Share News

నటనలో కత్తి కాంతారావు

ABN , First Publish Date - 2023-11-16T04:59:21+05:30 IST

సుమారు 450 సాంఘిక, జానపద చిత్రాల్లో నటించిన తాడేపల్లి లక్ష్మీకాంతారావును ప్రేక్షకలోకం జానపద కథానాయకుడిగానే భావిస్తుంది.

నటనలో కత్తి కాంతారావు

తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రగతికి దోహదం చేసిన ప్రముఖులలో టి.యల్‌. కాంతారావు చేసిన కృషి మరువలేనిది. నటుడిగా..

నిర్మాతగా.. పరిశ్రమ శ్రేయోభిలాషిగా.. దాతగా.. కత్తి కాంతారావుగా సినీ జానపద కథానాయకుడిగా కాంతారావు పేరు చిరస్మరణీయం.

సుమారు 450 సాంఘిక, జానపద చిత్రాల్లో నటించిన తాడేపల్లి లక్ష్మీకాంతారావును ప్రేక్షకలోకం జానపద కథానాయకుడిగానే భావిస్తుంది. నల్గొండ జిల్లాలోని కోదాడ మండలం గుడిబం గ్రామంలో 1923 నవంబర్‌ 16 తేదీన జన్మించిన కాంతారావు, చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో నాయనమ్మ దగ్గర పెరిగారు. ధార్మికత పురాణాల పట్ల ఆసక్తి నాయనమ్మ ద్వారా అబ్బింది. సురభి నాటకాల ద్వారా పొందిన ప్రేరణతో ‘‘బాలమిత్ర నాట్యమండలి’’ అనే సంస్థను స్థాపించి ‘గయోపాఖ్యానం, తెలుగుతల్లి, శ్రీకృష్ణలీలలు, కనకతార’ లాంటి నాటకాలతో మన్ననలు అందుకున్నారు.

అలా చిత్ర పరిశ్రమలోకి..

1950 సంవత్సరంలో మిత్రుల ప్రోద్బలంతో మద్రాసులో అడుగుపెట్టాడు కాంతారావు. ప్రముఖ దర్శకులు హెచ్‌.యం.రెడ్డికి సహాయ దర్శకుడైన టి.కృష్ణమాచారితో కలసి ఒకే గదిలో ఉండేవాళ్లు. అనంతరకాలంలో ఆ స్నేహం ఆయనకు బాగా కలిసొచ్చింది. తొలి తెలుగు టాకీ తీసిన హెచ్‌.యం.రెడ్డి దర్శకత్వంలో 1953 సంవత్సరంలో ‘‘ప్రతిజ్ఞ’’ చిత్రంతో ఆయన హీరోగా వెండితెరకు పరిచయమయినా.. ఆయన నటించిన మొదటి చిత్రం 1951 సంవత్సరంలో విడుదలైంది ‘నిర్దోషి’. ఆ తర్వాత ఎన్‌.ఎ.టి. పతాకంపై ఎన్‌.టి.రామారావు తీసిన ‘జయసింహ’లో ఎన్‌.టి.ఆర్‌. తమ్ముడిగా ఆయన నటించారు. ఆ తర్వాత 1958లో జానపద బ్రహ్మగా పేరొందిన విఠలాచార్య సినిమా ‘జయవిజయ’లో నటించారు. ఆ చిత్రం నుంచే తెలుగు వెండితెరపై సరికొత్త జానపద కథానాయకుడిగా టి.ఎల్‌.కాంతారావు విలక్షణ బాణీతో జానపద చిత్ర పరంపర ప్రారంభమైంది. దాదాపు ఎనభై జానపద చిత్రాల్లో హీరోగా నటించారాయన.

అందుకే ఆ పేరు వచ్చింది..

జానపద చిత్రాల్లోని ఆయన ‘‘కత్తియుద్ధం’’.. నాడు తెలుగునాట సరికొత్త ప్రభంజనాన్ని సృష్టించింది. డూప్‌ లేకుండా కాంతారావు స్వయంగా కత్తియుద్ధంలో ప్రత్యేక శిక్షణ తీసుకుని యుద్ధాలు చేయటం వల్ల చిత్రసీమలో ఆయన ‘‘కత్తి కాంతారావు’’గా పేరొందారు. పౌరాణిక చిత్రాలలో నారదుడి పాత్రకు ఆయన పెట్టింది పేరు. రాముడిగా, కృష్ణుడిగా, శ్రీమహావిష్ణువుగా.. ఆయన ఎన్నో చిత్రాల్లో నటించారు.

అందువల్లే ఆస్తులు పోగొట్టుకున్నారు..

ఆయన పేరు వినగానే గుర్తొచ్చే చిత్రాలు ఎన్నెన్నో. ఇలవేల్పు, శ్రీరామాంజనేయ యుద్ధం, జయవిజయ, భట్టి విక్రమార్క, మోహిని రుక్మాంగద, గురువును మించిన శిష్యుడు, మైరావణ, పక్కలోబల్లెం, మోహినీ భస్మాసుర, పలనాటి యుద్ధం, కంచుకోట, రాజసింహ, ఖడ్గవీర.... లాంటి వైవిధ్యభరితమైన చిత్రాల్లో ఆయన నటన అమోఘం, రెండు తమిళ చిత్రాల్లో నటించారు. సప్తస్వరాలు, గండరగండడు, ప్రేమజీవులు, గుండెలు తీసిన మొనగాడు, స్వాతిచినుకులు.. లాంటి చిత్రాలను నిర్మించారు. నటనా కౌశలం తప్ప దురదృష్టవశాత్తు లౌక్యం, వ్యాపార మెళకువలు కాంతారావులో లేకపోవడం వల్ల చిత్ర నిర్మాణంలో బాగా నష్టపోయారు. కథానాయకుడిగా ఆయన సంపాదించిన ఆస్తి, పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తిపాస్తులు సమస్తం చిత్ర నిర్మాణంలో హారతి కర్పూరంలా హరించుకుపోయాయి. నా అనుకున్న పరిశ్రమ వారి అసలు స్వరూపాలు బయటపడ్డాయి. 1990లో మద్రాసు నుంచి తన మకాంను హైదరాబాద్‌కు మార్చారు.

