Rajababu : హాస్య ప్రపంచానికి రారాజు

ABN , First Publish Date - 2023-03-26T01:21:01+05:30 IST

హాస్య నటుడు రాజబాబుది ఒక శకం. ఒకానోక సమయంలో ఆయన హాస్య ప్రపంచాన్ని ఏలారు. ఆ రోజుల్లో ఆయన లేని సినిమా ఉండేది కాదు. ఒక వేళ ఉందంటే లోటుగానే అనిపించేది. అప్పట్లో రాజబాబు విసుగు విరామం లేకుండా రాత్రి

Rajababu : హాస్య ప్రపంచానికి రారాజు

హాస్య నటుడు రాజబాబుది ఒక శకం. ఒకానోక సమయంలో ఆయన హాస్య ప్రపంచాన్ని ఏలారు. ఆ రోజుల్లో ఆయన లేని సినిమా ఉండేది కాదు. ఒక వేళ ఉందంటే లోటుగానే అనిపించేది. అప్పట్లో రాజబాబు విసుగు విరామం లేకుండా రాత్రి పగలు పని చేశారు.‘ కొత్తగా ఏదో చేసి నవ్వించడానికి ప్రయత్నించేవారు .ఒక పొజిషన్‌ చేరుకునేవరకు కష్ట పడాలి. ఆ తర్వాత ఆ స్థాయిని నిలబెట్టు కోవడానికీ కష్ట పడాలి. ఎప్పుడూ కష్టాలే’ అంటూ నవ్వేసేవారు రాజబాబు. ఆ రోజుల్లో రాజబాబు ఏది చేేస్త అదే కామెడీ. అయ్య బాబోయ్‌ అని ఆయన మెలికలు తిరిగిపోతూ నటిస్తుంటే థియేటర్‌లో జనం గొల్లుమనేవారు. రాజబాబు అంటే అంత క్రేజ్‌. రోజుకు మూడు సినిమాలు చేస్తూ 13 ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమను ఏలేశారు..ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ, శోభన్‌ బాబు.... హీరో ఎవరైనా సరే అందులో కమెడియన్‌గా మాత్రం రాజబాబు ఉండాల్సిందే. ఆయన కోసం హీరోలు షూటింగ్‌ స్పాట్‌ లో ఎదురు చూసిన రోజులు ఎన్నో!

బిర్యానీ ప్యాకెట్లు పంచారు

రాజబాబు అప్పటికి పది సినిమాలు చేశారు. హాస్య నటుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. వాహినీ స్టూడియోలో ఓ సినిమా కోసం ఒకసారి షాట్‌ చేసి బయటకు రాగానే ఒక లైట్‌ బాయ్‌.‘.చాలా బాగా చేసారు సార్‌. మీరు పైకి వస్తారు. అప్పుడు నాకు బట్టలు పెట్టాలి’ అన్నాడు. ఆ సినిమా హిట్‌ అయి రాజబాబు కు మంచి గుర్తింపు తెచ్చింది. ఆయన బిజీ అయ్యారు. అయినా ఆ లైట్‌ బాయ్‌ అన్న మాటలు మాత్రం మరచి పోలేదు.‘ ఆ రోజు అతను అన్న మాటల వల్లే నేను పైకి వచ్చానేమో.. ఎవరి రుణం వుంచుకోకూడదు’ అనుకున్నారు. కానీ ఆ లైట్‌ బాయ్‌ ఎవరో ఆయనకు గుర్తు లేదు. అందుకే ప్రతి ఏడాది తన పుట్టిన రోజున మద్రాస్‌లోనీ అన్ని స్టూడియోలకు వెళ్లి ప్రతి లైట్‌ బాయ్‌కి బట్టలు పెట్టి బిర్యానీ ప్యాకెట్‌ ఇచ్చేవారు రాజబాబు. ఆయన మంచితనానికి ఇదో నిదర్శనం. రాజబాబు మొత్తం 514 చిత్రాల్లో నటించారు. వరుసగా ఏడు సార్లు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు పొందిన తొలి హాస్య నటుడు ఆయనే. మూడు సార్లు నంది అవార్డ్‌ కూడా పొందారు. ఆయనకు గొంతు క్యాన్సర్‌ ఉండేది. దానికి ఒకసారి ఆపరేషన్‌ కూడా చేయించుకున్నారు మరణించడానికి రెండు రోజుల ముందే రెండో సారి ఆపరేషన్‌ చేయించుకున్నారు. రాజబాబుకు ఘంటసాల పాటలు అంటే ఇష్టం. 1983 ఫిబ్రవరి 11. ఆ రోజు మహా శివరాత్రి..ఘంటసాల వర్థంతి కూడా కావడంతో రోజంతా రాజబాబు ఆయన పాటలు వింటూనే ఉన్నారు. అదే రోజు రాత్రి గొంతులో ఇబ్బంది వచ్చి హైదరాబాద్‌ మదర్‌ థెరీసా ఆస్పత్రి లో చేరారు. పరిస్థితి విషమించడంతో 14 న తుది శ్వాస విడిచారు. మరణించే సమయానికి ఆయన నటించిన 9 చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి. ఒక తెలుగు చిత్రం, ఒక హిందీ చిత్రం నిర్మాణంలో ఉన్నాయి.

Updated Date - 2023-03-26T01:21:01+05:30 IST