌ అందుకునేదాన్ని. కాలిగ్రఫీ విషయానికొస్తే.. దాదాపు ఏ భాష అయినా అచ్చు అలానే రాయటానికి ప్రయత్నిస్తా. స్ర్టోక్స్‌ పర్ఫెక్ట్‌గా రాస్తా. చాలామంది ఇంక్‌పెన్‌తో హ్యాండ్‌రైటింగ్‌ రాస్తారు. అయితే నేను బాల్‌ పెన్‌తో రాస్తా. ఇటీవలే ‘ఉమెన్‌ ప్రొటెక్షన్‌’ సబ్జెక్టు మీద కాలిగ్రఫీ పోటీ పెట్టారు. అందులోని కంటెంట్‌, రాత వల్ల అవార్డుకు ఎంపికయ్యానని నిర్వాహకులు చెప్పారు. కాలేజీ తరఫున పంపించమన్నారని.. మనసులోని ఆలోచనలను రాసి పంపాను. పెద్దగా సమయం తీసుకోలేదు. నాలుగువేల మందికి పైగా పాల్గొన్న పోటీలో ప్రథమ ర్యాంకు రావటం ఎన్నటికీ మర్చిపోలేను! ఏకాగ్రత, పాజిటివ్‌ మూడ్‌తో పని చేస్తే మంచి ఫలితాలొస్తాయని మా నాన్న చెప్పేవారు. నాన్న ఉంటే ఈ విజయాన్ని చూసి ఎంతో ఆనందపడేవారు!

‘‘వారం నుంచి ఒకటే.. శుభాకాంక్షల వెల్లువ. బంధువులు, విద్యార్థులు, చిన్ననాటి స్నేహితులూ కాల్స్‌ చేసి కంగ్రాట్స్‌ చెబుతున్నారు. వాట్సప్‌ మెసేజులు చదువుకునే కొద్దీ ఉంటున్నాయి. అమెరికా, దక్షిణాఫ్రికా.. లాంటి దేశాలనుంచీ శుభాకాంక్షల సునామీ నడుస్తోంది. గూగుల్‌ ట్రెండ్స్‌లో కొన్ని గంటల పాటు ఉన్నాను. ఇదంతా కలా? నిజమా? అనిపించింది. అక్షరాలకు ఇంత మహత్తుందని తెలిసింది. ఆలిండియా హ్యాండ్‌ రైటింగ్‌ అండ్‌ కాలిగ్రఫీ వారు నిర్వహించిన ‘ఉమెన్‌ ప్రొటెక్షన్‌’ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టానికి గానూ మొదటి స్థానంలో నిలిచా. త్వరలో కేంద్రమంత్రితో అవార్డు తీసుకోబోతున్నాననే వార్త.. ఇలా గ్రీటింగ్స్‌తో నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ క్షణంలో ‘థ్యాంక్యూ డాడ్‌’ అని చెప్పా. అసలు చేతిరాతకు ఇంతటి ఆదరణ ఉంటుందనీ.., ఒక్కమాటలో తలరాతనే మారుస్తుందని... అనుకోలేదెన్నడూ!

అలా బాల్యం నుంచీ...

ఎందుకో తెలీదు కానీ.. చిన్నప్పటి నుంచి రాయటం ఇష్టం. మా నాన్న కేంద్రస్థాయి సంస్థల్లో పని చేయటం వల్ల.. పశ్చిమ బెంగాల్‌, ఒరిస్సా, వైజాగ్‌.. ఇలా పలుప్రాంతాలకు బదిలీ అయ్యేవారు. దీంతో నా బాల్యం పలుచోట్ల గడిచింది. దీంతో తెలుగు యాస మారిపోయింది. చిన్నప్పుడు బెంగాళీనే మాట్లాడేదాన్ని. నాకో తమ్ముడు ఉన్నాడు. ఇక చేతిరాత విషయానికొస్తే.. మా నాన్న ఓఎన్‌జీసీలో పని చేసేప్పుడు మేం నర్సాపూర్‌లో ఉండేవాళ్లం. అక్కడ ఓ హెడ్‌ మాస్టర్‌ ఉండేవారు. ఆయన ఇంగ్లీష్‌ కర్సీ రైటింగ్‌ రాయమని ప్రోత్సహించేవారు. మెచ్చు

కోలుకోసం రాస్తూ రాస్తూ.. అందంగా రాయటం నేర్చుకున్నా. అలా రెండున్నరేళ్ల పాటు అలా ప్రతిరోజూ ఏదోటి రాస్తూనే ఉండేదాన్ని. ఏడో తరగతికి వచ్చాక..