ఈ ‘హీరో’ను గుర్తించలేదు...

ఆ మహానటుడు నాగబాల, ఆత్మయాత్ర, విజయసామ్రాట్‌.. లాంటి టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు. 2001 సంవత్సరానికి గాను సినీ నంది అవార్డుల కమిటీ చైర్మన్‌గా కాంతారావు వ్యవహరించారు. తన అసమాన నటనా పటిమతో తెలుగు చిత్రసీమలో ప్రత్యేక బాణీని సృష్టించుకున్న ఆ మహానటుడు హెచ్‌.యం.రెడ్డి, బి.విఠలాచార్య, సి.పుల్లయ్య, కమలాకర కామేశ్వరరావు.. లాంటి దిగ్గజ దర్శకుల చిత్రాల్లో నటించి శెభాష్‌ అనిపించుకున్నారు కాంతారావు. సహ చలన చిత్రాల్లో అగ్ర కథానాయకులు ఎన్టీయార్‌, అక్కినేనిలకు దీటుగా హీరోగా నటించినా తెలుగు చిత్రసీమలో మాత్రం వెనకబడిపోయారు. తెలంగాణకు చెందిన సినీ ఽధ్రువతార కాంతారావును నాటి రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించలేదు. కేంద్ర ప్రభుత్వాలు గుర్తించలేదు. ఏ పద్మ పురస్కారాలు వరించలేదు. అజాత శత్రువు ఆయన. విశ్వవిద్యాలయాలు సైతం డాక్టరేట్స్‌ ఇవ్వలేదు.

మర్చిపోలేని పాత్రలవి..

పౌరాణిక చిత్రాల విషయంలో నందమూరి తారకరామారావు తర్వాత ఆస్థాయిలో పేరు సంపాదించిన వ్యక్తి కాంతారావు. రాముడిగా, కృష్ణుడిగా, శివుడిగా, విష్ణుమూర్తిగా, ఇంద్రుడుగా, లక్ష్మణుడిగా, నారదుడిగా, అర్జునుడుగా ఎన్నెన్నో పౌరాణిక చిత్రాల్లో నటించి జీవం పోశారు ఆయా పాత్రలకి. దీపావళి, సీతారామ కళ్యాణం, శ్రీకృష్ణ తులాభారం.. లాంటి ఎన్నో చిత్రాల్లో ఆయన నారదుడిగా ప్రదర్శించిన నటన అమోఘం. లవకుశ చిత్రంలో లక్ష్మణుడిగా ఆయన ప్రదర్శించిన నటన అసామాన్యం. ‘వీరాభిమన్యు’ చిత్రంలో అర్జునుడిగా ఆయన హావభావాలు మర్చిపోలేం. జానపద కథానాయకుడిగా ఆయనకు ఆయనే సాటి. నిర్మాతల పాలిట కల్పవృక్షంగా పేరు తెచ్చుకున్నారు. ఒకే సంవత్సరంలో 27 చిత్రాల్లో హీరోగా నటించిన ఘనాపాటి కత్తి కాంతారావు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఇసుమంతైనా గర్వంలేదు ఆయనకు. .సొంత ఇల్లు కూడా లేని దైన్యస్థితి ఆయన కుటుంబానిది. చిత్రసీమలో మకుటం లేని మహారాజుగా ఎదిగిన ఆయన తుదిరోజులు మాత్రం గడ్డుగా గడిచాయి. తెలుగు చలనచిత్రసీమకు ఆయన అందించిన అసమాన సేవలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2000 సంవత్సరంలో ‘రఘుపతి వెంకయ్య అవార్డు’కు ఎంపిక చేసి చేతులు దులిపేసుకుంది. తన జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న ఆ మహానటుడు 2009 మార్చి 22న తుది శ్వాస విడిచారు. కాంతారావు మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరనిలోటు. తెలంగాణ ప్రభుత్వం ఆ మహానటుడిని గుర్తించి కనీసం ఒక పేజీ అయినా పాఠ్యాంశంగా పెడితే బావుంటుంది.

నాగబాల డి. సురేష్‌ కుమార్‌

స్థాపక అధ్యక్షులు, తెలుగు టెలివిజన్‌ రచయితల సంఘం.

అడిగిన వారికల్లా లేదనకుండా సాయం చేసిన

గొప్పవ్యక్తి. తెలుగు చలనచిత్రసీమలో తనకంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించుకున్న హిమశిఖరం ఆయన. అందరినీ తన వాళ్లు అనుకున్నాడు. తాను అందరివాడయ్యాడు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ తనని సరిగ్గా గుర్తించకపోయినా ఆయన ఏనాడూ బాధపడలేదు. బెంగపడలేదు. తన తల రాత ఇంతే అనుకుని చిన్మయ ఆనందం పొందేవాడు. కాంతారావుగారి జీవితం తెరచిన పుస్తకం.

అది నేటి తరానికి పెద్ద గుణపాఠం. ఆయన మంచితనాన్ని ఎవరూ మర్చిపోలేరు.

Updated Date - 2023-11-16T04:59:22+05:30 IST