Share News

Newly introduced Heroinees : తొలి అడుగుతో మురిపించని ముద్దుగుమ్మలు

ABN , Publish Date - Dec 24 , 2023 | 02:48 AM

మన సినిమాల్లో హీరోలదే డామినేషన్‌ అయినా కథానాయిక ప్రాధాన్యం తక్కువేం కదు. హీరో తర్వాత ప్రేక్షకులు అడిగేది హీరోయిన్‌ ఎవరనేదే. అందుకే దర్శకులు కూడా తమ సినిమాల్లో

Newly introduced Heroinees : తొలి అడుగుతో మురిపించని ముద్దుగుమ్మలు

మన సినిమాల్లో హీరోలదే డామినేషన్‌ అయినా కథానాయిక ప్రాధాన్యం తక్కువేం కదు. హీరో తర్వాత ప్రేక్షకులు అడిగేది హీరోయిన్‌ ఎవరనేదే. అందుకే దర్శకులు కూడా తమ సినిమాల్లో ఫామ్‌లో ఉన్న కథానాయికలను నటింపజేయాలని చూస్తారు. మరికొందరు మాత్రం కొత్తందాలను వెండితెరకు పరిచయం చేస్తుంటారు. అలా 2023లో తెలుగు తెరకు కొత్తగా పరిచయమైన ముద్దుగుమ్మల ముచ్చట్లు తెలుసుకుందాం.

ఈ ఏడాది పలువురు పరభాషా తారలు కథానాయికలుగా తెలుగు తెరపై సందడి చేశారు. అయితే ఇందులో హిట్టు కొట్టిన వాళ్లు మాత్రం ఒకరిద్దరే ఉన్నారు. ఉత్తరాది తారలు నూపుర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్‌ ఒకే చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. రవితేజ హీరోగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’లో వీరు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా వారిద్దరికీ నిరాశనే మిగిల్చింది. ‘టైగర్‌...’ తెలుగులో యావరేజీ టాక్‌తో నడి చింది. బాలీవుడ్‌ జనాలు పట్టించుకోలేదు. దీంతో టాలీవుడ్‌లో ఈ భామలిద్దరికీ మంచి బోణీ దక్కలేదు.

సాక్షి వైద్య

అక్కినేని అఖిల్‌ కథానాయకుడిగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఏజెంట్‌’. ఈ భారీ బడ్జెట్‌ చిత్రంపై అనౌన్స్‌మెంట్‌తోనే హైప్‌ ఏర్పడింది. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌తో సాక్షి వైద్య కథానాయికగా పరిచయమయ్యారు. కానీ ‘ఏజెంట్‌’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ఫలితంగా సాక్షి వైద్యకు తెలుగులో తొలి చిత్రం అచ్చిరాలేదు. వరుణ్‌తేజ్‌తో నటించిన ‘గాంఢీవధారి అర్జున’ చిత్రం కూడా డిజాస్టర్‌ అయింది.

ఆషికా రంగనాథ్‌

కన్నడ, తమిళ చిత్రాల్లో కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆషికా రంగనాథ్‌. ఆమె ఈ ఏడాది హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. కల్యాణ్‌రామ్‌ హీరోగా భారీ అంచనాలతో వచ్చిన ‘అమిగోస్‌’తో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. రాజేందర్‌ రెడ్డి దర్శకుడు. ఇందులో కల్యాణ్‌రామ్‌ త్రిపుల్‌ రోల్‌ చేశారు. అయితే ఈ సినిమా పాయింట్‌లో ఉన్న కొత్తదనం కథనంలో లేకపోవడంతో ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఆమె నటించిన రెండో తెలుగు చిత్రం ‘నా సామిరంగా’ సంక్రాంతికి విడుదల కానుంది.

ప్రియా భవానీ శంకర్‌

సంతోష్‌ శోభన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కల్యాణం కమనీయం’తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు ప్రియా భవానీ శంకర్‌. తొలి ప్రయత్నం ఆమెకు అపజయాన్నే మిగిల్చింది. ఈ చిత్రాన్ని అనిల్‌ కుమార్‌ ఆళ్ల తెరకెక్కించారు. ఇందులో ఆమె అభినయానికి చక్కటి మార్కులే పడినా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రియ ప్రస్తుతం సత్యదేవ్‌ సరసన నటించిన ‘జీబ్రా’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళంలో ‘ఇండియన్‌ 2’ చిత్రం చేస్తున్నారు.

అనికా సురేంద్రన్‌

అర్జున్‌దాస్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘బుట్టబొమ్మ’. ఘన విజయం అందుకున్న మలయాళ చిత్రం ‘కప్పేలా’కు ఇది రీమేక్‌. ఈ చిత్రంతో అనికా సురేంద్రన్‌ కథానాయికగా తెలుగు సీమకు పరిచయం అయ్యారు. శౌరీ చంద్రశేఖర్‌ రమేశ్‌ దర్శకత్వం వహించారు. ఇందులో అమాయక గ్రామీణ యువతిగా అనికా నటన ప్రేక్షకులను మెప్పించింది. కానీ సినిమా స్లో నెరేషన్‌, సస్పెన్స్‌ తుదికంటా కొనసాగించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీంతో తొలి సినిమా అనికా కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు.

జాన్వీకపూర్‌

అగ్రహీరోలందరి సరసన ఆడిపాడి తెలుగు ప్రేక్షకులను అలరించిన అందాల తార శ్రీదేవి. ఆమె కూతురు జాన్వీకపూర్‌ బాలీవుడ్‌లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇప్పటిదాకా ఆమె తెలుగులో స్ట్రెయిట్‌ చిత్రం చేయలేదన్న లోటు తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. అది కాస్తా ఎన్టీఆర్‌ ‘దేవర’ చిత్రంతో తీరుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదలవుతోంది.

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తోన్న ‘ప్రాజెక్ట్‌ కె 2898 ఏడీ’ చిత్రంతో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దీపికా పదుకోన్‌ తెలుగు తెరపై ఎంట్రీ ఇస్తున్నారు. టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీపిక ఇందులో యాక్షన్‌ రోల్‌ చేస్తున్నారు.

వచ్చే ఏడాదికి సిద్ధం- మాళవికా మోహనన్‌

ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హారర్‌ జానర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మాళవికా మోహనన్‌ కథానాయిక. విజయ్‌ హీరోగా నటించిన ‘మాస్టర్‌’ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇప్పుడు ఏకంగా ప్రభాస్‌ సరసన కథానాయికగా అవకాశాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Dec 24 , 2023 | 02:48 AM