Srikanth Odela : కీర్తి సురేశ్‌ని హీరోయిన్‌ అంటే వద్దన్నాను

ABN , First Publish Date - 2023-03-26T01:53:32+05:30 IST

దర్శకుడిగా ఓ అవకాశం రావడమే గొప్ప విషయం. అందులోనూ తొలి సినిమాకి నాని లాంటి నేచురల్‌ స్టార్‌ దొరికాడు. పేరున్న సాంకేతిక నిపుణులు అండగా నిలబడ్డారు. అది కూడా పాన్‌ ఇండియా సినిమా. ఇంతకంటే

 Srikanth Odela : కీర్తి సురేశ్‌ని హీరోయిన్‌ అంటే వద్దన్నాను

దర్శకుడిగా ఓ అవకాశం రావడమే గొప్ప విషయం. అందులోనూ తొలి సినిమాకి నాని లాంటి నేచురల్‌ స్టార్‌ దొరికాడు. పేరున్న సాంకేతిక నిపుణులు అండగా నిలబడ్డారు. అది కూడా పాన్‌ ఇండియా సినిమా. ఇంతకంటే ఏం కావాలి? ఇన్ని అదృష్టాలు దక్కించుకొన్న కుర్రాడు.. శ్రీకాంత్‌ ఓదెల. టాలీవుడ్‌ అంతా ఇప్పుడు ఇతని గురించీ.. తన తొలి సినిమా ‘దసరా’ గురించే మాట్లాడుకొంటోంది. నాని కథానాయకుడిగా నటించిన ‘దసరా’ ఈనెల 30న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఈ సుకుమార్‌ శిష్యుడు చెప్పుకొచ్చిన సరదా కబుర్లు.

ఇంకో వారం రోజుల్లో మీ సినిమా వచ్చేస్తోంది. కంగారుగా ఉందా? కాన్ఫిడెన్స్‌తో ఉన్నారా?

నూటికి నూరుపాళ్లూ కాన్ఫిడెన్స్‌తోనే ఉన్నా. సినిమా చేస్తున్నప్పుడు ఏ దశలోనూ నాకు హిట్టూ, ఫ్లాపుల ఆలోచన లేదు. కానీ ఒక్కటే భయం. ‘సినిమాని ఎక్కడా మోసం చేయడం లేదు కదా..’ అని నన్ను నేను చెక్‌ చేసుకొనేవాడ్ని. ఎందుకంటే ఓ సినిమా చేస్తున్నప్పుడు ఎన్నో అనుకొంటాం. పేపర్‌పై రాసుకొన్నదంతా తెరపై తీసుకురావాలని తాపత్రయపడతాం. కొన్ని విషయాల్లో రాజీ పడాల్సివస్తుంది. దాంతో ఎక్కడో ఓ చోట బ్లఫ్‌ గేమ్‌ ఆడేస్తాం. కానీ.. నాకు ఆ అవసరం రాలేదు. ఈ సినిమా వెనుక వెన్నుదన్నుగా నాని అన్న ఉన్నాడు. నాకేం కావాలో అదిఇచ్చాడు. చెరుకూరి సుధాకర్‌ అనే నిర్మాత లేకపోతే ఈ సినిమా ఇంత భారీగా వచ్చేదే కాదు. వారిద్దరి నమ్మకమే ఈ ‘దసరా’.

నానిలో అంత మాస్‌, అంత రస్టిక్‌ క్యారెక్టర్‌ని ఎలా చూడగలిగారు?

నాని అంటే అందరికీ ఇష్టమే. మా ఇంట్లో అందరూ నాని అభిమానులే. తనని ప్రేక్షకులంతా ఓన్‌ చేసుకొన్నారు. నేను రాసుకొన్న ధరణి కూడా అలాంటి వాడే. ఊర్లో ఓ సామాన్యమైన వ్యక్తి. వాడంటే తెలియనివాళ్లు ఉండరు. చూసిన మరుక్షణమే ‘వీడు మనోడే’ అనే ఫీలింగ్‌ రావాలి. అది నాని అన్నతోనే సాధ్యం అనిపించింది.

కీర్తి సురేశ్‌ని హీరోయిన్‌గా తీసుకొంటానంటే మొదట మీరు ‘నో’ చెప్పారట..!

(నవ్వుతూ) అవును. వెన్నెల పాత్ర రాసుకొనేటప్పుడు నా మైండ్‌లో ఎవరెవరో ఉండేవారు. కీర్తిని ఆ దృష్టిలో చూడలేదు. నాని అన్న కీర్తి పేరు చెప్పగానే మొదట కంగారొచ్చింది. ‘వద్దు..’ అంటూ నేను రాసుకొన్న ఆప్షన్లు కొన్ని చెప్పా. కానీ నాని అన్న మాత్రం ‘కీర్తి అయితేనే బాగుంటుంది’ అని ఒప్పించారు. ఇప్పుడు కీర్తిని తప్ప వెన్నెల పాత్రలో మరొకర్ని ఊహించుకోలేను. ఇదే కాదు.. నేను ఏ కథ రాసుకొన్నా మొదట నాని, కీర్తిలకే వినిపిస్తా. వాళ్లు ‘నో’ అంటేనే ఇంకొకరి దగ్గరకు వెళ్తా. అంతగా ఇద్దరూ నచ్చేశారు.