రాయటం కొన్నాళ్లు ఆపేశా.

ఇంజనీరింగ్‌లో మెటీరియల్స్‌.. .

వాస్తవానికి ఏరోనాటికల్‌ స్పేసెస్‌ చదవాలనుకున్నా. కుదర్లేదు. చిన్నప్పటి నుంచీ డ్రాయింగ్‌ బాగా వేసేదాన్ని. దీంతో గుంటూరులోని మలినేని ఇంజనీరింగ్‌ కాలేజీలో సివిల్‌ ఇంజనీరింగ్‌లో జాయినయ్యా. ఏదో దొరికిన మెటీరియల్‌ తీసుకుని చదువుకోవటం ఇష్టం ఉండేది కాదు. దీంతో లైబ్రరీకి వెళ్లి సొంతంగా నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకునేదాన్ని. ఇచ్చే నాలుగు సెట్స్‌లో అన్ని ప్రశ్నలు-సమాధానాలతో రాసేదాన్ని. రాస్తుంటే చేతులు నొప్పి కలిగేవి. అయినా ఆపకపోయేదాన్ని. ఎందుకో తెలీదు.. రాస్తుంటే మూడ్‌ బావుండేది. మెటీరియల్స్‌ నీట్‌గా, అందమైన రాత ఉండటంతో స్నేహితులెంతో మెచ్చుకునేవారు. నేను పరీక్షలకోసం రాసుకున్న మెటీరియల్స్‌ను తీసుకుని జిరాక్స్‌ చేయించుకునేవాళ్లు. ఇంతటి సహనం ఎక్కడిదీ? అంటూ విద్యార్థులతో పాటు లెక్చరర్లు అడిగేవారు. నాకైతే మామూలే అనిపించేది. నేను రాసిన మెటీరియల్స్‌ ఇతర బిటెక్‌ కాలేజీల్లోని విద్యార్థులు కూడా చదువుతున్నారని తెలిసింది. ఎంతో ఆశ్చర్యపోయా. ఆ తర్వాత ఆర్వీయార్‌ కాలేజీలో ఎమ్‌.టెక్‌ చేశా. అది కూడా సివిల్‌ ఇంజనీరింగ్‌లో స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌ చేశా.

అదే నా లక్ష్యం...

మా నాన్నగారి పేరు కొల్లా శ్రీనివాసరావు. క్రమశిక్షణతో పెంచారు. నేను నాన్నకూచిని. నాన్నే నా స్ఫూర్తి. మా నాన్న 2019 ఆగష్టులో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ప్రొఫెసర్‌గా ఆర్వీయార్‌ కాలేజీలో 2014 నుంచి 2018 సంవత్సరం వరకూ చేశా. ఏడాదిపాటు ఓ ఇంజనీర్‌ దగ్గర పనిచేసి మళ్లీ 2019లో టీచింగ్‌ వైపు వచ్చా. సివిల్‌ ఇంజనీరింగ్‌ బోధిస్తా. సిఎ్‌ససి సబ్జెక్టు కూడా చెబుతా. ప్రస్తుతం విజయవాడలోని హిందూ ఇంజనీరింగ్‌ కాలేజీలో హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌లో సివిల్‌ ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌ను. మా ఆయన మెకానికల్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. మాకు మూడేళ్ల కొడుకు ఉన్నాడు. ఇంటితో పాటు కాలేజీ ప్రొఫెసర్‌ బాధ్యత, పర్సనల్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌ చేసుకుంటూ నడుస్తున్నా. ఏదైమైనా టీచింగ్‌ చేయటం ఇష్టం. చేతిరాత ప్యాషన్‌. ఒక్కమాటలో ప్రాణం. ఎంతో సహనం అలవడింది చేతిరాతతోనే. ఇక భవిష్యత్‌లో సివిల్‌ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేయాలన్నదే లక్ష్యం.

- రాళ్లపల్లి రాజావలి

Updated Date - 2023-08-15T23:30:58+05:30 IST