Share News

Subrahmanya Shashti : కారణజన్ముడు కార్తికేయుడు

ABN , Publish Date - Dec 15 , 2023 | 05:46 AM

పూర్వం మూడు లోకాలనూ పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుడి బారి నుంచి కాపాడాలని బ్రహ్మదేవుణ్ణి దేవతలు వేడుకున్నారు. ‘‘అమిత తపోబల సంపన్నుడైన తారకాసురుణ్ణి చంపడం ఎవరి వల్లా కాదు. కానీ శివతేజస్సుతో

Subrahmanya Shashti : కారణజన్ముడు కార్తికేయుడు

పూర్వం మూడు లోకాలనూ పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుడి బారి నుంచి కాపాడాలని బ్రహ్మదేవుణ్ణి దేవతలు వేడుకున్నారు. ‘‘అమిత తపోబల సంపన్నుడైన తారకాసురుణ్ణి చంపడం ఎవరి వల్లా కాదు. కానీ శివతేజస్సుతో జన్మించేవాడు తారకాసురుణ్ణి సంహరించగల సమర్ధుడవుతాడు’’ అని బ్రహ్మ చెప్పాడు. దేవతలు కైలాసానికి వెళ్ళి శివుణ్ణి అర్థించారు. అప్పుడాయన ‘‘ఇప్పటికే నా హృదయం నుంచి తేజస్సు వెలువడింది. దాన్ని భరించగలిగేవారెవరైనా ఉంటే వచ్చి స్వీకరించండి’’ అన్నాడు. అగ్నిదేవుడు ఆ తేజస్సును స్వీకరించినా, దాన్ని భరించలేక భూమాతకు అప్పగించాడు. ఆమె కూడా దాన్ని భరించలేక గంగాదేవికి అప్పగించింది. ఆ సమయంలో గంగానదిలో స్నానం చేస్తున్న ఆరుగురు కృత్తికా దేవతల గర్భంలో ఆ తేజస్సు ప్రవేశించింది. ఆ రుద్రతేజాన్ని వాళ్ళు భరించలేక... నది ఒడ్డున ఉన్న రెల్లు గడ్డి పొదల్లో విడిచిపెట్టారు. ఆ రెల్లు పొదల నుంచి ఆరు ముఖాలతో, పన్నెండు చేతులతో... దివ్యమంగళ స్వరూపుడైన బాలుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ఉద్భవించాడు. కృత్తికా దేవతలు ఆ బాలుడికి పాలు ఇచ్చి పోషించారు. అందుకే ఆయనను ‘కార్తికేయుడు’ అంటారు.

కారణజన్ముడైన ఆ కుమారస్వామిని దేవతల కోరిక మేరకు... వారికి సర్వసైన్యాధ్యక్షుడిగా పార్వతీ పరమేశ్వరులు నియమించారు. సకల దేవతల వరాలతో, ఆయుధాలతో, శక్తులతో పాటు తల్లితండ్రుల దీవెనలను పొందిన కార్తికేయుడు... తారకాసురుణ్ణి సంహరించాడు. ఆ రాక్షసుణ్ణి వధించడానికి కుమార సంభవం జరిగిందని మన పురాణాలు చెబుతున్నాయి. కాగా, కార్తికేయుని గురించి, మానవులలోని అంతర్గత సూక్ష్మ శరీర వ్యవస్థలో ఆయన గుణగణాలు ఎలా ప్రతిబింబిస్తాయనే అంశం గురించి వివిధ ప్రవచనాలలో సహజయోగప్రదాత శ్రీమాతాజీ నిర్మలాదేవి వివరించారు.

గణేశుడు, కార్తికేయుడు... వీరిద్దరూ పార్వతీ పరమేశ్వరుల సంతానమే అయినా... వారికి విభిన్నమైన బాధ్యతలు అప్పగించడం జరిగింది. వినాయకుడు ఆదిశక్తికి ఎంతో ప్రీతిపాత్రుడైన పుత్రుడు. అత్యంత వివేకవంతుడు. కార్తికేయుడు అత్యంత శక్తిమంతుడు. వారివారి లక్షణాలు, గుణాలను బట్టి గణేశుణ్ణి గణాధిపతిగా, కార్తికేయుణ్ణి సేనాధిపతిగా నియమించారు. భగవంతుడి సామ్రాజ్యంలో కార్తికేయుని పాత్ర అత్యంత కీలకం. మానవుల అంతర్గత శరీరం ప్రేమమయుడైన భగవంతుడి శక్తితో ఏడు చక్రాలు, మూడు నాడులు కలిగిన వ్యవస్థతో నిర్మితమయింది. ఒక్కొక్క చక్రం, ఒక్కొక్క నాడి ఒక్కొక్క అధిష్టానదేవత ఆధీనంలో ఉంటాయి. కార్తికేయుడు మనలోని మూలాధార చక్రానికి కుడివైపున అధిష్టించి ఉంటాడు. మూలాధార చక్రానికి ఎడమవైపు ఉన్న గణేశుని శక్తులను, గుణాలను మనలో స్థిరపరుచుకోవడానికి ఆటంకం కలిగిస్తున్న దుష్టశక్తులను, వాటి ప్రభావాన్ని తన సంహారక శక్తితో ఆయన నాశనం చేస్తాడు. మనకు సదా రక్షణ కల్పిస్తాడు. మనం కుండలినీ శక్తిని జాగృతం చేసుకోవడం ద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని పొంది, యోగ సాధన చేస్తున్నప్పుడు... కుండలినీ ఉత్థానం ద్వారా మూలాధార చక్రం వికసిస్తుంది. పరిశుద్ధమవుతుంది. దానికి కుడివైపున ఉన్న కార్తికేయ శక్తి మేలుకుంటుంది. తద్వారా కార్తికేయుని గుణగణాలు, లక్షణాలు మనలో స్థిరపడతాయి.

Updated Date - Dec 15 , 2023 | 05:46 AM