‘సుకుమార్‌ శిష్యుడు’ అనే ట్యాగ్‌లైన్‌ మీకు ఎంత వరకూ ఉపయోగపడింది?

ఈ కథ నాని అన్నకు వినిపిస్తున్నప్పుడు నేను సుకుమార్‌ శిష్యుడ్ని అని తెలీదు. షూటింగ్‌ మొదలైన కొన్ని రోజులకు ‘నువ్వు సుకుమార్‌ గారి దగ్గర పనిచేశావా? నాకు చెప్పలేదేంటి?’ అని నాని అన్న అడిగారు. ‘మీరు అడగలేదు.. నేను చెప్పలేదు’ అని సమాధానం ఇచ్చా. అయితే మేకింగ్‌ విషయంలో మాత్రం ఆయన ప్రభావం నాపై చాలా ఉంది. సుకుమార్‌ సార్‌ డీటైలింగ్‌ అద్భుతంగా ఉంటుంది. అది నాకు ఈ సినిమాలో చాలా పనికొచ్చింది.

‘దసరా’ మేకింగ్‌ చూస్తుంటే ‘రంగస్థలం’ ప్రభావం ఉందనిపిస్తుంది...

అదేం లేదండీ. నేను సుక్కుసార్‌ దగ్గర ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ చిత్రాలకు పని చేశాను. ‘నాన్నకు ప్రేమతో’ కంటే ముందు ‘దసరా’ ఆలోచన నా దగ్గర ఉంది. నేను ‘రంగస్థలం’ చిత్రానికి పని చేసినా, చేయకపోయినా.. ‘దసరా’ మేకింగ్‌ మాత్రం ఇలానే ఉండేది.

అసలు దర్శకుడు కావాలన్న ఆలోచన ఎప్పుడు.. ఏ సినిమాతో వచ్చింది?

నన్ను బాగా ప్రభావితం చేసిన సినిమా ‘జగడం’. ఆ సినిమా చూసి షాకయ్యా. ఆ టేకింగ్‌, స్టోరీ టెల్లింగ్‌ విధానం చూసి మతిపోయింది. నేను హాలీవుడ్‌ సినిమాలు పెద్దగా చూడను. చూసినా అర్థంకావు. ఇప్పటి వరకూ నాలుగైదు సినిమాలు చూశానంతే. కానీ ‘జగడం’ మాత్రం వంద సినిమాలు చూసి నేర్చుకొన్న జ్ఞానాన్ని అందించింది. సినిమాల్లోకి వెళ్లాలని, దర్శకుడ్ని కావాలని అప్పుడే డిసైడ్‌ అయ్యా. బీకాం ఏదోలా పూర్తి చేసి, ఇండ్రస్ర్టీకి వచ్చేశా. ఇక్కడ చాలామంది దర్శకుల దగ్గర సహాయకుడిగా పనిచేసే అవకాశం వచ్చినా చేయలేదు. సుకుమార్‌ ఆఫీసు చుట్టూ రెండేళ్లు తిరిగా. ‘షార్ట్‌ ఫిల్మ్‌ తీసి చూపించు.. అప్పుడు ఎంట్రీ ఉంటుంది’ అని సుకుమార్‌ సార్‌ చెప్పారు. దాంతో.. నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఓ షార్ట్‌ ఫిల్మ్‌ తీశా. అది నచ్చడంతో.. ఆయన టీమ్‌లో చోటు దొరికింది.

సుకుమార్‌ దగ్గర్నుంచి నేర్చుకొన్న విషయాలేంటి?

ఆయన ఇంత స్థాయికి వెళ్లారా.. అయినా సరే.. సినిమా అంటే ఓ రకమైన భయం ఉంటుంది. ‘మనం కరెక్ట్‌గానే చేస్తున్నామా? లేదా?’ అని ఎప్పటికప్పుడు మదనపడుతుంటారు. అది నాకు బాగా నచ్చింది. సినిమాపై ఆయనకున్న గౌరవం అది. ఆ గౌరవం ఉన్నవాళ్లు ఎప్పటికీ తప్పు చేయరు.

‘‘నేనో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న సింగరేణీలో పనిచేసేవారు. చేతిలో ఏదో ఓ డిగ్రీ ఉంటే తప్ప పెళ్లి కాదన్న భయంతో.. ఎన్నో తిప్పలు పడి బీకాం పూర్తి చేశా. నేను చూసిన వాతావరణం, నా మధ్య తిరిగిన పాత్రలు.. ఇవే

‘దసరా’లో కనిపిస్తాయి. ఈ సినిమాని చాలామంది యాక్షన్‌ కోణంలో చూస్తున్నారు. కానీ ఇదో ఎమోషనల్‌ జర్నీ’’

Updated Date - 2023-03-26T11:06:48+05:30 IST